Begin typing your search above and press return to search.

డల్లాస్‌లో దారుణం: భారత సంతతి వ్యక్తి తల నరికి హత్య

అమెరికా డల్లాస్‌లో భారత సంతతి వ్యక్తి ఓ భయానక ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.

By:  A.N.Kumar   |   12 Sept 2025 10:29 AM IST
డల్లాస్‌లో దారుణం: భారత సంతతి వ్యక్తి తల నరికి హత్య
X

అమెరికా డల్లాస్‌లో భారత సంతతి వ్యక్తి ఓ భయానక ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకకు చెందిన చంద్రమౌళి నాగమల్లయ్య (50) అనే వ్యక్తిని అతని సహోద్యోగి కత్తితో దారుణంగా పొడిచి, అనంతరం తలను నరికి హత్య చేశాడు. ఈ ఘటన అమెరికాలోని భారతీయుల సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

నాగమల్లయ్య స్థానికంగా ఓ హోటల్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అదే హోటల్‌లో 37 ఏళ్ల యోర్డానిస్ కొబోస్ మార్టినెజ్ అనే వ్యక్తి కూడా పని చేస్తున్నాడు. బుధవారం ఇద్దరి మధ్య చిన్న విషయంపై వాగ్వాదం చోటుచేసుకుంది.

నాగమల్లయ్య విరిగిపోయిన వాషింగ్ మెషీన్ ఉపయోగించవద్దని సూచించారు. అయితే ఆ విషయాన్ని ఆయన డైరెక్ట్‌గా చెప్పకుండా మరో మహిళా ఉద్యోగి ద్వారా చెప్పించడం మార్టినెజ్‌ను ఆగ్రహానికి గురి చేసింది. కోపంతో ఉన్న మార్టినెజ్‌ కత్తి తీసుకొని నాగమల్లయ్యపై దాడి చేశాడు.

కుటుంబసభ్యుల కళ్ల ముందే హత్య

హోటల్‌లో ఉన్న నాగమల్లయ్య భార్య, 18 ఏళ్ల కుమారుడు ఈ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే నిందితుడు ఆగకుండా ఆయనపై విచక్షణారహితంగా దాడి చేసి, చివరికి తలను నరికి చెత్తకుప్పలో పడేశాడు.

పోలీసులు, కాన్సులేట్ స్పందన

పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. సర్వైలెన్స్ కెమెరా ఫుటేజ్‌, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలతో కేసు దర్యాప్తు జరుగుతోంది.

ఈ ఘటనపై హ్యూస్టన్‌లోని భారత కాన్సులేట్ స్పందించింది. “డల్లాస్‌లో భారతీయుడు నాగమల్లయ్య దారుణంగా హత్యకు గురైన విషయం దిగ్భ్రాంతికి గురిచేసింది. కుటుంబసభ్యులతో మేము సంప్రదింపులు జరుపుతున్నాం. వారికి అవసరమైన సహాయం అందిస్తాం. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. కేసును జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నాం” అని ఎక్స్‌లో పోస్టు చేసింది.

భారతీయ సమాజంలో ఆందోళన

ఈ సంఘటన అమెరికాలో పని చేసే భారతీయుల భద్రతపై మళ్లీ ప్రశ్నలు లేవనెత్తింది. స్థానిక సమాజం ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఇది సాధారణ ఘర్షణ కాదని, ఉద్దేశపూర్వకంగా జరిగిన దారుణ హత్య అని పోలీసులు భావిస్తున్నారు.