Begin typing your search above and press return to search.

అమెరికాలో పెరుగుతున్న విద్వేష జ్వాలలు: భారతీయులే లక్ష్యంగా సోషల్‌ మీడియాలో 'ఇన్వేషన్' ప్రచారం

అమెరికాలో భారతీయుల పట్ల పెరుగుతున్న అసహనం ఇప్పుడు ఒక ప్రమాదకరమైన మలుపు తిరుగుతోంది.

By:  A.N.Kumar   |   30 March 2026 6:00 PM IST
అమెరికాలో పెరుగుతున్న విద్వేష జ్వాలలు: భారతీయులే లక్ష్యంగా సోషల్‌ మీడియాలో ఇన్వేషన్ ప్రచారం
X

అమెరికాలో భారతీయుల పట్ల పెరుగుతున్న అసహనం ఇప్పుడు ఒక ప్రమాదకరమైన మలుపు తిరుగుతోంది. నిన్నటి వరకు కేవలం ఉద్యోగాలు, హెచ్-1బీ వీసాలకే పరిమితమైన విమర్శలు.. ఇప్పుడు భారతీయుల దైనందిన జీవనశైలిపైకి మళ్లాయి. ముఖ్యంగా టెక్సాస్ వంటి రాష్ట్రాల్లోని రిటైల్ స్టోర్లలో భారతీయుల తాకిడి పెరిగిందంటూ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం.. అక్కడ నివసిస్తున్న భారతీయ సంతతి వారిని ఆందోళనకు గురిచేస్తోంది.

షాపింగ్ మాల్స్‌లో మొదలైన వివాదం

టెక్సాస్‌లోని ఫ్రిస్కో, ప్లానో వంటి నగరాల్లో ఉన్న కాస్ట్‌కో వంటి ప్రముఖ రిటైల్ స్టోర్లలో తీసిన కొన్ని వీడియోలు ఈ వివాదానికి ఆజ్యం పోశాయి. ఆ వీడియోల్లో భారతీయులు పెద్ద సంఖ్యలో షాపింగ్ చేస్తూ కనిపించగా, నెటిజన్లు దానికి నెగెటివ్ ట్యాగ్‌లను తగిలిస్తున్నారు. "ఈ స్టోర్లు 90% భారతీయులతో నిండిపోయాయి" అని, ఇది అమెరికాలోని ఒక నగరంలా కాకుండా "న్యూ ఢిల్లీ" లా కనిపిస్తోందని విమర్శిస్తున్నారు. సరదాగా మొదలైన ఈ వ్యాఖ్యలు.. కొద్ది కాలంలోనే "ఇన్వేషన్" (దురాక్రమణ) అనే తీవ్రమైన పదాజాలం వాడే స్థాయికి చేరుకున్నాయి.

ఆర్థిక, సామాజిక అంశాలతో ముడిపెడుతూ విషప్రచారం

రైట్ వింగ్ మద్దతుదారులు ఈ అంశాన్ని కేవలం జనాభా పెరుగుదలగా కాకుండా.. అమెరికా సంస్కృతిని మార్చే ప్రయత్నంగా చిత్రీకరిస్తున్నారు. భారతీయులు అధిక ధరలకు ఇళ్లను కొనుగోలు చేయడం వల్ల స్థానికులకు ఇళ్లు దొరకడం లేదని ఆరోపిస్తున్నారు. ఐటీ , టెక్ రంగాల్లో భారతీయుల ఆధిపత్యం పెరగడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్థానిక అమెరికన్ సంస్కృతి కనుమరుగైపోతోందని, భారతీయ జీవనశైలి రాజ్యమేలుతోందని ప్రచారం చేస్తున్నారు. "సోషల్ మీడియాలో వ్యాపించే చిన్న వీడియోలు కేవలం అభిప్రాయాలు మాత్రమే కాదు, అవి వాస్తవ ప్రపంచంలో విద్వేషపూరిత దాడులకు.. సామాజిక విభజనకు దారితీసే అవకాశం ఉంది." అని సామాజిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

వాస్తవాలు.. భారతీయుల సహకారం

ఈ విమర్శలన్నీ ఒకవైపు ఉంటే వాస్తవ పరిస్థితులు మరోలా ఉన్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థలో భారతీయ అమెరికన్ల పాత్ర ఎంతో కీలకం. అత్యధిక ఆదాయం గడించే వర్గాల్లో భారతీయులు ముందు వరుసలో ఉండి.. భారీగా పన్నులు చెల్లిస్తున్నారు. వీరు కొనుగోలు చేసే ఇళ్లు, చేసే షాపింగ్ ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతోంది. అమెరికాలోని టెక్ రంగం ప్రపంచస్థాయిలో నిలబడటానికి భారతీయుల మేధస్సు ప్రధాన కారణం.

పెరుగుతున్న ధ్రువీకరణ రాజకీయాలు

2026 ప్రారంభం నుంచి ఈ తరహా విమర్శలు పెరగడం అమెరికాలోని రాజకీయ ధ్రువీకరణను సూచిస్తోంది. వలస విధానాలపై ఉన్న అసంతృప్తిని భారతీయులపైకి మళ్లించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలు జరుగుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆన్‌లైన్ ట్రోలింగ్ కాస్తా ఇప్పుడు స్థానిక పట్టణ కౌన్సిల్ సమావేశాలకు కూడా పాకింది, అక్కడ భారతీయులకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ విద్వేష వాతావరణం ఇలాగే కొనసాగితే దశాబ్దాలుగా ప్రశాంతంగా సాగుతున్న సామాజిక సామరస్యం దెబ్బతినే ప్రమాదం ఉంది.