మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు
అమెరికా రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన అబ్దుల్ ఎల్-సయీద్ విజయానికి కర్ణాటకతోనూ ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన భార్య సారా జుకా మూలాలు భట్కల్‌కు చెందినవి. కర్ణాటక మాజీ ఉపమంత్రి జె.హెచ్. షంషుద్దీన్ మనవరాలైన సారా.. అబ్దుల్‌కు రాజకీయ ప్రయాణంలో అండగా నిలిచారు. మిచిగాన్ యూనివర్సిటీలో మొదలైన వీరి పరిచయం 2006లో వివాహ బంధంగా మారింది. అమెరికాలో స్థిరపడినా భారతీయ మూలాలను ఈ కుటుంబం మరువలేదు.
By: A.N.Kumar | 6 Nov 2026 2:54 PM ISTఅరచేతిలో ఇమిడిపోయే ఈ ప్రపంచంలో.. సరిహద్దులు ఎప్పుడో చెరిగిపోయాయి. కానీ కొన్ని విజయాలు మాత్రం ఖండాలు దాటి మన హృదయాలను తాకుతాయి. తాజాగా అమెరికా రాజకీయాల్లో డెమొక్రాట్ అభ్యర్థిగా పోటీచేసిన తొలి ముస్లిం అమెరికన్ అబ్దుల్ ఎల్-సయీద్ సాధించిన విజయం అలాంటి ఒక అద్భుతమైన అనుభూతిని అందిస్తోంది. మిచిగాన్ ప్రజల గుండెల్లో చోటు సంపాదించి సెనెట్లోకి అడుగుపెడుతున్న తొలి ముస్లిం నాయకుడిగా ఆయన చరిత్ర సృష్టించారు. అయితే ఈ చారిత్రాత్మక విజయం వెనుక దక్షిణ భారతదేశంతో.. ముఖ్యంగా కర్ణాటక మట్టితో విడదీయరాని ఓ మమకారపు బంధం ఉందనే విషయం మనకు ఎంతో గర్వకారణంగా మారింది.
అవును.. అమెరికా ప్రజాస్వామ్యంలో సగర్వంగా నిలిచిన ఈ అల్లుడు మన భారతీయుడే.. ఎల్-సయీద్ జీవిత భాగస్వామి సారా జుకాకు మూలాలు కర్ణాటకలోని తీరప్రాంత పట్టణమైన భట్కల్లో ఉన్నాయి. జాత్యహంకారం.. మతపరమైన వ్యాఖ్యలు.. విద్వేషపు గోడలను ఎదుర్కొని సాగిన ఈ రాజకీయ పోరాటంలో సారా ఆయనకు కొండంత అండగా నిలిచారు.
ఈ కథ కేవలం రాజకీయాల గురించే కాదు.. ఒక గొప్ప కుటుంబ వారసత్వం.. ప్రేమ గురించి కూడా.. సారా తాతయ్య జె.హెచ్. షంషుద్దీన్ జుకాకు కర్ణాటక రాజకీయాల్లో ప్రముఖ నాయకుడు.. మాజీ ఉప మంత్రి. ఆయన కుమారుడు డాక్టర్ తయ్యబ్ అంటే సారా తండ్రి బెంగళూరులో వైద్య విద్య పూర్తి చేసి 1980లలో అమెరికాలో స్థిరపడ్డారు. దేశం కాని దేశంలో పెరిగినా సారా కుటుంబం తమ భారతీయ మూలాలను, సంస్కృతిని ఎన్నడూ మరువలేదు. బెంగళూరు, భట్కల్లకు తరచూ వస్తూ తమ మట్టితో అనుబంధాన్ని కాపాడుకున్నారు.
మిచిగాన్ యూనివర్సిటీలో విద్యార్థులుగా ఉన్న సమయంలో అబ్దుల్.. సారాల మధ్య చిగురించిన పరిచయం ప్రేమగా మారి 2006లో వివాహ బంధంతో ఒకటైంది. ఈజిప్షియన్ మూలాలున్న అబ్దుల్.. ఈ రెండంకెల సుదీర్ఘ ప్రయాణంలో తాను "భారతీయ కుటుంబానికి అల్లుడిని" అని ఎంతో గర్వంగా చెప్పుకుంటారు.
ప్రచార సమయంలో ప్రత్యర్థుల నుంచి ముస్లిం గుర్తింపు ఆధారంగా ఎన్నో విమర్శలు.. హేళనలు ఎదురైనప్పటికీ.. అబ్దుల్ ప్రజాసేవే ధ్యేయంగా ముందుకు సాగారు. ఓ వైపు సైకియాట్రిస్ట్‌గా సేవలు అందిస్తున్న భార్య సారా.. మరోవైపు ఎపిడమాలజిస్ట్ అయిన అబ్దుల్.. ఇద్దరూ ప్రజారోగ్యం.. సామాజిక శ్రేయస్సే లక్ష్యంగా నిలబడ్డారు.
సముద్రాలు దాటినా చెరిగిపోని సంస్కారం.. ఎంత ఎదిగినా మూలాలను మరువని మమకారం కలబోసిన సారా-అబ్దుల్ల ప్రయాణం నేడు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. సరిహద్దులు ఎంత సుదూరమైనా 'మన అనుబంధం' ఎప్పుడూ ప్రత్యేకాలే అని ఈ విజయం మరోసారి నిరూపించింది.
