Begin typing your search above and press return to search.
'వజ్రకవచధర గోవింద'

Date of Release: 2019-06-14
నటీనటులు: సప్తగిరి - వైభవి జోషి - అర్చనా వేద - శ్రీనివాసరెడ్డి - జబర్దస్త్ అవినాష్ - టెంపర్ వంశీ - అప్పారావు - రాజేంద్ర జాన్ కొట్టోలి - వీరేన్ తంబిదొరై తదితరులు
సంగీతం: బుల్గానిన్
ఛాయాగ్రహణం: ప్రవీణ్ వనమాలి
కథ: జీటీఆర్ మహేంద్ర
నిర్మాతలు: నరేంద్ర యెడల - జీవీఎన్ రెడ్డి
స్క్రీన్ ప్లే - దర్శకత్వం: అరుణ్ పవార్
కామెడీ పాత్రలతో మంచి పేరు సంపాదించిన సప్తగిరి ‘సప్తగిరి ఎక్స్ప్రెస్’తో హీరోగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఆ సినిమా ఓ మోస్తరుగా ఆడగా ఆ తర్వాత అతను కథానాయకుడిగా నటించిన ‘సప్తగిరి ఎల్ఎల్బీ’ నిరాశ పరిచింది. ఈసారి కొంచెం గ్యాప్ తీసుకుని అతను చేసిన సినిమా ‘వజ్రకవచధర గోవింద’. ‘సప్తగిరి ఎక్స్ప్రెస్’ దర్శకుడు అరుణ్ పవార్ రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
గోవిందు (సప్తగిరి) చిత్తూరు జిల్లాలోని సోమల అనే గ్రామానికి చెందిన కుర్రాడు. కొన్ని కారణాల వల్ల ఆ ఊరి జనాలు క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోతుంటారు. వీరిని ఆదుకోవడం కోసం దొంగతనాలు మొదలుపెడతాడు గోవిందు. కానీ వాటి వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఆర్కియాలజిస్టును అనుకోకుండా కలిసిన గోవిందు.. అతడి టీం సాయంతో ఒక నిధి వేటకు బయల్దేరతాడు. అక్కడ అతడికి విలువైన వజ్రం దొరుకుతుంది. దాన్ని అమ్మి తన గ్రామం కష్టాలు తీర్చాలని అనుకుంటుండగా.. ఆ వజ్రం కనిపించకుండా పోతుంది. గోవిందు కూడా మతి స్థిమితం తప్పుతాడు. ఆ వజ్రం మీద కన్నేసిన వాళ్లంతా గోవిందును మామూలు మనిషిని చేయడానికి అవస్థలు పడతారు. ఇంతకీ గోవిందుకు మళ్లీ మతి స్థిమితం వచ్చిందా లేదా.. ఇంతకీ వజ్రం ఏమైంది.. చివరికి గోవిందు తన ఊరి కష్టాలు తీర్చాడా లేదా అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
‘వజ్రకవచధర గోవింద’ ఆరంభంలోనే హీరో ఒక ఒంట్లో దొంగతనానికి వెళ్తాడు. అక్కడో ఆర్కియాలజిస్టు బూతద్దం పెట్టి ఏదో పరిశీలనగా చూస్తుంటాడు. హీరో దొంగతనానికి వచ్చాడని తెలిసినా పెద్దగా చలించడు. అతడి దృష్టంతా ఎన్నో ఏళ్లుగా తెరవలేక పోతున్న ఒక పెట్టె మీద ఉంటుంది. ఐతే చదువూ సంధ్యా లేని పల్లెటూరి కుర్రాడైన హీరో అక్కడ పడి ఉన్న ఒక పేపర్ చూసి అందులో ఉన్న అక్షరాలు తెలుగు అంకెలని చటుక్కున చెప్పేస్తాడు. అంతేే.. అద్భుతం.. అమోఘం అంటూ ఆర్కియాలజిస్టు వెంటనే ఏదో కోడ్ రాసి ఆ పెట్టి తెరిచేస్తాడు. వందల కోట్ల విలువైన గుప్త నిధులకు సంబంధించి మ్యాప్ సంపాదించేసి హీరోకు పది కోట్ల డీల్ ఇచ్చేస్తాడు. అంత పెద్ద ఆర్కియాలజిస్టుకు కనీసం ఆ పేపర్ మీద రాసున్నవి తెలుగు అంకెలు అని కూడా తెలియవట. ఈ సీన్ చూడగానే ‘వజ్రకవచధర గోవింద’ సినిమాలో మున్ముందు ఇలాంటి వజ్రం లాంటి సన్నివేశాలు ఎన్నెన్ని చూడబోతున్నామో ఒక అంచనాకు వచ్చేస్తాం.
పైన గుప్త నిధులకు సంబంధించిన మ్యాప్ ఒకటి దొరికిందని చెప్పుకున్నాం కదా. హీరో అండ్ టీం దాన్ని పట్టుకుని నిధుల కోసం ఒక గుహలోకి వెళ్తుంది. కానీ అక్కడేమీ ఉండదు. వాళ్లు వచ్చిన దారి మూసుకుపోయిందని.. మరో దారిని పట్టుకుని ఒక పాముల పుట్టలోంచి (అవును పాముల పుట్టలోంచే) బయటికి వచ్చేస్తుంది హీరో బృందం. కానీ నిధి దొరకలేదని ఆ బృందంలో ఒకడు చాలా ఫ్రస్టేట్ అయిపోయి అందరినీ కొట్టేస్తుంటాడు. అప్పుడు హీరోకు కోపం వచ్చి పక్కన రోడ్డు మీద పడిన ఒక రాయి తీసి అతడిని కొడతాడు. కానీ అది చూసి పక్కనున్న ఆర్కియాలజిస్టు అది ఉత్త రాయి కాదు. వజ్రం అంటాడు. నల్లటి రాయిలా ఉన్న అది వజ్రం ఏంటి (మొదట్లో నల్లగా కనిపించే ఈ వజ్రం ఇంకో సీన్లో నీలి రంగులో.. మరో సీన్లో వంకాయ రంగులో కనిపిస్తుంది) అని పక్కనున్నోళ్లు తేలిగ్గా తీసి పడేస్తే.. నేను జాతీయ స్థాయిలో 8 గోల్డ్ మెడల్స్ తీసుకున్నా నాకు తెలియదా అంటాడు. ఇంతకీ ఆ వజ్రం విలువెంతో తెలుసా? అక్షరాలా 150 కోట్లట (ఇంకో సీన్లో 200 కోట్లని కూడా అంటారు). అంత విలువైన వజ్రాన్ని అలా రోడ్డు మీద ఎలా పడేశారో అర్థం కాదు. మన హీరో గారు దాన్ని తీసుకెళ్లి ఎక్కడ పెట్టాలో తెలియక చెట్టెక్కి పాముల గూడులో పెడతాడట. అక్కడి నుంచి కింద పడి మతి స్థిమితం తప్పుతాడట. ఇక అతగాడిని మామూలు మనిషిని చేసి వజ్రం గుట్టు తెలుసుకోవడానికి సినిమాలోని క్యారెక్టర్లన్నీ ఎలా కష్టపడ్డాయన్నది మిగతా కథ.
ఊహ తెలియని వయసులో చిన్న పిల్లలకు కథలు చెప్పే పెద్దోళ్లు.. తాము విన్న, కన్న, చదివిన కథలన్నీ చెప్పడం అయిపోయాక.. సొంతంగా ఏదైనా కల్పించి చెప్పాలనుకున్నపుడు కూడా ఇంత అసంబంద్ధమైన.. అర్థరహితమైన కథ చెప్పరేమో అనిపిస్తుంది ‘వజ్రకవచధర గోవింద’ సినిమా చూస్తున్నంతసేపూ. ఇలా కథ రాసి సినిమా చేయడానికి హీరోను.. నిర్మాతల్ని ఒప్పించిన దర్శకుడు అరుణ్ పవార్ కు ఎంత పెద్ద అవార్డిచ్చినా తప్పులేదు. అలాగే దీన్ని ఓకే చేసిన హీరో.. నిర్మాతల్ని కూడా సత్కరించాల్సిందే. మతిస్థిమితం తప్పి హీరో చేసిన విన్యాసాలు.. అతడిని మామూలు మనిషిని చేయడానికి చుట్టుపక్కల వాళ్లందరూ పడ్డ కష్టాల్ని చూసి కూడా మతిస్థిమితం తప్పకుండా బయటికి వచ్చిన ప్రేక్షకులను కూడా అభినందించాల్సిందే. కాస్తో కూస్తో తేడాగా ఉన్న సినిమా గురించైతే కథాకథనాల గురించి ఎంతో కొంత విశ్లేషించవచ్చు కానీ తొలి సన్నివేశం నుంచి చివరి దాకా మొత్తం తేడాగా ఉన్న ఇలాంటి సినిమా గురించి ఇంతకంటే లోతుల్లోకి వెళ్లి చర్చించడం వృథా. దీని కథను ఒక క్రమ పద్ధతిలో చెప్పడం.. ఇది ఏ జానర్ సినిమా అని చెప్పడం కూడా కష్టం అంటే.. పరిస్థితి అర్థం చేసుకోండి.
నటీనటులు:
మంచి కామెడీ టైమింగ్ ఉన్న సప్తగిరి కమెడియన్ పాత్రలు వదిలేసి హీరో వేషాల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నాడో అర్థం కాదు. కనీసం ‘సప్తగిరి ఎక్స్ప్రెస్’, ‘సప్తగిరి ఎల్ఎల్ఎల్బీ’ రీమేక్ సినిమాలు కాబట్టి వాటిని ఎలా తీసినా కొంచెం నయం అనే అనిపించాయి. కానీ ఈసారి మన టాలీవుడ్లోనే తయారైన ‘వజ్రం’ లాంటి కథలో సప్తగిరిని చూశాక అతడి కెరీర్ ఇలా తయారవడం గురించి ఎవరూ బాధ పడాల్సిన పని కూడా లేదనిపిస్తుంది. అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా అనుభవం ఉన్న సప్తగిరి అసలేం చూసి ఈ సినిమా ఒప్పుకున్నాడో అర్థం కాదు. తన ఇమేజ్ ఏంటి.. అతను చేసిన సినిమా ఏంటి..? ఇంత అర్థరహితమైన సినిమాలో సప్తగిరి నటన గురించి ఇక మాట్లాడటానికి ఏముంది? జూనియర్ ఆర్టిస్టులా కనిపించిన హీరోయిన్ వైభవి జోషి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఈ భారీ కథకు ‘భారీ’ విలన్ అవసరమని.. ఒక భారీకాయుడిని పెట్టారు. అతడిని చాలా భయానకంగా చూపించారు. కాకపోతే అతడిని చూసినపుడల్లా భయం కాకుండా నవ్వే వస్తుంది. అలాగే అర్చనా వేద చేసిన విలనీకి కూడా కడుపు చెక్కలయ్యేలా నవ్వుకుంటాం.
సాంకేతికవర్గం:
సంగీత దర్శకుడు బుల్గానిన్.. సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ వనమాలి సినిమా స్థాయికి తగ్గ ‘ప్రమాణాలు’ పాటించారు. నిర్మాణ విలువలు సైతం అంతే. జి.టి.ఆర్ మహేంద్ర అందించిన కథ గురించి పైనే వివరంగా మాట్లాడుకున్నాం కాబట్టి అంతకుమించి చెప్పేదేమీ లేదు. డైలాగులు ఎవరు రాశారో కానీ.. ఆటం బాంబులే. ‘ఇది నా మాస్టర్ ప్లాన్’ అని ఒకడంటే.. ‘ఇది నీ ప్లాన్ కాదా.. నీ మాస్టర్ వేశాడా’ అంటాడు ఇంకొకడు. ఇలాంటి ఆణిముత్యాలకు సినిమాలో లెక్కే లేదు. దర్శకుడు అరుణ్ పవార్ పనితనం అమోఘం. కామెడీ సీన్లతో ఏడిపించి.. సెంటిమెంట్ సీన్లతో నవ్వించి.. యాక్షన్ ఎపిసోడ్లతో భయపెట్టి.. చాలా బాగా ‘ఎంటర్టైన్’ చేశాడు.
చివరగా: వజ్రకవచధర.. గోవిందా గోవిందా!
రేటింగ్-1/5
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre