Begin typing your search above and press return to search.
సేవ్ ద టైగర్స్

Date of Release: 2023-04-27
నటీనటులు: ప్రియదర్శి-చైతన్య కృష్ణ-అభినవ్ గోమఠం-జోర్దార్ సుజాత-పావని గంగిరెడ్డి-దేవియాని-శ్రీకాంత్ అయ్యంగార్-హర్షవర్ధన్-గంగవ్వ తదితరులు
సంగీతం: అజయ్ అరసాడ
ఛాయాగ్రహణ: ఎస్వీ విశ్వేశ్వర్
నిర్మాతలు: మహి.వి.రాఘవ్-చిన్న వాసుదేవరెడ్డి
రచన: ప్రదీప్ అద్వైతం-విజయ్ నమోజు-ఆనంద్ కార్తీక్
దర్శకత్వం: తేజ కాకుమాను
సేవ్ ద టైగర్స్.. తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొత్త వెబ్ సిరీస్. ఆనందో బ్రహ్మ.. యాత్ర చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించిన మహి.వి.రాఘవ్ నిర్మాణంలో.. నటుడు తేజ కాకుమాను రూపొందించిన ఒరిజినల్ ఇది. ప్రియదర్శి.. అభినవ్ గోమఠం.. కృష్ణ చైతన్య ప్రధాన పాత్రలు పోషించిన ఈ కామెడీ సిరీస్ హాట్ స్టార్ ద్వారా ఈ రోజే ప్రేక్షకులను పలకరించింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
హైదరాబాద్ బోరబండలో పాల వ్యాపారం చేసే ఘంటా రవి (ప్రియదర్శి).. అదే సిటీలో ఒక యాడ్ ఏజెన్సీలో ఫిలిం మేకర్ అయిన విక్రమ్ (కృష్ణచైతన్య).. ఉద్యోగం మానేసి రైటర్ అవుదామని ప్రయత్నిస్తున్న రాహుల్ (అభినవ్ గోమఠం).. తమ పిల్లలు చదివే స్కూల్లో అనుకోకుండా కలుస్తారు. ఈ ముగ్గురూ తమ భార్యల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారే. ఇదే కాక మరి కొన్ని విషయాల్లో ఆలోచనలు.. అభిరుచులు కలిసి స్నేహితులవుతారు. ఈ ముగ్గురూ ఒక రోజు ఫుల్లుగా మందు కొట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయి పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సి వస్తుంది. అక్కడ తమ లాగే భార్యా బాధితుడైన సీఐతో కనెక్ట్ అయి.. ఆయనకు తమ కథ చెప్పడం మొదలుపెడతారు. ఆ ముగ్గురి జీవితాల్లో జరిగిన సంఘటనలు.. తమ భార్యలను వాళ్లు పెట్టిన ఇబ్బందులు.. వాళ్ల వల్ల వీళ్లు పడ్డ పాట్ల సమాహారమే.. ఈ సిరీస్.
కథనం-విశ్లేషణ:
ఒక భర్తను భార్యా బాధితుడిగా చూపించి కామెడీ పంచడం అన్నది ఎవర్ గ్రీన్ కాన్సెప్ట్. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని కాన్సెప్ట్ ఇది. ఈ నేపథ్యంలో ఎన్నో సినిమాల్లో కామెడీ ఎపిసోడ్లు చూశాం. అవి చాలవని అనిల్ రావిపూడి 'ఎఫ్-2' అంటూ ఫుల్ లెంగ్త్ సినిమా కూడా తీశాడు. ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తాడు. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ను ఆరు ఎపిసోడ్ల వెబ్ సిరీస్ గా రూపొందించింది 'సేవ్ ద టైగర్స్' టీం. ఇక్కడ టైగర్స్ అంటే మగవాళ్లే అన్నమాట. అంతరించి పోతున్న పులుల్ని కాపాడితే సరిపోదు.. రోజు రోజుకూ తరిగిన పోతున్న నిఖార్సయిన మగాళ్లను కూడా కాపాడాలి అంటూ ముగ్గురు పురుష పుంగవులు చేసే పోరాటం నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ సిరీస్ చూస్తున్నంతసేపూ 'ఎఫ్-2' సినిమానే కళ్ల ముందు కదలాడుతుంది. కాకపోతే వెబ్ సిరీస్ కావడం వల్ల హడావుడి లేకుండా.. కొంచెం తాపీగా కథను నడిపించారు. మరీ పగలబడి నవ్వే ఎపిసోడ్లు.. సీన్లు లేవు కానీ.. చూస్తున్నంతసేపు పెదాలపై చిరునవ్వు మాత్రం చెరగదు. టైంపాస్ వినోదానికి ఢోకా లేకుండా సమయం తెలియకుండా ఆరు ఎపిసోడ్లు పూర్తి చేసేలా సరదాగానే సాగిపోతుంది 'సేవ్ ద టైగర్స్'.
ఓటీటీల్లో వచ్చే ఒరిజినల్స్ లో చాలా వరకు క్రైమ్ తో ముడిపడ్డవే ఉంటాయి. అందులో థ్రిల్లర్స్ కే ఆదరణ ఎక్కువ. ఐతే అందులో పూర్తి స్థాయిలో వినోదం పంచేలా రూపొందిన అది కొద్ది కామెడీ సిరీసుల్లో 'సేవ్ ద టైగర్స్'ను ఒకటిగా చెప్పొచ్చు. ఈ సిరీస్ కు అతి పెద్ద ఆకర్షణ.. లీడ్ రోల్స్ చేసిన నటీనటులు.. వారికి సరిగ్గా సూటయ్యేలా తీర్చిదిద్దిన పాత్రలు. ముఖ్యంగా ఈ మధ్య మంచి ఫాంలో ఉన్న ప్రియదర్శికి నూటికి నూరు శాతం సూటయ్యే పాత్రను ఇచ్చారిందులో. హైదరాబాద్ లో పాల వ్యాపారం చేస్తూ కొంచెం మాస్ గా మాట్లాడుతూ.. బిల్డప్పులిచ్చే పాత్రలో ప్రియదర్శి చాలా సింపుల్ గా ఒదిగిపోయాడు. గల్లీల్లో హడావుడి చేస్తూ.. ఎక్కడుంటే అక్కడ సందడి తీసుకొచ్చే పక్కా హైదరాబాదీ పాత్రతో ఇన్ స్టంట్ గా కనెక్టవుతాం. ఇక ఒక ప్రత్యేకమైన కామెడీ టైమింగ్ ఉన్న అభినవ్ గోమఠంను కూడా ఇందులో మేకర్స్ సరిగ్గా వాడుకున్నారు. తన పాత్రతోనూ ప్రేక్షకులు ఈజీగా కనెక్టవుతారు. కృష్ణచైతన్యకు సైతం మంచి రోల్ పడింది. ముగ్గురి పాత్రలు బాగుండటం.. ఆ పాత్రలను మరింత ఎలివేట్ చేసేలా పెర్ఫామెన్స్ కూడా తోడవడంతో 'సేవ్ ద టైగర్స్' సాఫీగా సాగిపోయింది.
కామెడీ సిరీసే కానీ.. 'సేవ్ ద టైగర్స్'లో మరీ హడావుడి కనిపించదు. మహి.వి.రాఘవ్ తీసిన సినిమాల్లాగే ఇది కూడా కొంచెం సటిల్ గా నడుస్తుంది. సింపుల్ హ్యూమర్ తోనే నవ్వించడానికి ప్రయత్నించారు. అక్కడక్కడా సందర్భోచితంగా పాత్రలతో కొన్ని బూతులు మాట్లాడించేశారు కానీ.. చాలా వరకు క్లీన్ గా సాగిపోతుంది కామెడీ. భార్యా భర్తల మధ్య వచ్చే ఇగో క్లాషెస్ నేపథ్యంలోనే చాలా వరకు సన్నివేశాలను అల్లుకున్నారు. 'ఎఫ్-2'లో మాదిరే భర్తలతో భార్యలు ఎలా ఆడుకుంటారు అనే కోణంలో కామెడీని పండించడానికి ప్రయత్నం జరిగింది. టైటిల్ కు తగ్గట్లే.. ఈ కథ కూడా మగాళ్ల కోణంలోనే నడుస్తుంది. ప్రియదర్శి అదే పనిగా కామెడీ చేయకపోయినా.. తన పాత్ర కొంచెం టిపికల్ గా ఉండటం వల్ల తనతో ముడిపడ్డ సన్నివేశాలు ఎంగేజింగ్ గా అనిపిస్తాయి. ఇక అభినవ్ గోమఠం.. తనింట్లో పని మనిషి మధ్య సన్నివేశాలు భలే ఫన్నీగా అనిపిస్తాయి. కామెడీ సీన్లలో అభినవ్ టైమింగ్ భలేగా అనిపిస్తుంది. ఇక సిరీస్ మొత్తంలో స్టాండౌట్ గా నిలిచే ఎపిసోడ్ అంటే.. అండర్ వేర్ యాడ్ షూట్ కు సంబంధించినదే. ఈ ఎపిసోడ్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. సింపుల్ సీన్లు.. చిన్న చిన్న ఎపిసోడ్లతో బోర్ కొట్టకుండా ముందుకు సాగిపోతుంది 'సేవ్ ద టైగర్స్'. ఐతే రెండో సీజన్ కు హింట్ ఇస్తూ కథను అర్ధంతరంగా ఆపేశారు. చివరి ఎపిసోడ్ చూస్తుంటే క్లైమాక్స్ చూస్తున్న ఫీలింగ్ కలగదు. దీనికి ఒక ఆసక్తికర ముగింపునిచ్చి 'హై' ఇచ్చే ప్రయత్నం ఏమీ చేయకపోవడం నిరాశ కలిగిస్తుంది. సిరీస్ మొత్తంలో చెప్పుకోదగ్గ మలుపులేమీ లేవు. మొత్తంగా చూస్తే కథ పరంగా ఏం విశేషం లేదు. ఇందులో కొత్తదనం కూడా కనిపించదు. కానీ మూడు గంటల పాటు టైంపాస్ చేయించడంలో 'సేవ్ ద టైగర్స్' సక్సెస్ అయింది. మరీ అంచనాలు పెట్టుకోకుండా లైటర్ వీన్ కామెడీని ఎంజాయ్ చేయాలనుకుంటే దీనిపై ఒక లుక్కేయొచ్చు.
నటీనటులు:
పెద్ద తెరపై 'బలగం'లో అదరగొట్టిన ప్రియదర్శి తన ఫాంను బుల్లి తెరలోనూ కొనసాగించాడు. ఘంటా రవి పాత్రలో అతను సులువుగా ఒదిగిపోయాడు. హైదరాబాద్ గల్లీల్లో పెరిగిన మాస్ కుర్రాడంటే ఇలాగే ఉంటాడు అనిపించేలా అతను ఈ పాత్రను పోషించాడు. బేసిగ్గా హైదరాబాదీనే కావడం వల్ల అతను ఈ పాత్ర చేయడానికి పెద్దగా కష్టపడినట్లు లేదు. తన లుక్, బాడీ లాంగ్వేజ్ కూడా బాగా సూటయింది. తన పాత్రలోని అమాయకత్వమే దానికి అలంకరణ. దాన్ని ప్రియదర్శి బాగా పండించాడు. అభినవ్ గోమఠంను చూస్తే తన టాలెంటుని ఫిలిం మేకర్స్ ఎందుకు సరిగ్గా వాడుకోలేదనిపిస్తుంది. పాత్రలో మరీ విశేషం లేకపోయినా.. తన పెర్ఫామెన్సుతో దానికి ఎలివేషన్ ఇచ్చాడు. కృష్ణచైతన్య పాత్ర చాలా వరకు సీరియస్ గా సాగిపోతుంది. దానికి తగ్గట్లుగా అతను కొలిచినట్లు నటించాడు. పావని గంగిరెడ్డి ఖాళీగా ఉన్న భర్తను ప్రేమిస్తూ.. తన ఆగడాలను భరించే డాక్టర్ పాత్రలో బాగా చేసింది. ఎక్కడా అతి లేకుండా సింపుల్ గా నటించింది. గడుసు అమ్మాయిగా సుజాత ఆకట్టుకుంది. ప్రియదర్శికి జోడీగా ఆమె సూటయింది. కృష్ణచైతన్యకు జోడీగా నటించిన దేవయాని కూడా బాగానే చేసింది. హర్షవర్ధన్.. గంగవ్వ.. శ్రీకాంత్ అయ్యంగార్.. వీళ్లంతా ఓకే.
సాంకేతిక వర్గం:
'సేవ్ ద టైగర్స్'కు సాంకేతిక హంగులు బాగానే కుదిరాయి. అజయ్ అరసాడ నేపథ్య సంగీతం.. విశ్వేశ్వర్ ఛాయాగ్రహణం ఆకట్టుకునేలా సాగాయి. నిర్మాణ విలువలు మరీ రిచ్ గా అనిపించకపోయినా.. సిరీస్ స్థాయికి తగ్గట్లు కుదిరాయి. షార్ట్ ఫిలిం మేకర్ ప్రదీప్ అద్వైతం.. విజయ్ నమోజు.. ఆనంద్ కార్తీక్ కలిసి ట్రెండీగా ఉండేలా స్క్రిప్టు రాశారు. నటుడు తేజ కాకుమాను తనలోని దర్శకత్వ ప్రతిభను చాటుకున్నాడు. అతడి నరేషన్ స్టైల్ సరదాగా.. ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. రైటర్స్.. డైరెక్టర్ కలిసి అద్భుతాలు చేసేయలేదు కానీ.. ఈ తరం ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా.. ఎంటర్టైన్ చేసేలా సిరీస్ ను నడిపించారు.
చివరగా: సేవ్ ద టైగర్స్.. బుల్లితెర 'ఎఫ్-2'