ఆ ప్రశ్నే ఇక ఉండదు.. అమెరికా ఎఫ్-1 వీసాలకు భారీ మార్పులు
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు అగ్రరాజ్యం భారీ ఊరటను అందించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమవుతోంది.
By: A.N.Kumar | 26 Nov 2025 6:00 PM ISTఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు అగ్రరాజ్యం భారీ ఊరటను అందించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమవుతోంది. విదేశీ విద్యార్థులను ఎక్కువగా ఆకర్షించేందుకు, ఎఫ్-1 స్టూడెంట్ వీసాల జారీలో ప్రస్తుతం అమల్లో ఉన్న కఠిన నిబంధనలను సడలించడానికి అమెరికా చట్టసభ్యులు ప్రతిపాదనలు చేస్తున్నారు. ఈ మార్పులు ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది.
* ‘ఇంటెంట్ టు లీవ్’ రూల్ రద్దు వైపు అడుగులు: భారీ ఊరట!
ప్రస్తుతం ఎఫ్-1 వీసా దరఖాస్తుల్లో అత్యధిక తిరస్కరణలకు కారణమవుతున్న ‘ఇంటెంట్ టు లీవ్’ (స్వదేశానికి తిరిగెళ్లే ఉద్దేశం) నిబంధనను రద్దు చేసే విధానాన్ని ‘డిగ్నిటీ యాక్ట్–2025’ రూపంలో ప్రతిపాదించారు. విద్యార్థులు చదువు పూర్తయ్యాక తప్పనిసరిగా స్వదేశానికి తిరిగెళ్తామని కాన్సులర్ అధికారిని నమ్మించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆర్థిక సంబంధాలు, ఆస్తులు లేదా ఉద్యోగ భరోసా వంటి పత్రాలను చూపించాల్సి రావడం వల్ల అనేక మంది విద్యార్థులు వీసా తిరస్కరణను ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకంగా భారతీయ విద్యార్థులు ఈ రూల్ కారణంగా ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. ఈ సంవత్సరం F-1 వీసాల తిరస్కరణల్లో పెద్ద భాగం ‘ఇంటెంట్ టు లీవ్’ను నిరూపించలేని అభ్యర్థులవే. ఈ ప్రతిపాదిత చట్టం అమల్లోకి వస్తే, “చదువు పూర్తయ్యాక తిరిగి వెళ్తారా?” అనే ప్రశ్నకు తెరపడనుంది. వీసా తిరస్కరణలు గణనీయంగా తగ్గుతాయి.
ఈ నిబంధన తొలగిస్తే, అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని, తద్వారా యూనివర్శిటీలకు అంతర్జాతీయ విద్యార్థుల నుంచి వచ్చే ఆదాయం కూడా పెరుగుతుందని ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది.
ఎఫ్-1 వీసాలలో ‘డ్యూరేషన్ ఆఫ్ స్టే’ మార్పులు: పరిమిత కాల నివాసం!
‘ఇంటెంట్ టు లీవ్’లో ఊరట లభిస్తుండగా మరో కీలక మార్పును డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ప్రతిపాదిస్తోంది. ఎఫ్-1 వీసాలపై ఇంతకాలం ఉన్న డ్యూరేషన్ ఆఫ్ స్టే (D/S) నిబంధనను తొలగించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. విద్యార్థి తన చదువు పూర్తయ్యేంతవరకు (గ్రేస్ పీరియడ్) అమెరికాలో ఉండేందుకు వీలు ఉంది. చదువు మొత్తం కాలానికి ఒకేసారి అనుమతి కాకుండా, పరిమిత కాల నివాస అనుమతితో వీసా మంజూరు చేయాలని ప్రతిపాదన ఉంది. దీంతో ప్రతి విద్యా దశ పూర్తయ్యే సమయంలో వీసా పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి రావచ్చు.
ఈ ప్రతిపాదనలు ఇంకా బిల్లు దశలోనే ఉన్నాయి. ఇవి చట్ట రూపం దాల్చాలంటే కాంగ్రెస్ ఉభయ సభల్లో ఆమోదం పొంది.. అధ్యక్షుడు సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే ‘ఇంటెంట్ టు లీవ్’ నిబంధన రద్దయితే, అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే లక్షలాది మంది విద్యార్థులకు ఇది ఒక చారిత్రక పరిణామం అవుతుంది.
