Begin typing your search above and press return to search.
కాదలి

Date of Release: 2017-06-16
నటీనటులు: పూజ కె.దోషి - హరీష్ కళ్యాణ్ - సాయి రోనక్ - సుదర్శన్ - భద్రం - భాను తదితరులు
సంగీతం: పవన్ - ప్రసూన్ - శ్యామ్
ఛాయాగ్రహణం: శేఖర్ వి.జోసెఫ్
నిర్మాణం - రచన - దర్శకత్వం: పట్టాభి చిలుకూరి
అప్పుప్పుడు కొన్ని చిన్న సినిమాలో డిపరెంట్ ప్రోమోస్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఆ కోవలోని సినిమానే ‘కాదలి’. కొత్త నటీనటులతో కేటీఆర్ మిత్రుడైన పట్టాభి చిలుకూరి అనే కొత్త దర్శకుడు రూపొందించిన సినిమా ఇది. దీనికి ప్రమోషన్ కొంచెం గట్టిగానే చేయడంతో విడుదలకు ముందు కొంచెం పాజిటివ్ బజ్ తెచ్చుకుంది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ ముక్కోణపు ప్రేమకథలోని విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
బాంధవి వరదరాజన్ (పూజ కె.దోషి) హైదరాబాద్ లో స్థిరపడిన తమిళ అమ్మాయి. ఫిజియో థెరపిస్టుగా పని చేసే ఈ అమ్మాయికి కుటుంబ సమస్యల వల్ల పెళ్లి విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అలాంటి తరుణంలో తనకు కావాల్సిన వాడిని తనే వెతుక్కోవాలని అనుకుంటుంది. అప్పుడే కార్తీక్ (హరీష్ కళ్యాణ్).. క్రాంతి (సాయి రోనక్) అనే ఇద్దరబ్బాయిలు ఒకరి తర్వాత ఒకరు బాంధవికి పరిచయం అవుతారు. వాళ్లిద్దరూ ఆమెను ఇష్టపడతారు. బాంధవికి కూడా వాళ్లపై సదాభిప్రాయం ఏర్పడుతుంది. మరి ఆ ఇద్దరిలో ఎవరు ఆమె మనసు గెలిచారు. వారిలోంచి బాంధవి ఎవరిని ఎంచుకుంది అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
‘కాదలి’లో హీరోలిద్దరూ అందంగా ఉన్నారు. హీరోయిన్ తన నటనతో ఆకట్టుకుంటుంది. సంగీతం తాజాగా.. ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. విజువల్స్ కూడా బాగున్నాయి. తెరను అలా చూస్తుంటే ఒక ప్లెజెంట్ ఫీలింగ్ కలుగుతుంది. ఐతే ఈ అదనపు ఆకర్షణలన్నీ ప్రేక్షకుడికి ఏమేరకు సంతృప్తినిస్తాయి.. ఎంతసేపు ప్రేక్షకుడిని ఒద్దికగా కూర్చోబెడతాయి? ప్రేక్షకుడిని మెప్పించాల్సింది.. ఒప్పించాల్సింది.. కథాకథనాలే కదా? అవే ‘కాదలి’కి పెద్ద ప్రతికూతలుగా మారాయి. ముఖచిత్రంతో పాటు పేజీలు.. అందులోని అక్షరాలూ అందంగా ఉండి.. విషయం మాత్రం చాలా పేలవంగా ఉండే పుస్తకం లాగా అనిపిస్తుంది ‘కాదలి’. ఇందులో చెప్పుకోదగ్గ మలుపుల్లేవు.. ఆసక్తి రేకెత్తించే సన్నివేశాలూ లేవు.. ఫ్లాట్ గా సాగిపోయే బోరింగ్ లవ్ స్టోరీ ‘కాదలి’.
అప్పుడెప్పుడో వచ్చిన ‘ప్రేమదేశం’.. ఈ మధ్యే వచ్చిన ‘నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్’ కోవలో సాగే ప్రేమకథ ‘కాదలి’. ఐతే కథ విషయంలో పోలికే తప్ప ‘ప్రేమదేశం’లో మాదిరి ప్రేమ భావనల్ని ఏ కోశానా కలిగించదు ‘కాదలి’. పోనీ ‘నాన్న నేను..’ తరహాలో ఎంటర్టైన్ చేసే ప్రయత్నమూ జరగలేదు ఇందులో. పెళ్లి కోసం తపిస్తున్న ఓ అమ్మాయి అనుకోకుండా పరిచయమైన ఇద్దరబ్బాయిలతో ప్రయాణం మొదలుపెడుతుంది. ఆ ఇద్దరూ కూడా కారణమేమీ లేకుండా తనతో తొలి చూపులోనే ప్రేమలో పడిపోతారు. ఈ అమ్మాయి కూడా చాలా మామూలుగా వాళ్లను చూసి ఇంప్రెస్ అయిపోతుంది. వాళ్లను తిట్టేస్తుంది. మళ్లీ ఎందుకు తిట్టానా అని బాధపడుతుంది. ఆ ఇద్దరూ కూడా ఆమె తిట్టినా ఏమీ ఫీలవ్వరు. ఇటు ఆ అమ్మాయి తిరిగి తిరిగి వాళ్ల దగ్గరికే వెళ్తుంది. వాళ్లూ మళ్లీ మళ్లీ తన దగ్గరికే వస్తారు. సినిమా అంతా ఇదే తంతు. కథ ముందుకు కదలకుండా ఈ తిరుగుళ్లతోనే సా....గిపోతుంది. ఇద్దరు హీరోలతో హీరోయిన్ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు ఆసక్తి రేకెత్తించవు. కథలో కూడా ఎక్కడా ఎలాంటి మలుపూ లేదు.
‘రెస్పెక్ట్ హర్ ఛాయిస్’ అన్న ట్యాగ్ లైన్ చూస్తే.. తప్పనిసరి పరిస్థితుల్లో ఇద్దరబ్బాయిల మధ్య నలిగిపోయే అమ్మాయి సంఘర్షణ చూపించి.. కన్విన్సింగ్ ఆన్సర్ ఇస్తారేమో అనుకుంటాం. కానీ కథను మొదలుపెట్టి నడిపించిన తీరు చూస్తే.. ఆ అమ్మాయి ఇద్దరబ్బాయిల జీవితాలతో ఆడుకుంటున్న ఫీలింగ్ కలుగుతుంది తప్ప.. పరిస్థితుల ప్రభావంతో ఆమె ఇబ్బంది పడిన భావన కలగదు. విరామ సమయానికే ఎవరో ఒకరిని ఎంచుకోవాల్సిన స్థితిలో పడే హీరోయిన్.. ఆ తర్వాత కూడా ఒక దశా దిశా లేకుండా ప్రవర్తిస్తుంది. దీంతో తన ఛాయిస్ ఏంటో తెలుసుకోవాలన్న ఆసక్తే సన్నగిల్లిపోతుంది. కథను క్లైమాక్స్ వరకు నడిపించడానికి దర్శకుడు ఏవో పిల్లర్స్ లాగా సన్నవేశాల్ని పేర్చేయడంతో ద్వితీయార్ధం ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. పాటలు వినడానికి బాగున్నా అసందర్భంగా వచ్చి పడటంతో అవీ ఇబ్బంది పెడతాయి. క్లైమాక్స్ కూడా అంత కన్విన్సింగ్ గా ఏమీ అనిపించదు. ఏదో మొక్కుబడిగా అలా ముగించేసిన ఫీలింగ్ కలుగుతుంది.
ఈ రోజుల్లో జీవిత భాగస్వాముల్ని ఎంచుకోవడంలో యువతీ యువకుల ఆలోచన తీరు ఎలా ఉంటుందో చెప్పాలనే ప్రయత్నంలో దర్శకుడు ఈ కథ రాసుకున్నట్లుగా ఉంది. ఇంత వరకు కంటెంపరరీగానే ఆలోచించినప్పటికీ.. కథలో ఎలాంటి మలుపులూ లేకపోవడం.. నరేషన్ మరీ నెమ్మదిగా ఉండటం వల్ల ఇది సగటు ముక్కోణపు కథలా తయారైంది. ప్రోమోస్ లో ఉన్న తాజాదనం కథాకథనాల్లో లేదు. సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ.. ప్రేక్షకుల్లో ఉత్తేజం కలిగించే సన్నివేశాల కోసం వెతుక్కోవాల్సిందే. కథ ఎలా సాగుతుందని ముందే స్పష్టంగా తెలిసిపోతుంటే ఇక ఆసక్తి ఏముంటుంది? ప్రేమకథలో ఫీల్ లేకపోవడం.. వినోదానికి ఆస్కారం లేకపోవడంతో ‘కాదలి’ ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. ఆరంభంలో చెప్పుకున్న అదనపు ఆకర్షణలు తప్పితే ‘కాదలి’లో చెప్పుకోదగ్గ విశేషాలేం లేవు.
నటీనటులు:
కథకు కేంద్ర బిందువైన పాత్రలో పూజ కె.దోషి బాగానే చేసింది. కొత్త అమ్మాయి అయినా కాన్ఫిడెంట్ గా నటించింది. ఆమె హావభావాలు ఆకట్టుకుంటాయి. ఐతే నటనలో ఆమె నిలకడ కొనసాగించలేకపోయింది. ఐతే ఈ విషయంలో నిరాశ తప్పదు. పూజ చాలా యావరేజ్ గా అనిపిస్తుంది. హీరోలిద్దరూ అందంగా ఉన్నారు. ఆ విషయంలో ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. హీరోయిన్ని డామినేట్ చేశారు. ఐతే నటనలో మాత్రం ఇద్దరూ అంతంతమాత్రమే. ఇద్దరూ చాలా మెరుగ్వాలి. హీరో ఫ్రెండు పాత్రలో సుదర్శన్ అక్కడక్కడా కొంచెం నవ్వించాడు. భాను.. భద్రం ఓకే.
సాంకేతిక వర్గం:
‘కాదలి’కి టెక్నికల్ సపోర్ట్ బాగానే దక్కింది. పవన్-ప్రసూన్-శ్యామ్ సంగీతం సినిమాకు ప్లస్. పాటలు.. నేపథ్య సంగీతం తాజాగా అనిపిస్తాయి. సినిమాలో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తెచ్చే ప్రయత్నం చేశారు సంగీత దర్శకులు. శేఖర్ వి.జోసెఫ్ ఛాయాగ్రహణం కూడా బాగుంది. విజువల్ గా ఒక డిఫరెంట్ మూవీ చూస్తున్న భావన కలిగించే ప్రయత్నం చేశాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎటొచ్చీ.. దర్శకుడు పట్టాభినే నిరాశ పరిచాడు. అతను ఎంచుకున్న కథ కొత్తది కాదు. దాన్ని ప్రెజెంట్ చేసిన తీరులోనూ కొత్తదనం లేదు. ఆసక్తికరమైన సన్నివేశాలూ లేవు. చెప్పుకోదగ్గ మలుపులూ లేవు. పైగా నరేషన్ డెడ్ స్లో కావడంతో ‘కాదలి’ని ప్రేక్షకులకు చేరువ చేయలేకపోయాడు పట్టాభి.
చివరగా: భారమైన ‘కాదలి’
రేటింగ్- 1.75/5
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre