వారిలో సగం మంది రేసిజం బాధితులే....
ఎన్నారైలు అదృష్టవంతులు...హాయిగా ఏ అమెరికానో లండన్లోనో విలాసంగా బతుకుతుంటారు.
By: Tupaki Political Desk | 8 Dec 2025 2:00 PM ISTఎన్నారైలు అదృష్టవంతులు...హాయిగా ఏ అమెరికానో లండన్లోనో విలాసంగా బతుకుతుంటారు. డాలర్లు వారి జీవితాలను పంచరంగుల చిత్రంగా మారుస్తున్నాయని అనుకుంటున్నారా...అయితే మీరు పప్పులో కాలేసినట్లే. పీత కష్టాలు పీతవి, సీత కష్టాలు సీతవి అన్నట్లు ఎన్నారై కష్టాలు ఎన్నారైవి అనాల్సి ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న ప్రవాస భారతీయుల్లో సగం మంది నేటికీ వారి ఆఫీసుల్లో వర్ణవివక్ష (రేసిజం)కు గురవుతున్నట్లు తెలుస్తోంది.
వర్క్ ప్లేస్ కమ్యూనిటీ ప్లాట్ ఫాం బ్లిండ్ నిర్వహించిన సరికొత్త సర్వేలో ఈ షాకింగ్ విషయం తేలింది. బారతీయులపై వర్ణవివక్ష నిజమా అబద్ధమా అన్న శీర్షికతో నవంవర్ 28న పోస్ట్ చేయగా...వెయ్యిమందికి పైగా విదేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు స్పందించారు. ఈ సర్వే ప్రకారం విదేశాల్లో కొలువు చేస్తున్న ఎన్నారైలు 44శాతం మంది కంటే అధికంగా కేవలం వర్ణవివక్ష వల్లే కార్యాలయాల్లో అవమానాలు, నిరాదరణకు గురవుతున్నారని తెలుస్తోంది. గూగుల్,మైక్రోసాఫ్ట లాంటి టెక్ దిగ్గజ కంపెనీల్లో ఈ వివక్షశాతం ఇంకా అధికమని తేలింది. ఈ కార్యాలయాల్లో భారతీయులు కేవలం వారి రంగు వల్లనే నిర్లక్ష్యానికి గురవుతున్నట్లు సమాచారం.
అయితే 44 శాతం మంది ఎన్నారై ఉద్యోగులు రేసిజం కచ్చితంగా ఉందని, తాము నిత్యబాధితులమని అంటుండగా మరో 26 శాతం మంది ఎన్నారైలు వర్ణవివక్ష ఉన్న మాట వాస్తవమే కానీ అది మరీ మా కెరీర్ ను దెబ్బతీసేంత కాదని అంటున్నారు. కాగా 30 శాతం మంది మాత్రం ఇది అవాస్తవమని ఎగ్జాగరేటెడ్ గా చెబుతున్నారని రేసిజం వివాదాన్ని ఖండించారు. బ్లిండ్ సర్వేలో ఎన్నారైలు బాహ్యంగానే కాదు అంతర్గతంగా కూడా ఈ వర్ణవివక్షకు బలి అవుతున్నారని చెబుతోంది.
ఈ రేసిజం కూడా భారతదేశంలోని ప్రాంతాలను బట్టి హచ్చుతగ్గులుగా ఉంటోంది. ఉత్తర భారత దేశీయుల కన్నా దక్షిణ భారత దేశీయులకే ఈ బాధ అధికంగా అని తెలుస్తోంది. ఈ ఉత్తర, దక్షిణ ప్రాంత బేధం భారతీయుల్లోనే ఉండటం వల్ల ఇతరులకు అది అలుసుగా మారుతోంది. సర్వేలో 44శాతం మంది ఉద్యోగులు తమ పనితీరును సమీక్షించే సందర్బంగా ఈ రేసిజం ప్రభావం కనిపించిందని అంటున్నారు. మరో 21శాతం మంది సమాజంలో ఈ వివక్ష ఎదుర్కొంటున్నారు.
చూశారా...విదేశాల్లో మనోళ్ళు ఇరగదీస్తున్నారని...లక్ అంటే వారిదే అని ఇక్కడి వాళ్ళం అనుకుంటుంటామే గానీ వారి కష్టాలు తెలిస్తే వద్దు ఫారిన్ వద్దు బాబోయ్ అనేస్తాం. కలో గంజో తాగి మనూళ్లో మనవాళ్ళ మధ్య బతకడం అంత సుఖం మరొకటి లేదంటాం.
