Begin typing your search above and press return to search.
మంత్ర 2

Date of Release: 2015-07-31
రేటింగ్: 2/5
నటీనటులు: ఛార్మి, చేతన్ చీను, తనికెళ్ల భరణి, రాహుల్ దేవ్, ఢిల్లీ రాజేశ్వరి, జబర్దస్త్ వేణు తదితరులు
సంగీతం: సునీల్ కశ్యప్
ఛాయాగ్రహణం:ఆర్.పి.తనకెళ్ల
కథ: కేపీఆర్
నిర్మాతలు: యాదగిరి రెడ్డి, శౌరి రెడ్డి
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎస్.వి.సతీష్
ఎనిమిదేళ్ల కిందట వచ్చిన మంత్ర అప్పట్లో పెద్ద సంచలనం. హార్రర్ చిత్రాల్లో సరికొత్త ట్రెండుకు దారితీసిందా సినిమా. ఆ సినిమాను తన భుజాల మీద నడిపించి.. మంచి పేరు సంపాదించి పెట్టింది ఛార్మి. ఇన్నేళ్ల విరామం తర్వాత మళ్లీ ఆమె ప్రధాన పాత్రలో మంత్ర సీక్వెల్ ‘మంత్ర-2’ తెరకెక్కింది. మరి ఈసారి ఛార్మి అండ్ కో ఏమేరకు మెప్పించిందో చూద్దాం పదండి.
కథ:
యాక్సిడెంట్లో తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథగా మారిన మంత్ర (ఛార్మి) ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం కోసం హైదరాబాద్ వస్తుంది. రామారావు (తనికెళ్ల భరణి) ఇంట్లో పేయింగ్ గెస్టుగా దిగుతుంది. ఐతే ఆమెను ఎవరో చంపడాడనికి ప్రయత్నిస్తుంటారు. ఒకటికి రెండుసార్లు తన మీద అటాక్ జరగడంతో తన స్నేహితుడైన ఏసీపీ విజయ్ (చేతన్ చీను)కు విషయం చెబుతుంది. అతను జర్నలిస్టు బృందాన్ని తీసుకుని.. రాత్రి పూట మంత్ర ఉంటున్న ఇంటికి వెళ్తాడు. అక్కడికెళ్తే మంత్ర రెండేళ్ల క్రితమే చనిపోయిన రామారావు, అతడి భార్యతో కలిసి ఉంటున్నట్లు తెలిసి అంతా షాకవుతారు. మంత్ర, విజయ్, జర్నలిస్టు బృందం ఆ ఇంట్లోకి వెళ్లగానే తలుపులు మూసుకుంటాయి. మరి వాళ్లందరూ అక్కడి నుంచి బయటపడ్డారా? మంత్రకు, రామారావుకు సంబంధమేంటి? చివరికేమైంది? అన్నది తెరమీద చూసి తెలుసుకోవాలి.
కథనం, విశ్లేషణ:
మంత్ర-2 అని పేరు పెట్టారు కానీ.. ఇది మంత్రకు సీక్వెల్ కాదు. కేవలం ప్రేక్షకుల్ని ఆకర్షించడానికి మాత్రమే ఆ టైటిల్ పెట్టారు. ఇక సినిమా అంతా చూస్తే.. ఇది చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే వ్యవహారమని అర్థమవుతుంది. ఛార్మి ఉంది, హార్రర్ నేపథ్యం అన్నది తప్పితే కంటెంట్ పరంగా మంత్రకు, మంత్ర-2కు ఎక్కడా పోలికే లేదు. ‘మంత్ర’కు మంత్ర-2 ఏ విషయంలోనూ సరితూగదు. చివరికి ఛార్మి విషయంలో కూడా పోలిక పెట్టలేనంత తేడా ఉంది ఈ సినిమాలో. ఏళ్లు గడవడం వల్ల అందం తగ్గితే తగ్గొచ్చు, కానీ పెర్ఫామెన్స్ విషయంలోనూ ఆమె ఫేడవుట్ అయిపోయినట్లు కనిపించడమే ఆశ్చర్యం. డానికి పూర్తి బాధ్యత బలహీనమైన స్క్రిప్టుదే అని చెప్పాలి. సినిమాలో విషయం లేనపుడు ఛార్మి మాత్రం ఏం చేయగలదు పాపం?
తొలి సన్నివేశంలోనే భయపెట్టి.. పావుగంటకే సినిమాలో లీనం చేసి.. ఇంటర్వెల్ సమయానికి ఊపిరి బిగబట్టేలా చేసి.. ద్వితీయార్ధమంతా వణికించి.. క్లైమాక్స్ సమయానికి ఉత్కంఠను తారా స్థాయికి తీసుకెళ్లిన సినిమా ‘మంత్ర’ అయితే... తొలి సన్నివేశంలోనే ‘ప్చ్’ అనిపించే.. 20 నిమిషాలకే పిచ్చ బోర్ కొట్టించి.. ఇంటర్వెల్ సమయానికి రెండున్నర గంటల సినిమా చూసిన ఫీలింగ్ కలిగించి.. ద్వితీయార్ధమంతా ‘ఎండ్’ కార్డ్ ఎప్పుడు పడుుతుందా అని వెయిట్ చేసేంత అసహనం కలిగించి.. క్లైమాక్స్ అవగానే హమ్మయ్య అన్న నిట్టూర్పుతో ప్రేక్షకుడు థియేటర్ నుంచి బయటపడేలా చేసిన సినిమా మంత్ర-2.
‘మంత్ర’తో పోలికలు పక్కనబెట్టేసి మామూలుగా చూసినా.. మంత్ర ఏమాత్రం మింగుడు పడదు. హార్రర్ సినిమాలకు లాజిక్కులతో సంబంధం లేకుండా కథ రాసుకునే సౌలభ్యముంటుందన్నది వాస్తవమే. అలాగని మరీ సిల్లీ థింగ్స్ ట్రై చేస్తే చాలా కష్టం. బేసిక్ విషయాల్లోనే ఎంత లోపముందో చెప్పడానికి ఓ ఉదాహరణ చూద్దాం. ఇద్దరు స్నేహితులు హాస్పిటల్లో ఉంటారు. ఇద్దరి భార్యలూ ప్రసవానికి వెళ్తారు. ఓ స్నేహితుడి భార్య చనిపోయిన బిడ్డను ప్రసవిస్తుంది. ఇంకో స్నేహితుడి భార్య కవలల్ని కంటుంది. తనకు ఎంతో చేసిన స్నేహితుడి కోసం భార్యకు కవలలని చెప్పకుండా ఓ బిడ్డను తీసుకెళ్లి స్నేహితుడికిచ్చేస్తాడు రెండో స్నేహితుడు. అయినా కవల పిల్లలన్న సంగతి ప్రసవించే వరకు తెలియకపోవడమేంటో కథకుడికే తెలియాలి? ఇలాంటి సిల్లీ థింగ్స్ సినిమాలో చాలా ఉన్నాయి.
విలన్ తన అన్నని, వదినని, డ్రైవర్ని వాళ్లింట్లోనే అడ్డంగా నరికేస్తాడు. మరి పోలీసులు అతణ్నేమీ చేయకుండా ఇంటిని సీజ్ చేసి ఎందుకు వదిలేశారో? బహుశా దయ్యం అన్నయ్య దయ్యం చేతిలోనే చావడానికా? మరొకరి శరీరంలోకి చేరి తమ్ముణ్ని చంపే శక్తి తనకున్నపుడు దయ్యం అన్నయ్య రెండేళ్లు ఎందుకాగాడు? కూతుర్ని చంపడానికి వచ్చిన బేవర్స్ బ్యాచ్ లో ఒక్కొక్కర్ని ఖతం చేసిన దయ్యం అన్నయ్య.. తమ్ముడు అంతకాలం తన కూతురి మీద అటాక్ చేస్తూ వచ్చినా ఎందుకు ఊరుకున్నాడు? డైరెక్టర్ ఇంకా క్లైమాక్స్ టైం కాలేదని చెప్పనందుకా? పోనీ దయ్యాలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లే శక్తి లేదనుకుందామా అంటే.. దయ్యం డ్రైవర్ కారేసుకుని రైల్వేస్టేషన్ కు వెళ్లి మరీ హీరోయిన్ని ఇంటికి తీసుకొస్తాడాయె! అన్నావదినల్ని లాయర్ ముందే చంపేసి జల్సాగా వెళ్లిపోయిన తమ్ముడు.. అన్న కూతుర్ని చంపడానికి మాత్రం ముసుగేసుకుని ఎక్కడెక్కడో ఫాలో చెయ్యడం.. ఆమెను చంపలేక నానా తంటాలు పడ్డమేంటో? అబ్బో ఇలాంటి సందేహాలకు లెక్కే లేదు.
టైటిల్స్ కూడా పడకముందే ఓ పేలవమైన సన్నివేశంతో ఉస్సూరుమనిపించిన ‘మంత్ర-2’ ఆ తర్వాత ఏ దశలోనూ ప్రేక్షకుడిలో ఉత్సాహం తేలేకపోయింది. హత్యలన్నీ చేస్తోంది మంత్రానే అని జర్నలిస్టు బ్యాచ్ లో ఒకడికి అర్థమైనపుడు మాత్రమే.. కొంచెం ప్రేక్షకుడిలో కొంచెం ఉత్సాహం, ఉత్కంఠ కలుగుతుంది. కానీ తర్వాతి సన్నివేశంలో ట్విస్టు రివీల్ చేశాక ఆ ఉత్సాహం కూడా నీరుగారిపోతుంది. అసలేం జరిగిందన్నది తెలిశాక.. సినిమా మొదట్నుంచి చూసి సోది వ్యవహారం మరింత సోదిలా అనిపిస్తుంది.
ఓ పెద్ద ఇంట్లో ఓ బ్యాచ్ ను దించేసి.. లైట్లు ఆపేసి.. ఊరికే కెమెరాను షేక్ చేసేసి.. బ్యాగ్రౌండ్లో స్కోర్ తో మోతెక్కించేస్తే ప్రేక్షకులు భయపడిపోతారని.. థ్రిల్లయిపోతారనుకుంటే భ్రమే. మంత్ర స్ఫూర్తితో అలాంటి సినిమా తీయాలనుకున్నపుడు.. ఆ సినిమా ఒకటికి పదిసార్లు చూసుకుని ఉండాల్సింది. దర్శకుడికైతే అనుభవం లేదనుకోవచ్చు. మరి ‘మంత్ర’లో నటించిన ఛార్మికైనా మంత్ర-2 స్క్రిప్టు విన్నపుడు.. నటిస్తున్నపుడు తేడా ఏంటో తెలియకపోయిందా?
నటీనటులు:
కథాకథనాల్లో దమ్ము లేనపుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు? కాబట్టి ఛార్మి ఏంటి ఇలా చేసింది అని ఫీలవ్వాల్సిన పని లేదు. ఎలాగూ అందం విషయంలో ఒకప్పట్లా ఛార్మి ఆకర్షణ మంత్రం పని చేయట్లేదు. పోనీ పెర్ఫామెన్స్ పరంగా చూద్దామన్నా నిరాశ తప్పదు. మంత్ర నాటి కాన్ఫిడెన్స్ ఆమెలో కాస్తయినా కనిపించలేదు. తమిళ నటుడు చేతన్ చీను కూడా చేసిందేమీ లేదు. అతను నటించగలడని అర్థమవుతుంది కానీ.. తన క్యారెక్టర్ పేలవంగా ఉండటంతో వేస్ట్ అయిపోయాడు. తనికెళ్ల భరణి ఉన్నంతలో బాగా చేశాడు. జబర్దస్త్ వేణు కామెడీ పేరుతో ఓ పది నిమిషాలు హింస పెట్టాడు. మిగతా వాళ్లంతా మామూలే.
సాంకేతిక వర్గం:
కంటెంట్ పరంగా హార్రర్ ఫీలింగే లేకపోయినా.. ఆర్.పి.తనికెళ్ల తన కెమెరాతో, సునీల్ కశ్యప్ తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఆ ఎఫెక్ట్ తీసుకురావడానికి విశ్వప్రయత్నం చేశారు. ఐతే కెమెరా మరీ ఎక్కువ విన్యాసాలు చేసింది. బి-గ్రేడ్ సినిమాల మాదిరి ఏమీ లేకున్నా కెమెరాతో ఏదో జరగబోతున్నట్లు, జరిగిపోతున్నట్లు చూపించే ప్రయత్నం చేశారు. సినిమాలో ఉన్న ఏకైక పాట జర జర బూమ్ పర్వాలేదు. ఆ పాటలతో ఛార్మి చేతికి డ్రిల్లింగ్ మిషన్ ఇవ్వడం ద్వారా దర్శకుడు ఏం చెప్పదలుచుకున్నాడో అతడికే తెలియాలి. నిర్మాణ విలువలు పర్వాలేదు. ఒకే ఇంట్లో, చాలా తక్కువ లొకేషన్లలో తీశారు కాబట్టి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. లొకేషన్స్ సహజంగా ఉండేలా చూసుకోవాల్సింది. హార్రర్ సినిమాల్లో మాటలకు ప్రాధాన్యముండదు కానీ.. ఉన్న మాటలు కూడా పేలవంగా ఉన్నాయి. కొత్త దర్శకుడు ఎస్వీ సతీష్.. తాను క్రెడిట్ తీసుకున్న రెండు విషయాల్లోనూ నిరాశ పరిచాడు. స్క్రీన్ ప్లే సినిమాకు పెద్ద మైనస్ అయింది. క్లైమాక్స్ లో ప్రేక్షకుల్ని థ్రిల్ చేసేద్దామనుకుని.. అంతకుముందంతా పేలవమైన సన్నివేశాలతో నింపేశాడు. చివరికి క్లైమాక్స్ కూడా తేలిపోవడంతో అతడి ప్రయత్నం వృథా అయిపోయింది.
చివరగా:
హార్రర్ సినిమానే చూడాలనుకుంటే మళ్లీ ‘మంత్ర’ డీవీడీ వేసి చూసుకోండి. మంత్ర-2కు వెళ్తే హ్యాంగోవర్ దిగడానికి మళ్లీ ‘మంత్ర’ సినిమానే చూడాలనిపిస్తుంది.
Disclaimer : This Review is an Opinion of Review Writer. Please Do not Judge the Movie based on This Review and Watch Movie in Theatre