Begin typing your search above and press return to search.
శంకర

Date of Release: 2016-10-22
నటీనటులు: నారా రోహిత్ - రెజీనా కసాండ్రా - జాన్ విజయ్ - రాజీవ్ కనకాల - చిన్నా - ఎమ్మెస్ నారాయణ - ఆహుతి ప్రసాద్ తదితరులు
సంగీతం: సాయికార్తీక్
ఛాయాగ్రహణం: సురేందర్ రెడ్డి
నిర్మాత: చంద్రమౌళి ప్రసాద్
కథ: శాంతకుమార్
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: తాతినేని సత్యప్రకాష్
నారా రోహిత్ సినిమా అంటే మొదలైన కొన్ని నెలల్లో పూర్తవుతుంది.. ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. ఐతే ‘శంకర’ సినిమా మాత్రం నాలుగేళ్ల ముందు మొదలై.. అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చి.. ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమిళ హిట్ మూవీ ‘మౌనగురు’కు రీమేక్ అయిన ఈ చిత్రానికి తాతినేని సత్యప్రకాష్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
శంకర్ (నారా రోహిత్) అంతర్ముఖుడిలా కనిపించే కుర్రాడు. అతడికి ఆత్మాభిమానం ఎక్కువ. అన్యాయాన్ని సహించలేడు. ఎవ్వరికీ భయపడడు. హాస్టల్లో ఉండి చదువుకుంటున్న శంకర్ కు కాలేజీలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వాటన్నింటినీ అధిగమించి కాలేజీలో ఉత్తమ విద్యార్థిగా పేరు తెచ్చుకుంటాడు. ఐతే సాఫీగా సాగిపోతున్న అతడి జీవితాన్ని ఒక సంఘటన మలుపు తిప్పుతుంది. ఒక పెద్ద క్రైమ్ చేసిన ఏసీపీ (జాన్ విజయ్) దాన్ని కప్పి పుచ్చుకునే ప్రయత్నంలో తనకు అడ్డంకిగా ఉన్నవాళ్లందరినీ చంపుతూ వెళ్తాడు. ఆ క్రమంలో ఎవరో అనుకుని శంకర్ ను టార్గెట్ చేస్తారు ఏసీపీ కింద పని చేసే పోలీసులు. వాళ్ల వల్ల శంకర్ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటాడు. మరి ఈ ఇబ్బందుల నుంచి శంకర్ ఎలా బయటపడ్డాడు.. ఏసీపీ ఆట ఎలా కట్టించాడు.. అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
‘శంకర’ దర్శకుడు తాతినేని సత్య.. ఇంతకుముందు కూడా రెండు తమిళ హిట్ సినిమాల్ని రీమేక్ చేశాడు. అవి. భీమిలి కబడ్డీ జట్టు.. ఎస్ఎంఎస్. వాటిలో అతడి పనితనం కనిపిస్తుంది. ఐతే అవి రెండూ మామూలు సినిమాలే. కానీ ‘మౌనగురు’ ఒక వైవిధ్యమైన థ్రిల్లర్. ఐతే నేటివిటీ.. స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగే ఇలాంటి థ్రిల్లర్లను రీమేక్ చేయడం అంత సులువైన విషయం కాదు. ఇదే సినిమాను హిందీలోకి రీమేక్ చేసిన మురుగదాస్ సైతం మెప్పించలేకపోయాడు. తెలుగు వెర్షన్ విషయంలో తాతినేని సత్య కూడా మినహాయింపేమీ కాదు.
ఆ మధ్య రాజశేఖర్ ‘సూదుకవ్వుం’ అనే థ్రిల్లర్ మూవీని తెలుగులోకి ‘గడ్డం గ్యాంగ్’ పేరుతో రీమేక్ చేశాడు. ‘సూదుకవ్వుం’ తమిళంలో బ్లాక్ బస్టర్. క్లాసిక్ లాగా నిలిచిపోయింది. కానీ తెలుగులో చూస్తే మాత్రం గందరగోళంగా అనిపిస్తుంది. దాదాపుగా యథాతథంగా తీసినా తేడా కొట్టేసింది. ‘శంకర’ కూడా దాదాపుగా ఇలాగే అనిపిస్తుంది. కథాకథనాల పరంగా పెద్దగా మార్పులేమీ లేవు. ఐతే టేకింగ్ భిన్నంగా కనిపిస్తుంది. ప్లాట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించినా.. నారా రోహిత్ సిన్సియర్ పెర్ఫామెన్స్ తో సినిమాను నిలబెట్టడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నా.. బిగువైన కథనంతో సినిమాను నడిపించడంలో దర్శకుడు విఫలమయ్యాడు.
తమిళ వెర్షన్ తో పోలికలు పక్కనబెట్టేసి మామూలుగా చూస్తే ‘శంకర’ ఓ మోస్తరుగా అనిపిస్తుంది. ఐతే ఎంటర్టైన్మెంట్ లేని ఇలాంటి డార్క్ మూవీస్ తెలుగులో ఆడిన సందర్భాలు అరుదు. థ్రిల్లర్ సినిమాల నిడివి సాధ్యమైనంత వరకు తక్కువగా ఉండేలా.. ఫోకస్డ్ గా సాగేలా ఉంటే బెటర్. కానీ ‘శంకర’ నిడివి రెండున్నర గంటలుంటుంది. ప్రథమార్ధంలో ఓవైపు హీరో తాలూకు సన్నివేశాల్ని.. మరోవైపు ఏసీపీకి సంబంధించిన ఎపిసోడ్ ను సమాంతరంగా నడిపిస్తూ స్క్రీన్ ప్లే సాగుతుంది. ఐతే రెండింట్లోనూ బిగి లేకపోవడంతో ప్రేక్షకుడు డీవియేట్ అయిపోతాడు. నారా రోహిత్.. రెజీనాల లుక్ వర్తమానానికి భిన్నంగా ఉండటం.. ఎమ్మెస్ నారాయణ.. ఆహుతి ప్రసాద్ లాంటి దివంగత నటులు తెరమీద కనిపిస్తుండటంతో సినిమా ‘పాత’ అన్న ఫీలింగ్ కలుగుతుంది.
‘శంకర’లో నారా రోహిత్ పాత్ర ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అంతర్ముఖుడి పాత్రకు రోహిత్ బాగా సూటయ్యాడు. ఆ పాత్ర చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా ఏసీపీ వ్యతిరేకంగా స్టూడెంట్స్ ఆందోళన చేసినపుడు.. కాల్పులకు భయపడి అందరూ పారిపోతే హీరో మాత్రం అలాగే కూర్చునే సీన్ బాగా పేలింది. హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సీన్స్ పండాయి. ఐతే ద్వితీయార్ధం చాలా వరకు పెయిన్ ఫుల్ గా ఉండటం మైనస్ అయింది. హీరోను మెంటల్ హాస్పిటల్లో పెట్టి వేధించే సన్నివేశాల్ని మన ప్రేక్షకులు జీర్ణించుకోలేరు. హీరో మిస్టరీని ఛేదించే సన్నివేశాలు బాగానే అనిపిస్తాయి. ఏసీపీ పాత్రలో చేసిన తమిళ నటుడి ఓవరాక్షన్ వల్ల ఆ పాత్ర చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు విసిగిస్తాయి. క్లైమాక్స్ సాగతీతగా అనిపిస్తుంది. క్రిస్ప్ గా ముగించాల్సింది. ఓవరాల్ గా ప్లాట్ విషయంలో ఓకే అనిపించినా.. కొన్ని సన్నివేశాలు ఆసక్తి రేకెత్తించినా.. బిగితో సాగని స్క్రీన్ ప్లే వల్ల.. లెంగ్త్ బాగా ఎక్కువైపోవడం వల్ల ‘శంకర’ నిరాశ పరుస్తుంది.
నటీనటులు:
‘శంకర’ సినిమాకు ప్రధాన బలం నారా రోహితే. ఇది రోహిత్ కు అంతగా అనుభవం లేని రోజుల్లో పూర్తి చేసిన సినిమా. అయినా మెచ్యూరిటీ చూపించాడు. ఇది రోహిత్ కు సూటయ్యే సీరియస్ క్యారెక్టర్ కావడంతో ఈజీగా చేసేశాడు. ఎమోషన్లు బయటపడనివ్వకుండా సటిల్ పెర్ఫామెన్స్ ఇవ్వాల్సిన పాత్రలో రోహిత్ మెప్పించాడు. హీరోయిన్ రెజీనా కూడా ఆకట్టుకుంటుంది. ఆమె చాలా గ్లామరస్ గా కనిపించింది. విలన్ పాత్రలో జాన్ విజయ్ చికాకు కలిగిస్తాడు. ప్రతి సీన్లోనూ ఓవరాక్షన్ చేశాడతను. మిగతా వాళ్లంతా పర్వాలేదు.
సాంకేతికవర్గం:
టెక్నికల్ గా ‘శంకర’ వీక్ అనిపిస్తుంది. సాయికార్తీక్ సంగీతం కానీ.. సురేందర్ రెడ్డి ఛాయాగ్రహణం కానీ పెద్దగా ఆకట్టుకోలేదు. పాటలు సినిమాకు బ్రేకుల్లాగా అనిపిస్తాయి. నేపథ్య సంగీతం పర్వాలేదు. నిర్మాణ విలువలు ఏమంత గొప్పగా లేవు. ఇక దర్శకుడు తాతినేని సత్యప్రకాష్ ‘మౌనగురు’ను తెలుగీకరించడంలో తన ప్రత్యేకత చూపించలేకపోయాడు. ఆసక్తికర స్క్రీన్ ప్లే రాసుకోలేకపోయాడు. తమిళ వెర్షన్లో మూల కథ తీసుకుని.. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు క్రిస్ప్ గా సినిమాను తీర్చిదిద్దడంలో విఫలమయ్యాడు.
చివరగా: శంకర.. ప్లాట్ బాగుంది కానీ!
రేటింగ్: 2.5/5
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre