గుడ్ న్యూస్... హెచ్-1బీ వీసాదారులకు వెల్ కమ్ నోట్!
ఓ పక్క ట్రంప్ సర్కార్ వలసదారులపై కఠిన నిబంధనలు అమలు చేస్తోన్న వేళ.. మరోవైపు కెనడా సర్కార్ మాత్రం హెచ్-1బీ వీసాదారులకు వెల్ కమ్ నోట్ విడుదల చేసింది!
By: Raja Ch | 7 Nov 2025 9:20 PM ISTఓ పక్క ట్రంప్ సర్కార్ వలసదారులపై కఠిన నిబంధనలు అమలు చేస్తోన్న వేళ.. మరోవైపు కెనడా సర్కార్ మాత్రం హెచ్-1బీ వీసాదారులకు వెల్ కమ్ నోట్ విడుదల చేసింది! ఇందులో భాగంగా... కెనడా ప్రభుత్వం కొత్త ఇమ్మిగ్రేషన్ స్థాయి ప్రణాళికలను ప్రకటించిందని అంతర్జాతీయ మీడియా నివేదించింది. అగ్రశ్రేణి పరిశోధకులను, హెచ్-1బీ వీసా హోల్డర్లను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుందని తెలిపింది.
అవును... కెడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ అంతర్జాతీయ ప్రతిభను ఆకర్షించే ప్రణాళికను ఆవిష్కరించారు. ఇందులో భాగంగా... 1,000 కంటే ఎక్కువ నైపుణ్యం కలిగిన పరిశోధకులను నియమించుకోవడానికి $1.2 బిలియన్లను కేటాయించారు. కొత్త ఇమ్మిగ్రేషన్ ప్రణాళికలో భాగంగా 2026 నుండి 2028 మధ్య 3,80,000 శాశ్వత నివాసితులను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
మొదటి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మార్క్ కార్నీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ప్రసంగించిన కెనడా ప్రధాని.. ఈ పరిశోధకుల నైపుణ్యం మన ప్రపంచ పోటీతత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడుతుందని.. భవిష్యత్ ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతుందని పేర్కొన్నారు! ట్రంప్ హెచ్-1బీ వీసా రుసుములకు లక్ష డాలర్లకు పెంచిన తర్వాత ఈ ప్రకటన రావడం గమనార్హం.
హెచ్-1బీ వీసాదారుల కోసం వేగవంతమైన మార్గం!:
ఇదే సమయంలో... కెనడా ప్రభుత్వం రాబోయే నెలల్లో హెచ్-1బీ వీసాదారుల కోసం వేగవంతమైన మార్గాన్ని కూడా ప్లాన్ చేస్తోంది. ఇదే సమయంలో.. ఈ సంవత్సరం జూలై 1 నాటికి 7.3%గా ఉన్న జనాభాలో శాశ్వత నివాసితులు కాని వారి వాటాను 2027 చివరి నాటికి 5% కంటే తక్కువకు తగ్గించడం దీని లక్ష్యం అని చెబుతున్నారు.
యూనివర్సిటీలు ఎలా స్పందించాయి?:
ఈ సందర్భంగా స్పందించిన యూనివర్సిటీ ఆఫ్ కెనడా... తమ దేశంలో ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలలో చదువుకోవాలనుకునే వారిని స్వాగతించే స్థిరమైన వలస వ్యవస్థను నిర్మించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను గుర్తిస్తున్నామని తెలిపింది. అయితే ఈ ప్రణాళిక ఈ ప్రభుత్వ ప్రతిభ, ఆర్థిక ఎజెండాకు సరిపోలాలని ఒక ప్రకటనలో పేర్కొంది.
