కెనడా పౌరసత్వం కోసం చూస్తున్నారా.. ఇదిగో సానుకూల కబురు!
అవును... కెనడా తన పౌరసత్వ నియమాలలో పెద్ద సవరణకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో.. పౌరసత్వ చట్టాన్ని సవరించే బిల్ సీ-3 రాజ ఆమోదం పొందింది.
By: Raja Ch | 24 Nov 2025 3:00 AM ISTఓ పక్క పౌరసత్వం విషయంలో అగ్రరాజ్యం నుంచి రకరకాల కండిషన్స్ తెరపైకి వస్తోన్న వేళ.. మరోవైపు కెనడా నుంచి గుడ్ న్యూస్ వినిపిస్తోంది. ఇందులో భాగంగా... సిటిజన్ షిప్ యాక్ట్ ను సవరిస్తూ బిల్-సీ3 కు రాజ ఆమోదం లభించింది. దీంతో.. త్వరలోనే ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఫెడరల్ ప్రభుత్వం తేదీలను ప్రకటించనుంది.
అవును... కెనడా తన పౌరసత్వ నియమాలలో పెద్ద సవరణకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో.. పౌరసత్వ చట్టాన్ని సవరించే బిల్ సీ-3 రాజ ఆమోదం పొందింది. అయితే.. ఈ చట్టం ఇంకా అమలులోకి రాలేదు కానీ.. సమాఖ్య ప్రభుత్వం తేదీని ప్రకటించిన తర్వాత అమల్లోకి వస్తుంది. దీని ద్వారా వేలాది భారతీయ సంతతి కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు.
సెకండ్ జనరేషన్ కటాఫ్ కు ముగింపు!:
ఈ తాజా సవరణ ఇప్పటికే ఆ దేశంలో చర్చనీయాంశంగా ఉన్న సెకండ్ జనరేషన్ కటాఫ్ లోని సమస్యలను పరిష్కరిస్తుంది. విదేశాల్లో జన్మించిన కెనడా వాసులకు అటోమేటిక్ గా పౌరసత్వం సంక్రమించకుండా అడ్డుకునే గతంలో ఉన్న నిబంధన ఇకపై రద్దవ్వబోతోంది! దీంతో ఇలా నష్టపోయిన వారితో ఆ దేశంలో 'లాస్ట్ కెనెడీయన్స్' పేరిట గ్రూప్ కూడా ఏర్పడటం గమనార్హం.
వాస్తవానికి ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజెన్ షిప్ కెనడా (ఐ.ఆర్.సీ.సీ.) 2009లో తెచ్చిన మొదటి తరం పరిమితి ప్రకారం విదేశాల్లో జన్మించిన పిల్లల తల్లిదండ్రుల్లో కనీసం ఒకరైనా కెనడాలో పుట్టడమో.. కన్నుమూయడమో జరిగిన వారికే పౌరసత్వాన్ని పరిమితం చేసింది. అయితే డిసెంబర్ 2023లో ఒంటారియో న్యాయస్థానం ఈ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది.
ఈ నేపథ్యంలో.. ఈ నిర్ణయాన్ని సమాఖ్య ప్రభుత్వం అంగీకరించింది.. ఇదే సమయంలో తిరిగి అప్పీల్ కు వెల్లలేదు. కెనడియన్ ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ (సీ.ఐ.ఎల్.ఏ) ఈ సంస్కరణకు గట్టిగా మద్దతు ఇచ్చింది. ఆ సమయంలోనే రెండవ తరగతి పౌరసత్వం తెరపైకి వచ్చింది!
బిల్-సీ3.. వారికి తిరిగి పౌరసత్వాన్ని ఇస్తుంది!:
ఈ క్రమంలో తాజాగా తీసుకొచ్చిన బిల్ సీ-3.. పాత నిబంధనల ప్రకారం పౌరసత్వాన్ని కోల్పోయిన వారందరికీ తిరిగి పౌరసత్వాన్ని ఇస్తుంది. దీని ప్రకారం.. విదేశాల్లో జన్మించిన తల్లిదండ్రులు పిల్లలను కనడానికి లేదా దత్తత తీసుకోవడానికి ముందు కనీసం 1,095 రోజులు దేశంలోనే గడిపినట్లయితే పౌరసత్వాన్ని పొందేందుకు వీలు కలుగుతుంది. దీని అమలు గడువును కోర్టు జనవరి 2026 వరకూ పొడిగించింది.
