Begin typing your search above and press return to search.
రైటర్ పద్మభూషణ్

Date of Release: 2023-02-03
నటీనటులు: సుహాస్-టీనా శిల్పరాజ్-రోహిణి-అశిష్ విద్యార్థి-శ్రీ గౌరీ ప్రియ-గోపరాజు రమణ తదితరులు
సంగీతం: శేఖర్ చంద్ర
ఛాయాగ్రహణం: వెంకట్ శాఖమూరి
నిర్మాతలు: అనురాగ్ రెడ్డి-శరత్ చంద్ర-చంద్రు మనోహరన్
రచన-దర్శకత్వం: షణ్ముఖ ప్రశాంత్
షార్ట్ ఫిలిమ్స్ తో సత్తా చాటుకుని.. సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న యువ నటుడు సుహాస్ 'కలర్ ఫొటో'తో బలమైన ముద్రే వేశాడు. ఇప్పుడతను హీరోగా 'రైటర్ పద్మభూషణ్' అనే మరో సినిమా తెరకెక్కింది. చక్కటి ప్రోమోలతో ఆకర్షించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రోమోల్లో ఉన్న విషయం సినిమాలోనూ ఉందా.. చూద్దాం పదండి.
కథ:
లైబ్రేరియన్ గా పని చేసే పద్మభూషణ్ తనకు తాను గొప్ప రచయితని అని ఫీలవుతుంటాడు. అతను తన తల్లిదండ్రులకు కూడా తెలియకుండా 'తొలి అడుగు' పేరుతో ఒక నవల రాసి.. నాలుగు లక్షల అప్పు చేసి మరీ వేల కాపీలు ప్రింట్ చేయిస్తాడు. ఆ నవల మాత్రం ఎవ్వరికీ నచ్చదు. కానీ ఒక అజ్ఞాత వ్యక్తి పద్మభూషణ్ పేరుతో వేరే నవల రాయడంతో పాటు ఒక బ్లాగ్ కూడా నడపడంతో అతడికి మంచి పేరొస్తుంది. అంతే కాక తనెంతో ఇష్టపడే సారిక (టీనా శిల్పరాజ్)తో భూషణ్ కు పెళ్లి కూడా కుదురుతుంది. అంతా సాఫీగా సాగిపోతుండగా.. తన గురించి టీనాకు అసలు నిజం చెప్పాల్సిన పరిస్థితి భూషణ్ కు తలెత్తుతుంది. అప్పుడు అతడికి ఎదురైన పరిణామాలేంటి.. సారికతో భూషణ్ పెళ్లి జరిగిందా లేదా.. ఇంతకీ భూషణ్ పేరుతో రచనలు చేస్తోంది ఎవరు.. ఈ ప్రశ్నలకు సమాధానం తెర మీదే చూడాలి.
కథనం-విశ్లేషణ:
ఛాయ్ బిస్కెట్.. సోషల్ మీడియాను అనుసరించే వారికి ఈ పేరును కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ నుంచి వచ్చిన షార్ట్ ఫిలిమ్స్-వెబ్ సిరీస్ లు అన్నీ కూడా చాలా సింపుల్ గా.. 'ఫీల్ గుడ్' తరహాలో ఉంటాయి. వాటిలో పెద్దగా ట్విస్టులు షాకులేమీ ఉండవు. మన చుట్టూ ఉండే మనుషుల్నే పాత్రలుగా చూపిస్తూ.. మన మధ్య నడిచే విషయాల నుంచే వినోదాన్ని పండించడానికి ప్రయత్నిస్తుంటారు. చాలా వరకు వారి కథలన్నీ లైట్ హార్టెడ్ హ్యూమర్ తో అలరించేలా ఉంటాయి. అలాగే అక్కడక్కడా కొంచెం ఎమోషనల్ టచ్ కూడా ఇస్తారు. ఇప్పుడు ఈ సంస్థ నుంచి వచ్చిన ఫీచర్ ఫిలిం 'రైటర్ పద్మభూషణ్' కూడా అచ్చంగా ఆ తరహాదే. చిన్న పాయింట్ తీసుకుని దాని చుట్టూ చక్కటి కామెడీని పండించి.. చివర్లో ఇచ్చిన ఎమోషనల్ టచ్ ఇచ్చి 'రైటర్ పద్మభూషణ్'ను ఎంగేజింగ్ గా తయారు చేసింది టీం. కథ కొంచెం మామూలుగా అనిపించినా.. మధ్య మధ్యలో వేగం మందగించినా.. అక్కడక్కడా లాజిక్ తేడా కొట్టినా.. ఆ లోపాలన్నింటినీ మరిపించే కథనం 'రైటర్ పద్మభూషణ్'కు ప్లస్ అయింది.
కథ కొంచెం బలహీనంగా ఉన్నా.. ప్రధాన పాత్రతో కనెక్ట్ అయితే.. ఆ పాత్రను పోషించిన ఆర్టిస్టు పెర్ఫామెన్స్ బాగుంటే.. కామెడీ పండితే సినిమా ఎలా సాఫీగా సాగిపోతుందో చెప్పడానికి 'రైటర్ పద్మభూషణ్' ఉదాహరణ. లుక్స్ పరంగా చూడ్డానికి చాలా సాధారణంగా అనిపించినా.. లవబుల్ గా అనిపించే నటనతో సుహాస్ ఇప్పటికే తనదైన ముద్ర వేశాడు. 'రైటర్ పద్మభూషణ్'లో అతణ్ని చూసిన చాలామంది తన ఫ్యాన్ అయిపోతే ఆశ్చర్యం లేదు. అమాయకత్వం పోత పోసుకున్నట్లుగా కనిపించే పద్మభూషణ్ పాత్రకు అతను ప్రాణం పోసేశాడని చెప్పాలి. ఆరంభంలో వచ్చే రెండు మూడు సన్నివేశాలతోనే తన పాత్రతో ప్రేమలో పడిపోతాం. దాంతో ట్రావెల్ అవుతాం. హీరో అమాయకత్వం చుట్టూ పండించిన కామెడీనే సినిమాకు మేజర్ హైలైట్. ఏ సన్నివేశంలోనూ హడావుడి కనిపించదు. పెద్ద పెద్ద డైలాగులేమీ లేవు. డబుల్ మీనింగ్ లకు అసలు ఛాన్సే లేదు. కానీ నవ్వులకు ఢోకా లేదు. ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య వచ్చే 'థియేటర్' ఎపిసోడ్లో అయితే కామెడీ పేలిపోయింది. ఓవైపు సన్నివేశాలు సరదాగా సాగిపోతుండగా.. హీరో పేరుతో రచనలు చేస్తున్న వ్యక్తి ఎవరు అనే సస్పెన్స్ ఎలిమెంట్ కథను ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడింది. సినిమాలో ఒక్కటంటే ఒక్కటీ నెగెటివ్ క్యారెక్టర్ లేకుండా.. కనిపించే ప్రతి పాత్రా ఒక పాజిటివ్ ఫీల్ ఇవ్వడం 'రైటర్ పద్మభూషణ్'లోని ప్రత్యేకత.
ఐతే లాజికల్ గా చూసుకుంటే 'రైటర్ పద్మభూషణ్'లో కొన్ని అంశాలు మింగుడుపడవు. ఒక రైటర్ పేరుతో ఇంకెవరో కథలు రాస్తుంటే ఇతడికి ఎక్కడ లేని పేరు వచ్చేయడం.. హీరోయిన్ తనతో ప్రేమలో పడిపోవడం.. ఆమె తండ్రి హీరో మీద విపరీతమైన ప్రేమ కురిపించడం.. దీని చుట్టూ నడిపిన డ్రామా అంతగా వర్కవుట్ కాలేదు. హీరోను హీరోయిన్ అంత ప్రేమించడానికి బలమైన కారణాలు కనిపించవు. ఇక హీరో పేరు మీద కథలు రాసే అజ్ఞాత వ్యక్తికి సంబంధించిన ట్విస్టు కూడా లాజికల్ గా అనిపించదు. అలాగే హీరోలో ఉన్నట్లుండి మార్పు వచ్చి అతను ఏదో చేసేయడం కూడా ఇల్లాజికల్ గానే అనిపిస్తుంది. ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు కూడా బోరింగ్ గా అనిపిస్తాయి. ప్రథమార్ధంలో చక్కటి వినోదం తర్వాత.. సెకండాఫ్ లో సినిమా గ్రాఫ్ పడ్డట్లు అనిపిస్తుంది. కానీ ప్రి క్లైమాక్స్ నుంచి ప్రేక్షకుల మూడ్ మొత్తం మారిపోతుంది. ప్రేక్షకులను ఒక్కసారిగా భావోద్వేగాలతో ఊపేసే.. ఆలోచన రేకెత్తించేలా చివరి 20 నిమిషాలను నడిపించాడు దర్శకుడు షణ్ముఖ్. కొంచెం మెలో డ్రామా ఎక్కువైనట్లు అనిపించినా సరే.. ఆ సన్నివేశాలు ప్రేక్షకులను కదిలించి కంట్లో నీళ్లు తిరిగేలా చేస్తాయి. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యేలా ఆ సన్నివేశాలను తీర్చిదిద్దారు. సినిమాలోని చిన్న చిన్న లోపాలన్నింటినీ పతాక సన్నివేశాలు మరిపించేలా చేస్తాయి. ఒక పాజిటివ్ ఫీల్ తో ప్రేక్షకుడు థియేటర్ నుంచి బయటికొస్తాడు. ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయగలిగే క్లీన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కడం 'రైటర్ పద్మభూషణ్'కు ప్లస్.
నటీనటులు:
సుహాస్ మంచి నటుడని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాతో అతను మరింత బలమైన ముద్ర వేశాడు. తన లుక్ చూసి ఇతను హీరో ఏంటి అనుకునేవాళ్లు సినిమా చూశాక అతడి అభిమానులుగా మారిపోతే ఆశ్చర్యం లేదు. నటుడిగా అతడికంటూ ఒక స్టైల్ ఉంది. అది ఈ సినిమాలో మరింత ఎలివేట్ అయింది. తన హావభావాలు.. డైలాగ్ డెలివరీతోనే అతను చాలా చోట్ల నవ్వించాడు. సుహాస్ తర్వాత ఎక్కువ ఆకట్టుకునేది రోహిణినే. అమ్మ పాత్రల్లో ఇప్పుడున్న ఆర్టిస్టుల్లో తనంత బాగా ఇంకెవరూ చేయలేరనిపిస్తుంది. చాలా సహజంగా సాగే ఆమె నటనకు ముగ్ధులవుతాం. చివర్లో ఆమె పాత్రను హైలైట్ చేసిన తీరు బాగుంది. హీరోయిన్ టీనా శిల్పరాజ్ చూడ్డానికి బాగుంది. బాగానే పెర్ఫామ్ చేసింది. కెరీర్లో ఎక్కువగా రఫ్ క్యారెక్టర్లు చేసిన ఆశిష్ విద్యార్థి.. ఇందులో మధ్య తరగతి తండ్రిగా సులువుగా ఒదిగిపోయాడు. ఆయన పాత్ర చాలా చోట్ల మంచి వినోదాన్ని పండించింది. గోెపరాజు రమణ.. శ్రీ గౌరీ ప్రియ.. హీరో ఫ్రెండుగా కనిపించిన అబ్బాయి కూడా బాగా చేశారు.
సాంకేతిక వర్గం:
శేఖర్ చంద్ర చాన్నాళ్ల తర్వాత తన సంగీతంతో బలమైన ముద్ర వేశాడు. పాటలు.. నేపథ్య సంగీతం 'రైటర్ పద్మభూషణ్'కు బాగా ప్లస్ అయ్యాయి. అన్ని పాటలూ వినసొంపుగా ఉన్నాయి. చిన్న చిన్న బిట్ సాంగ్స్.. అలాగే నేపథ్య సంగీతం సినిమాను డ్రైవ్ చేయడంలో ఉపయోగపడ్డాయి. శేఖర్ సినిమాను అర్థం చేసుకుని మనసుపెట్టి మ్యూజిక్ చేశాడని అనిపిస్తుంది. వెంకట్ శాఖమూరి ఛాయాగ్రహణం కూడా బాగుంది. నిర్మాణ విలువలు ఓ మోస్తరుగా అనిపిస్తాయి. కానీ ఇలాంటి కథను సపోర్ట్ చేసి నిర్మాతలు తమ అభిరుచిని చాటుకున్నారు. రైటర్ కమ్ డైరెక్టర్ షణ్ముఖ్ ప్రశాంత్ తొలి సినిమాతోనే సత్తా చాటుకున్నాడు. కథాకథనాల్లో షార్ట్ ఫిలిమ్ ఛాయలు ఉన్నప్పటికీ.. థియేటర్లలో జనం మధ్య ఎంజాయ్ చేసేలా సినిమాను తీర్చిదిద్దాడు. కామెడీతో గిలిగింతలు పెట్టడంలోనే కాక చివర్లో భావోద్వేగాలతో ప్రేక్షకులను కదిలించడంలోనూ అతను సఫలమయ్యాడు.
చివరగా: రైటర్ పద్మభూషణ్.. నవ్వించి.. కదిలిస్తాడు
రేటింగ్-2.75/5