Begin typing your search above and press return to search.
Janda Pai Kapiraju

Date of Release: 2015-03-22
రేటింగ్: 2.5 /5
తారాగణం: నాని, అమలాపాల్, వెన్నెల కిషోర్, రాగిణి ద్వివేది, శరత్‌కుమార్, శివబాలాజి, చంద్రమోహన్, తనికెళ్ల భరణి తదితరులు
ఛాయాగ్రహణం: సుకుమార్, జీవన్
సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్
మాటలు: శశాంక్ వెన్నెల కంటి
నిర్మాత: శ్రీనివాసన్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సముద్రఖని
చాన్నాళ్లుగా మరుగున పడి ఉన్న నాని సినిమా 'జెండాపై కపిరాజు' అనుకోకుండా అతడి కొత్త సినిమా 'ఎవడే సుబ్రమణ్యం'తో పాటే ఉగాది రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. సాధారణంగా ఇలా ఆలస్యంగా విడుదలయ్యే సినిమాల మీద జనాలకు ఆసక్తి తగ్గిపోతుంది కానీ.. నాని మీద నమ్మకంతో జనాలు బాగానే ఆసక్తి చూపించారు. మరి వారి ఆసక్తిని నిలిపేలా ఈ సినిమా ఉందో లేదో చూద్దాం పదండి.
కథ:
చిన్నప్పటి నుంచి గురుకులంలో చదువుకున్న అరవింద్ (నాని) నిజాయితీ మారుపేరుగా పెరుగుతాడు. 'అపరిచితుడు'లో రామం లాగా నిజాయితీగా ఉండే అతను సమాజంలో ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది చివరికి అరవింద్ నిజాయితీ వల్ల అతడి ప్రాణమే పోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటి స్థితిలో తన మిత్రులతో కలిసి అవినీతికి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెడతాడు నాని. అవినీతి పరుల జాబితా తీసి వారిపై న్యాయ పోరాటానికి దిగిన అరవింద్‌కు.. అతడి పోలికలతో ఉండే మాయా కన్నన్ నుంచి పెద్ద సమస్య ఎదురవుతుంది. ఇలాంటి స్థితిలో అతనేం చేశాడు? తన పోరాటంలో అతను గెలిచాడా లేదా అన్నది మిగతా కథ.
కథనం:
అవినీతిపై పోరాటం నేపథ్యంలో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. 'జెండాపై కపిరాజు'కు కొన్ని సినిమాలతో పోలికలున్నప్పటికీ తమిళ దర్శకుడు సముద్రఖని సమస్యను కొంచెం భిన్నంగా డీల్ చేసే ప్రయత్నం చేశాడు. సినిమాకు ప్రధానమైన హైలైట్ కాన్సెప్టే. ఐతే కాన్సెప్ట్ మీద, నాని మీద ఎక్కువ డిపెండ్ అయిన సముద్రఖని సినిమాను అనుకున్నంత ఆసక్తికరంగా తీర్చిదిద్దలేకపోయాడు. కొన్ని ఎపిసోడ్ల్లో చాలా బాగా అనిపించే 'జెండాపై కపిరాజు' కొన్ని చోట్ల చాలా బోర్ కొట్టించేసి చివరికి ఏవరేజ్ ప్రయత్నంలా మిగిలిపోయింది.
సమస్యలోకి వెళ్లడానికి దర్శకుడు ఎక్కువ సమయం తీసుకోవడమే పెద్ద సమస్య. నిజాయితీ పరుడైన హీరో సొసైటీలో ఇమడలేక ఇబ్బంది పడే సన్నివేశాలు చాలా రొటీన్‌గా ఉన్నాయి. ఇవన్నీ చాలా సినిమాల్లో చూసినవే కాబట్టి.. వీటి మీద అంత ఫోకస్ పెట్టాల్సింది కాదు. ఒకట్రెండు బలమైన సన్నివేశాలతో తేల్చేయాల్సింది. పావుగంటలో చెప్పాల్సిన విషయం కోసం ముప్పావుగంట తీసుకున్నాడు సముద్రఖని. దీనికి తోడు హీరో హీరోయిన్ల ప్రేమకథ కూడా పంటికింద రాయిలా ఇబ్బంది పెడుతుంది.
ఇంటర్వెల్‌కు ముందు వచ్చే 20 నిమిషాల ఎపిసోడ్ సినిమాకు ఒక్కసారిగా ఊపు తెచ్చి.. ద్వితీయార్ధంపై ప్రేక్షకులకు ఆసక్తి రేపుతుంది. సెకండాఫ్‌లో మాయా కన్నన్ పాత్ర ప్రవేశంతో మరింత ఊపు వస్తుంది. కానీ ఆ పాత్ర ప్రవేశించాక రసవత్తరంగా సాగాల్సిన కథనం.. పడిలేస్తూ సాగుతుంది. ఓవైపు నాని తన పెర్ఫామెన్స్‌తో సినిమాను నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నా.. ఆసక్తి లేని కథనంతో దర్శకుడు నిరాశ పరిచాడు.
నిజానికి నెగెటివ్ ఛాయలున్న మాయాకన్నన్ పాత్రతో రెండో నాని రంగ ప్రవేశం చేశాక కథనాన్ని రసవత్తరంగా నడిపించడానికి అవకాశం ఉన్నా.. దర్శకుడు ఉపయోగించుకోలేకపోయాడు. నాని లాంటి నటుణ్ని సరిగా వాడుకోలేకపోవడం దర్శకుడి వైఫల్యం. సమస్యను సాల్వ్ చేయడానికి హీరో ఇబ్బంది పడ్డట్లే కథను క్లైమాక్స్‌కు తీసుకెళ్లడానికి దర్శకుడు కూడా అంతే ఇబ్బంది పడ్డాడు. సాదాసీదా సన్నివేశాలతో ద్వితీయార్ధాన్ని నడిపించాడు.
అవినీతి మీద ఠాగూర్, అపరిచితుడు లాంటి పక్కా కమర్షియల్ సినిమాల్లో రంజ్ హీరోయిజాన్ని చూసిన జనాలకు ఇది అంత ఆనదు. క్లైమాక్స్ కూడా ఆశించినంత స్థాయిలో కిక్కు ఇవ్వదు. కోర్టు సీన్ కావాల్సినంత హైలైట్ కాలేదు. సినిమా సడెన్‌గా ముగిసిపోయినట్లు అనిపిస్తుంది. మాయా కన్నన్ పాత్రలో మార్పు ఎందుకు వచ్చిందో చెప్పలేదు దర్శకుడు. ఓవరాల్‌గా చెప్పాలంటే 'జెండాపై కపిరాజు' కాన్సెప్ట్ పరంగా ఆకట్టుకున్నా.. ఆసక్తికరమైన కథనం లేక సాదాసీదాగా ముగిసింది.
నటీనటులు:
నాని సినిమాల ఫలితాల్లో తేడా రావచ్చు కానీ.. నటుడిగా అతనెప్పుడూ ఫెయిలవడు. 'జెండాపై కపిరాజు'తో నటుడిగా అతను మరో మెట్టు ఎదిగాడనే చెప్పాలి. తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన నాని.. ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని పంచాడు. రెండు క్యారెక్టర్లలోనూ వైవిధ్యం చూపించాడు. నిజాయితీకి మారుపేరుగా ఉంటూ సమాజం గురించి ఆందోళన చెందే అరవింద్ పాత్రను ఎంత బాగా చేశాడో.. నెగెటివ్ ఛాయలున్న మాయా కన్నన్ పాత్రనూ అంతే బాగా పోషించాడు. నానిని ఇలాంటి క్యారెక్టర్లో చూడటం ప్రేక్షకులకు కొత్తే. అమలాపాల్ తన పాత్ర పరిధిలో బాగా చేసింది. కీలకమైన పాత్రలో శరత్ కుమార్ కూడా ఆకట్టుకున్నాడు. వెన్నెల కిషోర్ కెరీర్లో గుర్తుండిపోయే పాత్ర చేశాడు. ప్రథమార్ధంలో పంచ్‌లతో అతను ఎంటర్టైన్ చేశాడు. కొన్ని చోట్ల అతడి పంచ్‌లకు విజిల్స్ పడతాయి. శివబాలాజి కూడా ఆకట్టుకుంటాడు. మిగతా వాళ్లంతా మామూలే.
సాంకేతిక వర్గం:
జి.వి.ప్రకాష్ కుమార్ బ్యాగ్రౌండ్ స్కోర్‌తో సినిమా కోసం చేయాల్సిందంతా చేశాడు. అతడి ఆర్ఆర్ జనాల్ని సినిమాలో ఇన్వాల్వ్ చేయడానికి ఉపయోగపడింది. ఉన్నవి రెండు మూడుపాటలైనా.. అవి పెద్దగా ఆకట్టుకోవు. సుకుమార్, జీవన్‌ల ఛాయాగ్రహణం బాగుంది. తమిళ వెర్షన్‌తో పోలిస్తే తెలుగు వెర్షన్‌ని అరగంటకు పైగా ఎడిట్ చేశామని నాని చెప్పాడు కానీ.. ఇంకా కూడా ఓ 20 నిమిషాలు కోత వేయాల్సిందని సినిమా చూశాక అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. శశాంక్ వెన్నెల కంటి రాసిన మాటల్లో చాలావరకు తమిళ వెర్షన్ నుంచి తీసుకున్నవే అయినా బాగున్నాయి, ఆలోచింపజేసేలా ఉన్నాయి. సముద్రఖని కాన్సెప్ట్ విషయంలో కొన్ని సన్నివేశాల్లో తనదైన ముద్ర వేశాడు. కానీ ఆద్యంతం ఆసక్తి రేపేలా స్క్రీన్‌ప్లే రాసుకోవడంలో విఫలమయ్యాడు. దర్శకుడిగా అతడికి ఏవరేజ్ మార్కులు పడతాయి..
చివరిగా...
మంచి కాన్సెప్ట్ కోసం, నాని నటన కోసం 'జెండాపై కపిరాజు'పై ఓ లుక్కేయొచ్చు. అంతకుమించి ఎక్కువ మాత్రం ఆశించొద్దు..