Begin typing your search above and press return to search.

విదేశీ గ‌డ్డ‌పై `మేయ‌ర్`గా బ‌రిలోకి.. తెలుగు మ‌హిళ‌ ప్ర‌చారం వేరే లెవల్!

విదేశీ గడ్డపై తెలుగు మూలాలున్న నాయకులు తమ రాజకీయ నైపుణ్యంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

By:  Sivaji Kontham   |   10 Oct 2026 5:47 PM IST
విదేశీ గ‌డ్డ‌పై `మేయ‌ర్`గా బ‌రిలోకి.. తెలుగు మ‌హిళ‌ ప్ర‌చారం వేరే లెవల్!
X

విదేశీ గడ్డపై తెలుగు మూలాలున్న నాయకులు తమ రాజకీయ నైపుణ్యంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో కెనడాలోని ప్రముఖ నగరమైన `మిస్సెస్సాగా` మేయర్ పదవి కోసం పోటీపడుతున్న ఆంధ్రా మూలాలున్న ప్రవాస భారతీయురాలు(ఎన్నారై), తెలుగు వ‌నిత‌ దీపికా దమెర్ల తన వినూత్న ప్రచార శైలితో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సాధారణ రాజకీయనాయకుల శైలికి భిన్నంగా, బాలీవుడ్ సూపర్‌హిట్ పాటను తన ఎన్నికల హామీకి అనుగుణంగా మార్చి పాడుతూ రూపొందించిన ఒక ప్రచార వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఆం‌ధ్రప్రదేశ్‌లో జన్మించి కెనడా పౌరసత్వం పొందిన దీపికా దమెర్ల, ఓటర్లను ఆకట్టుకునేందుకు క్లాసిక్ బాలీవుడ్ పాట ``క్యా హువా తేరా వాదా`` ట్యూన్‌ను ఎంచుకున్నారు. ఇటీవల జరిగిన వేడివేడి మేయర్ ఎన్నికల డిబేట్ అనంతరం ``ఈ స్పైసీ డిబేట్ తర్వాత మీకో చిన్న రిఫ్రెష్‌మెంట్`` అంటూ ఆమె `X వేదికగా ఈ క్లిప్‌ను షేర్ చేశారు. పాటలోని లిరిక్స్‌ను స్థానిక ప్రాపర్టీ ట్యాక్స్ సమస్యలకు అనుగుణంగా మార్చి పాడటం ద్వారా.. తాను మేయర్‌గా గెలిస్తే నగర ప్రజలపై ఆస్తి పన్నుల భారాన్ని పెంచబోనని అద్భుతంగా హామీ ఇచ్చారు.

పాట ముగింపులో `ఏ సిటీ ద‌ట్ వ‌ర్క్స్‌` అనే క్యాంపెయిన్ నినాదంతో పాటు... తన అభ్యర్థిత్వానికి మద్దతు తెలపాలని దామెర్ల దీపిక‌ ఓటర్లను అభ్యర్థించారు. కెనడాలో పెరిగిపోతున్న జీవన వ్యయం దృష్ట్యా ఆందోళన చెందుతున్న సామాన్య పౌరులకు తమ భాష, పాప్ కల్చర్‌కు చెందిన క్లాసిక్ మెలోడీ ద్వారా సీరియస్ పొలిటికల్ మెసేజ్‌ను అందించడం ఓటర్లతో సులభంగా మమేకం అవ్వడానికి తోడ్పడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సృజనాత్మక ఆలోచన వినోదాన్ని అందిస్తూనే కీలకమైన ఎన్నికల హామీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది.

కెనడా స్థానిక ప్రభుత్వంలో దీపికా దమెర్ల సుపరిచితమైన నాయకురాలు. టొరంటో విశ్వవిద్యాలయం నుంచి MBA ఫైనాన్స్ పూర్తి చేసిన ఆమె రాజకీయాల్లోకి రాకముందు కార్పొరేట్ బ్యాంకింగ్‌లో పనిచేయడంతో పాటు సొంతంగా వ్యాపారాన్ని కూడా నిర్వహించారు. అనంతరం 2018లో మిస్సెస్సాగా వార్డ్-7 నుంచి సిటీ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. అంతకుముందు మిస్సెస్సాగా ఈస్ట్-కుక్స్‌విల్లె నుంచి 7 సంవత్సరాలు ప్రొవిన్షియల్ పార్లమెంట్ సభ్యురాలిగా (ఎంపీపీ), ఒంటారియో రాష్ట్ర ఆరోగ్యం మ‌రియు సీనియర్స్ వ్యవహారాల మంత్రిగా సేవలు అందించారు. ఆ సమయంలో స్థానిక ఆసుపత్రులు, పాఠశాలల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.

ఇటీవలి కాలంలో పాప్ కల్చర్, సినిమా పాటల ఆధారంగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం రాజకీయాల్లో ట్రెండ్‌గా మారింది. గతంలో న్యూయార్క్ సిటీ మేయర్ రేసులో జోహ్రాన్ మమ్‌దానీ కూడా ఇదే తరహాలో బాలీవుడ్ శైలి వీడియోలతో ప్రచారం చేసి గుర్తింపు పొందారు. ఇప్పుడు అదే పంథాలో దీపికా దమెర్ల రూపొందించిన ఈ ప్రచార చిత్రం అక్కడి భారతీయ కమ్యూనిటీతో పాటు స్థానిక ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రవాసంలో ఉన్నా కానీ.. మన సాంస్కృతిక అంశాలను మమేకం చేస్తూ.. ఆస్తి పన్ను పెంపు ఉండదనే భరోసాతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి దీపిక‌ వేస్తున్న అడుగులు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.