Begin typing your search above and press return to search.
Gopala Gopala

Date of Release: 2015-01-10
రేటింగ్: 3 /5
తారాగణం: వెంకటేష్, పవన్ కళ్యాణ్, శ్రియ, పోసాని కృష్ణమురళి, మిథున్ చక్రవర్తి, కృష్ణుడు, అశిష్ విద్యార్థి, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు
ఛాయాగ్రహణం: జయనన్ విన్సెంట్
ఎడిటింగ్: గౌతంరాజు
మాటలు: సాయిమాధవ్ బుర్రా
సంగీతం: అనూప్ రూబెన్స్
నిర్మాతలు: దగ్గుబాటి సురేష్, శరత్ మరార్
కథ: ఉమేశ్ శుక్లా, భవేష్ మండాలియా
స్క్రీన్‌ప్లే: కిషోర్ పార్థసాని, భూపతి రాజా, దీపక్ రాజ్
దర్శకత్వం: కిషోర్ పార్థసాని (డాలీ)
గత కొన్నేళ్లుగా పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అంటే ఎంత హంగామా ఉంటోందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఐతే ఆయన గెస్ట్ రోల్ చేసిన 'గోపాల గోపాల' కూడా పవన్ కథానాయకుడి పాత్ర చేసిన స్థాయిలో హైప్ తెచ్చుకుందీ సినిమా. ఆరేళ్ల కిందట బాలీవుడ్లో సంచలనం రేపిన 'ఓ మై గాడ్'కు రీమేక్ ఈ సినిమా. మరి మాతృక లాగే రీమేక్ కూడా మెప్పించేలా ఉందా? గోపాల్రావుగా వెంకటేష్ ఎలా చేశాడు? గోపాలుడికి పవన్ మాయ చేశాడా? చూద్దాం పదండి.
కథ:
గోపాల్‌రావు (వెంకటేష్) ఓ నాస్తికుడు. దేవుడి విగ్రహాలు అమ్మే దుకాణం నడుపుతుంటాడు. మూఢ భక్తి అనే బలహీనత మీద దెబ్బ కొట్టి సంపాదిస్తుంటాడు. అదే సమయంలో ఆపదలో ఉన్నవాడిని ఆదుకుంటాడు. అతడి భార్య మీనాక్షి (శ్రియ) పరమ భక్తురాలు. ఓ సందర్భంలో భూకంపం దెబ్బకు గోపాల్‌రావు దుకాణం కూలిపోతుంది. ఇన్సూరెన్స్ క్లయిమ్ కోసం వెళ్తే.. అది 'యాక్ట్ ఆఫ్ గాడ్' కాబట్టి ఇన్సూరెన్స్ రాదంటారు. దీంతో దేవుడి మీదే కోర్టుకెళ్తాడు గోపాల్‌రావు. దేవుడి దూతలుగా చెప్పుకునే స్వామీజీలందరినీ కోర్టుకు లాగుతాడు. ఆ తర్వాత అతడికి.. స్వామీజీలకు మధ్య కోర్టులో పోరాటం సాగుతుంది. ఈ పోరాటం ఎలా సాగుతుంది. కష్టాల్లో ఉన్న గోపాల్‌రావును స్వయంగా ఆ గోపాలుడే (పవన్ కళ్యాణ్) ఎలా ఆదుకున్నాడు? చివరికి గోపాల్‌రావు ఈ కేసు గెలిచాడా లేదా? పరిహారం రాబట్టాడా లేదా? అన్నది తెరమీదే చూసి తెలుసుకోవాలి.
కథనం:
పవన్ కళ్యాణ్, వెంకటేష్ కలిసి నటించడం.. పవన్ దేవుడి పాత్ర వేయడం.. ఇలాంటి ఆకర్షణలన్నీ పక్కనబెడితే.. ముందుగా 'గోపాల గోపాల' కథాంశంలోని విశేషమేంటో చూద్దాం. ఓ నాస్తికుడు తనకు జరిగిన నష్టానికి బాధ్యుణ్ని చేస్తూ దేవుడి మీదే కోర్టుకెక్కడం.. చివరికి దేవుడే దిగివచ్చి ఆ వ్యక్తికి సాయం చేసి.. సమాజానికి అతడి ద్వారా బుద్ధిచెప్పడం.. ఇలాంటి కథాంశంతో సినిమా తీయడమే కాక.. అందరినీ మెప్పించి గొప్ప చిత్రంగా నిలిచింది 'ఓ మై గాడ్'. దీని తెలుగు రీమేక్ వెర్షన్ 'గోపాల గోపాల' కూడా ప్రేక్షకుల్ని నిరాశ పరచలేదు.
భక్తులందరూ గుడికి పాలు తీసుకెళ్లి దేవుడి మీద పోస్తారు. ఆ పాలంతా వృథాగా కాలువలోకి వెళ్తుంది. కానీ గుడి బయట భిక్షగాడు ఆకలితో అలమటిస్తుంటాడు. ఇదెక్కడి అన్యాయం.. కోర్టులో గోపాల్‌రావు చేసే వాదన ఇది. 'గోపాల గోపాల' మూల కథ ఈ వాదనలోనే దాగుంది. తన చుట్టూ ఉన్న మనుషుల్లోని దేవుణ్ని చూడకుండా.. రాతి బొమ్మల్ని కొలవడమేంటని ప్రశ్నిస్తాడు గోపాల్‌రావు. ఇలాంటి ప్రశ్నలు ఇంకెన్నో... ఆలోచింపజేస్తాయి... సూదుల్లా గుచ్చుకుంటాయి.. నవ్విస్తాయి.. ఏడిపిస్తాయి కూడా.
సమాజంలోని ప్రతి వ్యక్తితోనూ ముడిపడి ఉండే కథాంశమే 'గోపాల గోపాల'లోని ప్రధాన ఆకర్షణ. ఓ సమస్యనే వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నమిది. దేవుడి పట్ల భయం అనే మనిషి బలహీనతను దొంగ స్వాములు ఎలా సొమ్ము చేసుకుంటారన్న దానిపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఐతే ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా కన్విన్సింగ్‌గా సమస్యను చర్చించడం.. పరిష్కారం చూపించడమే 'గోపాల గోపాల' ప్రత్యేకత.
కథతో పాటు కథనమూ ఆసక్తికరంగానే సాగుతుంది. ఐతే 'సమస్య' ప్రధానంగా సాగే సినిమా కావడం వల్ల ఆరంభంలో కథనం నెమ్మదిగా సాగుతుంది. మొదట్లో ఎంటర్టైన్మెంట్ డోస్ కూడా సరిపోక.. ప్రథమార్ధం నెమ్మదిగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. పవన్ ఎంట్రీతో ఒక్కసారిగా ఊపు వస్తుంది. ద్వితీయార్ధంలో పవన్ ఉన్న సన్నివేశాలతో పాటు.. కోర్టులో వెంకీ లాజిక్కులు తీసి వాదించే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ద్వితీయార్ధం నిడివి ఎక్కువగా ఉన్నా.. కొంచెం సాగతీత అయినా.. పవన్ స్క్రీన్ ప్రెజెన్స్, వెంకీ మార్కు వినోదం ప్రేక్షకుల్ని కుదురుగా కూర్చోబెడతాయి. క్లైమాక్స్‌ను మరీ అంత ఎక్కువసేపు నడిపించాల్సింది కాదు. కొంచెం క్రిస్ప్ చేసి ఉండాల్సింది.
'ఓ మై గాడ్'తో పోలిస్తే.. మూల కథను కానీ, అందులో హైలైట్ అనదగ్గ సన్నివేశాలు కానీ ఏమీ మార్చ లేదు. ఐతే పవన్ క్యారెక్టర్‌ను పెంచారు. కొన్ని అదనపు సన్నివేశాలు జోడించారు. అందులో అక్షయ్‌కుమార్ సింపుల్‌గా ఎంట్రీ ఇస్తే.. పవన్ తన ఫ్యాన్స్‌కు ఊపునిచ్చేలా ఎంటర్టైనింగ్గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ క్యారెక్టర్‌కు డైలాగులు కూడా పెంచారు. పాత్ర ఔచిత్యం దెబ్బతినకుండానే.. ఫ్యాన్స్‌ను కూడా మెప్పించేలా ఆ డైలాగులుండటం విశేషం. తెరపై పవన్, వెంకీల కెమిస్ట్రీ బాగా పండింది. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి. భాజే డోలు భాజే పాటలో పవన్, వెంకీల కెమిస్ట్రీ అదుర్స్. దర్శకుడు డాలీ కొత్తగా అద్భుతాలేమీ చేయకున్నా ఉన్నంతలో మాతృకను చెడగొట్టలేదు. మాతృకను తడాఖా తరహాలోనే రీమేక్‌ను చక్కగా డీల్ చేశాడు.
నటీనటులు:
'గోపాల గోపాల'లో కథానాయకుడు వెంకటేష్ కాబట్టి ముందు తన గురించే మాట్లాడదాం. హిందీలో పరేష్ రావల్ 'ఓఎంజీ' చేయడానికి ముందే ఈ కథాంశంతో నడిచిన డ్రామాలో ప్రధాన పాత్రను పోలిన పాత్రలను లెక్కలేనన్నిసార్లు చేశాడు. ఆ అనుభవంతో ఇందులో కూడా ఆ పాత్రను అద్భుతంగా పోషించాడు. అలాంటి పాత్రను చేయడం వెంకీకి సవాలే. ఐతే వెంకీ.. పరేష్ రావల్‌ను అనుకరించడానికి ప్రయత్నించలేదు. తనదైన శైలిలో గోపాల్‌రావు పాత్రకు కొంచెం కామెడీ టచ్ ఇచ్చి.. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు నటించాడు. వెన్నెల కిషోర్‌ను కొట్టే సన్నివేశంలో, కోర్టులో వాదించే సన్నివేశాల్లో వెంకీ వినోదం బాగా పండించాడు. ఓవరాల్‌గా వెంకీ ఆల్‌రౌండ్ నటనతో ఆకట్టుకున్నాడు. ఐతే వెంకీని పరేష్ రావల్‌తో వెంకీని పోల్చి చూడకపోవడం బెటర్. ఇక పవన్ కళ్యాణ్ విషయానికొస్తే.. దేవుడి పాత్ర వెయిట్‌ను హిందీలో కంటే చాలా పెంచేశాడు. పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ఇలా మోడ్రన్ డ్రెస్సుల్లో, స్టెప్పులేసే దేవుడిగా పవన్‌ను చూడటం కొత్త అనుభూతి. వేసింది దేవుడి క్యారెక్టరే అయినా.. ఫ్యాన్స్‌ను ఏమాత్రం నిరాశ పరచకుండా, వారిని ఎంటర్టైన్ చేయడం పవన్‌కే చెల్లింది. మొత్తానికి పవన్ తన పవర్‌తో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. హిందీ దేవుడి క్యారెక్టర్‌కు మరింత వన్నెలద్దిన డాలీ అండ్ టీమ్‌కి, మాటల రచయితకు అభినందనలు తెలపాలి. మిగతా నటుల్లో పోసాని కృష్ణమురళి ఎక్కువ మార్కులు కొట్టేశాడు. దొంగ స్వామీజీ గెటప్‌లో పోసాని తనదైన శైలిలో నవ్వించాడు. వెంకీ భార్య క్యారెక్టర్లో శ్రియ చేసిందేమీ లేదు. ఆమె పాత్రకు అంత ప్రాధాన్యం లేదు. మిథున్ చక్రవర్తి మాతృకలో చేసినట్లే చేశాడు. ఐతే అతడి నటనతో మనవాళ్లు కనెక్టవగలరా అన్నదే సందేహం. మాడా తరహా మిథున్ నటన కొన్ని సన్నివేశాల్లో బాగానే అనిపిస్తుంది కానీ.. కొన్ని సన్నివేశాల్లో ఎబ్బెట్టుగానూ అనిపిస్తుంది. అశిష్ విద్యార్థి, కృష్ణుడు, మురళీ శర్మ పాత్రలకు తగ్గట్లు నటించారు..
సాంకేతిక వర్గం:
అనూప్ రూబెన్స్ సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. భాజే డోలు భాజే పాట సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ఆ ట్యూన్‌ను బ్యాగ్రౌండ్ స్కోర్‌లో కూడా బాగానే వాడాడు. మిగతా రెండు పాటలు పర్వాలేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రథమార్ధంతో పోలిస్తే.. ద్వితీయార్ధంలో ఎఫెక్టివ్‌గా ఉన్నట్లు అనిపిస్తుంది. జయనన్ విన్సెంట్ ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. ఐతే ఆర్ట్ వర్క్ మాత్రం స్టాండర్డ్స్‌కి తగ్గట్లు లేదు. హీరో ఇల్లు కూలిపోయిన దృశ్యాల్ని ఆర్ట్ డైరెక్టర్ సరిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు. నిర్మాణ విలువలు ఓకే. సాయిమాధవ్ బుర్రా మాతృకలోని మాటల్ని వాడుకునే.. తన ప్రతిభ కూడా చూపించాడు. పవన్ వ్యక్తిత్వాన్ని, అతడి అభిమానుల ఆకాంక్షల్ని కూడా దృష్టిలో పెట్టుకుని పవన్ పాత్రకు చక్కటి మాటలు రాశాడు. వెంకీకి రాసిన సంభాషణలు కూడా బాగున్నాయి. ''మోసం చేయడం తప్పే కానీ.. మోసాన్ని నమ్మడం ఇంకా పెద్ద తప్పు''.. ''ఈ మనుషులు రాయిని కూడా దేవుణ్ని చేసేస్తారు.. ఆ దేవుడు ఈ మనుషుల్ని మనుషులుగా చేస్తే బాగుణ్ను''.. ఇలాంటి మంచి మాటలు సినిమాలో చాలానే ఉన్నాయి.
చివరిగా...
సమాజంలోని ప్రతి మనిషీ కనెక్టయ్యే ఓ సమస్యను వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నమే 'గోపాల గోపాల'. సందేశంతో పాటు వినోదమూ ఉన్న ఈ చిత్రం కొన్ని చోట్ల నెమ్మదిగా, ఇంకొన్ని చోట్ల సాగుతున్నట్లు అనిపించినా.. ఓవరాల్‌గా మంచి ప్రయత్నమే అనిపించుకుంటుంది. 'ఓ మై గాడ్' చూసిన వాళ్లకు మామూలుగా అనిపించినా.. నేరుగా చూస్తే బాగానే ఆకట్టుకునే అవకాశాలున్నాయి.