Begin typing your search above and press return to search.
నగరం

Date of Release: 2017-03-10
నటీనటులు: సందీప్ కిషన్ - రెజీనా - శ్రీ - మధు - చార్లీ తదితరులు
సంగీతం: జావెద్ రియాజ్
ఛాయాగ్రహణం: సెల్వకుమార్
మాటలు: శశాంక్ వెన్నెలకంటి
నిర్మాత: అశ్విని కుమార్ సహాదేవ్
రచన - దర్శకత్వం: లోకేష్ కనకరాజ్
తెలుగులో వరుసగా ఎదురు దెబ్బలు తిన్నాక ఉన్నట్లుండి తమిళ సినిమాలపై దృష్టిపెట్టాడు యువ కథానాయకుడు సందీప్ కిషన్. అతను తమిళంలో ప్రధాన పాత్ర పోషించిన సినిమా ‘మానగరం’. తెలుగులోకి ‘నగరం’ పేరుతో అనువాదమైంది. రెజీనా కథానాయిక. లోకేష్ కనకరాజ్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
ఉద్యోగం కోసం సిటీ వచ్చిన ఓ యువకుడికి ఇక్కడ అనూహ్య పరిస్థితులు ఎదురవుతాయి. ఉద్యోగంలో చేరిన తొలి రోజే అతడిపై కొందరు రౌడీలు దాడి చేస్తారు. అతడి సర్టిఫికెట్లన్నీ పోతాయి. నిజానికి ఆ రౌడీలు కొట్టాలనుకున్నది ఇంకో కుర్రాడిని. భిన్న మనస్తత్వాలున్న ఈ ఇద్దరు కుర్రాళ్ల జీవితాలు రెండు రోజుల వ్యవధిలో ఎలాంటి మలుపులు తిరిగాయి.. ఒక పిల్లాడి కిడ్నాప్ వీరిపై ఎలాంటి ప్రభావం చూపింది అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
వేర్వేరు వ్యక్తుల కథల్ని సమాంతరంగా చూపిస్తూ పతాక సన్నివేశంలో ఆ వ్యక్తులందరినీ ఒకచోటికి తీసుకొచ్చి ముగింపునిచ్చే సినిమాలు కొన్ని తెలుగులో చూశాం. అలాంటి కోవలోనే మంచి థ్రిల్ ఇస్తూ సాగే సినిమా ‘నగరం’. 48 గంటల్లో వ్యవధిలో కొందరు వ్యక్తుల జీవితాలు ఎలా మలుపు తిరిగాయో ఇందులో చూపిస్తారు. ‘మిస్టేకెన్ ఐడెంటిటీ’ కాన్సెప్ట్ ఆధారంగా కొత్త దర్శకుడు లోకేష్ కనకరాజ్ రూపొందించిన ‘నగరం’ ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేస్తుంది. క్యారెక్టర్లను పరిచయం చేయడానికి ఎక్కువ టైం తీసుకోవడం.. అక్కడక్కడా గందరగోళంగా సాగడం.. సినిమా అంతటా తమిళ వాసనలు కొట్టడం ‘నగరం’లో మైనస్ పాయింట్స్.
‘నగరం’ కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్. ‘‘నువ్వొకరికి సాయపడితే నీకు ఇంకొకరు సాయపడతారు’’ అనే సందేశాన్ని అంతర్లీనంగా చెబుతూ.. కొన్ని చోట్ల థ్రిల్ చేస్తూ.. అక్కడక్కడా ఎంటర్టైన్ చేస్తూ.. కొన్నిచోట్ల బోర్ కొట్టిస్తూ.. కొంత గందరగోళానికి గురి చేస్తూ సాగుతుంది ‘నగరం’. ఓవైపు కథను సీరియస్ గా నడిపిస్తూనే వినోదానికి కూడా ఢోకా లేకుండా చూసుకోవడంతో ‘నగరం’ రెండు గంటల పాటు బాగానే ఎంగేజ్ చేస్తుంది. ఐతే అక్కడక్కడా పంటికింద రాళ్లలా కొన్ని సన్నివేశాలు అడ్డం పడతాయి. సినిమా పేస్ లో కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అందుకే నగరం కంప్లీట్ ఎంటర్టైనర్ కాలేకపోయింది.
కథను మలుపు తిప్పే ఆరంభ సన్నివేశమే ఇది ఒక ప్రత్యేకమైన చిత్రమనే భావన కలిగిస్తుంది. కాకపోతే సమస్య ఏంటంటే.. క్యారెక్టర్లను ఎస్టాబ్లిష్ చేయడానికి.. ప్రథమార్ధంలో కథను ఓ కొలిక్కి తేవడానికి దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. వేర్వేరు కథల్ని సమాంతరంగా చెప్పే ప్రయత్నంలో కొంచెం గందరగోళం కనిపిస్తుంది. రొమాంటిక్ ట్రాక్ సినిమాకు మైనస్ అయింది. ప్రతి సన్నివేశం కూడా కథకు అవసరమైందే అని ద్వితీయార్ధంలో తెలుస్తుంది కానీ.. మొదట్లో ఆయా సన్నివేశాలు చూస్తున్నపుడు మాత్రం అనాసక్తికరంగా అనిపిస్తాయి. దర్శకుడు ఏం చెప్పదలుచుకున్నాడన్నది అర్థం కాకపోవడంతో కొన్ని చోట్ల ఫ్రస్టేట్ అవుతాం.
ఐతే ఇంటర్వెల్ ముంగిట ఉప కథలన్నింటికీ లింకు కలిపి ఉత్కంఠ రేకెత్తిస్తాడు దర్శకుడు. పిల్లవాడి కిడ్నాప్ తో ముడిపడ్డ కథ కొత్త మలుపు తిరగడంతో ద్వితీయార్ధంపై ఆసక్తి మొదలవుతుంది. సెకండాఫ్ కొంత ఉత్కంఠ రేకెత్తిస్తూ సాగుతుంది. థ్రెడ్స్ అన్నింటికీ లింకు కలిపిన విధానం ఆకట్టుకుంటుంది. ట్యాక్సీ డ్రైవర్ పాత్రలో చార్లీ ఎమోషనల్ గా కదిలిస్తే.. విల్సన్ పాత్రలో కనిపించిన రాం దాస్ పాత్ర గిలిగింతలు పెడుతుంది. ప్రి క్లైమాక్స్ లో ఆ పాత్ర భలే హైలైట్ అయింది. ఆరంభం నుంచి కూడా ఆ పాత్ర ఎంటర్టైన్ చేస్తూనే సాగుతుంది.
మామూలుగా మల్టిపుల్ స్టోరీస్ ను కలిపి ఒక చోటికి తీసుకొచ్చి కథను ముగించే సినిమాల్లో ‘మిక్సింగ్’ సరిగా ఉండదు. ఫోర్స్ ఫుల్ గా ఏదో కలపాలి కాబట్టి కలపడం అన్నట్లుంటుంది. కానీ ‘నగరం’ దీనికి మినహాయింపు. ఏ కథకు ఆ కథను ప్రత్యేకంగా చెబుతూనే.. అన్నింటికీ సరిగ్గా బ్లెండ్ చేయడంతో ‘నగరం’ ప్రత్యేకంగా అనిపిస్తుంది. ప్రి క్లైమాక్స్ సినిమాకు ఆకర్షణ. అందులో మలుపులు ఉత్కంఠ రేకెత్తిస్తాయి. క్లైమాక్స్ ఓకే. ఓవరాల్ గా డార్క్ థ్రిల్లర్లను ఇష్టపడేవారికి ‘నగరం’ నచ్చుతుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల తరహా ఎంటర్టైన్మెంట్ కోరుకుంటే మాత్రం కష్టం. తమిళ వాసనలు ఎక్కువగా ఉన్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది సందేహమే. కథనంలో ఇంకొంచెం క్లారిటీ ఉండి గందరగోళానికి అవకాశం లేకుండా చూసుకుని ఉంటే నగరం ప్రత్యేకంగా ఉండేది.
నటీనటులు:
‘నగరం’లో హీరో అని.. హీరోయిన్ అని.. విలన్ అని ఎవరూ లేరు. ఇందులో పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. నటీనటులందరూ కూడా ఆయా పాత్రల్లో ఒదిగిపోయారు. సందీప్ కిషన్ కు ఈ సినిమా అన్ని రకాలుగా ఒక మేకోవర్ అని చెప్పొచ్చు. అతడి లుక్.. నటన కొత్తగా అనిపిస్తాయి. దూకుడుగా ఉండే కుర్రాడి పాత్రలో అతను మెప్పించాడు. శ్రీ కూడా బాగానే చేశాడు. రెజీనా పాత్రకు ఎక్కువ ప్రాధాన్యమేమీ లేదు కానీ.. అయినా ఆమె మెప్పించింది. ఒక సీన్లో రెజీనా అద్దం ముందు ముఖం కడుగుతుంటుంది. మరో వైపు తన ఫ్రెండు మాట్లాడుతుంటుంది. ఆ మాటలతో హీరో మీద రెజీనాకు అభిప్రాయం మారాలి. ఆ మార్పును తన హావభావాలతో రెజీనా చూపించిన తీరు ఆమె ఎంత మంచి నటో తెలియజెబుతుంది. మధు సూదన్.. చార్లి కూడా చాలా బాగా చేశారు. ఐతే సినిమా పూర్తయ్యాక అందరి కంటే ఎక్కువ గుర్తుండేది మాత్రం విల్సన్ అనే పాత్రలో కనిపించిన రామ్ దాసే. సినిమాలో ఎంటర్టైన్మెంట్ పార్ట్ అంతా అతడి క్రెడిటే. ఈ పాత్ర ప్రత్యేకత ఏంటన్నది తెరమీదే చూసి తెలుసుకోవాలి. మొదట్లో ఏదోలా అనిపించే ఆ పాత్ర చివరికి వచ్చేసరికి ప్రేక్షకులపై బలమైన ముద్ర వేస్తుంది.
సాంకేతికవర్గం:
టెక్నీషియన్స్ అందరూ కూడా దర్శకుడి ఆలోచనలకు చక్కటి సహకారం అందించారు. జావెద్ రియాజ్ నేపథ్య సంగీతం.. సెల్వ కుమార్ ఛాయాగ్రహణం సినిమాకు పెద్ద బలంగా నిలిచాయి. సినిమాలో సింక్ అయ్యేలా వీళ్లిద్దరూ తమ పనితనం చూపించారు. ఇందులో పాటలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఉన్నవే రెండో మూడో. సందీప్-రెజీనా మధ్య వచ్చే పాట సినిమాకు అనవసరం అనిపిస్తుంది. నేపథ్య సంగీతంలో నేచురల్ సౌండ్లను వాడుకున్న తీరు ఆకట్టుకుంటుంది. సౌండ్ డిజైనింగ్ కూడా చాలా బాగా చేశారు. ఎడిటింగ్ కూడా సినిమాకున్న ముఖ్య ఆకర్షణల్లో ఒకటి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇక కొత్త దర్శకుడు లోకేష్ కనకరాజ్ తొలి సినిమాతోనే బలమైన ముద్ర వేశాడు. అతడి సినిమాపై ఉన్న ప్యాషన్ ఏంటో తెరమీద కనిపిస్తుంది. తొలి ప్రయత్నంలోనే అతను కాంప్లెక్స్ స్క్రిప్టు ఎంచుకుని ఉన్నంతలో బాగానే తెరమీదికి తెచ్చాడు. సినిమా మొత్తంలో ప్రతి సన్నివేశంతో ఇంకో సన్నివేశానికి లింక్ ఉండటం ‘నగరం’ ప్రత్యేకత. లోకేష్ స్క్రీన్ ప్లే అలా రాసుకున్నాడు. ప్రథమార్ధంపై ఇంకొంత కసరత్తు చేసి.. క్రిస్ప్ గా తయారు చేసి ఉంటే.. నరేషన్ ఇంకొంత సరళంగా ఉండి ఉంటే అతడికి దర్శకుడిగా మరిన్ని మార్కులు పడేవి.
చివరగా: నగరం.. థ్రిల్లింగే కానీ..!
రేటింగ్-2.75/5
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre