Begin typing your search above and press return to search.

ఈ సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లో ఉండాలంటే నెలకు ఎన్ని లక్షలో తెలుసా..!

అవును... తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ అద్దె నెలకు సుమారు రూ.8 లక్షలు పైనే అంటూ లండన్ లో నివసించే భారతీయ యువతి దీపాంశి చౌదరి చెబుతున్నారు.

By:  Raja Ch   |   9 Jan 2026 10:00 PM IST
ఈ సింగిల్  బెడ్  రూమ్  ఫ్లాట్  లో ఉండాలంటే నెలకు ఎన్ని లక్షలో తెలుసా..!
X

సాధారణంగా సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ (హాలు, కిచెన్, బెడ్ రూమ్, బాత్ రూమ్) కలిపి అద్దె ఎంత ఉందొచ్చు..? మండల హెడ్ క్వార్టర్స్ లో అయితే రూ.5 వేల వరకూ, ఓ మోస్తరు టౌన్ లో అయితే రూ.10 వేల వరకూ, హైదరాబాద్ లో అయితే ఏరియాని బట్టి రూ.15 వేల నుంచి రూ.ముప్పై వేళవరకూ, బెంగళూరు వంటి నగరాల్లో అయితే రూ.25 నుంచి 35 వేల వరకూ అనుకోవచ్చు. ఏరియాను బట్టి కాస్త అటు ఇటు మారొచ్చు. కానీ.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ రెంటు నెలకు సుమారు రూ.8 లక్షలు పైనే అంటున్నారు లండన్ లో నివసించే భారతీయ యువతి ఒకరు.

అవును... తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ అద్దె నెలకు సుమారు రూ.8 లక్షలు పైనే అంటూ లండన్ లో నివసించే భారతీయ యువతి దీపాంశి చౌదరి చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆ ఇంటిలో ఉన్న గదులు, ఫర్నిచర్ ని షూట్ చేసి ఇన్ స్టా లో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన కామెంట్ సెక్షన్ నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. నెలకు రూ.8 లక్షల పైనే అద్దె చెల్లించే ఓపిక ఉంటే అంతకంటే గొప్ప ఫ్లాటే వస్తుందని ఒకరంటే.. ఏరియా & బిల్డింగ్ చాలా రిచ్ ఆ ఉంది అందుకేనేమో అని మరొకరు అంటున్నారు! మరికొంతమంది వారి వారి ఏరియాలో పరిస్థితి వెల్లడిస్తున్నారు.

ఇక నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియోలో కనిపిస్తున్న వివరాల విషయానికొస్తే... అపార్ట్మెంట్ లోపల ఓ చిన్న లాబీ, రైట్ సైడ్ వాష్‌ రూమ్, కాంపాక్ట్ స్టోరేజ్ రూమ్ ఉన్నట్లు వీడియోలో చూపించారు. బెడ్‌ రూమ్‌ లో దాదాపు 3 నుంచి 4/6 సైజ్ బెడ్, కబోర్డ్ కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో.. ఓ చిన్న సోఫా, డైనింగ్ టేబుల్, టెలివిజన్‌ తో కూడిన లివింగ్ రూమ్.. ఉన్నంతలో కాస్త మోడ్రన్ గా కనిపిస్తున్న కిచెన్ కనిపిస్తున్నాయి! వీటికి లండన్‌ లో నెలకు సుమారు ఎనిమిది లక్షల రూపాయల అద్దె.. అని వీడియోలో టెక్స్ట్ కనిపించగా.. ఈ అపార్ట్మెంట్ సెంట్రల్ లండన్ లో ఉందని.. సెయింట్ పాల్స్ కేథడ్రాల్ కు ఎదురుగా ఉందని క్యాప్షన్ లో వివరించింది!

అయితే... క్రిస్మస్ పండుగ సమయంలో ఒక నెల రోజుల స్వల్పకాలిక బస కోసం బుక్ చేసినందుకు ఈ స్థాయిలో అద్దె చెల్లించాల్సి వచ్చిందని.. ప్రధానంగా ఈ బిగ్ ఫెస్టివల్ సీజన్ కావడం వల్ల అద్దె అధికంగా ఉన్నట్లుగా భావిస్తోన్నానని ఆమె పేర్కొంది! ఇక ఈ వీడియోకి సంబంధించిన కామెంట్ సెక్షన్ విషయానికొస్తే... హాంప్‌ స్టెడ్ వంటి ప్రాంతాల్లో రెండు అంతస్తుల ఇళ్ళు కూడా నెలకు 2,000 నుంచి 3,000 పౌండ్లకు లభిస్తాయని ఒకరంటే.. కెనరీ వార్ఫ్‌ లో నివసిస్తున్నానని బిల్లులతో సహా త్రీ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్‌ కు నెలకు 3,200 పౌండ్లు చెల్లిస్తున్నట్లు మరొకరు తెలిపారు.

తన అభిప్రాయం ప్రకారం ఆ లొకేషన్ వల్ల ఇంత అద్దె ఉండి ఉండొచ్చు.. ఇది జోన్ 2 కు చెందినది అయ్యి ఉండొచ్చని.. ఈ రకమైన ఇల్లు 1.7 - 2కే పౌండ్స్ అవుతుందని మరొకరు కామెంట్ చేశారు. లండన్‌ లో చాలా మంది ఇంత అద్దె భరించలేరు.. ఇంతకూ మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారు? అని మరొకరు స్పందించారు. ఏది ఏమైనా.. ఈ వీడియో వైరల్ గా మారింది!!