Begin typing your search above and press return to search.
జేమ్స్ బాండ్

Date of Release: 2015-07-24
రేటింగ్: 2.5/5
నటీనటులు: అల్లరి నరేష్ - సాక్షి చౌదరి - పోసాని కృష్ణమురళి - చంద్రమోహన్ - ప్రవీణ్ - ఆశిష్ విద్యార్థి - జయప్రకాష్ రెడ్డి - రఘుబాబు - సప్తగిరి - పృథ్వీ - ఆలీ - హేమ తదితరులు
సంగీతం: సాయికార్తీక్
కథ: ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్
మాటలు: శ్రీధర్ సీపాన
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సాయికిశోర్ మచ్చ
అల్లరి నరేష్ చివరగా ఎప్పుడు హిట్టు కొట్టాడో జనాలకు గుర్తులేదు. తన స్టయిల్లో చేసిన సినిమాలన్నీ దెబ్బ కొట్టేస్తుండటంతో ఇంద్రగంటి మోహనకృష్ణను నమ్మకుని కొత్తగా ఏదో ట్రై చేస్తే.. బందిపోటు దారుణమైన ఫలితాన్నిచ్చింది. దీంతో మళ్లీ తన దారిలోనే ‘జేమ్స్ బాండ్’ చేశాడు. అల్లరి ఈజ్ బ్యాక్ అని పోస్టర్ల మీద కాన్ఫిడెంటుగా వేసుకున్నాడు. మరి కొత్త దర్శకుడు సాయికిశోర్ రూపొందించిన ‘జేమ్స్ బాండ్’ నిజంగానే అల్లరి ఈజ్ బ్యాక్ అనిపించిందా? చూద్దాం పదండి.
కథ:
బుల్లెట్ అని పిలవబడే పూజ (సాక్షి చౌదరి) దుబాయ్ లో పెద్ద మాఫియా డాన్. ఐతే తన తల్లి కోసం హైదరాబాద్ కు వచ్చేసిన పూజ.. ఆమె దగ్గర మామూలు అమ్మాయిలా నటిస్తుంటుంది. తాను పెళ్లి చేసుకోవాలన్న తల్లి కోరికను నెరవేర్చడానికి ఓ అమాయకుడి కోసం చూస్తుంటుంది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేసే నాని (అల్లరి నరేష్) పూజను అనుకోకుండా గుడిలో చూసి ప్రేమలో పడిపోతాడు. పూజ గురించి తెలియకుండా ఆమెను పెళ్లి చేసుకుంటాడు. నానికి తనెవరో తెలియకుండా పూజ కొంత కాలం మేనేజ్ చేస్తుంది కానీ.. ఓ సమయంలో ఆమె సంగతి నాని పసిగట్టేస్తాడు. ఇక అప్పట్నుంచి పూజ నుంచి తప్పించుకోవడానికి నాని నానా పాట్లు పడతాడు. అదే సమయంలో పూజ కోసం ఆమె శత్రువు బడా దుబాయ్ నుంచి వస్తాడు. మరి నాని పూజ నుంచి తప్పించుకున్నాడా? బడా పూజను ఏం చేశాడు? చివరికేమైందన్నది తెరమీదే చూడాలి.
కథనం - విశ్లేషణ:
సుడిగాడు సినిమా తర్వాత మళ్లీ హిట్టు కొట్టడానికి అల్లరి నరేష్ రకరకాల ప్రయత్నాలు చేశాడు. ఐతే ఆ సినిమాల ఫలితాలతో అతను ఫుల్ కన్ఫ్యూజన్లో పడిపోయినట్లున్నాడు. బందిపోటు లాంటి కొత్త ప్రయత్నాలతో తల బొప్పి కట్టించుకోవడం కంటే తన స్టయిల్లో ఓ మినిమం గ్యారెంటీ సినిమా అయినా చాలనుకున్నట్లున్నాడు. ఆ సంగతి అర్థం చేసుకుని ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ టీమ్.. అల్లరోడి పాత సినిమాల్నే అటు తిప్పి ఇటు తిప్పి ఓ కథ తయారు చేసింది. కొత్త దర్శకుడు సాయికిశోర్ మచ్చ కూడా ఎక్కువ కష్టపడకుండా అలవాటైన కామెడీనే వడ్డించడానికి ప్రయత్నం చేశాడు. తెలుగు ప్రేక్షకులు దయార్ద్ర హృదయులు. రొటీన్ అయినా.. కొత్తదనం లేకున్నా.. చూపించిందే చూపించినా.. కొంచెం థ్రిల్ చేస్తే.. మరికొంచెం నవ్విస్తే మన్నించేస్తారు. కానీ ‘జేమ్స్ బాండ్’ టీమ్ ఎంత కష్టపడ్డా అనుకున్నంత స్థాయిలో నవ్వులు పండలేదు.
జేమ్స్ బాండ్ అనే టైటిల్ కింద నేను కాదు నా పెళ్లాం అని చూడగానే సినిమా మీద ప్రేక్షకుడికి ఓ అంచనా వచ్చేసింది. భార్య వీరలెవెల్లో రెచ్చిపోతుంటే.. బిక్కచచ్చిపోయే భర్తగా నరేష్ కనిపిస్తాడని.. ఈ క్రమంలో కామెడీ పండించే ప్రయత్నం చేస్తారని అర్థమైపోయింది. ఐతే ఎప్పుడో కితకితలు సినిమాలోనే ఇలాంటి వినోదం చూసేసి.. ఓ అంచనాతో థియేటర్ కు వచ్చే ప్రేక్షకుడికి ఇంకేదైనా థ్రిల్ ఇవ్వడానికి ప్రయత్నించాలి. ఎక్కడో ఓచోట సర్ ప్రైజ్ చేయాలి. అలాంటి ప్రయత్నమేదీ ‘జేమ్స్ బాండ్’లో జరగలేదు.
మాఫియా డాన్ అయిన హీరోయిన్ కు హీరో బకరాలా దొరకబోతున్నాడని.. ఆ తర్వాత ఆమె సంగతి తెలిసి హీరో బెంబేలెత్తిపోతాడని.. చివరికి హీరో అమాయకత్వం నచ్చేసి హీరోయిన్ మారిపోయి అతడి ఒళ్లో వాలిపోతుందని థియేటర్లో ఉన్న ప్రతి ప్రేక్షకుడూ గ్రహించేస్తాడు. ప్రేక్షకుడి అంచనాకు పొల్లుబోకుండా సినిమా సినిమా తీయడంలో దర్శకుడు ఏమాత్రం నిరాశ పరచలేదు. అన్ని రసాల్లోకి హాస్య రసం పండించడం చాలా కష్టమని అంటుంటారు.. ఈ విషయం సాయికిశోర్ పడ్డ ప్రయాస చూస్తే బాగానే అర్థమవుతుంది. ప్రేక్షకుల్ని నవ్వించడానికి అతను చాలా క్యారెక్టర్లను ఉపయోగించుకున్నాడు. కానీ పోసాని కృష్ణమురళి క్యారెక్టర్ని మినహాయిస్తే ఏ పాత్రతోనూ నవ్వించలేకపోయాడు. పోసాని పాత్ర వల్లే ప్రథమార్ధం కొంచెం వేగంగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది.
హీరోయిన్ క్యారెక్టర్ కు భారీ బిల్డప్ ఇచ్చిన దర్శకుడు.. ఆమెను డాన్ పాత్రలో ఎలివేట్ చేయడానికి ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. ముందు ప్రేక్షకుడు ఆ క్యారెక్టర్ చూసి భయపడి.. అయ్యో పాపం హీరో అని ఫీలవ్వాలి. కానీ అలాంటి ఫీలింగేమీ కలగదు. పెద్ద బంగ్లాలో ఉండటం.. ఊరికే చుట్టూ రౌడీల్ని వేసుకుని తిరగడం.. డీల్ ఓకే అనడం.. మినహాయిస్తే హీరోయిన్ డాన్ ఫీలింగ్ కలిగించదు. హీరోకు హీరోయిన్ సంగతి ఎప్పుడు తెలుస్తుందా అని ప్రథమార్ధమంతా ఎదురు చూస్తే.. హీరోకు తన సంగతి తెలుసన్న విషయం హీరోయిన్ కు ఎప్పుడు తెలుస్తుందా అని ద్వితీయార్ధమంతా ఎదురు చూస్తాడు ప్రేక్షకుడు.
హీరో హీరోయిన్ల మధ్య వచ్చిన సన్నివేశాలు తేలిపోగా.. పృథ్వీ లాంటి సైడ్ క్యారెక్టర్లు కనిపించినపుడే కొంచెం ఉత్సాహం కలుగుతుంది. చాలా డ్రమటిగ్గా అనిపించే డైనింగ్ టేబుల్ సీన్ ను పది నిమిషాలకు పైగా పొడిగించడం చూస్తే డైరెక్టర్ సమయం గడపడానికి పడుతున్న ప్రయాస ఏంటో అర్థమవుతుంది. క్లైమాక్స్ కు ముందు వచ్చే బురఖాల ఎపిసోడ్ కూడా ఇలాంటిదే. ఈ ఎపిసోడ్ తో ఇంకో పావుగంట లాగించాడు. ఇలా అతి కష్టం మీద కథను క్లైమాక్స్ కు తీసుకెళ్లాడు. హీరోయిన్ని ప్రెగ్నెంట్ ని చేసి చివర్లో ఎమోషనల్ టచ్ ఇవ్వడానికి ట్రై చేశాడు. ఇక క్లైమాక్స్ ఎంత రొటీనో చెప్పాల్సిన పని లేదు. కొత్తదనం లేని కథాకథనాలు, సోసోగా అనిపించే కామెడీ మూలంగా నిడివి 2 గంటల 20 నిమిషాలే అయినా మూడు గంటలు థియేటర్లో కూర్చున్న ఫీలింగ్ కలిగిస్తుంది ‘జేమ్స్ బాండ్’.
నటీనటులు:
అల్లరి నరేష్ ఇలాంటి పాత్రలు తక్కువలో తక్కువ పాతికైనా చేసుంటాడేమో. నటన పరంగా బాగా చేయలేదు అనడానికేమీ లేదు కానీ.. అతడి పాత్రలో కానీ, నటనలో కానీ రవ్వంత కూడా కొత్తదనం లేకపోవడం నిరాశ పరుస్తుంది. భార్య వీరత్వం చూసి బెంబేలెత్తిపోయి.. లోలోన గొనుక్కునే పాత్రను ఎప్పుడో పదేళ్ల కిందటే ‘కితకితలు’లో వేసేశాడు నరేష్. ఇప్పుడిక కొత్తగా చేసిందేమీ లేదు. లేడీ డాన్ పాత్రలో సాక్షి చౌదరి ఇంప్రెస్ చేయలేకపోయింది. మగాడిలా నడుస్తూ, యాక్షన్ సన్నివేశాల్లో ఈజ్ చూపిస్తూ బాడీ లాంగ్వేజ్ వరకు మార్కులు తెచ్చుకుంది కానీ.. నటన విషయంలో మాత్రం ఆమె తేలిపోయింది. ఎక్స్ ప్రెషన్స్ విషయంలో ఆకట్టుకోలేదు. ఐతే అందాల ఆరబోతతో మాత్రం ఫుల్ మార్కులు కొట్టేసింది. కామెడీ కోసం చాలామందిని పెట్టుకున్నారు కానీ.. ఒక్క పోసాని కృష్ణమురళి మాత్రమే నవ్వించాడు. సీరియల్ పిచ్చోడిగా అతడి పాత్ర బాగానే పేలింది. ఐతే ఆ పాత్రను మరీ ఎక్కువ వాడుకోవడానికి వీల్లేకపోయింది. విలన్ గా ఆశిష్ విద్యార్థి ఏ ప్రత్యేకతా చూపించలేకపోయాడు. పృథ్వీ పేరడీ కామెడీ పేలలేదు. సప్తగిరి ఏదో హడావుడి చేయాలని చూశాడు కానీ ఫలితం లేకపోయింది. జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు, ప్రవీణ్, ఆలీ.. వీళ్లంతా మామూలే.
సాంకేతిక వర్గం:
మ్యూజిక్ డైరెక్టర్ సాయికార్తీక్ టాలెంటెడే కానీ.. సబ్జెక్ట్ ను బట్టే తన టాలెంట్ చూపిస్తుంటాడతను. ‘జేమ్స్ బాండ్’ అతడికి ఎలాంటి ఎగ్జైట్మెంట్ ఇచ్చినట్లు లేదు. పైగా అల్లరి నరేష్ సినిమాలంటేనే సంగీతానికి ప్రాధాన్యం ఉండదని ఫిక్సయిపోయినట్లున్నాడు.. చాలా మొక్కుబడి ఔట్ పుట్ ఇచ్చాడు. పాటల్లో గుర్తుంచుకోదగ్గది ఏదీ లేదు. నేపథ్య సంగీతం విషయంలో ఎంత మొక్కుబడిగా పని చేశాడంటే.. చాలా చోట్ల ఇప్పటికే వాడేసిన సౌండ్స్ వినిపించాడు. దాము నర్రావుల ఛాయాగ్రహణం పర్వాలేదు. శ్రీధర్ సీపాన డైలాగుల్లో ప్రాస కోసం ప్రయాస ఎక్కువైంది. అల్లరి నరేష్ సినిమా అంటే డైలాగులు ఇలాగే ఉండాలన్న ఓ మూసలో రాసినట్లుంది. ‘‘సముద్రం చూస్తే అలలు.. అమ్మాయిని చూస్తే కలలు రావడం కామనే’’.. ఈ టైపు డైలాగులతో సినిమా అంతా నింపేశాడు. కొన్ని చోట్ల అవసరం లేకున్నా పంచ్ డైలాగులు, ప్రాసలు బాగా ఎక్కువైపోయాయి. ఐతే పోసాని పాత్రకు రాసిన సీరియల్ ఎఫెక్ట్ డైలాగ్స్ మాత్రం బాగున్నాయి. నిర్మాణ విలువలు ఓకే. సాయికిశోర్ మచ్చ తొలి సినిమాతో దర్శకుడిగా తన ముద్ర వేయలేకపోయాడు. అల్లరి నరేష్ సినిమాల్నే చూసి.. ఒక టెంప్లేట్ ప్రకారం స్క్రిప్టు తయారు చేసుకున్నాడు. ప్రతి సన్నివేశంలోనూ ఇమిటేషన్ కనిపించింది తప్పితే.. కొత్తగా ఏదైనా ట్రై చేసి ఇంప్రెస్ చేద్దామన్న ప్రయత్నం ఏదీ చేయలేదతను.
చివరగా:
అల్లరి నరేష్ గత సినిమాలతో పోలిస్తే కొంచెం బెటర్ అనిపించొచ్చు కానీ.. పోస్టర్లలో వేసుకున్నట్లు జేమ్స్ బాండ్ ‘అల్లరి ఈజ్ బ్యాక్’ అనిపించే సినిమా మాత్రం కాదు.