Begin typing your search above and press return to search.
మన్యం పులి

Date of Release: 2016-12-02
నటీనటులు: మోహన్ లాల్ - కమలిని ముఖర్జీ - జగపతిబాబు - లాల్ - నమిత - కిషోర్ - విను మోహన్ తదితరులు
సంగీతం: గోపి సుందర్
ఛాయాగ్రహణం: షాజి కుమార్
మాటలు: రాజశేఖర్ రెడ్డి
కథ - స్క్రీన్ ప్లే: ఉదయ్ కృష్ణ
దర్శకత్వం: వైశాక్
మనమంతా.. జనతా గ్యారేజ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. ఈ నేపథ్యంలోనే మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టయిన లాల్ సినిమా ‘పులిమురుగన్’ను తెలుగులోకి ‘మన్యం పులి’ పేరుతో అనువాదం చేశారు. మలయాళ సినీ చరిత్రలోనే తొలిసారి వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి రికార్డు నెలకొల్పిన ఈ చిత్రంలో అంత ప్రత్యేకత ఏముందో చూద్దాం పదండి.
కథ:
అడవిలో పుట్టి పెరిగిన కుమార్ (మోహన్ లాల్) చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోతాడు. తన తండ్రిని పులి చంపేయడంతో దానిమీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. అలా చిన్నతనంలోనే పులిని చంపిన కుమార్.. పెరిగి పెద్దయ్యాక అటవీ ప్రాంతంలో బతికే జనాలందరికీ దేవుడిలా మారతాడు. ఎక్కడ పులి మనుషులపై దాడి చేస్తోందని తెలిసినా అక్కడ ప్రత్యక్షమై దాని అంతు చూడటం కుమార్ కు అలవాటు. అలాంటి కుమార్.. తన తమ్ముడి కోసమని అడవిని వదిలేసి.. పట్నంలో డాడీ గిరిజా (జగపతిబాబు) అనే పెద్దమనిషి దగ్గర చేరాల్సి వస్తుంది. ఐతే డాడీ దగ్గర నమ్మకంగా పని చేస్తున్న కుమార్.. కొన్ని కారణాల వల్ల అతడికి ఎదురు తిరగాల్సి వస్తుంది. ఆ కారణాలేంటి..? డాడీ-కుమార్ శత్రుత్వం ఏ పరిస్థితులకు దారి తీసింది అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
తన ఇమేజ్ తో సంబంధం లేకుండా కథా బలమున్న.. వైవిధ్యమైన సినిమాలు చేస్తుంటాడు మోహన్ లాల్. ఐతే ఆయన కూడా అప్పుడప్పుడూ కమర్షియల్ బాటలో నడుస్తుంటాడు. అభిమానుల్ని అలరించే సినిమాలు చేస్తుంటాడు. ఆ కోవలో వచ్చిన సినిమానే ‘పులి మురుగన్’. మలయాళం సినిమా.. అందులోనూ మోహన్ లాల్ హీరో.. వంద కోట్ల కలెక్షన్లు అంటున్నారు కాబట్టి ఇదేదో చాలా కొత్తగా ఉండే సినిమా.. ఇందులో బలమైన కథ ఉంటుంది.. అని ఆశిస్తే నిరాశ తప్పదు. ‘మన్యం పులి’ ఫక్తు రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్. ముఖ్యంగా మోహన్ లాల్ అభిమానుల్ని అలరించాలన్న ప్రధాన లక్ష్యంతో తెరకెక్కిన చిత్రమిది.
కథాకథనాల పరంగా ‘మన్యం పులి’లో చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు. మన దగ్గరే ఇలాంటి సినిమాలు చాలా చూశాం. ఐతే అద్భుతమైన ప్రకృతి రమణీయతకు కేంద్రమైన కేరళ అడవుల నేపథ్యంలో ఈ కథ సాగడం వల్ల ప్రతి సన్నివేశం కంటికి ఇంపుగా అనిపిస్తుంది. దీనికి తోడు కళ్లు చెదిరేలా.. చాలా థ్రిల్లింగ్ గా సాగే యాక్షన్ సన్నివేశాలు కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వీటికి ఉత్తేజం కలిగించే నేపథ్య సంగీతం కూడా తోడవడంతో కథాకథనాలు రొటీన్ సాగుతున్నా కొంత వరకు ప్రేక్షకుడు కొంత వరకు ఎంగేజ్ అయ్యే అవకాశముంది.
మన దగ్గర మాస్ మసాలా సినిమాల్లో హీరోను పసి పిల్లవాడిగా ఉండగానే పెద్ద వీరుడి లాగా చూపిస్తారు. ‘మన్యం పులి’ కూడా అదే తరహాలో మొదలవుతుంది. చిన్న పిల్లవాడిగా ఉండగానే హీరో పెద్ద పులిని మట్టుబెడతాడు. అప్పుడే ఈ సినిమా ఎలా సాగొచ్చన్న అంచనా వచ్చేస్తుంది. ఇక మోహన్ లాల్ పరిచయ దృశ్యం కూడా మన కమర్షియల్ సినిమాల్నే తలపిస్తుంది. ఆ సన్నివేశంలో బ్యాగ్రౌండ్ స్కోర్.. హీరోను చూపించే ముందు ఇచ్చే బిల్డప్.. అన్నీ కూడా మోహన్ లాల్ అభిమానుల్ని దృష్టిలో ఉంచుకుని చేసిన సినిమా ఇదనే విషయాన్ని స్పష్టం చేస్తాయి. ఐతే మోహన్ లాల్ మనవాడు కాదు కాబట్టి ఈ హీరోయిజంతో ఏమాత్రం మన ప్రేక్షకులు ఏమాత్రం కనెక్టవుతారన్నది సందేహమే.
హీరోయిజం ఎలివేట్ అయ్యే ఒక యాక్షన్ సీన్.. ఆ తర్వాత ఫిల్లింగ్ కోసం కొన్ని కామెడీ సీన్లు.. ఆ తర్వాత మళ్లీ ఒక యాక్షన్ సీన్.. ఇలా సాగుతుంది ‘మన్యం పులి’ సినిమా. పీటర్ హెయిన్ అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేసిన యాక్షన్ సన్నివేశాలువచ్చినపుడల్లా ప్రేక్షకుడిలో ఉత్తేజం కలుగుతుంది కానీ.. మధ్యలో వచ్చే సన్నివేశాలు మాత్రం ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తాయి. ఏ ప్రత్యేకత లేకుండా సాగిపోయే కథా కథనాలు చూస్తుంటే ఇది వంద కోట్ల సినిమా ఎలా అయ్యిందో అన్న సందేహం కలుగుతుంది.
కథ నేపథ్యం అడవి నుంచి పట్టణానికి షిఫ్ట్ అయ్యాక సన్నివేశాలు మరింత బోరింగ్ గా సాగుతాయి. జగపతిబాబు పాత్ర కానీ.. ఆయన విలనీ కానీ ఏమాత్రం ప్రత్యేకంగా లేవు. ద్వితీయార్ధం సాగతీతగా అనిపిస్తుంది. మలయాళ వెర్షన్ నుంచి 20 నిమిషాల కోత పెడితేనే సాగతీతగా అనిపించిన ఈ సినిమా.. పూర్తి నిడివితో ఉంటే ఎలా ఉండేదో మరి. ప్రేక్షకుడు పూర్తిగా డస్కనెక్ట్ అయిపోయిన దశలో క్లైమాక్స్ సినిమాను కొంతవరకు నిలబెడుతుంది. దాదాపు పావు గంటల పాటు సాగే యాక్షన్ ఎపిసోడ్ అద్భుతంగా అనిపిస్తుంది. ఈ ఫైట్ ఉత్కంఠ భరితంగా.. కళ్లు చెదిరిపోయేలా తెరకెక్కించారు.
మొత్తంగా అడవి అందాల్ని అద్భుతంగా ఒడిసిపట్టిన కెమెరా పనితనం.. కళ్లు చెదిరే యాక్షన్ సన్నివేశాలు.. ఉత్తేజం కలిగించే నేపథ్య సంగీతం.. ఇవే ‘మన్యం పులి’లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అంశాలు. కథాకథనాల పరంగా మాత్రం ఇది సగటు సినిమా. ఏమంత ఎగ్జైటింగ్ గా అనిపించదు.
నటీనటులు:
మోహన్ లాల్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. అడవి వీరుడి పాత్రలో ఆయన ఒదిగిపోయారు. ఈ వయసులోనూ ఆయన ఎంతో శ్రమించి చాలా క్లిష్టమైన ఫైట్లు చేశారు. నటన పరంగా ఆయన తన ప్రత్యేకతను చూపించాల్సిన అవసరమేమీ ఇందులో లేదు. కమలిని ముఖర్జీ బాగా చేసింది. ఐతే ఆమెలో గ్లామర్ కోణం పూర్తిగా మిస్సయింది. జగపతిబాబు పాత్ర.. నటన మామూలుగా అనిపిస్తాయి. ఆయన చేయాల్సినంత ప్రత్యేకమైన పాత్రేమీ కాదిది. లాల్.. కిషోర్ ఓకే. నమిత తనకు అలవాటైన వ్యాంప్ పాత్రలో కనిపించింది.
సాంకేతిక వర్గం:
ఒరిజినల్లో ఎన్ని పాటలున్నాయో ఏమో కానీ.. తెలుగులో మాత్రం ఒకట్రెండు పాటలే ఉన్నాయి. అవేమంత ఆకట్టుకోవు. గోపీసుందర్ నేపథ్య సంగీతం మాత్రం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హీరోయిజం ఎలివేట్ కావడంలో నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషించింది. పులిరా పులిరా మన్యంపులిరా.. అంటూ సాగే హమ్మింగ్ ఆకట్టుకుంటుంది. షాజి కుమార్ ఛాయాగ్రహణం కూడా సూపర్బ్. ఆద్యంతం కెమెరా పనితనం కనిపిస్తుంది. అడవి నేపథ్యంలో సాగే సన్నివేశాలన్నీ బాగా తెరకెక్కించాడు. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కూడా బాగుంది. ఇక సినిమాకు అన్నిటికంటే పెద్ద ఆకర్షణ పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రఫీనే. తన ప్రత్యేకతను ప్రతి యాక్షన్ సీన్లోనూ చూపించాడు పీటర్ హెయిన్. నిర్మాణ విలువలు బాగున్నాయి. కథాకథనాలు ఏమంత ఆసక్తికరంగా కలిగించవు. దర్శకుడు వైశాక్.. మోహన్ లాల్ అభిమానుల్ని దృష్టిలో ఉంచుకునే ప్రతి సన్నివేశాన్ని తీర్చిదిద్దినట్లున్నాడు. సినిమాలో దర్శకుడి ముద్ర ప్రత్యేకంగా ఏమీ కనిపించదు.
చివరగా: మన్యం పులి.. ఓన్లీ ఫర్ డిష్యుం డిష్యుం!
రేటింగ్: 2.75/5
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre