Begin typing your search above and press return to search.

విదేశాల నుంచి వాపసు.. ఇండియాకొచ్చేస్తున్నారు..

విదేశాలకు వెళ్లి స్థిరపడటం అనేది చాలా మందికి కల. మెరుగైన వేతనాలు, ఆధునిక సదుపాయాలు, క్రమశిక్షణతో నడిచే వ్యవస్థ.. ఇవి అన్నీ ఆకర్షణీయమే.

By:  A.N.Kumar   |   12 Feb 2026 11:00 PM IST
విదేశాల నుంచి వాపసు.. ఇండియాకొచ్చేస్తున్నారు..
X

విదేశాలకు వెళ్లి స్థిరపడటం అనేది చాలా మందికి కల. మెరుగైన వేతనాలు, ఆధునిక సదుపాయాలు, క్రమశిక్షణతో నడిచే వ్యవస్థ.. ఇవి అన్నీ ఆకర్షణీయమే. ‘దూరపు కొండలు నునుపు’ అన్న సామెత విదేశీ జీవితం విషయంలో మరింత వర్తిస్తుంది. కానీ ఆ నునుపు వెనుక ఉన్న ఒత్తిడులు, ఒంటరితనం, సమయాభావం వంటి సమస్యలు అనుభవించినవారికే స్పష్టమవుతాయి. అలాంటి అనుభవాల మధ్యే ఒక భారత మహిళ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

దుబాయ్‌లో స్థిరపడిన లీబా సుబిన్ తన కుటుంబంతో కలిసి అకస్మాత్తుగా భారత్‌కు స్వస్థలం కేరళకు వచ్చేసింది. అయితే ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని.. ఎంతో ఆలోచనతో, కుటుంబ సభ్యులతో చర్చించి తీసుకున్న నిర్ణయమని ఆమె స్పష్టం చేసింది. మానసిక ప్రశాంతత, సమయపాలన, కుటుంబ బంధాల బలపరిచే అవసరం.. ఇవే తన వాపసుకు ప్రధాన కారణాలని ఆమె పేర్కొంది.

విదేశాల్లో ఉన్నప్పటికీ అక్కడి జీవితం ఎప్పుడూ సౌకర్యాల సుఖం మాత్రమే కాదు. వీసా రీన్యువల్‌ టెన్షన్‌, ఇంటి అద్దె ఒత్తిడి, పిల్లల విద్య కోసం పొడవాటి ప్రయాణాలు.. ఇవి రోజువారీ జీవితాన్ని అలసటతో నింపుతాయి. లీబా చెప్పినట్లుగా దుబాయ్‌లో పిల్లవాడు పాఠశాలకు వెళ్లేందుకు 90 నిమిషాల ప్రయాణం అవసరం కాగా, కేరళలో అదే స్కూల్‌కు పదినిమిషాల్లో చేరుకోవచ్చు. ఈ చిన్న మార్పే కుటుంబ సమయాన్ని పెంచి, ఒత్తిడిని తగ్గించగలదు.

అంతేకాదు అప్పులు లేకుండా ఈఎంఐల బెడద లేకుండా జీవించడం కూడా మానసిక శాంతికి మూలం. స్వంత ఇంటిలో నివసించడం ద్వారా అద్దె భారమూ తగ్గుతుంది. ముఖ్యంగా సమాజంతో మమేకమవడం, బంధువులతో మళ్లీ కలిసిపోవడం.. ఇవి విదేశాల్లో కొరవడే అంశాలు. ఆర్థికంగా కొంత తగ్గినా, భావోద్వేగంగా బలపడే జీవితం ఎంతో విలువైనదని ఆమె నిర్ణయం సూచిస్తోంది.

ఇక్కడ ఒక ముఖ్యమైన సందేశం దాగి ఉంది. విదేశీ జీవితం అందరికీ ఒకేలా ఉండదు. కొందరికి అది అభివృద్ధి దారి అయితే మరికొందరికి అది ఒత్తిడి కారణం కావచ్చు. ముఖ్యంగా కుటుంబంతో కలిసి ఉండే వారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు సమష్టిగా చర్చించడం అత్యంత అవసరం. వ్యక్తిగత సంతోషం, కుటుంబ సమగ్రత, మానసిక ఆరోగ్యం.. ఇవి డాలర్ల కంటే గొప్పవని గుర్తు చేస్తోంది ఈ ఘటన.

విదేశాల్లో స్థిరపడాలనే కలలు తప్పు కావు. కానీ ఆ కలల వెనుక మన విలువలు, మన సంబంధాలు, మన మానసిక శాంతి కోల్పోతే ఆ విజయం ఎంతవరకు సార్థకం? సక్సెస్‌ అనే పదానికి మనం ఇస్తున్న అర్థాన్ని మరోసారి ఆలోచించాల్సిన సమయం ఇదేమో.

లీబా సుబిన్‌ తీసుకున్న నిర్ణయం అందరికీ ఆదర్శమవ్వాల్సిన అవసరం లేదు. అయితే అది ఒక ఆలోచన మాత్రం కలిగిస్తోంది. టెన్షన్‌ లేని జీవితం కోసం మనం ఎక్కడ ఉండాలి? విదేశాల మెరుపుల మధ్యనా, లేక మన నేలలోని నిశ్శబ్ద సౌఖ్యమా?

ఇది కేవలం ఒక కుటుంబం కథ మాత్రమే కాదు… ప్రాధాన్యాలపై సమాజం ముందుకు తెచ్చిన ప్రశ్న.