Begin typing your search above and press return to search.
Ladies and Gentlemen

Date of Release: 2015-01-30
రేటింగ్: 2.5 /5
తారాగణం: అడివి శేష్, చైతన్యకృష్ణ, మహత్ రాఘవేంద్ర, కమల్ కామరాజు, నిఖిత నారాయణ్, స్వాతి దీక్షిత్ తదితరులు
ఛాయాగ్రహణం: జగన్ చావలి
సంగీతం: రఘు కుంచె
నిర్మాత: ఎంవీకే రెడ్డి
కథ: సంజీవ్ రెడ్డి
మాటలు: నివాస్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మంజునాథ్
తన దర్శకత్వంలో, నిర్మాణంలో లో బడ్జెట్లో ట్రెండీగా ఉండే సినిమాలు తీస్తుంటాడు మధుర శ్రీధర్. కానీ ఈ మధ్య అతడి సినిమాలు వరుసగా బోల్తా కొట్టేస్తున్నాయి. నీలకంఠతో తీసిన 'మాయ' విభిన్నమైన ప్రయత్నంగా గుర్తింపు తెచ్చుకున్నా కాసులు మాత్రం రాబట్టలేకపోయింది. ఇలాంటి సమయంలో మంజునాథ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ 'లేడీస్ అండ్ జెంటిల్మన్' పేరుతో పక్కా యూత్‌ఫుల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు మధర. ఈ ట్రెండుకు సరిగ్గా సరిపోయే సినిమా ఇదని, కచ్చితంగా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందని చెప్పాడతను. మరి లేడీస్ అండ్ జెంటిల్మన్ అతడి నమ్మకాన్ని నిలబెట్టిందో లేదో చూద్దాం పదండి.
కథ:
ఆనంద్ (కమల్ కామరాజు), ప్రియ (నిఖిత) ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న జంట. ఆనంద్ ఎప్పుడూ ఆఫీస్‌లో బిజీగా గడుపుతుంటాడు. అతడి తీరుతో విసిగిపోయిన ప్రియ జీవితంలోకి ఒకప్పటి ఆమె బాయ్‌ఫ్రెండ్ రాహుల్ (అడివి శేష్) ఫేస్బుక్ ద్వారా మళ్లీ టచ్‌లోకి వస్తాడు. ఇక మోడల్‌గా తొలి అడుగులు వేస్తున్న అంజలిని తానో బిజినెస్‌మేన్ అని చెప్పి మోసం చేసి లవ్‌లోకి దింపిన కాల్ సెంటర్ ఉద్యోగి విజయ్ (మహత్ రాఘవేంద్ర) ఆమె కోసం ఆన్లైన్ మోసాలు చేస్తుంటాడు. మరోవైపు ఫేస్బుక్లో పరిచయమైన దీప (స్వాతి దీక్షిత్)ను ప్రేమలోకి దింపే ప్రయత్నంలో ఉంటాడు కాలేజ్ స్టూడెంట్ కృష్ణమూర్తి (కృష్ణచైతన్య). ఇంటర్నెట్ వీరి జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపింది? ఎవరి జీవితాలు ఎలా మలుపు తిరిగాయన్నది తెరమీదే చూసి తెలుసుకోవాలి.
కథనం:
''పొద్దున లేవగానే ఫేస్ కూడా కడక్కుండానే ఫేస్ బుక్ చూసే.. వాటర్ కూడా తాగకుండానే వాట్సప్ చెక్ చేసుకునే జనరేషన్లో ఉన్నాం'' అంటూ పూరి జగన్నాథ్ వాయిస్ ఓవర్‌తో మొదలవుతుంది 'లేడీస్ అండ్ జెంటిల్మన్'. పూరి మాటల్ని బట్టే సినిమా ఉద్దేశమేంటో అర్థమైపోతుంది. ఇంటర్నెట్ వల్ల జరిగే అనర్థాల్ని చూపించే ప్రయత్నమే ఇది. ఇందు కోసం మూడు జంటల కథల్ని ఎంచుకున్నారు. రెండు మూడు కథల్ని సమాంతరంగా నడుపుతూ.. చివరికి ఆ కథల్ని ఒకచోటికి చేర్చి ముగింపునిచ్చే స్క్రీన్‌ప్లేతో గతంలో కొన్ని సినిమాలు చూశాం. లేడీస్ అండ్ జెంటిల్మన్ కూడా ఆ తరహాలోనే సాగుతుంది.
ఐతే ఈ మూడు కథలు సాగేతీరు అంత ఆసక్తికరంగా లేదు. మూడూ కూడా చాలా మామూలు కథలు కావడం.. వాటిని చాలా మామూలు సన్నివేశాలతో నడిపించడం ఇక్కడ సమస్య. ఉన్నంతలో కృష్ణచైతన్య-స్వాతిల కథ కొంచెం బెటర్. ఆ కథకు ఇచ్చిన ముగింపు ప్రేక్షకులకు షాకిస్తుంది. ఐతే అది అంత సహజంగా లేదు. ఓ కన్నింగ్ లేడీ లేడీస్ హాస్టల్లో ఉంటూ అబ్బాయిల్ని ముగ్గులోకి దించి.. వారి ప్రాణాలతో చెలగాటమాడే తీరు.. కన్విన్సింగ్‌గా తెరకెక్కించలేదు. దీనికి సంబంధించిన సన్నివేశాలు సహజంగా అనిపించలేదు.
ఇక కమల్, అడివి శేష్, నిఖితల ముక్కోణపు కథ.. చాలా బోరింగ్‌గా సాగుతుంది. ఇది మరీ రొటీన్ వ్యవహారంలా అనిపిస్తుంది. అడివి శేష్ వ్యవహారం తేడాగా ఉందని.. అతను మోసగాడని చాలా ముందే అర్థమైపోతుంది. కమల్, నిఖితల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా సిల్లీగా, డ్రమటిక్‌గా ఉన్నాయి. నెగెటివ్ క్యారెక్టర్ కావడం వల్ల.. క్రైమ్ ఎలిమెంట్ మిక్స్ అయి ఉండడం వల్ల మహత్ రాఘవేంద్ర ఎపిసోడ్‌తో యూత్ కొంచెం కనెక్టయ్యే అవకాశముంది. కానీ అతడి ఎపిసోడ్ కూడా రొటీనే.
ఇంటర్నెట్ నేపథ్యంలో సాగే 'లేడీస్ అండ్ జెంటిల్మన్' చూస్తుంటే యూట్యూబ్‌లో రెండు మూడు షార్ట్ ఫిలిమ్స్‌ను మిక్స్ చేసి చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. కంటెంట్ కూడా షార్ట్ ఫిలిమ్స్ స్టాండర్డ్‌లోనే ఉంది. కాకపోతే సినిమా అని గుర్తు చేయడానికి.. ప్రతి ఎపిసోడ్‌లోనూ ఓ లిప్ కిస్ స్పెషల్ అట్రాక్షన్‌గా చేర్చారు. కాన్సెప్ట్ కాస్త యూత్‌ఫుల్‌గా, కంటెంపరరీగా ఉండటం వల్ల యూత్ అట్రాక్ట్ అయితే కావచ్చు కానీ.. సినిమాగా చెప్పుకోవడానికి 'లేడీస్ అండ్ జెంటిల్మన్'లో ఏమీ లేదు.
నటీనటులు:
లేడీస్ అండ్ జెంటిల్మన్ నటులెవరికీ పెద్దగా పరీక్ష పెట్టలేదు. అందర్లోకి కమల్ కామరాజు, అడివి శేష్ ఆకట్టుకుంటారు. పెర్ఫామ్ చేయడానికి అవకాశం దొరికిన ఒకటి రెండు సన్నివేశాల్లో ఇద్దరూ తమ ప్రతిభ చూపించారు. కృష్ణచైతన్య బాగానే నటించాడు కానీ.. కొన్ని సన్నివేశాల్లో పాత్ర తాలూకు అమాయకత్వాన్ని కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయలేదు. కొన్ని సన్నివేశాల్లో అవసరమైందానికంటే ఎక్కువ అమాయకత్వం చూపించాడు. మహత్ రాఘవేంద్ర బ్యాడ్‌బాయ్ పాత్రకు బాగానే సూటయ్యాడు. అమ్మాయిల్లో నిఖిత నారాయణ్ పర్వాలేదు. కన్నింగ్ లేడీగా స్వాతి దీక్షిత్ చివరి సన్నివేశంలో ఆకట్టుకుంది. మోడల్‌గా నటించిన అమ్మాయి చేసిందేమీ లేదు. కృష్ణచైతన్య ఫ్రెండ్‌గా నటించిన నటుడు పంచ్‌లు బాగానే వేశాడు. అతడికి డైలాగ్ డెలివరీ అస్సెసట్. కమెడియన్‌గా ఈ కుర్రాణ్ని బాగానే వాడుకోవచ్చు.
సాంకేతిక వర్గం:
రఘు కుంచె సంగీతం పర్వాలేదు. ఆరంభంలో వచ్చే జానపద గీతం ఆకట్టుకుంటుంది. మిగతా పాటలన్నీ మామూలే. జగన్ చావలి ఛాయాగ్రహణం చాలా మామూలుగా అనిపిస్తుంది. మిగతా సాంకేతిక విభాగాలు కూడా ఏవరేజ్ ఔట్పుట్ ఇచ్చాయి. సంజీవ్ రెడ్డి అందించిన కథలో గొప్ప విశేషమేమీ లేదు. నివాస్ మాటల్లో అక్కడక్కడా మెరుపులు కనిపించాయి. ''గత ఏడాది హుస్సేన్ సాగర్‌లో వాటర్ లెవెల్స్ పెరిగాయన్నారు కదా. అది నా కన్నీటి ఎఫెక్టే''.. ఇలాంటి రెండు మూడు డైలాగులు పేలాయి. కొత్త దర్శకుడు మంజునాథ్ మూడు కథల్ని కలిపి చెప్పడంలో స్క్రీన్‌ప్లే పరంగా కాస్త ఆకట్టుకున్నాడు కానీ.. దర్శకుడిగా ఫెయిలయ్యాడు. ఫీచర్ ఫిలిం స్థాయి ప్రతిభ చూపించలేకపోయాడు. కాంబినేషన్ సెట్ చేయడంలో, చాలా తక్కువ బడ్జెట్లో సినిమా పూర్తి చేయడంలో మధుర శ్రీధర్ ప్లానింగ్ కనిపిస్తుంది. నిర్మాణ విలువలు పర్వాలేదు.
చివరిగా...
ఈ లేడీస్ అండ్ జెంటిల్మన్.. షార్ట్ ఫిలిమ్ స్థాయికి ఎక్కువ.. సినిమా స్థాయికి తక్కువ.