Begin typing your search above and press return to search.

అమెరికాలో భారతీయుల భారీ పెట్టుబడులు

అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసం కోసం భారతీయులు పెట్టుబడుల రూపంలో తమ దారిని ఏర్పరచుకుంటున్నారు.

By:  A.N.Kumar   |   5 Aug 2025 3:00 AM IST
From Tech to Investment: Why More Indians Are Choosing the EB-5 Route
X

అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసం కోసం భారతీయులు పెట్టుబడుల రూపంలో తమ దారిని ఏర్పరచుకుంటున్నారు. ఉద్యోగ వీసా అయిన హెచ్‌1బీ వీసా లభ్యత తగ్గిపోతున్న నేపథ్యంలో, వ్యాపార పెట్టుబడుల ఆధారంగా లభించే ఈబీ-5 వీసాలపైన భారతీయుల ఆసక్తి గణనీయంగా పెరిగింది.

EB-5 వీసాలపై పెరుగుతున్న డిమాండ్

వీసా ప్రక్రియలో ఉన్న బ్యాక్‌లాగ్, ఇతర వీసాలపై ఉన్న కఠిన నిబంధనలు కారణంగా భారతీయులు ఈబీ-5 వీసాలవైపు మొగ్గుచూపుతున్నారు. 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు 1,200కు పైగా ఐ-526ఈ పిటిషన్లు భారతీయుల నుంచి వచ్చినట్లు యునైటెడ్‌ స్టేట్స్‌ ఇమిగ్రేషన్‌ ఫండ్ (USIF) తెలిపింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే రెట్టింపు వృద్ధిగా చెప్పవచ్చు. 2024లో భారతీయులకు 1,428 ఈబీ-5 వీసాలు జారీ కాగా, 2023లో ఈ సంఖ్య కేవలం 815 మాత్రమే.

ఈబీ-5 వీసా అంటే, అమెరికాలో కనీసం 8 లక్షల డాలర్ల పెట్టుబడి పెట్టినవారికి శాశ్వత నివాసం (గ్రీన్‌కార్డు) పొందే అవకాశం లభిస్తుంది. అమెరికాలో త్వరితగతిన స్థిర నివాసం కావాలనుకునే వారికి ఇది మంచి మార్గంగా మారింది.

గ్రీన్‌కార్డుపై కఠిన నిబంధనలు

ఇక గ్రీన్‌కార్డ్‌ల విషయంలో అమెరికా ప్రభుత్వం ఇటీవల మరిన్ని కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. అమెరికన్‌ పౌరుల కుటుంబసభ్యులకు ఇచ్చే ఇమిగ్రెంట్‌ వీసాల జారీ ప్రక్రియను USCIS (U.S. Citizenship and Immigration Services) మరింత పకడ్బందీగా మార్చింది.

వివాహాల ఆధారంగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జాయింట్‌ బ్యాంక్‌ అకౌంట్లు, సంయుక్త ఆస్తి పత్రాలు, కుటుంబ మిత్రుల నుంచి వచ్చిన అభినందన పత్రాలు, పెళ్లి ఫొటోలు వంటి ఆధారాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, అభ్యర్థులు వ్యక్తిగతంగా ఇంటర్వ్యూకు హాజరై తమ సంబంధాన్ని నిశ్చయంగా నిరూపించాల్సి ఉంటుంది. స్పాన్సర్‌ గతంలో వీసా మోసాలకు పాల్పడినట్లుగా తేలితే, మరింత లోతుగా దర్యాప్తు జరగనుంది.

నకిలీ వివాహాలకు చెక్

ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధనల లక్ష్యం – నకిలీ వివాహాలు, తప్పుడు ఆధారాలతో వీసా పొందే ప్రక్రియలను అడ్డుకోవడమే. వాస్తవిక, చట్టబద్ధ సంబంధాల ఆధారంగా మాత్రమే వీసా మంజూరు చేయాలని USCIS స్పష్టంగా పేర్కొంది. ప్రస్తుతం USCIS వద్ద దాదాపు 1.1 కోట్ల వీసా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటంతో, ఇలాంటి దుర్వినియోగాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టారు.

అమెరికాలో ఉద్యోగ వీసాల లభ్యత క్షీణిస్తున్నప్పటికీ, పెట్టుబడి వలసదారులకై అవకాశాలు విస్తరిస్తున్నాయి. వ్యాపార పెట్టుబడుల ద్వారా శాశ్వత నివాసం కల్పించే ఈబీ-5 వీసాల పట్ల భారతీయుల ఆసక్తి ఈ మారుతున్న వలస దిశకు అద్దంపడుతోంది. అయితే, నిబంధనల మార్పుల కారణంగా ఇప్పుడు మరింత జాగ్రత్తగా, నిజమైన డాక్యుమెంటేషన్‌తో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.