ట్రంప్ విధానాలే యమడేంజర్ ...అమెరికా భారత సంతతి ఆందోళన
అమెరికా ప్రతినిధుల సభలో దక్షిణాసియా, మధ్య ఆసియా వ్యవహారాల ఉప కమిటీ నిర్వహించిన చర్చలో చట్టసభ సభ్యురాలు ప్రమీలా జయపాల్ భారత్ పై ట్రంప్ ప్రభుత్వం అవలంబిస్తున్న అనేక విధానాలను నిశితంగా సోదాహరణంగా విమర్శించారు.
By: Tupaki Political Desk | 12 Dec 2025 12:19 PM ISTనేను మోనార్క్ ని...నేను చేసిందే శాసనం అని అమెరికా అధ్యక్షుడు డొనల్ట్ ట్రంప్ ఒంటెత్తు పోకడలు పోతున్నంత కాలం ...అమెరికా దెబ్బ తింటూనే ఉంటుంది. భారత్ పై అనవసర ప్రతీకార సుంకాలు విధించడంతో రెండు దేశాల సంబంధాలు ఘోరంగా దెబ్బతినే ప్రమాదముంది. ఈ పరిణామాలు అమెరికాలో తరతరాలు ఉంటున్న భారత సంతతికి చాలా ఇబ్బందికరం...బారత్ సంతతి అమెరికా చట్టసభ సభ్యులుగా ఉంటున్న వారు వ్యక్తం చేస్తున్న ఆందోళన ఇది. భారత్ పై అమెరికా అదనపు సుంకాలతో దండయాత్ర చేయాలనుకుంటే...అది ఆ దేశానికి కూడా కష్టమే అని విదేశీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం రష్యాతో సన్నిహిత సంబంధాలు పెంచుకుంటోందని భారత్ పై విరుచుకు పడటం అమెరికా విదేశాంగ విధానానికే మచ్చగా చెప్పాలి.
అమెరికా ప్రతినిధుల సభలో దక్షిణాసియా, మధ్య ఆసియా వ్యవహారాల ఉప కమిటీ నిర్వహించిన చర్చలో చట్టసభ సభ్యురాలు ప్రమీలా జయపాల్ భారత్ పై ట్రంప్ ప్రభుత్వం అవలంబిస్తున్న అనేక విధానాలను నిశితంగా సోదాహరణంగా విమర్శించారు. భారత్ తో అమెరికా కొనసాగిస్తున్న వ్యూహాత్మక సంబంధాలు...ప్రయోజనాలు పూర్తిగా దెబ్బతినే పరిస్థితి నెలకొందని ప్రమీలా ఆవేదన వ్యక్తం చేశారు. వాషింగ్టన్ రాష్ట్రంలో తరతరాలుగా వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న ఓ భారతీయకుటుంబం ఈ ప్రతీకార ఎగుమతి సుంకాల వల్ల తీవ్రంగా నష్టపోయినట్లు ప్రమీలా వివరించారు. వారు భారతదేశంలోని వ్యవసాయ ఉత్పత్తుల్ని ఇక్కడికి తీసుకొచ్చి విక్రయించేవారు. అయితే ట్రంప్ సుంకాల పుణ్యమా అని ఆ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వారి వ్యాపారం చాలా ఘోరంగా దెబ్బతింటోంది. గత 120 సంవత్సరాలు తర్వాత తొలిసారిగా వారి కుటుంబం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు ప్రమీలా వివరించారు.
ఇక హెచ్1బి వీసాలను కఠినతరం చేయడం...లక్షడాలర్ల ఫీజు నిర్ణయించడం లాంటి దుందుడుకు చర్యలు మేధో వలసను దెబ్బతీస్తున్నాయి...ఫలితంగా నష్టపోయేది అమెరికా మాత్రమే. భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా చైనా అధ్యక్షులతో వరసగా భేటీ కావడం అమెరికాకు ఇస్తున్న తీవ్ర సందేశమేనని గుర్తుంచుకోవాలి. మొన్నటి దాకా అమెరికా..భారత్ వాణిజ్య సంబంధాలు చాలా అద్భుతంగా ఉండేవి. కానీ ట్రంప్ మనసులో ఏముందో కానీ కేవలం రష్యాయుద్ధాన్ని బూచి చూపి దానికి భారత్ చమురు కొనుగోలే కారణమనడం అర్థరహితం అందుకే పుతిన్ భారత్ పర్యటనలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మరి అమెరికా తమతో అణుఇంధనం కొనుగోలు చేయవచ్చా అని నిలదీశారు.
ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అమెరికా భారత్ ను కోల్పోవడం వల్ల అనవసరంగా చిక్కుల్లో పడ్డట్టు కనిపిస్తోంది. రక్షణ, ఇంధన, ఏఐ రంగాల్లో భారత్ అవసరం అమెరికాకు చాలా ఉందని విస్మరించడం బాధాకరం. ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో అమెరికా ప్రయోజనాలు రక్షణపొందాలంటే భారత్ తో జట్టుకట్టడం అనివార్యం. ట్రంప్ ఈ సత్యాన్ని తెలుసుకుంటే తప్ప అమెరికా భారత్ సంబంధాలు పునరుద్దరణ కావు. దేశ ప్రయోజనాల కన్నా వ్యక్తిగత ప్రయోజనాలు ప్రధానం కావని ట్రంప్ గుర్తెరగాలి. ప్రతీకార సుంకాల వల్ల ఇప్పటికే క్వాడ్ సదస్సు వాయిదా పడిందని గ్రహించాలి. అమెరికా టెక్, సాఫ్ట్ వేర్ రంగాల్లో భారతీయుల భాగస్వామ్యం చాలానే ఉంది. ఇదే భావాలను చట్టసభ సభ్యులు సిడ్నీ కమలాగర్ డోవ్ వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి ట్రంప్ స్వదేశంలోనే రగులుతున్న అసంతృప్తి జ్వాలల్ని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మేలు. చమురు కొనుగోలు నుంచి భారత్ ను దూరం చేసినంత మాత్రాన రష్యా బేలగా మారిపోపదు..ఒంటరిగా మిగిలిపోదు. ఉక్రెయిన్ తో రష్యాయుద్దం ముగింపు పలకాలంటే....అక్కడి భూ ఆక్రమణల సమస్యలు ప్రధానమని ట్రంప్ గ్రహిస్తే మంచిది. అంతేకాదు యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్ ను ఇప్పటికీ యుద్ధానికే ఎగదోస్తున్న సత్యాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గ్రహిస్తే మేలు.
