Begin typing your search above and press return to search.
తిక్క

Date of Release: 2016-08-13
నటీనటులు: సాయిధరమ్ తేజ్ - లారిసా - మన్నారా చోప్రా - రాజేంద్రప్రసాద్ - అజయ్ - ఆలీ - సత్య - సప్తగిరి - ఆనంద్ - రఘుబాబు - పోసాని కృష్ణమురళి తదితరులు
ఛాయాగ్రహణం: కె.వి.గుహన్
సంగీతం: తమన్
కథ: దావూద్
స్క్రీన్ ప్లే: దావూద్ - సునీల్ రెడ్డి
దర్శకత్వం: సునీల్ రెడ్డి
‘ఓం’ లాంటి డిజాస్టర్ తో దర్శకుడిగా పరిచయమయ్యాడు ఒకప్పటి కెమెరామన్ సునీల్ రెడ్డి. ఆ తర్వాత బాగా గ్యాప్ తీసుకుని వరుస హిట్లతో ఊపుమీదున్న సాయిధరమ్ తేజ్ హీరోగా ఇప్పుడు ‘తిక్క’ తెరకెక్కించాడు. మరి ఈసారైనా సునీల్ దర్శకుడిగా మెప్పించాడా.. మంచి సినిమా అందించాడా.. చూద్దాం పదండి.
కథ:
ఆది (సాయిధరమ్ తేజ్) ఉద్యోగం చేస్తూ సరదాగా స్నేహితులతో జీవితం గడిపేస్తున్న కుర్రాడు. ఓ యాక్సిడెంట్ వల్ల తనకు పరిచయమైన అంజలి (లారిసా) వల్ల అతడి జీవితం మారిపోతుంది. ఆమె అతడి జీవితంలోకి వచ్చాక తన అలవాట్లన్నీ వదిలేయాల్సి వస్తుంది. ఐతే ఆది మీద తనకున్నంత ప్రేమ తన మీద అతడికి లేదంటూ అతణ్ని వదిలేసి వెళ్లిపోతుంది అంజలి. ఆ బాధలో తన స్నేహితులతో కలిసి ఒక బార్లో మందుకొట్టడం మొదలుపెడతాడు ఆది. ఈ క్రమంలో అతడికి కొన్ని అనూహ్యమైన పరిణామాలు ఎదురవుతాయి. ఆ రాత్రి అతడి జీవితంలోకి చాలామంది కొత్త వ్యక్తులు వస్తారు. వాళ్ల వల్ల అతనెలా ఇబ్బంది పడ్డాడు.. తన ప్రేయసిని అతను మళ్లీ తిరిగి కలిశాడా లేదా అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
తిక్క అనే టైటిల్.. అన్ లిమిటెడ్ అనే ట్యాగ్ లైన్.. రెండూ ఏ ఉద్దేశంతో పెట్టారో కానీ.. ఇవి రెండూ కూడా సినిమాకు నూటికి నూరు శాతం సూటవుతాయి. ఈ మధ్య కాలంలో ఈ స్థాయి ‘తిక్క’ సినిమా తెలుగులో రాలేదు. ఒక కథను ఎంత తిక్క తిక్కగా రాయొచ్చో.. పాత్రల్ని ఎంత తిక్క తిక్కగా తీర్చిదిద్దవచ్చో.. ఓ సినిమాను ఎంత తిక్క తిక్కగా తెరకెక్కించవచ్చో టెస్ట్ చేసుకోవడానికి తీశారేమో అనిపిస్తుంది ‘తిక్క’ చూస్తుంటే. కథకుడు దావూద్- దర్శకుడు సునీల్ రెడ్డి జంట ‘అన్ లిమిటెడ్ తిక్క’ చూశాక.. మనకు తిక్క రేగడం ఖాయం.
ఒక్క రోజులో ముగిసిపోయే ‘తిక్క’ కథను ఒక గంట కూడా భరించడం కష్టమే అవుతుంది. సినిమా మొదలైన ఓ పావు గంటకే ప్రేక్షకుడికి తిక్క రేగి.. దిక్కులు చూడ్డం మొదలుపెట్టేలా సాగుతంది ఈ తిక్క వ్యవహారం. తెరమీదికి ఏ పాత్ర ఎందుకొస్తుందో తెలియదు.. ఎలా ప్రవర్తిస్తుందో తెలియదు.. ఏ సన్నివేశం ఉద్దేశమేంటో తెలియదు. తెరమీద లెక్కకు మిక్కిలి పాత్రలు చేరిపోయి చేసే గందరగోళానికి ప్రథమార్ధం ముగిసేసరికి బుర్ర బద్దలైపోతుంది. 2 గంటల 20 నిమిషాల నిడివిలే తెర మీద ఏ సన్నివేశం కూడా కొంచెం కుదురుగా అనిపించదు. తెరనిండా పాత్రలు కనిపిస్తుంటే ప్రతి ఒక్కరూ వాళ్లకు తోచిన రీతిలో వాళ్లు గోల చేస్తుంటారు. పస లేని ఈ సన్నివేశాల్లో ఆయా పాత్రల నసను భరిస్తూ చివరిదాకా కూర్చుంటే తలపోటు వచ్చేయడం ఖాయం.
‘తిక్క’లో ప్రతి సన్నివేశంలోనూ తెరమీద ఏదో ఒక పాత్ర చేతిలో మందు బాటిల్ ఉంటుంది. ముఖ్యంగా హీరోగారైతే మందుకొట్టడమే జీవితం అన్నట్లుగా సాగిపోతుంటారు. రోడ్డు మీద కారు నడుపుతూ తాగడమే.. బార్లో తాగడమే.. ఇంటికొచ్చి తాగడమే.. సమస్యలో చిక్కుకుని ఏం చేయాలో తోచక గిలగిలలాడుతున్నపుడూ తాగడమే. ఓ సందర్భంలో అయితే అసలే కారణం లేకుండా ఓ వందమందిని పోగేసి.. వాళ్ల కోసం ఒక ‘బీర్ ఇంజిన్’ పట్టుకొచ్చి.. అందరితో తాగించి.. ఊగించి.. ఐటెం పాపతో స్టెప్పులేయించి పంపిస్తాడు హీరో. అసలక్కడ ఆ పాట అవసరమేంటో అస్సలు అర్థం కాదు. కొడితే మందు కొట్టడం.. లేకుంటే ఇంకొకర్ని కొట్టడం.. ఇదీ సినిమా అంతటా హీరోగారు చేసే పని.
ఒక దశా దిశా అంటూ లేకుండా సాగిపోయే ‘తిక్క’లో అక్కడక్కడా కొన్ని ఫన్నీ సీన్స్ వస్తాయి. వాటికి ఆ క్షణాల్లో నవ్వుకున్నా.. ఆ వెంటనే ఆ ఫీలింగ్ పోగొట్టేసే సిల్లీ సీన్ వచ్చిపడుతుంది. రచయిత-దర్శకుడు ఒక్క రోజులో ముగిసిపోయే కథ అనుకున్నారు కాబట్టి అందుకు తగ్గట్లే కథను ‘పరుగులు’ పెట్టించడానికి ప్రయత్నించారు. హీరోను కారెక్కించేసి అతడితో ఇష్టానుసారం డ్రైవ్ చేయించారు. ఆ క్రమంలో యాక్సిడెంట్లు.. ఛేజింగ్ సీన్లు.. యాక్షన్ ఎపిసోడ్లు.. అవసరమున్నా లేకున్నా బ్లాస్టింగ్స్.. తెరమీద భారీతనం చూపించడానికి దర్శకుడు ఎంచుకున్న మార్గం ఇది. ఖర్చు భారీగా పెట్టించాడు కానీ.. ఆ ఛేజింగ్ సీన్లు.. ఆ యాక్షన్ ఎపిసోడ్ల అవసరం సినిమాకు ఎంత వరకు ఉందంటే మాత్రం సమాధానం ఉండదు.
ప్రథమార్ధమంతా యాక్షన్ పేరుతో వాయిస్తే.. ద్వితీయార్దంలో కామెడీ పేరుతో మోత మొదలవుతుంది. సినిమాలోని లేడీ క్యారెక్టర్లన్నింటికీ బురఖాలు వేయించి చేసిన కన్ఫ్యూజింగ్ కామెడీ ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తుంది. ఈ బురఖా ఆటను దాదాపు అరగంట సాగదీయడం చూస్తే దర్శకుడికి తిక్కకు ఒక లెక్కంటూ ఏమీ లేదని పూర్తిగా అర్థమవుతుంది. క్లైమాక్స్ వరకు ఓపిక పట్టగలిగితే సాహసమే. సాయిధరమ్ డెబ్యూ మూవీ ‘రేయ్’ కూడా ‘తిక్క’ ముందు బెటర్ అనిపిస్తే ఆశ్చర్యమేమీ లేదు. ఆ స్థాయిలో ప్రేక్షకులకు తిక్క రేగేలా చేసే సినిమా ఇది.
నటీనటులు:
‘రేయ్’ను పక్కనబెట్టేస్తే సాయిధరమ్ చేసిన మిగతా మూడు సినిమాలూ అతడికో టేస్టుందని.. జడ్జిమెంట్ స్కిల్స్ ఉన్నాయని రుజువు చేశాయి. కానీ ‘తిక్క’ చూశాక మాత్రం సాయిధరమ్ టేస్టు మీద సందేహాలు కలుగుతాయి. ఇలాంటి కథను ఎలా ఒప్పుకున్నాడో.. ఎలా చేశాడో.. చేస్తున్నపుడు.. రషెస్ చూసుకున్నపుడు అయినా అతడికేమీ తేడా కొట్టలేదా అన్నది సందేహం. ఏదో డ్యాన్సులు బాగా వేశాడని చెప్పుకోవడం తప్ప.. ఇలాంటి సినిమాలో సాయిధరమ్ నటన గురించి మాట్లాడుకోవడానికేమీ లేదు. హీరోయిన్లు లారిసా-మన్నారాల గురించి చెప్పడానికేమీ లేదు. ఆలీ నటన గురించి కాదు కానీ.. అతడికి వేసిన మేకప్ గురించి మాత్రం కచ్చితంగా ప్రస్తావించాలి. బట్టతలతో చూపించడానికి సీరియళ్లలో కూడా అలాంటి మేకప్ వేయరు. అంత ఘోరంగా ఉంది మేకప్. అసలు ఆలీని అలా చూపించాలన్న ఆలోచన ఎందుకొచ్చిందో ఏంటో మరి. మిగతా నటీనటులందరూ కూడా రచయిత-దర్శకుడు ఆడిన ఆటలో బొమ్మలయ్యారంతే.
సాంకేతిక వర్గం:
తమన్ సంగీతం మాత్రం బాగుంది. మంచి పాటలే ఇచ్చాడు. నీకోసం.. వెళ్లిపోకే.. టైటిల్ సాంగ్.. మూడూ కూడా బాగున్నాయి. నేపథ్య సంగీతం సినిమాకు తగ్గట్లుగా ఉంది. కెమెరామన్ కె.వి.గుహన్ చాలానే కష్టపడ్డాడు. నిర్మాత ఇలాంటి కథను నమ్మి బోలెడన్ని డబ్బులు పోసేశాడు. ఎక్కడా రాజీ పడలేదు. రచన.. దర్శకత్వం గురించి మాత్రం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దర్శకుడు సునీల్ రెడ్డి తొలి సినిమా ‘ఓం’ డిజాస్టర్ అయినా.. అందులో అతడి ప్రయత్నం కనిపిస్తుంది. తొలి సినిమా అలాంటి ఫలితాన్నిచ్చాక మరో అవకాశం దక్కితే జాగ్రత్త పడతాడు ఏ దర్శకుడైనా. కానీ సునీల్ మాత్రం ఇలాంటి అర్థరహితమైన కథాకథనాలతో సినిమా తీసే సాహసం ఎలా చేయగలిగాడో అర్థం కాదు.
చివరగా: ఔను.. ఇది అన్ లిమిటెడ్ తిక్కే
రేటింగ్: 1.5/5
Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre