కెనడా నుంచి భారతీయుల బహిష్కరణ.. రూల్స్ అతిక్రమిస్తే ఇక ఇంటికేనా?
కెనడా కలలు కంటున్న వారికి ఇప్పుడు అక్కడి పరిస్థితులు కొంచెం ఆందోళన కలిగిస్తున్నాయి.
By: Madhu Reddy | 19 Feb 2026 10:22 AM ISTకెనడా కలలు కంటున్న వారికి ఇప్పుడు అక్కడి పరిస్థితులు కొంచెం ఆందోళన కలిగిస్తున్నాయి. అక్రమ వలసలపై కెనడా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. గతేడాది ఏకంగా 18 వేల మందిని దేశం నుంచి వెనక్కి పంపగా, అందులో మన భారతీయులే 2800 మంది ఉండటం గమనార్హం. వీసా నిబంధనలు ఉల్లంఘించినా, చిన్నపాటి నేరాలకు పాల్పడినా కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ (CBSA) ఏమాత్రం కనికరం చూపడం లేదు. కఠినమైన చట్టాలతో ప్రవాసులను వారి స్వదేశాలకు పంపే ప్రక్రియను వేగవంతం చేసింది. ఆ వివరాలు చూద్దాం..
వేల సంఖ్యలో బహిష్కరణలు:
కెనడియన్ బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ తాజాగా విడుదల చేసిన నివేదిక చూస్తుంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది. గతేడాది తొలి పది నెలల్లోనే 18,785 మందిని కెనడా బయటకు పంపించేసింది. వీరిలో మెక్సికన్లు అత్యధికంగా ఉండగా, రెండో స్థానంలో మన భారతీయులు 2800 మంది ఉన్నారు. ఇంతటితో ఇది ఆగలేదు మరో 29,500 మందిని వెనక్కి పంపే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఇక ఈ వెయిటింగ్ లిస్టులో ఆరు వేల మందికి పైగా భారతీయులు ఉండటం గమనార్హం. సరైన పత్రాలు లేకపోవడం, వీసా గడువు ముగిసినా అక్కడే ఉండటం, లేదా ఏదైనా క్రిమినల్ కేసుల్లో ఇరుక్కోవడం వంటి కారణాలే ఈ బహిష్కరణలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.
మూడు రకాల ఆర్డర్లు.. ఏది వస్తే ఏమవుతుందంటే:
కెనడాలో చట్టాలను అతిక్రమించిన వారికి అక్కడి అధికారులు మూడు రకాల నోటీసులు జారీ చేస్తారు. వీటి గురించి అవగాహన ఉండటం చాలా ముఖ్యం. మొదటిది 'డిపార్చర్ ఆర్డర్'. ఇది వస్తే 30 రోజుల్లోగా దేశం విడిచి వెళ్లాలి. రెండోది 'ఎక్స్‌క్లూజన్ ఆర్డర్'.. దీనివల్ల ఏడాది నుండి ఐదేళ్ల వరకు కెనడాలోకి అడుగు పెట్టకుండా నిషేధం విధిస్తారు. ఇక అన్నిటికంటే ప్రమాదకరమైనది 'డిపోర్టేషన్ ఆర్డర్', ఇది గనుక వచ్చిందంటే ఇక జీవితంలో ఎప్పటికీ కెనడా వైపు చూడలేరు. జాతీయ భద్రతకు ముప్పు కలిగించినా లేదా తీవ్రమైన నేరాలు చేసినా ఈ చివరి అస్త్రాన్ని ప్రయోగిస్తారు.
కెనడా వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాల్సిందే:
ఒకప్పుడు కెనడా వెళ్లడం అంటే ఎవరైనా సులభంగా వెళ్లొచ్చు అని అందరూ అనుకునేవారు, కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. స్థానిక చట్టాలను గౌరవించకపోయినా, వీసా రూల్స్ బ్రేక్ చేసినా కెనడా ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంటోంది. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగాల కోసం వెళ్లేవారు తమ పేపర్లు అన్నీ పక్కాగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే చేతిలో ఉన్న ఉద్యోగం పోవడమే కాదు, జీవితకాలం ఆ దేశానికి దూరం కావాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే రూల్స్ పాటిస్తూ, పద్ధతిగా ఉంటేనే కెనడాలో భవిష్యత్తు ఉంటుందని ఈ గణాంకాలు హెచ్చరిస్తున్నాయి.
