అమెరికా డ్రీమ్‌కు కొత్త ట్విస్ట్.. గ్రీన్ కార్డ్ కోసం ఇండియన్స్‌కు ‘రిటర్న్ టు హోమ్’ సిగ్నల్!
ఒకప్పుడు “మా అబ్బాయి అమెరికాలో ఉంటాడండీ” అని పేరెంట్స్ కాలర్ ఎగరేసేవాళ్లు. ఆ ముక్క చెప్పగానే చుట్టుపక్కల వాళ్లు కూడా కాస్త గౌరవంగా చూసేవాళ్లు.
By: A.N.Kumar | 24 May 2026 12:00 AM ISTఒకప్పుడు “మా అబ్బాయి అమెరికాలో ఉంటాడండీ” అని పేరెంట్స్ కాలర్ ఎగరేసేవాళ్లు. ఆ ముక్క చెప్పగానే చుట్టుపక్కల వాళ్లు కూడా కాస్త గౌరవంగా చూసేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అమెరికా నుంచి కొత్త మెమోలు, యూఎస్.సీఐఎస్ నుంచి కొత్త ట్విస్టులు వస్తున్న కొద్దీ.. “మా బాబు ఇంకా అక్కడే ఉన్నాడా? లేక లగేజ్ సర్దుకుని ఎయిర్‌పోర్ట్ దారి పడ్డాడా?” అనే టెన్షన్ ఇళ్లలో స్టార్ట్ అయింది. గ్రీన్ కార్డు కోసం లైన్లో నిలబడ్డ భారతీయుల పరిస్థితిపై డిజిటల్ దునియాలో పేలుతున్న కొన్ని క్రేజీ సెటైర్లు.. ప్రస్తుత పరిస్థితిపై ఒక లుక్కేద్దాం!
ఐ-140 అంటే 'ఇక ఫిక్స్' అనుకుంటే పొరపాటే!
ఇప్పటివరకు అమెరికా ఇమ్మిగ్రేషన్ కథలో రియల్ హీరో ఎవరయ్యా అంటే "ఐ-140 అప్రూవల్". ఒకసారి అది చేతికి వచ్చిందంటే చాలు.. ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‌లలో డీపీలు మారిపోయేవి. లింక్డ్ ఇన్ లో లో “ఫైనల్లీ బ్రెస్డ్.. బౌండరీ క్రాస్డ్ ” అంటూ పొడవాటి పోస్టులు పడేవి. ఊర్లో ఉండే చుట్టాలు “ఇంకో రెండేళ్లలో మనోడు సిటిజన్ అయిపోతాడు.. అక్కడ ఇల్లు కొనేస్తాడు” అని ఫిక్స్ అయిపోయేవాళ్లు. కానీ ఇప్పుడు అమెరికా ఇమ్మిగ్రేషన్ సంస్థ కొత్త ట్విస్ట్ ఇచ్చింది. “మీరు క్వాలిఫై అయ్యారా?” అనేది పాత ప్రశ్న. “అసలు మీకెందుకు ఇక్కడే గ్రీన్ కార్డు ఇవ్వాలి? మీ దేశం వెళ్ళిపోవచ్చు కదా?” అనేది కొత్త ప్రశ్న! అంటే.. ఎగ్జామ్ మొత్తం బాగా రాసినా ఇన్విజిలేటర్ మూడ్ బాగోలేకపోతే ఫెయిల్ చేసే కొత్త రూల్స్ తెచ్చారన్నమాట.
'లాంగ్ టర్మ్' పని చేయండి.. కానీ ఉండకండి!
ఇక్కడ కామెడీ ఏంటంటే.. ఏళ్ల తరబడి అమెరికా కంపెనీల్లో రాత్రింబవళ్లు కోడ్ కొట్టి, టాక్సులు కట్టి, అక్కడి ఎకానమీని నడిపించిన భారతీయులకు ఇప్పుడు యూఎస్.సీఐఎస్ ఇండైరెక్ట్ గా ఇస్తున్న మెసేజ్ ఒక్కటే “బాస్.. మీరు టెంపరరీ వీసా మీద కదా వచ్చింది. ఇంత కంఫర్ట్‌గా సెటిల్ అయిపోవాలని మీకు ఎవరు చెప్పారు?” అని నిలదీసే పరిస్థితికి వచ్చింది. మరోవైపు అమెరికన్ కంపెనీలు పెట్టే జాబ్ పోస్టింగ్స్ చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. వాళ్లకు “లాంగ్ టర్మ్ కమిటెడ్ టాలెంట్ ” కావాలట. కానీ ఇమ్మిగ్రేషన్ రూల్స్ సబ్‌టెక్స్ట్ మాత్రం “పని లాంగ్-టర్మ్ చేయండి.. కానీ ఇక్కడ మాత్రం లాంగ్-టర్మ్ ఉండకండి!” అంటూ స్పష్టం చేస్తోంది.
ఐటీ ఉద్యోగుల మదిలో 'టెన్షన్.. టెన్షన్!'
ప్రస్తుతం ఒక సగటు భారతీయ హెచ్-1బి ఉద్యోగి జీవితం ఒక వైపు మేనేజర్ ఇచ్చే స్పిరిట్ డెడ్ లైన్, మరోవైపు యూఎస్.సీఐఎస్ పెట్టే డిస్కవరీ డెడ్ లైన్ల మధ్య నలిగిపోతోంది. ఇప్పటికే వారి లైఫ్ లో టెన్షన్లకు కొదవ లేదు. ఇప్పుడు వీటన్నింటికీ తోడు “ప్యాక్ యువర్ బ్యాగ్స్ టెన్షన్” కూడా అదనంగా యాడ్ అయింది. చెన్నై, హైదరాబాద్ కాన్సులేట్ల ముందు క్యూలు చూస్తుంటే.. “అమెరికా వెళ్లడం కంటే వెళ్లి మళ్లీ ఇండియాకి సేఫ్‌గా రావడం.. మళ్లీ తిరిగి వెళ్లడమే పెద్ద హారర్ టాస్క్” లా అనిపిస్తోంది.
'ప్లాన్-బి' వైపు అడుగులు..
పరిస్థితి ఇలా తయారుకావడంతో దేశీయ పేరెంట్స్ లో కూడా మార్పు వచ్చింది. ఒకప్పుడు “ఎప్పుడు అమెరికా రమ్మంటావ్ బాబు?” అని అడిగే తల్లిదండ్రులు ఇప్పుడు “ఎప్పుడు తిరిగొచ్చేస్తున్నావ్ నాయనా?” అని ఆరా తీస్తున్నారు. అందుకే మనోళ్లు కూడా లైట్ తీస్కుని 'ప్లాన్-బి'లు రెడీ చేసుకుంటున్నారు. కెనడా పీఆర్ కి ఏమైనా స్కోప్ ఉందా? దుబాయ్‌లో టాక్స్ ఫ్రీ లైఫ్ బెటరా? ఇవన్నీ కాదు కానీ.. గప్‌చుప్‌గా హైదరాబాద్‌లో ఒక ఫ్లాట్ కొనేసి వెనక్కి వచ్చేద్దామా? అని ఆలోచిస్తున్నారు.
మొత్తానికి.. ఒకప్పటి 'అమెరికన్ డ్రీమ్' ఇప్పుడు ప్రతి సీజన్ చివర్లో ఊహించని ట్విస్ట్ ఇచ్చే ఒక పాపులర్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లా మారిపోయింది. అందుకే గ్రీన్ కార్డు క్యూలో ఉన్న దేశీ టెక్కీల కొత్త స్లోగన్ ఒక్కటే "కోడ్ అంటే మేం రాస్తాం కానీ.. అమెరికా ఇమ్మిగ్రేషన్ సంస్థ స్క్రిప్ట్ ఎవరికీ అర్థం కావడం లేదు బాస్!" అంటూ వాపోతున్న పరిస్థితి నెలకొంది.
