Begin typing your search above and press return to search.
ఉపేంద్ర 2

Date of Release: 2015-08-14
రేటింగ్- 1/5
నటీనటులు- ఉపేంద్ర - క్రిస్టిన అఖీవా - పరుల్ యాదవ్
సంగీతం- గురుకిరణ్
నిర్మాతలు - ప్రియాంక ఉపేంద్ర
దర్శకత్వం- ఉపేంద్ర
ఉపేంద్ర ఎప్పుడూ ప్రేక్షకుల అంచనాలకు అందడు. ఎ - రా - ఉపేంద్ర - సూపర్ లాంటి సినిమాలతో మన ఇండియన్ సినిమాను దాటి ఎక్కడికో వెళ్లిపోయాడతను. తన ప్రతి సినిమాతోనూ ప్రేక్షకులకు షాకులిస్తూనే ఉన్నాడు ఉపేంద్ర. ఐతే ఆ షాకులన్నీ ఇప్పటిదాకా స్వీట్ గానే ఉన్నాయి. అతడెంత తలతిక్క సినిమాలు తీసినా.. ఏదో ఒక చోట ఆ ‘తిక్క’తో ప్రేక్షకులు కనెక్టయ్యారు. కానీ ఈసారి అతడి తిక్క పరాకాష్టకు చేరింది. ఇప్పటిదాకా ఔట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాలతో సినిమాలు తీసిన ఉప్పి.. ఈసారి ఔట్ ఆఫ్ ద వరల్డ్ ఐడియాతో వచ్చాడు. ప్రపంచంలోనే ఎవరూ తీయని తరహా సినిమా తీద్దామనుకున్నాడో ఏమో కానీ.. అతడి ఉపేంద్ర-2 సినిమా చూశాక రెండున్నర గంటల పాటు ఒక పిచ్చాసుపత్రిలో గడిపిన భావనే కలుగుతుంది ప్రేక్షకులకు.
ఇప్పటిదాకా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎంత ఘోరమైన సినిమాలైనా వచ్చి ఉండొచ్చు. కానీ ఉపేంద్ర లాంటి వాడు ఇలాంటి సినిమా తీయడమే ఘోరం. వేరే సినిమాలైతే భరించలేక మధ్యలో వచ్చేస్తామేమో. కానీ ఇది ఉపేంద్ర సినిమా కదా.. ఎక్కడో ఓ చోట ఏదో ఒక అద్భుతం చేస్తాడు. ఏదో ఒక కొసమెరుపు ఉండే ఉంటుంది. అప్పటిదాకా భరిద్దాం.. అని కూర్చోవడమే పాపమైపోయింది. చివరికి ఎండ్ టైటిల్స్ పడబోతున్నపుడు కూడా ఏదో ఆశ. సినిమాలోని మర్మమేంటో.. తనేం చెప్పదలుచుకున్నాడో వివరిస్తాడేమో అని. కానీ ఉప్పి దాదా కరుణిస్తేనా?
థియేటర్లో కూర్చుని ఎంత అర్థం చేసుకుందామన్నా.. బయటికి వచ్చాక ఎంత రీకలెక్ట్ చేసుకుందామనుకున్నా.. కథ ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. ఇదీ కథ అని చెప్పే సాహసం చేయలేం. బహుశా సినిమా చూసిన ఏ ప్రేక్షకుడూ కూడా ఉపేంద్ర-2 కథేంటి అంటే చెప్పలేడేమో. కనీసం ఉపేంద్రకైనా తనేం చెప్పాలనుకుంటున్నాడో తెలుసో లేదో.. తన కథపై క్లారిటీ ఉందో లేదో అనేది డౌటే. అతనేం చెప్పి నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని సినిమాకు ఒప్పించాడో మరి. ఉపేంద్ర ట్రాక్ రికార్డు మీద నమ్మకంతో సినిమా చేయడానికి ఒప్పేసుకుని ఉంటారు. ఆయా సన్నివేశాల వరకు అతను చెప్పింది చేసి ఉంటారు.
ఆలోచన వల్లే సమస్యలన్నీ అంటాడు. భవిష్యత్తు గురించి ఆలోచించి లాభం లేదంటాడు. ఫ్యూచర్ లో బతకాల్సిన పని లేదంటాడు. అందరూ ఈ రోజు ఉప్మా తింటూ రేపు పెసరట్టు తింటామో లేదో ఆలోచిస్తుంటారంటాడు. ప్రస్తుతంలో బతకమంటాడు. ఈ ఫిలాసఫీలన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఈ ఫిలాసఫీల్ని కన్వే చేయడానికి ఉపేంద్ర ఎంచుకున్న మార్గమే ప్రేక్షకుల్ని ముప్పుతిప్పలు పెడుతుంది. మనమేమైనా అథమ స్థాయి ప్రేక్షకులమేమో.. కొంచెం ఉపేంద్ర స్థాయికి ఎదిగి ఆలోచిద్దామని ఎంత జుట్టు పీక్కున్నా కూడా ఉపేంద్ర కాన్సెప్ట్ అర్థమైతే ఒట్టు. మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో కోటి రూపాయల ప్రశ్నగా.. ‘ఉపేంద్ర-2 కాన్సెప్ట్ ఏంటి?’ అనే ప్రశ్న పెట్టడం సబబేమో అన్న ఆలోచన కూడా తడుతుంది ఈ సినిమా చూస్తుంటే.
సినిమా కథ వివరించలేని నిస్సహాయ స్థితిలో.. సినిమా లోతుల్లోకి వెళ్లడం మహాపాపం. కథ గురించి చెప్పలేనపుడు.. కథనం గురించి.. నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి.. ఏమని వర్ణించగలం?
ఉపేంద్ర-2 చూస్తే ఉపేంద్ర మీద ఉన్న అభిమానం, గౌరవం గంగలో కలిసిపోయే ప్రమాదముంది. కాబట్టి నిజంగా ఉపేంద్ర మీద ఏమాత్రం అభిమానం ఉన్నా ఉపేంద్ర-2 జోలికి వెళ్లొద్దు. ఉపేంద్ర, రా, ఎ, సూపర్ లాంటి సినిమాలు మనకిచ్చిన ఆనందాన్ని వాషౌట్ చేసేసి.. ఇకపై ఉపేంద్ర కొంచెం బెటర్ గా ఉండే సినిమాలు చేసినా వాటి జోలికి వెళ్లలేనంత భయాన్ని నింపేస్తుందీ సినిమా. ఎక్కడైనా ఉపేంద్ర-2 ఆడుతున్న థియేటర్ నుంచి బయటికొస్తున్న ప్రేక్షకుడిని సినిమా ఎలా ఉంది అని అడిగి చూడండి. ఆ ప్రేక్షకుడిచ్చే విచిత్రమైన ఎక్స్ ప్రెషన్ ను బట్టి అర్థమైపోతుంది సినిమాకు వెళ్లాలో లేదో.
Disclaimer : This Review is an Opinion of Review Writer. Please Do not Judge the Movie based on This Review and Watch Movie in Theatre