Begin typing your search above and press return to search.

చేతులు పైకి ఎత్తనందుకు తెలంగాణ టెకీని కాల్చి చంపిన అమెరికన్ పోలీసులు

అమెరికాలో మరోసారి తెలుగు కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తిన ఘటన చోటుచేసుకుంది.

By:  A.N.Kumar   |   19 Sept 2025 11:28 AM IST
చేతులు పైకి ఎత్తనందుకు తెలంగాణ టెకీని కాల్చి చంపిన అమెరికన్ పోలీసులు
X

అమెరికాలో మరోసారి తెలుగు కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తిన ఘటన చోటుచేసుకుంది. ఉన్నత విద్య, మంచి భవిష్యత్తు కోసం అమెరికా వెళ్లిన మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మొహమ్మద్ నిజాముద్దీన్ (30) కాలిఫోర్నియాలో పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు.

ఈ దారుణ ఘటన సెప్టెంబర్ 3న కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలో జరిగింది. నిజాముద్దీన్, తన రూమ్‌మేట్‌తో కలిసి ఏసీకి సంబంధించిన ఒక చిన్న సమస్యపై వాగ్వాదానికి దిగాడు. ఈ గొడవ తీవ్రరూపం దాల్చి, కత్తులు తీసుకునే స్థాయికి వెళ్ళింది. ఇది గమనించిన ఇరుగుపొరుగువారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న శాంటా క్లారా పోలీసులు ఇద్దరిని చేతులు పైకి ఎత్తమని ఆదేశించారు. రూమ్‌మేట్ పోలీసుల ఆదేశాలను పాటించగా, నిజాముద్దీన్ మాత్రం చేతులు పైకి ఎత్తడానికి నిరాకరించాడు. దీంతో పోలీసులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నిజాముద్దీన్‌ నేలకొరిగాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినా, అప్పటికే పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయాడు.

మంచి భవిష్యత్తు కోసం 2016లో అమెరికా వెళ్లిన నిజాముద్దీన్, ఫ్లోరిడా కాలేజీలో ఎం.ఎస్. పూర్తి చేశాడు. తర్వాత ఒక ఐటీ సంస్థలో ఉద్యోగం సంపాదించి, ఇటీవల పదోన్నతి పొందడంతో కాలిఫోర్నియాకు మారాడు.

తన కొడుకు మరణవార్త విని నిజాముద్దీన్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషాదకర వార్త అమెరికాలో ఉన్న తన స్నేహితుడి ద్వారా తెలిసిందని నిజాముద్దీన్ తండ్రి మొహమ్మద్ హస్నుద్దీన్ తెలిపారు. తన కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సహాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం భారత రాయబార కార్యాలయం, శాన్ ఫ్రాన్సిస్కో కాన్సులేట్ ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నాయి. అమెరికాలో ఉన్న తెలుగు వర్గాలు కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి.