Begin typing your search above and press return to search.
రంగబలి

Date of Release: 2023-07-07
నటీనటులు: నాగశౌర్య-యుక్తి తరేజా-షైన్ టామ్ చాకో-శరత్ కుమార్-సత్య-గోపరాజు రమణ-మురళీ శర్మ-రాజ్ కుమార్ కసిరెడ్డి-అనంత్ శ్రీరామ్-సప్తగిరి-బ్రహ్మాజీ-శుభలేఖ సుధాకర్ తదితరులు
సంగీతం: పవన్ సీహెచ్
ఛాయాగ్రహణం: దివాకర్ మణి
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
రచన-దర్శకత్వం పవన్ బాసంశెట్టి
మంచి హిట్టు కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు యువ కథానాయకుడు నాగశౌర్య. తన కొత్త చిత్రం 'రంగబలి' మంచి బజ్ తెచ్చుకుని తన కరవు తీర్చేలాగే కనిపించింది. మంచి ప్రోమోలకు పబ్లిసిటీ కూడా తోడై అంచనాలు పెంచిన 'రంగబలి' ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ అంచనాలను సినిమా ఏమేర అందుకుందో చూద్దాం పదండి.
కథ:
శౌర్య అలియాస్ షో (నాగశౌర్య) గోదావరి ప్రాంతంలోని రాజవరం అనే ఊరికి చెందిన కుర్రాడు. అతడికి తన ఊరే బలం. స్నేహితులే బలగం. తన ఊరిలో కింగులా బతికే అతను తండ్రి పోరు పడలేక.. ఒక ఫార్మసీ కోర్సు కోసం విశాఖపట్నానికి వెళ్తాడు. అక్కడ అతడికి మెడిసిన్ చదువుతున్న సహజ (యుక్తి తరేజా) పరిచయం అవుతుంది. కొంత కాలానికి ఇద్దరూ ప్రేమలో పడతారు. సహజ తండ్రికి కూడా శౌర్య నచ్చుతాడు కానీ.. అతడి ఊరేదో తెలుసుకున్నాక వీరి ప్రేమకు ససేమిరా అంటారు. ఆ ఊరిలో ఆయనకు ఒక భయానక అనుభవం ఉంటుంది. మరి ఆ అనుభవం ఏంటి.. ఆయన సమస్యను పరిష్కరించి సహజను తన దాన్ని చేసుకోవడానికి శౌర్య ఏం చేశాడు అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
'రంగబలి' సినిమాలో విలన్ చేతిలో దెబ్బ తిన్న హీరో తండ్రి.. తన కొడుకుని కూర్చోబెట్టుకుని ఒక డైలాగ్ చెబుతాడు. మనం 20-30 ఏళ్లు ఎంత మంచి చేసినా జనం దాన్ని గుర్తుంచుకోరు. కానీ వాళ్లకేదైనా చెడు కనిపిస్తే దాని గురించే మాట్లాడతారు. మన మనుషులే అంత'' అని. ఇదే విషయాన్ని సినిమాకు అన్వయించుకుని చూస్తే.. సినిమాను ఎంత బాగా మొదలుపెట్టినా.. తొలి గంటలో ఎంత బాగా టైంపాస్ చేయించినా.. ప్రేక్షకులు చివరికి దాన్ని గుర్తుంచుకోరు. సినిమాలో అసలు కథను ఎలా చెప్పారు.. అక్కడ్నుంచి సినిమాను ఎలా నడిపించారు.. ఎలా ముగించారు అన్నదే చూస్తారు. ముఖ్యంగా ముగింపుకి వచ్చేసరికి సినిమా ఎలాంటి ఫీలింగ్ కలిగించిందన్నదే ముఖ్యం. అది బాలేకుంటే.. మొదట్లో ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ డోస్ ఏమీ పనికిరాదు. సినిమాలోని మంచి విషయాలను కూడా మరిచిపోయి చెడు మాత్రమే హైలైట్ అవుతుంది. 'రంగబలి' పరిస్థితి ఇలాగే తయారైంది. ఒక దశ వరకు మంచి ఎంటర్టైనర్ లాగా కనిపించే ఈ చిత్రం.. అసలు కథలోకి దిగిన దగ్గర్నుంచి గాడి తప్పి.. చివరికి ఇదేం సినిమారా బాబూ అనుకునేలా చేస్తుంది.
'రంగబలి' గురించి ఎప్పుడు ఏ ప్రమోషన్ ఈవెంట్లో అయినా.. ఇంటర్వ్యూలో అయినా నాగశౌర్య ఒకటే చెప్పాడు. ఇదొక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అని. 'రంగబలి' ట్రైలర్ సైతం సగటు కమర్షియల్ సినిమా చూడబోతున్న సంకేతాలే ఇచ్చింది. ఇది చాలా కొత్తగా ఉంటుందని.. ఏదో ప్రయోగం చేశామని ఏమీ చిత్ర బృందం ఊదరగొట్టలేదు. ఈ రకంగా ప్రేక్షకులను బాగానే ప్రిపేర్ చేశారని చెప్పాలి. 'రంగబలి' మొదలైన తీరు.. ఒక దశ వరకు నడిచే వైనం చూస్తే.. సినిమాలకు మహరాజ పోషకులైన యువతకు ఈమాత్రం ఎంటర్టైన్మెంట్ చాలులే అనిపిస్తుంది. హీరో ఇంట్రడక్షన్ నుంచి ప్రతి సన్నివేశం కూడా సగటు కమర్షియల్ సినిమాల ఫార్మాట్లోనే సాగిపోయినా సరే.. ప్రతి సీన్ ఎంటర్టైన్మెంట్ లక్ష్యంగా సాగిపోవడంతో టైంపాస్ బాగానే అయిపోతుంది. ముఖ్యంగా కొందరు జర్నలిస్టులను ఇమిటేట్ చేస్తూ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో 'రంగబలి'కి హైప్ తీసుకొచ్చిన సత్య చేసిన కామెడీ ప్రథమార్ధానికి ప్రత్యేక ఆకర్షణ. తన పాత్ర కూడా కొత్తగా ఏమీ ఉండదు. ఎదుటోడి బాధలు చూసి పైశాచిక ఆనందం పొందే 'స్పైడర్' విలన్ పాత్రనే కామెడీగా మార్చి.. దాన్నుంచి మంచి వినోదం పండించాడు దర్శకుడు పవన్. కొన్ని చోట్ల బూతులు శ్రుతిమించినా.. కొన్ని సీన్లు మరీ క్రింజ్ అనిపించినా.. ఎంటర్టైన్మెంట్ మాయలో అవి కొట్టుకుపోతాయి.
కానీ తొలి గంటలో సరదా సన్నివేశాలతో టైంపాస్ చేయించి.. తీరా అసలు కథలోకి వెళ్లగానే చేతులెత్తేసే చాలామంది దర్శకుల బాటలోనే పవన్ బాసంశెట్టి కూడా నడిచాడు. అసలీ సినిమాకు 'రంగబలి' అనే టైటిల్ ఎందుకు పెట్టారనే సందేహానికి తెరదించుతూ.. హీరో పుట్టి పెరిగిన ఊరిలోని రంగబలి సెంటర్ వైపు కథను మళ్లించిన తీరు బాగానే ఉంది. ఈ మలుపు దగ్గర కాన్ఫ్లిక్ట్ పాయింట్ కూడా ఆసక్తికరంగానే అనిపిస్తుంది. కానీ హీరో ప్రేమించిన అమ్మాయి కోసం తన ఊర్లో ఫేమస్ అయిన సెంటర్ పేరు మార్చడానికి హీరో పడే పాట్ల దగ్గర్నుంచే 'రంగబలి' పతనం మొదలువుతుంది. కామెడీ కోసమని చేసిన ప్రయత్నాలన్నీ వరుసగా బెడిసికొట్టడం మొదలవుతాయి. 'దసరా' సినిమాలో విలనీని అద్భుతంగా పండించిన షైన్ టామ్ చాకోను ఒక జోకర్ లాగా చూపించడంతో సినిమాను సీరియస్ గా తీసుకోలేని పరిస్థితి ఎదురవుతుంది. విలన్ పాత్ర తేలిపోవడం.. దాంతో పాటే హీరో 'లక్ష్యం' సైతం చిన్నదిగా కనిపించడం.. అతడి కష్టాలు కన్నీళ్లు అన్నీ కూడా నాటకీయంగా అనిపించడంతో ద్వితీయార్ధం నెమ్మది నెమ్మదిగా ప్రేక్షకులకు శిరోభారంగా మారుతుంది.
హీరోయిన్ని మొదట్నుంచి అంత పద్ధతిగా, క్యూట్ గా చూపించి.. ఉన్నట్లుండి ఆ పాత్ర ఔచిత్యమే దెబ్బ తినేలా హద్దులు దాటి ఎక్స్ పోజింగ్ చేయించడం.. అంత ఘాటుగా పాట తీయడం.. కుర్రాళ్లకు కూడా రుచించకపోవచ్చు. మా ఇమాజినేషన్లు మాకున్నాయ్ అంటూ హీరోతో డైలాగ్ చెప్పించినా సరే.. సినిమా గమనంలో ఆ పాట అసలు సింకే కాలేదు. ఇక ఉన్నట్లుండి ఊడిపడ్డట్లుగా అనిపించే శరత్ కుమార్ పాత్ర.. దాంతో ముడిపడ్డ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే 'రంగబలి' నుంచి సడెన్ గా వేరే సినిమాలోకి వెళ్లిపోయామా అన్న ఫీలింగ్ కలిగిస్తాయి. ఈ ఫ్లాష్ బ్యాక్ అయ్యాక హీరో ఇందులో నేను సైడ్ క్యారెక్టర్ అయిపోయానేంటి.. ఈ కథ నాది.. కాన్ఫ్లిక్ట్ నాది అంటూ గొంతు చించుకుని అరుస్తాడు కానీ.. నిజానికి ప్రేక్షకులు ఆ సమయానికి శౌర్యను సైడ్ క్యారెక్టర్ లాగే ఫీలవుతారు. ద్వితీయార్ధమంతా అవసరం లేని సన్నివేశాలు.. ఎపిసోడ్లు.. పాటలతో సాగదీసి.. చివరికి పతాక సన్నివేశాలను మాత్రం హడావుడిగా లాగించేశాడు దర్శకుడు. విలన్ కు చెక్ పెట్టడానికి హీరో వేసిన ఐడియా.. ఆ తర్వాత జరిగే హడావుడి అంతా సినిమాతో ప్రేక్షకులు పూర్తిగా డిస్కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. కొంతమేర 'జాతిరత్నాలు' స్ఫూర్తి కూడా కనిపిస్తుంది క్లైమాక్సులో. ఆఖర్లో ఒక్కసారిగా మిరాకిల్స్ జరిగిపోయి హీరో అనుకున్నది జరిగిపోవడం సిల్లీగా అనిపిస్తుంది. విలన్ పాత్రను మరింత లోతుకు తొక్కేసిన దర్శకుడు క్లైమాక్స్ మీద పూర్తిగా ఇంట్రెస్ట్ కోల్పోయేలా చేశాడు. ప్రథమార్ధంలో కలిగిన పాజిటివ్ ఫీలింగ్ ను.. రెండో అర్ధం పూర్తిగా తుడిచపెట్టేసి చివరికి 'రంగబలి'కో దండం అనిపించేస్తుందీ సినిమా.
నటీనటులు:
నాగశౌర్య చూడ్డానికి చాలా బాగున్నాడీ సినిమాలో. ఈ కథ అతడికి మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చినట్లుంది.. సినిమా అంతా చాలా హుషారుగా నటించాడు. తన వరకు శౌర్య పూర్తి న్యాయం చేశాడీ పాత్రకు. కెరీర్లో ది బెస్ట్ అనిపించే లుక్స్ లో అతను కనిపించాడు. తనే పెట్టించుకున్నాడో.. దర్శకుడి ఆలోచనో కానీ.. అమ్మాయిలు అతణ్ని చూసి వావ్ అనుకుంటుంటే అదేమీ అతిశయోక్తిలా అనిపించదు. ఈ కటౌట్ కు సరైన సినిమా పడితే.. అనే ఫీలింగ్ కలుగుతుంది తనను చూస్తుంటే. కానీ 'రంగబలి' లాంటి సినిమా కోసం అతను తన ప్రతిభను, కష్టాన్ని వృథా చేసుకున్నాడనే చెప్పాలి. హీరోయిన్ యుక్తి తరేజా పర్వాలేదు. చూడ్డానికి బాగుంది. నటన సోసోగా అనిపిస్తుంది. పైన చెప్పుకున్నట్లే ఒక పాటలో తనను చూపించిన విధానం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. విలన్ పాత్రలో షైన్ చాకోను దర్శకుడు ఏమాత్రం ఉపయోగించుకోలేకపోయాడు. తన ప్రత్యేకత ఏమీ కనిపించలేదీ పాత్రలో. శరత్ కుమార్ కనిపించిన కాసేపు బాగా చేసినా.. ఆయన వల్ల సినిమాకు ప్రయోజనం లేకపోయింది. సత్య కామెడీ సినిమాలో పెద్ద రిలీఫ్. కానీ ద్వితీయార్ధంలో అతణ్ని కూడా వాడుకోలేకపోయారు. హీరో తండ్రి పాత్రలో గోపరాజు రమణ తనకు అలవాటైన శైలిలో నటించి ఆకట్టుకున్నాడు. మురళీ శర్మ సహా మిగతా నటీనటులు మామూలే.
సాంకేతిక వర్గం:
సంగీతం 'రంగబలి'కి అతి పెద్ద మైనస్. 'లవ్ స్టోరీ'లో తన అభిరుచిని చాటిన పవన్ సీహెచ్ ఈ సినిమాలో పెద్ద షాకే ఇచ్చాడు. పాటల్లో ఒక్కటి కూడా ఒక మోస్తరుగా అనిపించదు. పాట రాగానే బయటికి వెళ్లిపోయేలా ఉన్నాయి. 'లవ్ స్టోరీ'కి.. దీనికి ఒకరే సంగీత దర్శకుడు అంటే నమ్మలేం. నేపథ్య సంగీతం పర్వాలేదు. దివాకర్ మణి ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ కలర్ ఫుల్ గా సాగాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. కొత్త దర్శకుడు పవన్ బాసంశెట్టి మంచి హీరో.. అన్ని వనరులూ దొరికినా సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. కొన్ని సన్నివేశాలు.. డైలాగులు చూస్తే అతడికి యూత్ పల్స్ తెలుసనే అనిపిస్తుంది. కామెడీ వరకు ఓకే అనిపించాడు. కానీ కథ విషయంలో పవన్ సరైన కసరత్తే చేయలేదు. తన డైలాగుల్లో బూతులు శ్రుతి మించాయి. ఏమాత్రం సీరియస్ గా తీసుకోలేని నరేషన్ వల్ల.. సినిమా గాడి తప్పేసింది. పవన్ చేజేతులా తన సినిమాను దెబ్బ తీసుకున్నాడు.
చివరగా: రంగబలి.. సగం నుంచి బలి
రేటింగ్-2/5
Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater