అమెరికాలో పదేళ్లు ఉంటే గ్రీన్కార్డా? లక్షలాది వలసదారులకు ఊరటనిచ్చేలా డెమోక్రాట్ల కొత్త బిల్లు
అమెరికాలో పదేళ్లకు పైగా నివసిస్తున్న అర్హులైన వలసదారులకు గ్రీన్ కార్డులు ఇచ్చేలా డెమొక్రాట్లు ‘ప్రొటెక్ట్ అవర్ నైబర్స్ యాక్ట్’ బిల్లును ప్రతిపాదించారు. అయితే నేర చరిత్ర లేని వారు, పన్ను పత్రాలు సహా ఇతర అర్హతలు ఉన్నవారికే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ ఆమోదంతో పాటు ట్రంప్ సంతకం కూడా అవసరం కావడంతో బిల్లు చట్టమవడంపై ఇంకా స్పష్టత లేదు.
By: A.N.Kumar | 25 Nov 2026 3:40 PM ISTరిపబ్లికన్లు వెళ్లగొడుతారు.. డెమోక్రాట్లు కడుపులో పెట్టుకొని కాపాడుతారు. అందుకే ఇప్పుడు అమెరికాలోని వలసదారులంతా కూడా మిడ్ టర్న్ ఎన్నికల్లో డెమోక్రాట్లకు ఓట్లేసి గెలిపించారు. ట్రంప్ అస్తవ్యస్థ విధానాలు, టారిఫ్ లు, ధరాఘాతంతో అమెరికాలో రిపబ్లికన్లను చిత్తుచిత్తుగా ఓడించారు. ఇప్పుడు అన్నట్టే డెమొక్రాట్లు వలసదారులకు ఊరటనిచ్చేలా బిల్లులు, సవరణలు తీసుకొస్తున్నారు.
అమెరికాలో శాశ్వత నివాసం పొందాలన్నది ప్రతీ వలసదారుడి కల. ఇప్పుడు తమకు ఓట్లు వేసి గెలిపించిన వారి ఆశలు నిలబెట్టేందుకు డెమొక్రాట్లు సిద్ధమయ్యారు. పదేళ్లకు పైగా అమెరికాలో నివసిస్తున్న వారికి ఊరటనిచ్చేలా బిల్లు ప్రతిపాదించారు. సరైన ఇమ్మిగ్రేషన్ హోదా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి గ్రీన్ కార్డ్ ఇచ్చేందుకు డెమోక్రాట్లు ఈ కొత్త బిల్లును తీసుకొచ్చారు. ‘ప్రొటెక్ట్ అవర్ నైబర్స్ యాక్ట్’ పేరుతో ప్రతిపాదించిన ఈ బిల్లు అమల్లోకి వస్తే.. కాంగ్రెస్ తోపాటు ట్రంప్ సంతకం పెడితే అమెరికాలో 10 ఏళ్లు ఉన్న వలసదారులకు గ్రీన్ కార్డ్ భాగ్యం కలుగనుంది. అయితే 10 ఏళ్లు అమెరికాలో ఉంటే ఆటోమేటిక్ గా గ్రీన్ కార్డ్ రాదు.. ఈ ప్రతిపాదనలో కొన్ని కీలక అర్హతలు, పరిమితులను పొందుపరిచారు.. ఇవన్నీ దాటి మన భీకర ట్రంప్ తాత సంతకం పెడితేనే ఈ బిల్లు చట్టరూపం దాల్చుతుంది.
అమెరికాలో సాధారణంగా బహిష్కరణ ఉత్తర్వు జారీ అయితే వారు ఈ గ్రీన్ కార్డ్ కు అనర్హులు. ఇక వలసదారులు వివిధ కేసుల్లో అరెస్ట్ అయిన వారిని కూడా గ్రీన్ కార్డ్ కు పరిగణలోకి తీసుకోరు. ఇవన్నీ అందులో లూప్ హోల్స్ గా పెట్టి కొత్త బిల్లును రూపొందించారు. పదేళ్ల పాటు అమెరికాలో ఏ వివాదాలు లేకుండా నివసించి ఉన్నవారు.. నిర్ధిష్ట నేరాలకు పాల్పడని వారు.. ఇమ్మిగ్రేషన్ నిబందనలు పాటించే వారు అర్హులు. ఇక ఫెడరల్ ఆదాయపు పన్ను రిటర్నులకు సంబంధించిన ధ్రువీకరించిన పత్రాలను సమర్పించాలి. ఇతర ఇమ్మిగ్రేషన్ అర్హతలను పూర్తి చేసి ఉండాలి. 1200 డాలర్ల వరకూ ఉండే దరఖాస్తు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఇవన్నీ పాటించి దరఖాస్తు చేసుకున్న వారికి గ్రీన్ కార్డ్ ఇచ్చేలా ఈ నిబంధనను రూపొందించారు.
ప్రస్తుతం అమెరికాలో భారీ సంఖ్యలో భారతీయులున్నారు. అక్కడే స్థిరపడ్డవారు గ్రీన్ కార్డ్ కోసం చూస్తున్నారు. హెచ్1బీ, ఎఫ్1, ఓపీటీ వీసా హోదాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డ్ ఇవ్వరు. గ్రీన్ కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుస్తున్న భారతీయులకు ఈ బిల్లు వర్తిస్తుందని భావించడానికి వీల్లేదు. పైనున్న నిబంధనలు తూ.చా తప్పకుండా పాటించిన వారికే గ్రీన్ కార్డ్ ఇచ్చేలా రూపొందించారు.
అయితే డెమొక్రాట్లు ఎన్ని బిల్లులు తెచ్చినా.. కాంగ్రెస్ లో ఆమోదించినా ఈ బిల్లు చట్టంగా మారాలంటే ప్రతినిధుల సభ.. సెనేట్ ఆమోదంతో పాటు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం కూడా అవసరం. ఆయన ఆమోదించడం కల్ల.. కాబట్టి ఇప్పుడే గ్రీన్ కార్డు వస్తుందని చంకలు గుద్దుకోవడానికి లేదు. అర్హులైన వారు ఇప్పుడే ఈ కొత్త నిబంధన కింద గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు. అమెరికాలో పదేళ్లు నివసించినంత మాత్రాన గ్రీన్ కార్డ్ వచ్చే పరిస్థితి లేదు. అనిశ్చితిలో జీవిస్తున్న కొందరు నిబంధనలన్నీ పాటించే వలసదారులకు శాశ్వత నివాసం పొందే అవకాశం ఉంటుంది. అయితే ట్రంప్ ప్రభుత్వం దీన్ని అంగీకరిస్తుందా? అన్నదే అసలు ప్రశ్న.
