Begin typing your search above and press return to search.
రామబాణం

Date of Release: 2023-05-05
నటీనటులు: గోపీచంద్-డింపుల్ హయతి-జగపతి బాబు-ఖుష్బు సుందర్- తరుణ్ అరోరా-నాజర్-శుభలేఖ సుధాకర్-సచిన్ ఖేద్కర్-కాశీ విశ్వనాథ్-వెన్నెల కిషోర్, ఆలీ, సప్తగిరి-సత్య తదితరులు
సంగీతం: మిక్కీ జే మేయర్
ఛాయాగ్రహణం: వెట్రి పళనిస్వామి
కథ: భూపతి రాజా
మాటలు: మధుసూదన్ పడమర్తి
నిర్మాత: టీజీ విశ్వప్రసాద్
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీవాస్
మాస్-యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరైన గోపీచంద్ కు 'లక్ష్యం'.. 'లౌక్యం' లాంటి సూపర్ హిట్లు ఇచ్చాడు శ్రీవాస్. వీరి కలయికలో వచ్చిన కొత్త సినిమా 'రామబాణం'. మరి ఈ జోడీకి ఈ చిత్రం హ్యాట్రిక్ హిట్టును అందించేలా ఉందా..? చూద్దాం పదండి.
కథ:
విక్కీ (గోపీచంద్).. తన అన్న మీద కోపంతో టీనేజీలో ఇల్లు వదిలి వెళ్లిపోయిన కుర్రాడు. అతను కలకత్తాకు వెళ్లి ఒక రౌడీకి కుడి భుజంగా ఉంటూ అంచెలంచెలుగా ఎదుగుతాడు. ఒక స్థాయికి ఎదిగాక భైరవి (డింపుల్ హయతి)తో ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతణ్ని ప్రేమిస్తుంది. కానీ వీరి పెళ్లికి భైరవి తండ్రి ఒప్పుకోడు. నీకంటూ ఒక కుటుంబం ఉంటేనే కూతుర్ని ఇస్తా అని విక్కీకి కండిషన్ పెడతాడు. దీంతో 14 ఏళ్ల తర్వాత తన కుటుంబాన్ని కలుసుకోవడానికి ఆంధ్రాకి వస్తాడు విక్కీ. ఐతే గొడవలంటే అస్సలు పడని తన అన్న రాజారాం (జగపతిబాబు)కు విక్కీ తన గురించి అసలు నిజం చెప్పకుండా దాస్తాడు. అదే సమయంలో తన అన్న పెద్ద సమస్యలో ఉన్నట్లు విక్కీకి తెలుస్తుంది. అప్పుడతను ఏం చేశాడు.. విక్కీ గురించి అసలు నిజం రాజారాం తెలుసుకున్నాడా.. తర్వాత ఎలాంటి పరిణామాలు తలెత్తాయి.. ఈ విషయాలన్నీ తెర మీదే చూడాలి.
కథనం-విశ్లేషణ:
కలకత్తా నుంచి ఊడిపడి.. తమకు తలపోటుగా తయారైన హీరో గురించి తెలుసుకోవడానికి విలన్.. ఒక మనిషిని ఆ సిటీకి పంపిస్తాడు. అక్కడి నుంచి తిరిగొచ్చిన విలన్ మనిషి.. హీరో గురించి చెబుతూ చెబుతూ.. ''వాడి గురించి తన పార్టనర్ చెప్పిన ఒక ఇన్సిడెంట్ వింటే ఆ విక్కీ కాస్తా విక్కీ భాయ్ ఎందుకు అయ్యాడో తెలిసింది'' అంటూ 'బాషా' లెవెల్లో ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పడం మొదలుపెడతాడు. ఇంతకీ ఆ ఇన్సిడెంట్ ఏంటయ్యా అంటే.. కలకత్తాలో పేదవాళ్ల ఇళ్లను అక్కడుండే ఒక విలన్ అండతో ఓ పెద్ద మనిషి ఖాళీ చేయిస్తుంటే.. హీరో రంగంలోకి దిగుతాడు. సింపుల్ గా ఒక ఫైట్ చేసి.. ''ఇంకోసారి ఇక్కడ కనబడ్డారంటే మీ తలల్ని కాళీ మాత గుడికి వేలాడదీస్తా'' అంటాడు. ఇంతకుమించి ఏమీ జరగదు అక్కడ. ఈ ఇన్సిడెంట్ గురించి చెప్పడం ముగించగానే.. అక్కడున్న విలన్ గ్యాంగ్ అంటే ఒక్కసారిగా ఉలిక్కి పడి చెమటలు కక్కేస్తుంది. కానీ దశాబ్దాల నుంచి ఇలాంటి రొటీన్ సన్నివేశాలు చూసి చూసి విసుగెత్తిపోయిన ప్రేక్షకులకు రవ్వంత కూడా ఎమోషన్ కలగదు. 'రామబాణం' ఎంత రొటీన్ సినిమానో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. సినిమా అంతటా ఇలాంటి సీన్లు బోలెడు కనిపిస్తాయి.
'రామబాణం'లో హీరో తన అన్నయ్య తిట్టాడని అలిగి తన కళ్ల ముందే కట్టుబట్టలతో ఒక ట్రైన్ ఎక్కేస్తాడు. కట్ చేస్తే కలకత్తాలో తేలుతాడు. ఒక టీనేజీ పిల్లాడు ఇలా ఒంటరిగా కలకత్తా చేరితే తిండికి ఉండటానికి ఎంత కష్టపడతాడో అనుకుంటాం. కానీ కొన్నేళ్లు గడిచాక సూటూ బూటూ వేసుకుని ఒక పెద్ద కంపెనీ సీఈవో తరహాలో నడుచుకుంటూ వెళ్లి చార్టెడ్ ఫ్లైట్ ఎక్కుతాడు. తన లుక్.. వాలకం చూసి అక్కడేదో అదృష్టం కొద్దీ ఒక పెద్ద కుటుంబంలో పడి.. బాగా చదువుకుని పెద్ద కంపెనీ నడిపే స్థాయికి వెళ్లాడేమో అనుకుంటే పొరపాటే. అతను ఒక రౌడీ దగ్గర చేరి.. తన కుడి భుజంలా ఉంటూ సెటిల్మెంట్లు.. కాంట్రాక్టులు చేస్తూ ఇలా వందలు.. వేల కోట్ల స్థాయికి ఎదిగిపోతాడట. ఎదిగితే ఎదిగాడు కానీ.. అతణ్ని కనీసం అతణ్ని ఒక రౌడీ లుక్ లో చూపించినా ఒక అర్థం ఉంది. కానీ ఆ పోష్ లుక్.. ఆ చార్టెడ్ ఫ్లైట్లు.. ఈ వ్యవహారమేంటో అర్థం కాదు. మాస్ హీరో.. కమర్షియల్ సినిమా అనగానే లాజిక్ ను అటకెక్కించేసి తోచినట్లు రాసేశారు.. తీసేశారు అనిపిస్తుంది.
'రామబాణం'లో ప్రతి డైలాగ్.. ప్రతి సన్నివేశం..ఏదో ఒక సినిమా నుంచి స్ఫూర్తి పొందో.. దేన్నో ఇమిటేట్ చేస్తూనే రాసినట్లు.. తీసినట్లు అనిపిస్తుంది. 'సంతోషం' సినిమాలో ఆల్రెడీ విన్న ''ప్రేమించడానికి రెండు మనసులు చాలు. పెళ్లి చేసుకోవడానికి రెండు కుటుంబాలు కావాలి'' అనే డైలాగ్ ను యాజిటీజ్ ఇందులో పెట్టేశారు. ఇక బాబాయి కూతురి పెళ్లికి కష్టం వస్తే.. హీరో వెళ్లి అప్పటికప్పుడు సింగిల్ క్లిక్ తో 50 కోట్లు జమ చేసేయడం.. మంత్రి గారికి ఝలక్ ఇచ్చి అక్కడి నుంచి ఖాళీ చేయించడం.. లాంటి సీన్లు ఎన్ని సినిమాల్లో చూడలేదు. 'రామబాణం' ట్రైలర్ చూసినపుడు కలిగే 'రొటీన్' ఫీల్ ను సినిమాలో ప్రతి సన్నివేశం కూడా క్యారీ చేస్తుంది. సేంద్రియ పంటలతో వంటలు.. హోటళ్లు అంటూ ఇందులో పెట్టిన థ్రెడ్ కూడా ఏమంత ఆసక్తికరంగా లేదు. జగపతిబాబు పాత్రను తీర్చిదిద్దిన తీరు చూస్తేనే మనం ఒక రొటీన్ సినిమా చూడబోతున్నామని అర్థమైపోతుంది. హీరో వేరే ప్రాంతానికి అనామకుడిలా వెళ్లి అక్కడుండే డాన్లు అందరినీ కొట్టి పెద్ద డాన్ అయిపోయే ట్రాక్ లు.. అలాగే హీరో తన నేపథ్యాన్ని దాచి పెట్టి ఫ్యామిలీలోకి వచ్చి.. అక్కడ సైలెంటుగా సమస్యలన్నీ చక్కబెట్టేసే ఎపిసోడ్లు ఎన్ని చూడలేదు. కనీసం కామెడీనోె.. ఎలివేషన్ సీన్లో అయినా వర్కవుట్ అయితే కొంచెం టైంపాస్ అయ్యేది. కానీ అవి కూడా చాలా సాధారణంగా తయారవడంతో 'రామబాణం' ఎంతమాత్రం గుండెల్ని తాకదు.
నటీనటులు:
గోపీచంద్ ఎప్పట్లాగే చక్కగా స్టైలింగ్ చేయించుకుని చాలా అందంగా కనిపించాడు. మాచో స్టార్ అనే పదానికి అతడి కటౌట్ సూటయ్యేలా కనిపించాడు. కానీ చేసిందేమో రౌడీ పాత్ర.. కనిపించేదేమో కార్పొరేట్ సీఈవో తరహాలో. ఆ లుక్.. స్టైలింగ్ తన పాత్ర నేపథ్యానికి సూట్ కాలేదు. సినిమా లాగే గోపీ నటన కూడా మామూలుగా సాగిపోయింది. ఇలాంటి పాత్రలు బోలెడు చేశాడతను. కానీ గోపీ లుక్స్ చూస్తే మాత్రం ఈ కటౌట్ కు సరైన సినిమా పడట్లేదే అనిపిస్తుంది. హీరోయిన్ డింపుల్ హయతి సినిమాలో పాటలకు మాత్రమే పనికొచ్చింది. చాలా చోట్ల ఆమె ఉత్సవ విగ్రహమే అయింది. సెకండ్ ఇన్నింగ్స్ లో చేసిన 80 పాత్రల్లో ఏడెనిమిదికి మించి చెప్పుకోదగ్గవి లేవంటూ ఈ సినిమా ఇంటర్వ్యూల్లో జగపతిబాబు.. ఇందులోని పాత్ర చూసే ఫీలయ్యాడో ఏమో అనిపిస్తుంది. ఆయన పాత్ర అంత సాధారణంగా సాగిపోయింది. తరుణ్ అరోరా విలనీ గురించి కూడా చెప్పడానికి ఏమీ లేదు. నాజర్ కూడా మరీ మొక్కుబడిగా సాగే పాత్ర చేశాడు. సినిమాలో చాలామంది నటీనటులున్నా.. ఎవరికీ చెప్పుకోదగ్గ పాత్రలు లేవు. వెన్నెల కిషోర్.. ఆలీ డబుల్ మీనింగ్ కామెడీతో కొంత నవ్వించడానికి ప్రయత్నించారు.
సాంకేతిక వర్గం:
మిక్కీ జే మేయర్ మాస్ సినిమాలకు నప్పే బీట్ ఉన్న పాటలు ఇవ్వలేకపోయాడు. తెర మీద చూడ్డానికి కూడా బోరింగ్ గా అనిపించాయి పాటలు. నేపథ్య సంగీతం కూడా రొటీన్ గా సాగిపోయింది. వెట్రి పళనివేల్ ఛాయాగ్రహణం రిచ్ గా సాగింది. సినిమాకు బాగానే ఖర్చు పెట్టారు నిర్మాతలు. ప్రతి సీన్లోనూ రిచ్ నెస్ కనిపించేలా చూసుకున్నారు. కానీ దర్శకుడు శ్రీవాస్ వనరులను ఏమాత్రం ఉపయోగించుకోలేకపోయాడు. ఒకసారి గోపీతో ఇంతకుముందు అతను చేసిన రెండు సినిమాలు చూసుకుని.. ఆ తర్వాత ఈ చిత్రం చూస్తే తేడా ఏంటో అతడికే అర్థమైపోతుంది. 'లక్ష్యం'లో మాదిరి కథలో విషయం లేదు. 'లౌక్యం'లో మాదిరి కామెడీ కూడా పండించలేకపోయాడు. మరీ మూసగా అనిపించే భూపతి రాజా కథను.. అంతే మూసగా ప్రెజెంట్ చేసి తన కెరీర్లో అన్నిటికంటే దిగువన నిలిచే సినిమాను అందించాడు శ్రీవాస్.
చివరగా: రామబాణం.. శిరోభారం
రేటింగ్ - 2/5
Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater