Begin typing your search above and press return to search.

'నేను నా భార్యను చంపాను కానీ.. అది హత్య కాదు'!

'నేను నరహత్యకు కారణమయ్యాను కానీ.. హత్యకు దోషిని కాదు ' అని ఆస్ట్రేలియాలో భారత సంతతికి చెందిన 42 ఏళ్ల వ్యక్తి విక్రాంత్ ఠాకూర్ వాదిస్తున్నారు.

By:  Raja Ch   |   20 Jan 2026 11:49 AM IST
నేను నా భార్యను చంపాను కానీ.. అది హత్య కాదు!
X

'నేను నరహత్యకు కారణమయ్యాను కానీ.. హత్యకు దోషిని కాదు ' అని ఆస్ట్రేలియాలో భారత సంతతికి చెందిన 42 ఏళ్ల వ్యక్తి విక్రాంత్ ఠాకూర్ వాదిస్తున్నారు. కస్టోడియల్ ఫెసిలిటీ నుంచి వీడియో కాల్ ద్వారా విచారణకు హాజరైన ఠాకూర్.. ఆడిలైడ్ మేజిస్ట్రేట్ కోర్టుకు మాట్లాడుతూ.. నేను నా భార్యను చంపాను కానీ.. అది హత్య కాదని అన్నారు. ఈ సందర్భంగా అతని న్యాయవాది జేమ్స్ మార్కస్ ఆదేశాల మేరకు అతని ప్రకటన వెలువడిందని అంతర్జాతీయ మీడియా నివేదించింది.

అవును... ఎవరైనా ఉద్దేశపూర్వకంగా మరొకరి మరణానికి కారణమైతే అది హత్య.. అయితే, నరహత్య అనేది ఒక వ్యక్తి అనుకోకుండా మరణానికి దారితీసే పరిస్థితులను సూచిస్తుంది అనుకుంటే.. గత ఏడాది చివర్లో తన 36 ఏళ్ల భార్య సుప్రియా ఠాకూర్ హత్య కేసులో అభియోగం మోపబడిన తర్వాత రెండోసారి కోర్టుకు హాజరైన ఠాకూర్... ఈ తరహా వాదనను తెరపైకి తెచ్చారు. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. దీనిపై న్యాయమూర్తి రియాక్షన్ పైనా ఆసక్తి నెలకొంది!

కాగా... డిసెంబర్ 21న అడిలైడ్‌ లోని ఇన్నర్ నార్త్ ప్రాంతంలోని నార్త్‌ ఫీల్డ్‌ లోని ఒక ఇంటి నుంచి రాత్రి అత్యవసర కాల్స్ వచ్చాయి. దీనితో వెంటనే స్పందించిన పోలీసులు.. రాత్రి 8:30 గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో సుప్రియా ఠాకూర్ అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించారని కోర్టు రికార్డులు వెల్లడించాయి. ఈ సమయంలో.. అధికారులు ఆమెకు సీపీఆర్ చేసి బతికించడానికి ప్రయత్నించినా.. బతికించలేకపోయారని వారు తెలిపారు.

ఈ క్రమంలో దర్యాప్తులో భాగంగా అధికారులు ఠాకూర్ దంపతుల మొబైల్ ఫోన్‌ లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమయంలో... పోస్ట్‌ మార్టం నివేదిక, డీ.ఎన్.ఏ ఫలితాలతో సహా ఆధారాలు పెండింగ్‌ లో ఉన్నాయని పేర్కొంటూ.. ఈ విషయాన్ని 16 వారాల పాటు వాయిదా వేయాలని ప్రాసిక్యూటర్లు కోర్టును అభ్యర్థించారు. మరోవైపు.. తాజాగా విక్రాంత్ చేసిన ఈ అంగీకారంతో.. కేసు ఏప్రిల్‌ లో తిరిగి కోర్టు ముందుకు వస్తుంది.

గోఫండ్‌ మీ పేజీ ప్రకారం.. సుప్రియ శ్రద్ధగల స్వభావం, ఇతరులకు సహాయం చేయడంలో అంకితభావం కలిగి ఉండటం ద్వారా ప్రసిద్ధి చెందింది. ఆమె రిజిస్టర్డ్ నర్సు కావాలని ఆకాంక్షించింది. ఈ సమయంలో సంభవించిన ఆమె విషాదకరమైన మరణం.. ఆమె కొడుకును తల్లి లేకుండా చేసింది.. రాత్రికి రాత్రే అతని జీవితాన్ని తలక్రిందులు చేసింది.