Begin typing your search above and press return to search.
Raghuvaran B Tech

Date of Release: 2015-01-01
రేటింగ్: 3 /5
తారాగణం:ధనుష్, అమలా పాల్, శరణ్య, సముద్రఖని, సురభి, వివేక్, అమితాష్ తదితరులు
సంగీతం: అనిరుధ్
మాటలు: కిషోర్
కథ, స్క్రీన్ ప్లే, ఛాయాగ్రహణం, దర్శకత్వం: వేల్ రాజ్
రజినీకాంత్ అల్లుడవడానికి ముందే నటుడిగా తనకంటూ ఓ పేరు సంపాదించాడు ధనుష్. రజినీ అల్లుడయ్యాక తన నటుడిగా తన ఇమేజ్ మరింత పెంచుకున జాతీయ అవార్డు గెలుచుకునే స్థాయికి ఎదిగాడు. ఐతే మిగతా తమిళ హీరోల్లాగే తెలుగులోనూ నిలదొక్కుకోవాలని చాలా ఏళ్లుగా ధనుష్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ నేపథ్యంలో కొన్ని నెలల కిందట తమిళంలో సూపర్ హిట్టయిన ధనుష్ సినిమా ''వేల ఇల్ల పట్టాదారి''ని 'రఘువరన్ బీటెక్' తెలుగులోకి అనువదించారు ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్. మరి ఈ సినిమా ధనుష్ కు ఎలాంటి ఫలితాన్నిచ్చేలా ఉందో చూద్దాం పదండి.
కథ:
రఘువరన్ (ధనుష్) బీటెక్ పూర్తి చేసిన నాలుగేళ్లయినా ఉద్యోగం లేక ఇబ్బంది పడే కుర్రాడు. ఎంసీఏ చేసిన అతడి తమ్ముడికి ఉద్యోగం వస్తుంది కానీ.. రఘువరన్ మాత్రం ఖాళీగా ఉంటూ తండ్రితో తిట్లు తింటుంటాడు. అతడికి పక్కింటి షాలిని (అమలా పాల్)తో పరిచయం మొదలై అది ప్రేమగా మారుతుంది. ఓ సందర్భంలో రఘువరన్ నిర్లక్ష్యం వల్ల తల్లి (శరణ్య) ప్రాణాలు పోవడంతో అతడి ఆలోచన విధానమే మారిపోతుంది. అక్కడి నుంచి రఘువరన్ జీవితంలో స్థిరపడ్డానికి ఏం చేశాడు? తన ఎదుగుదలకు అడ్డుపడిన కార్పొరేట్ యజమాని అరుణ్ (అమితాష్)ను ఎలా ఎదుర్కొన్నాడు? షాలినితో అతడి ప్రేమకథ ఎంతవరకు వెళ్లింది? అన్నది మిగతా కథ.
కథనం:
హీరో ఇంటికి రౌడీలు వస్తారు. రాగానే హీరోను కొట్టడం మొదలుపెడతారు. కాసేపు సైలెంటుగా దెబ్బలు తింటాడు హీరో. మధ్యలో అతడి తల్లి వచ్చి.. రౌడీల్ని తిడుతూ అయ్యో ఇంట్లో నాన్న కూడా లేదే అంటుంది. అప్పుడు హీరో ''ఏంటీ ఇంట్లో నాన్న లేడా'' అని కొంచెం గ్యాప్ ఇచ్చి.. రౌడీల్ని ఆటాడేసుకుంటాడు. తల్లి కూడా కొట్టు కొట్టు అంటూ అతడికి ఆయుధాలిస్తుంటుంది. ఓ ఫైట్ సీన్ ఇంత ఎంటర్టైనింగ్ తీయవచ్చా అనిపిస్తుంది ఈ సన్నివేశం చూస్తే.
ఇలా కలిసి విలన్లను చితకబాదే తల్లీ కొడుకులు ఓ సందర్భంలో గొడవపడతారు. హీరో తల్లి మీద అలుగుతాడు. తాను హీరోయిన్ తో ముచ్చట్లాడుతుండగా.. తల్లి అదే పనిగా ఫోన్ చేస్తుంటే కట్ చేస్తుంటాడు. ఆ తర్వాత ఇంటికొచ్చి చూస్తే తల్లి చనిపోయి ఉంటుంది. ఈ సన్నివేశం చూస్తే సెంటిమెంట్ అంటే పడని యూత్ కూడా కన్నీళ్లు పెట్టేస్తారు.
పని లేని హీరో 80ల నాటి డొక్కు లూనా స్కూటర్లో తిరుగుతుంటాడు. లక్ష రూపాయల జీతం తీసుకునే హీరోయిన్ కార్లో వెళ్తుంటుంది. అయినా ఆమె అతడికి పడిపోతుంది. ఈ ప్రేమకథ చాలా కన్విన్సింగానూ అనిపిస్తుంది. లవ్ స్టోరీ ఇలా కూడా నడిపించవచ్చా అనిపిస్తుంది.
''రఘువరన్ బీటెక్'' సినిమాలోని హైలైట్లలో కొన్ని ఇవి. ఇప్పటిదాకా తెలుగులోకి వచ్చిన ధనుష్ సినిమాలు చాలావరకు ప్రయోగాలే. అవి తమిళంలో కూడా పెద్దగా ఆడలేదు. కానీ ''రఘువరన్ బీటెక్'' మాత్రం ఫక్తు కమర్షియల్ సినిమా. తమిళంలోనూ సూపర్ హిట్టయింది. ఒక మామూలు కథనే ఆసక్తికరంగా, కొత్తగా ఎలా చెప్పవచ్చో ''రఘువరన్ బీటెక్'' చూస్తే తెలుస్తుంది.
బీటెక్ పూర్తయి నాలుగేళ్లయినా ఉద్యోగం రాని నిరుద్యోగి కథ కాబట్టి ఆటోమేటిగ్గా యూత్ మొత్తానికి కనెక్టయిపోతుందీ సినిమా. సినిమాలోని పాత్రలు, సన్నివేశాలు కూడా యూత్ కు మరింతగా కనెక్టవుతాయి. రఘువరన్ లాంటి వ్యక్తులు మనచుట్టూనే ఉంటారు. ఆ క్యారెక్టరే సినిమాకు ప్రధాన ఆకర్షణ. ప్రథమార్ధంలో హీరో నేపథ్యానికి సంబంధించిన సన్నివేశాలు ప్రతి ఇంట్లోనూ జరిగేవే. వాటిని అత్యంత ఆసక్తికరంగా మలిచాడు దర్శకుడు వేల్ రాజ్.
హీరోను పనిలేని నిరుద్యోగిగా చూపిస్తూనే.. ప్రతి సన్నివేశంలోనూ అతడి స్ట్రెంత్ చూపిస్తూ సాగిపోయాడు దర్శకుడు. హీరో, హీరోయిన్ల లవ్ స్టోరీ చాలా సింపుల్ గా ఉంటూనే బ్యూటిఫుల్ అనిపిస్తుంది. ప్రతి సన్నివేశం తర్వాత తర్వాతి సన్నివేశం ఎలా ఉండబోతోందన్న ఆసక్తి రేపేలా సాగుతుంది స్క్రీన్ ప్లే. ఇంటర్వెల్ ట్విస్టు గుండెల్ని మెలిపెడుతుంది. హీరో తల్లి చనిపోయినపుడు, ఆ తర్వాతి సన్నివేశాల్లో సెంటిమెంట్ గొప్పగా పండింది. ధనుష్, సముద్రఖనిల నటన కూడా ఆ సన్నివేశాల్ని మరింతగా ఎలివేట్ చేసింది. ఈ సన్నివేశాల వరకు సినిమా అప్ లోనే సాగుతుంది. ఆ తర్వాత కొంచెం డౌన్ అవుతుంది.
ద్వితీయార్ధంలో హీరో, విలన్ వార్ మొదలయ్యాక సినిమా మామూలుగా అనిపిస్తుంది. ఇక్కడి నుంచి అంతా ప్రెడిక్టబుల్ గా సాగుతుంది. ఐతే అందులో కొన్ని సన్నివేశాలు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి. చివర్లో విలన్ని హీరో అతడి ఆఫీసులోనే కొట్టే సన్నివేశం హైలైట్. క్లైమాక్స్ ఫైట్ కూడా మాస్ ని అలరిస్తుంది. ఐతే ధనుష్ తెలుగు ప్రేక్షకులకు అంత సుపరిచితుడు కాదు కాబట్టి.. ఫైట్లలో బిల్డప్ ఎక్కువైన ఫీలింగ్ కలగొచ్చు. ఈ సన్నివేశాల్లో ధనుష్ ని చూస్తుంటే రజినీకాంత్ కూడా గుర్తుకొస్తాడు.
నటీనటులు:
ధనుష్ ఎంత మంచి నటుడో చెప్పడానికి ''రఘువరన్ బీటెక్'' చక్కటి ఉదాహరణ. సినిమా అంతటా రఘువరన్ క్యారెక్టరే కనిపించింది తప్పితే.. ధనుష్ కనిపించలేదు. పని లేని బీటెక్ గ్రాడ్యుయేట్ క్యారెక్టర్లో జీవించేశాడు ధనుష్. ఒక సాదాసీదా క్యారెక్టర్ని అద్భుతమైన నటనతో ఏ స్థాయికి తీసుకెళ్లవచ్చో ధనుష్ రుజువు చేశాడు. పాత్రకు తగ్గ బాడీ లాంగ్వేజ్ తో, చక్కటి హావభావాలతో రఘువరన్ పాత్రను అద్భుతంగా పోషించాడతను. ప్రథమార్ధంలో అల్లరి చిల్లరి వేషాలతో ఎంతగా ఎంటర్టైన్ చేశాడో.. తల్లి చనిపోయిన సన్నివేశంలో, ఆ తర్వాత అంతగా ఏడిపించాడు. విలన్ని ఎదుర్కొనే సన్నివేశాల్లో హీరోయిజాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లాడు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అమలా పాల్ అందంతో, అభినయంతో ఆకట్టుకుంది. శరణ్య చేసిన తల్లి పాత్ర బలమైన ముద్ర వేస్తుంది. సముద్రఖని కూడా తండ్రి పాత్రలో ఒదిగిపోయాడు. వివేక్ నవ్వించాడు. విలన్ అరుణ్ కూడా ఓకే.
సాంకేతిక వర్గం:
అనిరుధ్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ. అమ్మ పాట సినిమాకు హైలైట్ అని చెప్పొచ్చు. మిగతా పాటలు మామూలుగానే అనిపిస్తాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం అనిరుధ్ అదరగొట్టేశాడు. ప్రథమార్ధంలో హీరో క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసే సన్నివేశాల్లో నేపథ్య సంగీతం అదరగొట్టేశాడు. హీరోయిజం ఎలివేటయ్యే సన్నివేశాల్లోనూ అనిరుధ్ ఆర్ఆర్ ప్రేక్షకుల్ని ఉత్తేజితుల్ని చేస్తుంది. దర్శకుడు వేల్ రాజ్ స్వతహాగా ఛాయాగ్రాహకుడు. దర్శకుడిగా అతడికిదే తొలి సినిమా అంటే ఆశ్చర్యపోవాల్సిందే. తాను క్రెడిట్ వేసుకున్న ప్రతి విభాగంలోనూ అతను ప్రతిభ చూపించాడు. యూత్ కి బాగా కనెక్టయ్యే కథను ఎంచుకున్న అతను ఆసక్తికర స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. స్క్రీన్ ప్లే సెకండాఫ్ లో కొంచెం నెమ్మదించిన భావన కలుగుతుంది తప్పితే.. ఓవరాల్ గా ఆకట్టుకుంటుంది. వేల్ రాజ్ ఛాయాగ్రహణం కూడా ఆకట్టుకుంటుంది. సినిమా అంతటా మాటలు సహజంగా ఉండేవే కాబట్టి.. మాతృకలోని డైలాగుల్నే తెలుగులోకి అనువదించినట్లున్నారు తప్పితే.. కొత్తగా చేయడానికి పెద్దగా ఆస్కారం లేదు. తక్కువ బడ్జెట్లో తెరకెక్కినప్పటికీ నిర్మాణ విలువలకు ఢోకా లేదు.
చివరిగా...
అనువాదం అని చిన్నచూపు చూడకుండా కొత్త ఏడాదిలో ఓ మంచి సినిమా చూడాలనుకుంటే రఘువరన్ బీటెక్ మంచి ఛాయిస్.