Begin typing your search above and press return to search.
I Manoharudu

Date of Release: 2015-01-14
రేటింగ్: 2.5 /5
తారాగణం: విక్రమ్, అమీ జాక్సన్, సంతానం, ఉపేన్ పటేల్, సురేష్ గోపి, రామ్‌కుమార్ తదితరులు
ఛాయాగ్రహణం: పి.సి.శ్రీరామ్
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
మాటలు: శ్రీరామకృష్ణ
నిర్మాత: ఆస్కార్ రవిచంద్రన్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శంకర్
ఓ దక్షిణాది సినిమా కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురు చూడటం చాలా అరుదు. ఆ స్థాయిలో ఆసక్తి రేపింది.. ఐ. తన ప్రతి సినిమాకో మరో మెట్టు ఎక్కే శంకర్ నాలుగేళ్ల కిందట 'రోబో'తో ఎలాంటి సంచలనాలకు తెరతీశాడో తెలిసిందే. ఇప్పుడు 'రోబో'ను తలదన్నే సినిమానే తీసి ఉంటాడని.. 'ఐ' తొలి టీజర్ రిలీజైన నాటి నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తోంది భారతీయ చలనచిత్ర పరిశ్రమ. కొన్నేళ్ల ఎదురు చూపులకు.. కొన్ని నెలల ఉత్కంఠకు తెరదించుతూ ఎట్టకేలకు 'ఐ' ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. మరి ఆకాశాన్నంటే అంచనాల్ని ఈ సినిమా అందుకుందా? ప్రేక్షకుల ఆకాంక్షలకు తగ్గట్లే శంకర్ తెరమీద అద్భుతాలు ఆవిష్కరించాడా? చూద్దాం పదండి.
కథ:
లింగేశ్వర (విక్రమ్) మిస్టర్ ఇండియా కావాలని కోరుకునే ఓ లోకల్ బాడీ బిల్డర్. అందులో భాగంగా ముందు మిస్టర్ ఆంధ్రా పోటీలకు వెళ్లి గెలుస్తాడు. లింగేశ్వరకు మోడల్ దియా (అమీ జాక్సన్) అంటే ప్రాణం. ఆమెను ఓ షూటింగ్లో కలిసి పరిచయం పెంచుకుంటాడు. దియా అంటే పడి చచ్చే జాన్ (ఉపేన్ పటేల్) అనే మోడల్ ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలని ప్రయత్నించి ఫెయిలవుతాడు. దీంతో ఆమెకు మోడల్‌గా అవకాశాలు రాకుండా చేస్తాడు. ఐతే జాన్‌కు చెక్ పెట్టేందుకు లింగేశ్వర తో కలిసి ఓ యాడ్ షూట్ చేస్తుంది దియా. అదే సమయంలో లింగేశ్వర, దియా ప్రేమలో పడతారు. ఐతే దియాను దక్కించుకోలేకపోయిన జాన్, లింగేశ్వర అంటే నచ్చని ఇంకో నలుగురు కలిసి అతణ్ని ఎలా దెబ్బ తీశారు? వాళ్ల కుట్ర వల్ల లింగేశ్వరకు ఏమైంది? తిరిగి లింగేశ్వర వారిపై ఎలా పగ తీర్చుకున్నాడు అన్నది మిగతా కథ.
కథనం:
తన సినిమాకు సంబంధించి ముఖ్యమైన విశేషాల్ని విడుదలకు ముందు బయటికి పొక్కనీయకుండా చూసుకోవడం శంకర్‌కు అలవాటు. ఓపెన్ మైండ్‌తో థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేసి.. మెస్మరైజ్ చేస్తుంటాడీ దర్శకుడు. కానీ 'ఐ' విషయంలో మాత్రం దీనికి భిన్నంగా జరిగింది. భారతీయ వెండితెర మీద ఓ అద్భుతం ఆవిష్కృతం కాబోతోందని ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకునేలా 'ఐ' విశేషాల్ని ముందే బయటపెట్టేసి.. విపరీతమైన హైప్ తీసుకొచ్చాడు శంకర్. అప్పుడే జనాలు అంచనా వేయాల్సింది.. వ్యవహారం ఏదో తేడాగా ఉందని.
అందరూ ఆశించినట్లు 'ఐ' అద్భుతమేమీ కాదు. ఓ మామూలు సినిమా. లవ్ నేపథ్యంలో సాగే ఒక రొటీన్ రివెంజ్ డ్రామా. తన జీవితాన్ని నాశనం చేసిన విలన్స్‌పై హీరో పగ తీర్చుకోవడం కొన్ని వందల సినిమాల్లో చూశాం. ఐతే విలన్స్ హీరోకు చేసిన 'నష్టం' మాత్రమే ఇక్కడ భిన్నమైన పాయింట్. 'ఐ' అనే ప్రమాదకర వైరస్ హీరో ఒంట్లోకి వెళ్లడం.. దాంతో అతను కురూపిగా మారడం.. హీరో కూడా విలన్లను అదే ప్టయిల్లో దెబ్బతీయడం.. సినిమాలో చెప్పుకోదగ్గ విశేషం ఇదే. కేవలం మేకప్ మీద ఆధార పడకుండా విక్రమ్ పాత్రలకు తగ్గట్లు తన శరీరాకృతి మార్చుకోవడం.. ఆయా పాత్రలకు తగ్గ బాడీ లాంగ్వేజ్‌తో నటనతో వైవిధ్యం చూపించడం.. మెప్పించడం.. ఇదే 'ఐ'లోని హైలైట్.
తనపై ఎంతగా అంచనాలు పెట్టుకుని వచ్చినా.. ఆ అంచనాల్ని మించిపోయేలా తెరమీద అద్భుతాలు చూపిస్తుంటాడు శంకర్. కానీ ఈసారి అంచనాలు తలకిందులు చేసేశాడు శంకర్. విక్రమ్ పెర్ఫామెన్స్, అతడి కష్టం.. మేకప్ టీమ్ చేసిన అద్భుతాలు.. టెక్నికల్ టీమ్ బ్రిలియన్స్.. ఈ అదనపు ఆకర్షణలన్నీ సరే.. కానీ శంకర్ సినిమాల్లో ప్రధాన ఆకర్షణలుగా నిలిచే కథాకథనాల విషయంలో మాత్రం ఈసారి తేడా వచ్చేసింది. బహుశా ఈ విషయంలో శంకర్ వీకెస్ట్ మూవీ 'ఐ' అని చెప్పడానికి సందేహించాల్సిన పని లేదు.
సింపుల్‌గా చెప్పాలంటే 'ఐ'లో శంకర్ మార్కు 'మ్యాజిక్' మిస్సయింది. అపరిచితుడు, శంకర్ సినిమాల్లో ఎప్పుడూ ఉండే ఓ బలమైన పాయింట్ అంటూ ఏమీ లేకపోవడం 'ఐ'లోని పెద్ద వీక్ పాయింట్. శంకర్ ప్రేక్షకుల్ని ఎప్పట్లా సర్ప్రైజ్ చేయలేదు, మెస్మరైజ్ చేయలేదు. సాగతీత అనే పదం శంకర్‌కు నచ్చదు. తన సినిమాల్లో సన్నివేశాలు చాలా షార్ప్‌గా ఉంటాయి. కానీ 'ఐ' మాత్రం 'ఐ'లో ఆ షార్ప్‌నెస్ కనిపించలేదు. సినిమా ఎంతగా సా....గదీశాడంటే.. హీరో కురూపిగా మారిపోవడానికి కారణమేంటో 2 గంటలకు పైగా సినిమా చూసిన తర్వాత కానీ తెలియదు.
శంకర్ ఇంతకుముందు కూడా ఎక్కువ నిడివితో సినిమాలు తీశాడు. కానీ అందుకు జస్టిఫికేషన్ కూడా ఉంటుంది. కానీ 'ఐ'ని ఎందుకు మూడు గంటల్లో తీశాడన్నదే అర్థ: కాని విషయం. సినిమాలో గే క్యారెక్టర్ చుట్టూ అల్లుకున్న అరగంట సన్నివేశాలు పెద్ద మైనస్. అసలా క్యారెక్టరే లేపేస్తే.. ప్రేక్షకులకు చాలా బాధ తప్పేది. హీరో హీరోయిన్ల ప్రేమకథ కూడా సాగతీతే. విక్రమ్ నటన, అమీ జాక్సన్ స్క్రీన్ ప్రెజెన్స్.. అద్భుతమైన సినిమాటోగ్రఫీ వల్ల చైనాలో సాగే ముప్పావుగంట కథనం ఏదో అలా సాగిపోయింది కానీ.. లేకుంటే చాలా కష్టమయ్యేది.
గంటన్నరకు పైగా సాగే ప్రథమార్ధం అయ్యేసరికి ఓ సినిమా చూసిన అనుభూతి కలిగించాడు శంకర్. ఐతే శంకర్ మీద ఉన్న అంచనాలు, గౌరవం వల్ల ప్రథమార్ధంపై పెదవి విరుస్తూనే.. ఆశగా ద్వితీయార్ధంలోకి అడుగుపెడతాం. ఐతే హీరోకు ఏం జరిగి ఉండొచ్చని.. మందబుద్ధిగల ప్రేక్షకులు సైతం గ్రహించేంతగా సాగదీసి.. ఆ తర్వాత అసలు సీక్రెట్ రివీల్ చేశాడు శంకర్. డాక్టరే విలన్ అన్న విషయం గ్రహించడం పెద్ద కష్టమేమీ కాదు. హీరో స్నానం చేస్తూ భుజంపై హోల్ చూసుకున్నపుడే సీన్ మొత్తం అర్థమైపోతుంది. దీంతో సర్ప్రైజ్ అంటూ ఏమీ లేకపోయింది. ఇక ఆపై విలన్లను దెబ్బ తీసే సన్నివేశాలు చాలా రొటీన్. మధ్య మధ్యలో సంతానం క్యారెక్టర్‌తో కామెడీ చేయించబోయి విసిగించాడు శంకర్.
విక్రమ్ ఎంత కష్టమైనా పడి ఉండొచ్చు. మేకప్ టీం ఎంత ఎఫర్ట్ అయినా పెట్టి ఉండొచ్చు. కానీ కురూపి క్యారెక్టర్‌ను, దానికి సంబంధించిన సన్నివేశాలను మన ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది సందేహమే. పైగా ఒక క్యారెక్టర్ చాలదన్నట్లు చివర్లో విలన్ గ్యాంగ్ మొత్తాన్ని 'అగ్లీ'గా మార్చేశాడు శంకర్. మిగతా విషయాల్లో సంతృప్తి పరిచి ఉంటే.. ఇంకేమైనా అద్భుతాలు చూపించి ఉంటే.. ఈ పాత్రల్ని, సన్నివేశాల్ని మామూలుగానే చూసేవాళ్లేమో కానీ.. కథాకథనాల్లోనే నిరాశ పరచడం వల్ల వీటిని జీర్ణించుకోవడం కొంచెం కష్టమే. మృగం క్యారెక్టర్ గురించి ఎన్నో అంచనాలు పెట్టుకుంటాం కానీ.. అసలా క్యారెక్టరే లేదు సినిమాలో. అది కేవలం ఓ పాటకు సంబంధించిన ఊహ మాత్రమే. ఈ విషయంలో శంకర్ ప్రేక్షకుల్ని దారుణంగా దెబ్బ కొట్టాడు. ఈ క్యారెక్టర్ విషయంలోనే కాదు.. మొత్తంగా సినిమా మీదే భారీగా అంచనాలతో వెళ్లిన ప్రేక్షకులు.. శంకర్ తెర మీద తీసింది చూశాక పాతాళంలోకి పడిపోవడం ఖాయం.
సాధారణంగా తన సినిమాలకు శంకరే హీరో. కానీ 'ఐ'లో విక్రమే కథానాయకుడు. అతడే సినిమాకు ప్రధాన ఆకర్షణ. అమీజాక్సన్ అందాలు, ఆమె పెర్ఫామెన్స్ కూడా ఆకట్టుకుంటాయి. రెహామన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, పి.సి.శ్రీరామ్ ఛాయాగ్రహం.. కనువిందైన పాటలు, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్, అద్భుతమైన లొకేషన్లు, నిర్మాణ విలువలు.. ఇలాంటి అదనపు ఆకర్షణల కోసం 'ఐ' చూడొచ్చు. కానీ శంకర్ మీద ఆశలు పెట్టుకుంటే, ఏదో అద్భుతం చేశాడని ఆశిస్తే మాత్రం నిరాశ తప్పదు.
నటీనటులు:
విక్రమ్ గురించి ఏమని చెప్పాలి. బహుశా మన దేశంలో ఏ నటుడు కూడా ఓ సినిమా కోసం ఇంతగా కష్టపడి ఉండడేమో. అతడి కష్టమంతా తెరమీద కళ్లకు కట్టినట్లు కనిపించింది. నిజమైన బాడీ బిల్డర్‌లా కనిపించడానికి ఎంత కష్టపడ్డాడో. కురూపిలా, మృగంలా వేర్వేరు అవతారాల్లో కనిపించేందుకు మేకప్ విషయంలో, ఆహార్యం మార్చుకోవడంలో ఎంతగా ఇబ్బంది పడ్డాడో ఇప్పటికే విన్నాం. అయినప్పటికీ తెరమీద మన అంచనాల్ని మించిపోయేలా కనిపించాడు విక్రమ్. కేవలం తన శరీరాకృతి మార్చుకోవడంలో, మేకప్ వేసుకోవడంలో మాత్రమే కాదు.. నటన పరంగానూ మెప్పించాడు. మొత్తంగా సినిమాను నిలబెట్టడానికి నటుడిగా తనేం చేయగలడో అదంతా చేశాడు విక్రమ్. అతడికి హ్యాట్సాఫ్. అమీజాక్సన్ తన గ్లామర్‌తోనే కాదు.. నటనతోనూ మెప్పించింది. దియా పాత్రకు ఆమె పర్ఫెక్ట్గా సూటైంది. స్వతహాగా మోడల్ కావడంతో ఆ పాత్రను చాలా ఈజ్‌తో చేసింది. అందాల ప్రదర్శన విషయంలో ఏమాత్రం లిమిట్స్ పెట్టుకోకపోవడం వల్ల కూడా ఈ పాత్రకు ఈమే కరెక్ట్ అనిపించింది. ఆమె యాక్టింగ్‌లోనూ ఆకట్టుకోవడం విశేషమే. సురేష్ గోపి నటనలో వైవిధ్యమేమీ లేదు. ఉపేన్ పటేల్ కూడా మామూలుగానే అనిపించాడు. సంతానం ఫస్టాఫ్‌లో మంచి పంచ్‌లతో నవ్వించాడు. సెకండాఫ్‌లో టీవీ రిపోర్టర్ వేషంలో విసిగించాడు..
సాంకేతిక వర్గం:
విక్రమ్ గురించి ఏమని చెప్పాలి. బహుశా మన దేశంలో ఏ నటుడు కూడా ఓ సినిమా కోసం ఇంతగా కష్టపడి ఉండడేమో. అతడి కష్టమంతా తెరమీద కళ్లకు కట్టినట్లు కనిపించింది. నిజమైన బాడీ బిల్డర్‌లా కనిపించడానికి ఎంత కష్టపడ్డాడో. కురూపిలా, మృగంలా వేర్వేరు అవతారాల్లో కనిపించేందుకు మేకప్ విషయంలో, ఆహార్యం మార్చుకోవడంలో ఎంతగా ఇబ్బంది పడ్డాడో ఇప్పటికే విన్నాం. అయినప్పటికీ తెరమీద మన అంచనాల్ని మించిపోయేలా కనిపించాడు విక్రమ్. కేవలం తన శరీరాకృతి మార్చుకోవడంలో, మేకప్ వేసుకోవడంలో మాత్రమే కాదు.. నటన పరంగానూ మెప్పించాడు. మొత్తంగా సినిమాను నిలబెట్టడానికి నటుడిగా తనేం చేయగలడో అదంతా చేశాడు విక్రమ్. అతడికి హ్యాట్సాఫ్. అమీజాక్సన్ తన గ్లామర్‌తోనే కాదు.. నటనతోనూ మెప్పించింది. దియా పాత్రకు ఆమె పర్ఫెక్ట్గా సూటైంది. స్వతహాగా మోడల్ కావడంతో ఆ పాత్రను చాలా ఈజ్‌తో చేసింది. అందాల ప్రదర్శన విషయంలో ఏమాత్రం లిమిట్స్ పెట్టుకోకపోవడం వల్ల కూడా ఈ పాత్రకు ఈమే కరెక్ట్ అనిపించింది. ఆమె యాక్టింగ్‌లోనూ ఆకట్టుకోవడం విశేషమే. సురేష్ గోపి నటనలో వైవిధ్యమేమీ లేదు. ఉపేన్ పటేల్ కూడా మామూలుగానే అనిపించాడు. సంతానం ఫస్టాఫ్‌లో మంచి పంచ్‌లతో నవ్వించాడు. సెకండాఫ్‌లో టీవీ రిపోర్టర్ వేషంలో విసిగించాడు.
చివరిగా...
అసలు కంటే కొసరునే నమ్ముకున్న 'ఐ'ని అంచనాల్లేకుండా ఓపెన్ మైండ్‌తో చూస్తే పర్వాలేదనిపించొచ్చు. కానీ అంచనాలు పెట్టుకుంటే కష్టమే. ఎందుకంటే అందరూ ఆశించినట్లు 'ఐ' అద్భుతమేమీ కాదు.