Begin typing your search above and press return to search.
Mukunda

Date of Release: 2014-12-24
రేటింగ్: 2.5 /5
తారాగణం: వరుణ్ తేజ్, పూజా హెగ్డే, రావు రమేష్, ప్రకాష్ రాజ్, నాజర్, రఘుబాబు, పరుచూరి వెంకటేశ్వరరావు, ప్రవీణ్, అభిమన్యుసింగ్, ఆలీ తదితరులు
ఛాయాగ్రహణం: మణికందన్
ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్
సంగీతం: మిక్కీ జె.మేయర్
నిర్మాతలు: ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జి
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల
తెలుగు తెరపైకి వరుసబెట్టి వారసులు దూసుకొస్తున్న తరుణమిది. ఐతే ఈ ఏడాది అత్యంత ఆసక్తి రేపిన అరంగేట్రం మాత్రం వరుణ్ తేజ్‌దే. మెగా బ్రదర్ నాగబాబు తనయుడైన వరుణ్.. తన పర్సనాలిటీతో, లుక్స్‌తో తొలి సినిమా విడుదలకు ముందే అందరినీ ఆకర్షించాడు. అందరిలా తొలి సినిమాకు కమర్షియల్ బాటలో నడవకుండా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఓ మామూలు కుర్రాడి కథతో అరంగేట్రానికి సిద్ధమవడం ఇంకా ఆసక్తి రేపింది. ఇంతకీ వరుణ్ తొలి సినిమా ఎలా ఉంది? అతనెలా చేశాడు?.. చూద్దాం పదండి.
కథ:
ముకుంద (వరుణ్ తేజ్) చిన్న పట్టణంలో నాన్నకు సాయపడుతూ, స్నేహితులకు అండగా నిలుస్తూ జీవితం సాగించే ఓ మామూలు కుర్రాడు. అతని ఫ్రెండు.. మున్సిపల్ ఛైర్మన్ (రావు రమేష్) తమ్ముడి కూతుర్ని ప్రేమిస్తాడు. దీంతో అతడి మనుషులు తన స్నేహితుణ్ని కొట్టడానికి వస్తే ముకుంద అడ్డు పడతాడు. అక్కడి నుంచి ముకుందకు, మున్సిపల్ ఛైర్మన్‌కు వైరం మొదలవుతుంది. అంతలో ఎన్నికలు కూడా వస్తాయి. మున్సిపల్ ఛైర్మన్‌కు వ్యతిరేకంగా ఓ పెద్దమనిషి (ప్రకాష్ రాజ్)ను పోటీకి దించుతాడు ముకుంద. ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచారు? ముకుందకు, మున్సిపల్ ఛైర్మన్‌కు మధ్య వైరం ఎక్కడిదాకా వెళ్లింది? ఛైర్మన్ కూతురికి, ముకుందకు మధ్య ఏం జరిగింది? అన్నది తెరమీదే తెలుసుకోవాలి.
కథనం:
తెలుగు సినిమాలందు శ్రీకాంత్ అడ్డాల సినిమాలు వేరని.. అతడి తొలి రెండు సినిమాలతో రుజువైంది. ముఖ్యంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో తెలుగు సినిమా గ్రామర్‌కు పూర్తి విరుద్ధంగా వెళ్లాడు శ్రీకాంత్. కథల కోసం అభూత కల్పనలు చేయకుండా మన చుట్టూ మనుషుల్ని, వాళ్ల జీవితాల్ని, వారి భావోద్వేగాల్ని తెరమీద చూపించే ప్రయత్నం చేస్తాడతను. 'ముకుంద'లోనూ అదే ప్రయత్నం చేశాడు.
'ముకుంద' రొటీన్ కమర్షియల్ సినిమా కాదు. వరుణ్ పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్న హీరో కాబట్టి.. ఇలా ఉండొచ్చు అని కమర్షియల్ లెక్కలు వేసుకొస్తే కుదరదు. తెర మీద హీరో కంటే కూడా డైరెక్టరే ఎక్కువ కనిపిస్తాడు. వరుణ్ తేజ్ బ్యాగ్రౌండ్ గురించి పట్టించుకోకుండా.. అతి సామాన్యమైన కథను.. తనదైన శైలిలో చెప్పడానికి ట్రై చేశాడు. ఐతే ఈ ప్రయత్నం విఫలమవలేదు. అలాగని పూర్తిగా విజయవంతమూ కాలేదు.
కథలో ఏ విశేషం లేదు. పలుకుబడి ఉన్న విలన్‌తో ఓ సామాన్యుడు తలపడే కథలు తెలుగు తెరపై చాలా వచ్చాయి. దీన్ని తనదైన శైలి కథనంతో, క్యారెక్టర్లతో, మాటలతో నడిపించాలని చూశాడు దర్శకుడు. డ్రామాకు, మలుపులకు చోట్వికుండా సహజత్వం మీద మరీ ఎక్కువ దృష్టిపెట్టడం వల్ల.. కథ బాగా పలుచబడిన ఫీలింగ్ కలుగుతుంది.
హీరో ఫ్రెండు విలన్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయితో తిరగడం.. విలన్ గ్యాంగ్ అతడిపై అటాక్ చేయడం.. హీరో ఎదుర్కోవడం.. విలన్‌కి, అతడికి మధ్య మాటల యుద్ధం.. ఇవే సన్నివేశాలు సినిమా అంతటా రిపీటవుతుంటాయి. ఐతే వరుణ్‌కి, రావు రమేష్‌కి మధ్య సన్నివేశాల్లో దర్శకుడు పదునైన, ఆసక్తికరమైన మాటలు రాసి.. ఆ సన్నివేశాలకు వన్నె తెచ్చాడు. దర్శకుడు హీరో కంటే కూడా రావురమేష్ క్యారెక్టర్ మీద ఎక్కువ దృష్టిపెట్టాడు. ఆ క్యారెక్టర్‌కు రాసిన మాటలన్నీ ఆకట్టుకుంటాయి.
రావు రమేష్‌తో పాటు మిగతా పాత్రల పరిచయం.. మంచి డైలాగులు.. రెండు మంచి పాటలు.. హీరో-విలన్ మధ్య కన్ఫ్రంటేషన్తో ప్రథమార్ధం వేగంగానే సాగిపోతుంది. ఐతే సెకండాఫ్‌కు వచ్చేసరికి సమస్య మొదలవుతుంది. కథంటూ ఏమీ లేకపోవడం వల్ల.. తన శ్రీకాంత్ తన ప్రతిభనంతా ఫస్టాఫ్‌లోనే చూపించేయడం వల్ల ద్వితీయార్థం నెమ్మదిగా సాగుతుంది. రిపీటెడ్ సీన్స్ విసిగిస్తాయి. ద్వితీయార్ధంలో ఎలక్షన్ ఎపిసోడ్ మినహాయిస్తే ఆసక్తికర ఘట్టాలేమీ లేవు. క్లైమాక్స్‌లోనూ ఏ విశేషం లేదు. సినిమాను మరీ మామూaలుగా ముగించేశాడు దర్శకుడు. రొటీన్‌గా భారీ ఫైట్ చివర్లో హీరోకు, విలన్‌కు మధ్య వైరాన్ని పీక్స్‌కి తీసుకెళ్లి.. ఏదైనా ట్రై చేసి ఉంటే బావుండేదేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది.
కథ వీక్‌గా ఉన్నప్పటికీ.. సినిమా గ్రాఫ్ పడి లేస్తూ సాగినప్పటికీ.. శ్రీకాంత్ స్టోరీ టెల్లింగ్ స్టయిల్, అతడు రాసిన మాటలు సినిమాకు ఆకర్షణ. ప్రధాన పాత్రలు వేటికీ పేరు పెట్టకపోవడం.. హీరో హీరోయిన్లు ఒక్కసారీ మాట్లాడుకోకుండానే వారి మధ్య చూపులతోనే ప్రేమకథ నడిపించడం.. సహజత్వమున్న క్యారెక్టర్లు రాయడంలో శ్రీకాంత్ ముద్ర కనిపిస్తుంది. ఐతే ఐతే అదనపు ఆకర్షణల మీద, డైలాగ్స్ మీద పెట్టిన శ్రద్ధ.. కథ మీద కూడా పెట్టి ఉంటే, కథనం ఇంకా చిక్కగా ఉండి ఉంటే 'ముకుంద' మెమొరబుల్ మూవీ అయ్యేది.
నటీనటులు:
పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి హీరో పరిచయమవుతున్నపుడు.. ఆ సినిమా ఎలా ఉంది అన్నదానికంటే హీరో ఎలా చేశాడు అన్న ప్రశ్న ముందు ఉదయిస్తుంది. రొటీన్ బాటలో వెళ్లకుండా తొలి ప్రయత్నంలో ఓ భిన్నమైన సబ్జెక్టు ఎంచుకున్నందుకు వరుణ్‌ను అభినందించాలి. అతడి లుక్స్ బాగున్నాయి. ్ణస్కీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది. ఐతే నటన పరంగా మెరుగవ్వాలి. ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ పలికించలేకపోయాడు. బాడీ లాంగ్వేజ్ కూడా మారాలి. డైలాగ్ డెలివరీ పర్వాలేదు. తన పర్సనాలిటీకి తగ్గట్లు ఫైట్స్‌లో ప్రతిభ చూపించిన వరుణ్.. డ్యాన్స్‌లో వీక్‌గా కనిపించాడు. పూజా హెగ్డే మరోసారి తన క్యూట్‌నెస్‌తో కట్టిపడేసింది. ఐతే ఆమె పాత్ర మీద దర్శకుడు అంతగా దృష్టిపెట్టలేదు. రావు రమేష్ మరో గుర్తుండిపోయే పాత్ర చేశాడు. అతడి బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అదిరిపోయాయి. కొన్ని చోట్ల రావు రమేష్‌లోని సహజమైన అతి బయటపడ్డప్పటికీ.. అతను అదరగొట్టేశాడనే చెప్పాలి. ఐతే ఈ పాత్రకు సరైన ముగింపునివ్వకపోవడం దర్శకుడి వైఫల్యం. క్లైమాక్స్‌లో ఆ క్యారెక్టర్ తేలిపోయింది. ప్రకాష్ రాజ్ ఓ చిత్రమైన పాత్రలో కనిపించాడు. ఆ పాత్ర కూడా హాఫ్ బేక్డ్లా అనిపిస్తుంది. పరుచూరి వెంకటటేశ్వరరావు కనిపించేది రెండు మూడు సన్నివేశాల్లోనే అయినా.. ఆకట్టుకున్నారు. హీరో ఫ్రెండు క్యారెక్టర్ చేసిన కుర్రాడు బాగా చేశాడు. అతడి లవర్‌గా చేసినమ్మాయి బాగుంది.
సాంకేతిక వర్గం:
సాంకేతిక నిపుణులంతా శ్రీకాంత్ టేస్టుకు తగ్గ ఔట్పుట్ ఇచ్చారు. మిక్కీ జే మేయర్.. గోపికమ్మా సహా అన్నీ మంచి పాటలే ఇచ్చాడు. ఐతే అతడి పాటల్ని శ్రీకాంత్ సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. పాటలు మిస్‌ప్లేస్ అయ్యాయి. మూడు పాటలు సినిమాకు అడ్డంకిగా నిలిచాయి. హీరో హీరోయిన్లు కనీసం కలవనైనా కలవకుండా డ్రీమ్ సాంగ్స్ వేయించడం చిత్రం. బ్యాగ్రౌండ్ స్కోర్ ఓకే. మణికందన్ ఛాయాగ్రహణం సినిమా హైలైట్స్‌లో ఒకటి. హీరో పరిచయ సన్నివేశం మొదలు సినిమా అంతా అతడి కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. శ్రీకాంత్ ఎక్కడా అనవసర హంగామా చేయలేదు. ఎడిటర్ సెకండాఫ్‌లో కొంచెం చేయి చేసుకోవాల్సింది. శ్రీకాంత్ రాసిన మాటల్లో ఆణిముత్యాలు చాలానే ఏరుకోవచ్చు. ''ఎవడి మనసు వాడికి కోర్టు.. ఎవడి మాట వాడికి తీర్పు'' లాంటి మంచి మాటలు చాలానే ఉన్నాయి సినిమాలో.
చివరిగా...
'ముకుంద' గుర్తుండిపోయే సినిమా కాదు. అలాగని తీసిపారేయదగ్గ సినిమానూ కాదు. ప్లస్‌లు, మైనస్‌లు సమానంగా ఉన్న ఈ సినిమా ఒక్కసారికి ఓకే.