Begin typing your search above and press return to search.

గ్రీన్‌కార్డ్‌కు అడ్డంకి.. భర్త గతం భార్య కలను కడతేర్చిందా?

అమెరికాలో ఉన్నత విద్య, మంచి ఉద్యోగం... ఆ తర్వాత అమెరికన్ పౌరుడితో వివాహం చేసుకొని గ్రీన్‌కార్డ్‌ (శాశ్వత నివాసం) సాధించడం అనేది లక్షలాది మంది విదేశీ విద్యార్థుల కల

By:  A.N.Kumar   |   12 Oct 2025 7:00 PM IST
గ్రీన్‌కార్డ్‌కు అడ్డంకి.. భర్త గతం భార్య కలను కడతేర్చిందా?
X

అమెరికాలో ఉన్నత విద్య, మంచి ఉద్యోగం... ఆ తర్వాత అమెరికన్ పౌరుడితో వివాహం చేసుకొని గ్రీన్‌కార్డ్‌ (శాశ్వత నివాసం) సాధించడం అనేది లక్షలాది మంది విదేశీ విద్యార్థుల కల. కానీ, ఒక్కోసారి అనూహ్య సమస్యలు ఈ కలను కడతేరుస్తాయి. సరిగ్గా అలాంటి పరిస్థితే అమెరికాలో చదువుకుంటున్న ఓ విదేశీ విద్యార్థినికి ఎదురైంది.

తన అమెరికన్ ఫియాన్సీ గతంలో ఉన్న క్రిమినల్ కేసు, ముఖ్యంగా 'వాహనం దొంగతనం' కేసులో ఉన్న ఫెలనీ వారెంట్ ఇప్పుడు ఆమె గ్రీన్‌కార్డ్‌ కలపై పెను నీడ వేసింది.

* వీసా గడువు - గ్రీన్‌కార్డ్‌ టెన్షన్

F-1 విద్యార్థి వీసాతో అమెరికాలో చదువుకున్న ఆ యువతి, ప్రస్తుతం ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) కింద పనిచేస్తోంది. ఈ OPT వీసా గడువు డిసెంబర్ వరకు మాత్రమే ఉంది. అంటే ఆ సమయం లోపల ఆమె గ్రీన్‌కార్డ్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆలస్యం చేస్తే చట్టపరమైన హోదా కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ ఒత్తిడిలోనే ఆమె వివాహాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకుంది.

* కఠినమైన తనిఖీలు: జీవిత భాగస్వామి రికార్డే కీలకం

అమెరికాలో వివాహ ఆధారిత గ్రీన్‌కార్డ్ దరఖాస్తులను యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) అధికారులు చాలా కఠినంగా పరిశీలిస్తారు. అభ్యర్థి (ఇక్కడ విద్యార్థిని) ఎలాంటి నేరం చేయకపోయినా, ఆమె భర్త గతంలో నేరాలకు పాల్పడితే, అది అప్లికేషన్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. క్రిమినల్ రికార్డులు ఉన్న జీవిత భాగస్వాములు ఉన్న దరఖాస్తులను USCIS అధికారులు ప్రత్యేకంగా విచారిస్తారు.

NTA (Notice to Appear) జారీ

అనుమానాస్పద లేదా అసంపూర్తి పత్రాలు ఉన్న దరఖాస్తులకు అధికారులు Notice to Appear (NTA) జారీ చేయవచ్చు. దీని అర్థం, ఆ దరఖాస్తుదారుని డిపోర్టేషన్ (దేశం నుండి బహిష్కరణ) ప్రక్రియ కోసం ఇమ్మిగ్రేషన్ కోర్టుకు పంపడం. ఈ మధ్యకాలంలో ఇమ్మిగ్రేషన్ విధానాలు మరింత కఠినంగా మారడం, అధికారులకు వ్యక్తిగత విచక్షణ ఆధారంగా కేసులను సమీక్షించే అధికారం ఉండటం వల్ల, ఫలితాలు చాలా అనిశ్చితంగా ఉంటున్నాయి.

* న్యాయ సహాయం... ఇక తప్పనిసరి!

OPT గడువు సమీపిస్తున్నందున, ఆలస్యం చేయడానికి వీల్లేదు. భర్త గతం భార్య భవిష్యత్తుపై నీడ వేసిన ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, గ్రీన్‌కార్డ్‌ దరఖాస్తు నిలిపివేయడం సరైన నిర్ణయం కాదు. సరైన న్యాయ సలహా తీసుకోవడం ముఖ్యం.

ఈ యువతి తన అమెరికా కలను నిలబెట్టుకోవాలంటే, అనుభవజ్ఞులైన ఇమ్మిగ్రేషన్ న్యాయవాది సహాయం తీసుకోవడం అత్యంత సురక్షితం. క్రిమినల్ రికార్డు వివరాలను పూర్తిగా విశ్లేషించి, దాని వల్ల ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం ఎలాంటి సమస్యలు వస్తాయో ముందుగానే అంచనా వేయగలరు. దరఖాస్తు తిరస్కరణకు లేదా జాప్యానికి దారితీసే పొరపాట్లు జరగకుండా, అన్ని పత్రాలను పకడ్బందీగా సిద్ధం చేయగలరు.

ప్రేమ, వివాహం, గ్రీన్‌కార్డ్ ఈ మూడూ ఆమె జీవితంలోని కీలక దశలు. భర్త గతానికి తగిన చట్టపరమైన పరిష్కారం చూపించి, సమయానుకూలంగా గ్రీన్‌కార్డ్ దరఖాస్తు దాఖలు చేస్తేనే, ఆమె అమెరికా కల నిలబడుతుంది. ఇప్పుడు ఆమె తీసుకోవాల్సిన ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా, న్యాయపరమైన సలహాతో కూడుకున్నదై ఉండాలి.