Begin typing your search above and press return to search.
Ganga (Kanchana 2)

Date of Release: 2015-05-01
రేటింగ్: 2.75 /5
తారాగణం: రాఘవ లారెన్స్, తాప్సి, నిత్యామీనన్, కోవై సరళ, జయప్రకాష్, సుహాసిని, శ్రీమాన్, మనోబాల, పూజ రామచంద్రన్ తదితరులు
ఛాయాగ్రహణంకు రాజవేల్
సంగీతం: థమన్, సత్య, లియోన్ జేమ్స్, అశ్వమిత్ర
నిర్మాత: బెల్లంకొండ సురేష్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాఘవ లారెన్స్
హార్రర్ కామెడీలు తీయడంలో తనకంటూ ఓ స్టయిల్ క్రియేట్ చేసుకున్నాడు రాఘవ లారెన్స్. 'ముని'తో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తి.. ఆ తర్వాత దానికి సీక్వెల్‌గా కాంఛన తీసి తెలుగు, తమిళ భాషల్లో పెద్ద హిట్టు కొట్టాడు. ఇప్పుడా సిరీస్‌లో మూడో సినిమాగా వచ్చింది 'గంగ'. తమిళంలో రెండు వారాల ముందే విడుదలైన ఈ సినిమా.. అనేక అడ్డంకుల్ని దాటుకుని శుక్రవారం తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి గంగ ఏమేరకు భయపెట్టింది? ఎంతమాత్రం నవ్వించింది? చూద్దాం పదండి.
కథ:
ఓ ప్రైవేటు టీవీ ఛానెల్లో కెమెరామన్‌గా పని చేస్తుంటాడు రాఘవ. అతడికి దయ్యాలంటే విపరీతమైన భయం. ఐతే తమను పక్కకు నెట్టేసి నెంబర్‌వన్ స్థానానికి చేరిన వేరే ఛానెల్‌ను కొట్టేందుకు ఓ దయ్యం ప్రోగ్రాం ప్లాన్ చేస్తుంది రాఘవ పని చేసే ఛానెల్లో డైరెక్టర్ అయిన నందిని (తాప్సి). ఈ ప్రోగ్రాం కోసం నందిని, రాఘవలతో పాటు యూనిట్ సభ్యులు ఓ పల్లెటూరుకు వెళ్తారు. అక్కడో పాడుబడ్డ బంగ్లాలోకి వెళ్లి ప్రోగ్రాం చేస్తుంటారు. ఐతే అది నిజంగానే దయ్యాల కొంప. ఆ ఇంటి ముందు బీచ్‌లో ఓ తాళిని నందిని బయటకు తీయడంతో ఆమెతో పాటు అందరికీ సమస్యలు మొదలవుతాయి. నందినిని దయ్యం పడుతుంది. ఇంతకీ ఆ తాళి ఎవరిది? నందినిని పట్టుకున్న దయ్యం ఎవరు? ఈ దయ్యం కథేంటి? చివరికి నందినిని పట్టిన దయ్యం బయటకు వెళ్లిందా లేదా? అన్నది మిగతా కథ.
కథనం:
హార్రర్ కామెడీ.. ఇప్పుడిదే సక్సెస్ ఫార్ములా. ఈ ఫార్ములాను నమ్ముకుని తీసిందే తీసినా పర్లేదు.. బాక్సాఫీస్ జర్నీ సాఫీగా సాగిపోతుంది. ఇటు తెలుగులో, అటు తమిళంలో.. రెండు చోట్లా హార్రర్ కామెడీల హవా నడుస్తోందిప్పుడు. ఐతే ఈ జానర్‌ను పాపులర్ చేసిన ఘనత రాఘవ లారెన్స్దే. ముని, కాంఛన సినిమాలు రెండూ జనాల్ని భయపెట్టాయి, బాగా నవ్వించాయి.
ఐతే ఒకే ఫార్మాట్లో రెండు సినిమాలు తీసి మెప్పించడమే కష్టమైతే.. లారెన్స్ మూడోసారి కూడా అదే ప్రయత్నంతో సాహసం చేశాడు. ఐతే ఈ సాహస యాత్రను లారెన్స్ విజయవంతంగానే పూర్తి చేశాడు. గంగ సినిమా నుంచి జనాలు ఏమైతే ఆశిస్తారో అదిచ్చాడు లారెన్స్. బాగా నవ్వించాడు, ఓ మోస్తరుగా భయపెట్టాడు.
హార్రర్ కామెడీల్లో కనిపించే కామన్ పాయింట్.. దయ్యంతో కామెడీ క్యారెక్టర్లను చితకబాదించడం. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు చాలాసార్లు ఈ కామెడీని ఆస్వాదించినా.. మళ్లీ వాళ్లకు మొహం మొత్తని కామెడీ డోస్ ఇచ్చాడు లారెన్స్. మిగతా హార్రర్ కామెడీలకు అతడి సినిమాలకు ఉన్న తేడా ఏంటంటే.. హీరోనే విపరీతమైన భయస్తుడిగా ఉండటం. ముని, కాంఛన స్టైల్లోనే ఉండే హీరో క్యారెక్టరైజేషన్.. దయ్యం క్యారెక్టర్‌తో చేయించే బాదుడు కామెడీనే 'గంగ'లో హైలైట్.
హీరో బాత్రూమ్లో తనకు కాపలాగా సెక్యూరిటీ గార్డ్‌ను పెట్టుకోవడం మొదలు.. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలన్నీ బాగానే నవ్విస్తాయి. వల్గారిటీ లేకుండానే గే కామెడీతో నవ్వించాడు లారెన్స్. ఇక ఇంటర్వెల్‌కు ముందు ఫియర్ ఫ్యాక్టర్ మొదలవుతుంది. ద్వితీయార్ధంలో మళ్లీ కోవై సరళ బాదుడు కామెడీ నవ్విస్తుంది. ఐతే ఒకేసారి ఆరు దెయ్యాల్ని దింపి.. ఓ బీభత్సమైన పాటతో లారెన్స్ చేసిన రచ్చ మాస్ ఆడియన్స్‌ను కొంచెం టూమచ్. అందులో లారెన్స్ అవతారాలు షాకింగ్‌గా, ఆసక్తికరంగా అనిపిస్తాయి కానీ.. డోస్ మరీ ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది.
ఫ్లాష్ బ్యాక్‌లో నిత్యామీనన్ క్యారెక్టర్ చూసి ప్రేక్షకులు షాకవ్వడం ఖాయం. 'కాంఛన'లో హిజ్రాలపై దృష్టిపెట్టి సెంటిమెంటు పండించిన లారెన్స్.. ఈసారి వికలాంగుల మీద ఫోకస్ పెట్టాడు. ఫ్లాష్ బ్యాక్ బాలేదని చెప్పలేం కానీ.. కొంచెం లెంగ్తీగా, డ్రామా ఎక్కువైనట్లు అనిపిస్తుంది, క్లైమాక్స్‌లో గ్రాఫిక్స్ మరీ ఎక్కువైపోయాయి. అదేదో బొమ్మలాటలా ఉంటుంది తప్పితే.. 'కాంఛన'లో లాగా క్లైమాక్స్‌తో జనాలు ఎమోషనల్‌గా కనెక్టవరు. దయ్యం రివెంజ్ను ప్రేక్షకులు ఫీలయ్యేలా చేయడంలో లారెన్స్ ఫెయిలయ్యాడు. ఫస్టాఫ్ ఉన్నంత స్థాయిలో సెకండాఫ్ లేకపోవడం, లెంగ్త్ ఎక్కువవడం, క్లైమాక్స్ సినిమాకు మైనస్. ఓవరాల్‌గా చూస్తే లారెన్స్ నిరాశ పరచలేదు.
నటీనటులు:
లారెన్స్ డైరెక్టర్‌గానే కాక నటుడిగానూ తన స్టయిల్ చూపించాడు. రాఘవ క్యారెక్టర్లో నవ్వించి.. శివ క్యారెక్టర్లో హీరోయిజం చూపించి.. దయ్యం క్యారెక్టర్లలో చెలరేగిపోయాడు. అవతారాలు మార్చే పాటలో లారెన్స్ తన టాలెంట్ అంతా చూపించాడు. చిన్న పాప, ముసలావిడ గెటప్స్‌లో లారెన్స్ అదరగొట్టాడు. క్లైమాక్స్‌లోనూ అతడి అవతారం బాగుంది. ఐతే కొన్ని చోట్ల లారెన్స్ యాక్టింగ్‌లో సహజంగా వచ్చే అతి ఇబ్బంది పెడుతుంది. లారెన్స్ డ్యాన్సుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాప్సి, నిత్యామీనన్లిద్దరికీ మరిచిపోలేని క్యారెక్టర్లు ఇచ్చాడు లారెన్స్. దయ్యం పట్టిన పాత్రలో తాప్సిని చూడటం ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్లో ఆమె మెప్పించింది. నిత్యామీనన్ ఎందుకీ పాత్ర ఒప్పుకుందో తెరమీద చూస్తేనే తెలుస్తుంది. ఆమె కెరీర్లో మరో గుర్తుండిపోయే పాత్ర ఇది. విలన్ జయప్రకాష్తో పాటు కామెడీ రోల్స్‌లో కోవై సరళ, శ్రీమాన్, మనోబాల తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక వర్గం:
సంగీతం, ఛాయాగ్రహణం మాస్ ఆడియన్స్‌ను మెప్పించేలా లారెన్స్ టేస్టుకు తగ్గట్లు ఉన్నాయి. కెమెరా యాంగిల్స్ కొన్ని చోట్ల మరీ టూమచ్‌గా, నేపథ్య సంగీతం చాలా చోట్ల లౌడ్‌గా అనిపిస్తుంది. రెప్పకేల ఓదార్పు.. మినహాయిస్తే పాటలన్నీ ఊర మాసే. ఎడిటింగ్‌లో లారెన్స్ మార్కు జర్క్‌లుగా ఎక్కువ కనిపిస్తాయి. నెమ్మదిగా సాగాల్సిన కొన్ని చోట్ల మరీ స్పీడు ఎక్కువైంది. ఇంకొన్ని చోట్ల అనవసరమైన సన్నివేశాల్ని అలాగే వదిలేశారు. ద్వితీయార్ధంలో ఓ పావుగంట నిడివి తగ్గించి ఉంటే సినిమా మరింత బెటర్‌గా అనిపించేది. ప్రొడక్షన్ వాల్యూస్ అంత గొప్పగా ఏమీ లేవు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో గ్రాఫిక్స్ చీప్‌గా అనిపిస్తాయి.
చివరిగా...
లారెన్స్ బ్రాండు మాస్ హార్రర్ కామెడీ నచ్చేవాళ్లను 'గంగ' పూర్తిగా సంతృప్తి పరుస్తుంది. అతడి మాస్ కామెడీని, హార్రర్ వేషాల్ని భరించలేం అనుకుంటే మాత్రం 'గంగ'కు దూరంగా ఉండొచ్చు.