Begin typing your search above and press return to search.
'కర్తవ్యం’

Date of Release: 2018-03-16
నటీనటులు: నయనతార - రామచంద్రన్ దురైరాజ్ - సును లక్ష్మి - మహాలక్ష్మి తదితరులు
సంగీతం: జిబ్రాన్
ఛాయాగ్రహణం: ఓం ప్రకాష్
నిర్మాతలు: శరత్ మరార్ - రవీంద్రన్
రచన - దర్శకత్వం: గోపి నైనార్
దక్షిణాదిన కథానాయికగా తిరుగులేని స్థాయి అందుకున్న నటి నయనతార. 30 ప్లస్ తర్వాత హీరోయిన్ల తిరోగమనం మొదలవుతుంది కానీ.. నయనతార మాత్రం ఆ తర్వాత తన ఇమేజ్ మరింత పెంచుకుంది. తమిళంలో ఆమె నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘అరామ్’ మంచి విజయం సాధించింది. ఆ చిత్రం ఇప్పుడు తెలుగులోకి ‘కర్తవ్యం’ పేరుతో వచ్చింది. శరత్ మరార్ అందించిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
ఒకవైపు చూస్తే రాకెట్ లాంచింగ్ స్టేషన్.. మరోవైపు చూస్తే తాగునీటికి కటకట.. ఇలా పరస్పర విరుద్ధమైన పరిస్థితులున్న ఓ పల్లెటూరిలో ఒక పేద కుటుంబం జీవిస్తుంటుంది. భార్యాభర్తలిద్దరూ చిన్న చిన్న పనులు చేసుకుని బతుకుతుంటారు. ఒక రోజు వీళ్ల కూతురు బోరు బావిలో పడుతుంది. దీంతో ఆ కుటుంబంతో పాటు ఆ ఊరు మొత్తంలో అలజడి మొదలవుతుంది. అదే సమయంలో ఆ జిల్లాకు కలెక్టరుగా వచ్చిన మధువర్షిణి (నయనతార)కు విషయం తెలుస్తుంది. ఆమె చిత్తశుద్ధి ఉన్న అధికారి. పాపను కాపాడేందుకు మొత్తం యంత్రాంగాన్ని తీసుకుని ఘటనా స్థలానికి వెళ్తుంది మధువర్షిణి. మరి అక్కడ ఆమెకు ఎదురైన అడ్డంకులేంటి.. చివరికి పాపను రక్షించారా లేదా అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
సినిమా అంటే వినోద ప్రధానంగానే భావిస్తారు మెజారిటీ ఫిలిం మేకర్స్. సామాజిక సమస్యల్ని స్పృశించినా.. అది పైపైనే. ఐతే ప్రజలు పడే బాధల మీద సిన్సియర్ గా సినిమా తీస్తే.. కష్టాలు కన్నీళ్లు చూపించినా జనాలకు బాగానే కనెక్టవుతుందని.. అది ఎమోషనల్ గా కదిలిస్తుందని కొన్ని చిత్రాలే రుజువు చేస్తాయి. ఆ కోవలోని సినిమాని సినిమానే కర్తవ్యం. ఇది సమాజం నుంచి.. జనాల నుంచి.. మన చుట్టూ ఉన్న అనుభవాల నుంచి.. కష్టాలు కన్నీళ్ల నుంచి పుట్టిన కథ. ఒకవైపు వేల కిలోమీటర్ల పైన ఉన్న వేరే గ్రహాల మీదికి మనిషిని పంపించి పరిశోధన సాగిస్తూ.. మరోవైపు కింద 100 అడుగుల లోతులో ఒక బిడ్డ బోరు బావిలో పడిపోతే కాపాడలేని దైన్యం గురించి ప్రశ్నిస్తుందీ సినిమా. ఇంకా అనేక సమస్యలా మీదా ఇందులో చర్చిస్తారు. అలాగని ఇది ఒక డాక్యుమెంటరీ తరహా ఏమో అని సందేహించాల్సిన పని లేదు. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ.. భావోద్వేగాలు రగిలిస్తూ.. రెండు గంటల పాటు ఆసక్తికరంగానే సాగుతుందీ చిత్రం.
‘కర్తవ్యం’ మొదలైన కాసేపటికే మనం సినిమా చూస్తున్న భావన నుంచి బయటికి వచ్చేస్తాం. ఒక పల్లెటూరికి వెళ్లి అక్కడ ఒక కుటుంబాన్ని దగ్గరుండి చూస్తున్న అనుభూతిలోకి వెళ్లిపోతాం. ఒక మారుమూల పల్లెటూరిలో తాగునీటి కోసం పడే కష్టాల్ని చూసి కరిగిపోతాం. భవిష్యత్తుపై ఆందోళన చెందుతాం. ఒక పేద కుటుంబం ఆశల్ని అణుచుకుని బతికే వైనాన్ని.. వారి దయనీయ స్థితిని చూసి బాధపడతాం. ఇంతలో ఒక భారీ కుదుపు. ఒక చిన్న అమ్మాయి బోరు బావిలో పడుతుంది. ఇక అక్కడి నుంచి మొదలవుతుంది ఉత్కంఠ. దాదాపు గంటన్నర వ్యవధిలో ఆ పాపను బయటికి తీయడానికి చేసే ప్రయత్నాల నేపథ్యంలోనే ఈ చిత్రం సాగుతుంది. ఈ క్రమాన్ని ఎంత బాగా చిత్రీకరించారంటే.. ఆద్యంతం మనం అక్కడే ఉండి అంతా చూస్తున్న భావనలోనే ఉంటాం. క్షణ క్షణం ఉత్కంఠతో ఊగిపోతాం. తీవ్ర ఆందోళనకు.. ఆవేదనకు లోనవుతాం. చివరికొచ్చేసరికి మనసున్న ఎవరైనా కదిలిపోవాల్సిందే.
నిజానికి పోస్టర్ నిండా నయనతార కనిపిస్తున్నప్పటికీ ఇది ఆమె సినిమా కాదు. ఇది బోరు బావిలో పడ్డ ఒక పాప.. ఆమె కుటుంబం కథ. వాళ్ల చుట్టూ.. సమస్యల చుట్టూనే సినిమా సాగుతుంది. నయనతార సినిమాకు ప్రేక్షకుల్ని ఆకర్షించే ఒక ఉత్ప్రేరకం లాగా పని చేస్తుంది. తన పెర్ఫామెన్స్ తో చాలా సన్నివేశాల్ని ఆమె నిలబెట్టింది. ఈ సినిమా లోతుల్లోకి వెళ్లి విశేషాల గురించి మాట్లాడుకుంటే ఉత్కంఠ.. ఆసక్తి తగ్గిపోతాయి. అసలేం జరుగుతుందన్నది తెర మీదే చూడాలి. ఒకటి మాత్రం వాస్తవం.. ఇది ఒక ప్రత్యేకమైన సినిమా. ఇది చూశాక కలిగే అనుభూతే వేరు.
ఐతే ‘కర్తవ్యం’లో లోపాలు లేవని కాదు. ముఖ్యంగా మన ప్రేక్షకులకు నేటివిటీ అనేది సమస్యగా అనిపించొచ్చు. నయనతార మినహాయిస్తే నటీనటులందరూ మనకు పరిచయం లేని వాళ్లే. నేటివిటీ.. పాత్రధారులు.. వారి నటన అంతా కూడా తమిళ నేపథ్యాన్ని తలపిస్తుంటాయి. అక్కడక్కడా సినిమా కొంచెం నత్తనడకన సాగుతుంది. టీవీ చర్చల నేపథ్యంలో సాగే సన్నివేశాలు విసిగిస్తాయి. వాటిని తెలుగు వెర్షన్లో పూర్తిగా తీసేస్తే బాగుండేదేమో. బోరు బావి నుంచి పాప బయటపడుతుందా లేదా అనే ఉత్కంఠ ప్రేక్షకుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుండగా.. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు డీవియేట్ చేస్తాయి. అసహనం కలిగిస్తాయి. అక్కడక్కడా నయనతార పాత్రను ఎలివేట్ చేసే ప్రయత్నం జరిగింది. ముఖ్యంగా పతాక సన్నివేశంలో ఎలివేషన్ అయితే ఎందుకో అర్థం కాదు. సినిమా సీరియస్ గా సాగుతూ.. కొన్ని చోట్ల ప్యానిక్ అయ్యేలా చేస్తుంది కాబట్టి అది అన్ని రకాల ప్రేక్షకులకూ రుచించకపోవచ్చు. ఐతే మధ్యలో ఎలా అనిపించినా.. చివరికి వచ్చేసరికి ప్రేక్షకుడికి కలిగే అనుభూతి వేరుగా ఉంటుంది. ప్రతికూలతల్ని పక్కన పెడితే ‘కర్తవ్యం’ కచ్చితంగా చూడదగ్గ సినిమా. చూడాల్సిన సినిమా కూడా.
నటీనటులు:
సినిమాకు నయనతార ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమెలో ఎంత మంచి నటి ఉందో ఈ సినిమాతో తెలుస్తుంది. నయన్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అదిరిపోయింది. కొన్ని సన్నివేశాల్లో ఆమె హావభావాలు అమోఘంగా అనిపిస్తాయి. ఇక పేద తల్లిదండ్రులుగా రామచంద్రన్ దురైరాజ్.. సును లక్ష్మి తమ పాత్రల్లో జీవించేశారు. వాళ్లు నటులు అనే విషయమే గుర్తుకు రాదు. నిజంగా ఓ పల్లెటూరిలో పేద భార్యాభర్తల్ని చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. మిగతా నటీనటులు కూడా పాత్రలకు తగ్గట్లుగా సహజంగా నటించారు.
సాంకేతికవర్గం:
టెక్నీషియన్లు సినిమాకు తమ వంతుగా పూర్తి సహకారం అందించారు. జిబ్రాన్ నేపథ్య సంగీతం.. ఓం ప్రకాశ్ ఛాయాగ్రహణం ప్రేక్షకుడిని సినిమాలో ఇన్వాల్వ్ చేయించడంలో కీలక పాత్ర పోషించాయి. ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగుంది. మొత్తంగా సాంకేతిక నిపుణులందరూ కలిసి ఈ కథకు ఒక అథెంటిసిటీ.. సహజత్వం తేవడంలో కీలక పాత్ర పోషించారు. పరిమిత బడ్జెట్లోనే సినిమాకు అవసరమైన నిర్మాణ విలువలు పాటించారు. డబ్బింగ్ విలువలు కూడా బాగున్నాయి. దర్శకుడు గోపి నైనార్ ఇలాంటి కథతో సినిమా చేసినందుకు అభినందనీయుడు. సమాజం పట్ల ఒక బాధ్యతతో అతడీ సినిమా తీసిన విషయం అర్థమవుతుంది. సమస్యల నేపథ్యంలో సినిమా తీసినా.. ఆసక్తి తగ్గకుండా చూసుకోవడంలోనూ విజయవంతమయ్యాడు.
చివరగా: కర్తవ్యం.. ఇది ప్రత్యేకమైన సినిమా
రేటింగ్- 3/5
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre