Begin typing your search above and press return to search.

అమెరికాకు వెళ్లాక డాలర్లొచ్చాయి గానీ... 'గోత్రాలు' మారలేదు సుమీ!

ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక తెలుగు మహిళ వీడియో చూస్తే మనోళ్ల విజ్ఞాన వికాసాలు చూసి నవ్వాలో లేక సిగ్గుతో తలదించుకోవాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.

By:  A.N.Kumar   |   4 Aug 2026 12:08 AM IST
అమెరికాకు వెళ్లాక డాలర్లొచ్చాయి గానీ... గోత్రాలు మారలేదు సుమీ!
X

అమెరికా అంటే మనోళ్లకు కేవలం గ్రీన్ కార్డ్, సిలికాన్ వ్యాలీ జాబ్‌లు, ఆపిల్ ఐఫోన్లు మాత్రమే కాదు.. మన స్వచ్ఛమైన కులాసా కుల రాజకీయాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే ఒక అద్భుతమైన వేదిక. సముద్రాలు దాటినా, ఖండాలు మారినా, సూట్‌కేసులతో పాటు మన మూలాలను, అంటే ఆ కుల పిచ్చిని పదిలంగా బ్యాగుల్లో భద్రపరుచుకుని మరీ తీసుకెళ్తామని మరోసారి నిరూపించారు మన ప్రవాస రత్నాలు.

ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక తెలుగు మహిళ వీడియో చూస్తే మనోళ్ల విజ్ఞాన వికాసాలు చూసి నవ్వాలో లేక సిగ్గుతో తలదించుకోవాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. పాపం ఆవిడ పిల్లల భవిష్యత్తు కోసం, కాస్త విశాలమైన వాతావరణం ఉంటుందని అపార్ట్‌మెంట్ వదిలి ఒక స్వంత ఇంటికి మారింది. చుట్టుపక్కల మన తెలుగు వాళ్లే ఉన్నారు. పండుగలకీ పబ్బాలకీ హాయిగా కష్టసుఖాలు పంచుకోవచ్చని ఆశపడింది. కానీ ఆ పక్కింటి దొరసాని గారు పరిచయం కాగానే బోణీ చేస్తూనే వేసిన మొదటి బ్రహ్మాస్త్రం ఏంటంటే "ఇంతకీ మీదే కులం అండి?" అని. నాసా టెక్నాలజీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్పేస్ ఎక్స్ ముచ్చట్లు పక్కన పెడితే మనోళ్లకు పక్కింటోడి డీఎన్ఏ ఏంటో తేలడం చాలా ముఖ్యం మరి.

అమెరికా వెళ్తే బర్గర్లు, పిజ్జాలు తింటారు, డాలర్లలో జీతాలు తీసుకుంటారు. టెక్సాస్‌లో పెద్ద పెద్ద విల్లాలు కొంటారు. కానీ ఆలోచనలు మాత్రం పాతకాలపు రచ్చబండ స్థాయిలోనే ఉంచుకుంటారు. అక్కడ పుట్టి పెరిగిన రెండో తరం పిల్లలు ఈ కులాల గోల చూసి విస్తుపోతున్నా.. మొదటి తరం పెద్దమనుషులు మాత్రం కమ్యూనిటీ వాట్సాప్ గ్రూపుల్లో మన కమ్మటి, కాపు, రెడ్డి లేదా మరో వర్గం వేడుకల ప్లానింగ్‌లో బిజీగా ఉంటారు. పెళ్లిళ్ల విషయానికి వస్తే డాలర్లలో ప్యాకేజీలు ఉన్నా "మన బ్లడ్ వేరు.. మన బ్రీడ్ వేరు" అంటూ పాత కాలపు ఛాందససత్వానికే ప్రాధాన్యమిస్తారు.

అమెరికాలోని తెలుగు సంఘాలు సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నాయో లేక కులాల వారీగా జనాభా లెక్కింపులు చేసుకుంటున్నాయో అర్థం కాక పక్కనున్న తెల్లదొరలు కూడా తలగోక్కునే పరిస్థితి వచ్చింది. లక్షలాది మంది తెలుగువాళ్లు చాలా ప్రశాంతంగా.. ఎలాంటి వివక్ష లేకుండా జీవిస్తున్న మాట వాస్తవమే అయినా.. ఇలాంటి కుల గజ్జి మహానుభావులు కొందరు చాలు... ప్రపంచ పటంలో మన సమాజం ఇమేజ్‌ను దారుణంగా దెబ్బతీయడానికి. డాలర్లు సంపాదించడంలో చూపించిన తెలివితేటలు.. మనస్సులోని ఈ కులజాడ్యాలను వదిలించుకోవడంలో ఎప్పుడు చూపిస్తారో ఏంటో. ఎందుకంటే విమానం ఎక్కి వేరే దేశం వెళ్లినంత మాత్రాన విజ్ఞానం, విశాల దృక్పథం వచ్చేసినట్లు కాదు కదా...