Begin typing your search above and press return to search.
కేరాఫ్ సూర్య

Date of Release: 2017-11-10
నటీనటులు: సందీప్ కిషన్-మెహ్రీన్-విక్రాంత్-హరీష్ ఉత్తమన్-సత్య-తులసి తదితరులు
సంగీతం: డి.ఇమాన్
ఛాయాగ్రహణం: లక్ష్మణ్
నిర్మాత: చక్రి చిగురుపాటి
కథ-స్క్రీన్ ప్లే -దర్శకత్వం: సుశీంద్రన్
తెలుగులో యువ కథానాయకుడు సందీప్ కిషన్ కు ఈ మధ్య అంతగా కలిసి రావడం లేదు. ఐతే తమిళంలో మాత్రం అతను మంచి ఫలితాలే అందుకుంటున్నాడు. ఇప్పుడతను ‘కేరాఫ్ సూర్య’ అనే ద్విభాషా చిత్రంలో నటించాడు. తెలుగులో మంచి ఫలితం అందుకున్న ‘నా పేరు శివ’ చిత్రాన్ని రూపొందించిన సుశీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ: సూర్య (సందీప్ కిషన్) ఎంబీఏ పూర్తి చేసి ఖాళీగా ఉండటం ఇష్టం లేక తన స్నేహితులతో కలిసి కేటరింగ్ సర్వీస్ నడుపుతుంటాడు. అతడికి తన స్నేహితుడు (మహేష్) అంటే ప్రాణం. ఐతే సూర్యకు తెలియకుండా అతడి చెల్లెలిని ప్రేమిస్తుంటాడు మహేష్. ఆమె కూడా అతడిని ప్రేమిస్తుంది. ఇదిలా ఉండగా ఓ రౌడీ గ్యాంగ్ మహేష్ ను చంపాలని చూస్తుంది. ఈ విషయం తెలిసిన సూర్య.. స్నేహితుడిని కాపాడుకోవడానికి ఏం చేశాడు.. ఇంతకీ మహేష్ ను చంపాలనుకున్నది ఎవరు.. ఎందుకు? ఇది తెలిసి సూర్య ఏం చేశాడు అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ: దర్శకుడు సుశీంద్రన్ తమిళంలో తీసిన కొన్ని సినిమాలు గతంలో తెలుగులోకి కూడా అనువాదమయ్యాయి. అందులో ‘నా పేరు శివ’.. ‘పల్నాడు’ లాంటి సినిమాలు చూస్తే వీటిలో కామన్ గా కనిపించే కొన్ని అంశాలు గమనించవచ్చు. ఇందులో హీరో ఒక మధ్య తరగతి కుర్రాడై ఉంటాడు. అతడి పాత్ర మనలో ఒకడిలా కనిపిస్తుంది. తనకు బాగా కావాల్సిన వ్యక్తి కోసం అతను చేసే సాహసాల నేపథ్యంలో కథ సాగుతుంది. అవతల చాలా సామాన్యంగా కనిపిస్తూనే భీతిగొల్పే విలన్ ఉంటాడు. అతడి నేపథ్యం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ‘కేరాఫ్ సూర్య’ కూడా దాదాపుగా ఈ లైన్స్ లోనే సాగుతుంది. కథగా ఇది అంత ఎగ్జైట్ కలిగించకపోయినప్పటికీ సుశీంద్రన్ మార్కు నరేషన్ తో ఓ మోస్తరుగా ఎంగేజ్ చేస్తుంది.
ఒక రకంగా ‘నా పేరు శివ’కు కొనసాగింపులాగా అనిపిస్తుంది ‘కేరాఫ్ సూర్య’. కానీ అందులో ఉన్నంత బిగి ఇందులో లేదు. కానీ ఇందులోనూ చెప్పుకోదగ్గ మూమెంట్స్ ఉన్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది విలన్ పాత్ర.. దాని చుట్టూ నడిచే సన్నివేశాలు. విలన్ అనగానే లేని పోని హడావుడి.. బిల్డప్ ఏమీ లేకుండా సుశీంద్రన్ తనదైన శైలిలో ఈ పాత్రను తీర్చిదిద్దిన విధానం ‘కేరాఫ్ సూర్య’ను ప్రత్యేకంగా నిలబెడుతుంది. సుపారీ తీసుకుని హత్యలు చేసే గ్యాంగును నడిపే పాత్ర ఇది. ఐతే ఆ హత్యలు చేయడంలో అతడికో విభిన్నమైన శైలి ఉంటుంది.
తాను చేసే హత్యల విషయంలో అతడి ప్లానింగ్, దాన్నుంచి అందరినీ అతను డైవర్ట్ చేసే తీరు.. తన ఎదుగుదలకు ఈ హత్యల్ని ఉపయోగించుకునే వైనం.. ఇవన్నీ కూడా చాలా ఆసక్తి రేకెత్తించేలా ఒక సెటప్ పెట్టాడు సుశీంద్రన్. దీని వల్ల విలన్ తో ముడిపడ్డ ప్రతి సన్నివేశం చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. సినిమాలో రొమాంటిక్.. కామెడీ ట్రాక్స్ కొంచెం వీక్ అయినప్పటికీ.. మెయిన్ ప్లాట్ ఆసక్తికరంగా ఉండటంతో చాలా వరకు ప్రేక్షకుడు ఎంగేజ్ అయిపోతాడు. ‘కేరాఫ్ సూర్య’లో ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేసే మరో ఆకర్షణీయ అంశం సస్పెన్స్ ఫ్యాక్టర్. దాన్ని చివరి వరకు దాచి పెట్టి ప్రేక్షకుల్ని గెస్సింగ్ లో ఉంచడంలో సుశీంద్రన్ విజయవంతమయ్యాడు.
తన స్నేహితుడిని చంపాలనుకున్న వారెవరో.. వారి అసలు ఉద్దేశమేంటో తెలుసుకోవడానికి హీరో చేసే ప్రయత్నం ద్వితీయార్ధాన్ని ఉత్కంఠగా నడిపిస్తుంది. నరేషన్ కొంచెం నెమ్మదిగా సాగినప్పటికీ ప్రేక్షకుల్లో ఆసక్తి మాత్రం అలాగే నిలిచి ఉంటుంది. ప్రి క్లైమాక్సులో వచ్చే సన్నివేశాలు ఉత్కంఠ రేకెత్తిస్తాయి. క్లైమాక్స్ మాత్రం ఒకింత నిరాశ కలిగిస్తుంది. ట్విస్టు ట్విస్టు కోసం అన్నట్లుంటుంది కానీ.. అదంత సహజంగా అనిపించదు. అలాగే రొమాంటిక్ ట్రాక్ కూడా మామూలుగా అనిపిస్తుంది. కామెడీ పరంగా కూడా చెప్పుకోదగ్గ మెరుపుల్లేవు. సత్య పాత్ర కొంతమేర అక్కడక్కడా నవ్విస్తుంది. ఓవరాల్ గా ‘కేరాఫ్ సూర్య’ సుశీంద్రన్ స్టయిల్లో సాగే ఎంగేజింగ్ థ్రిల్లర్.
నటీనటులు: సందీప్ కిషన్ పక్కింటి కుర్రాడిలా అనిపించే పాత్రలో మెప్పించాడు. అతడి నటన సహజంగా సాగిపోయింది. ఎక్కడా తడబాటు లేకుండా తన పాత్రను చేసుకుపోయాడు. హీరోయిన్ మెహ్రీన్ పాత్ర చిన్నది. ఆమెను చాలా తక్కువ సన్నివేశాలకు పరిమితం చేశారు. పాత్ర కూడా అంత ప్రాధాన్యమున్నది కాదు. హీరో ఫ్రెండుగా నటించిన విక్రాంత్ బాగానే చేశాడు. నటీనటుల్లో అందరికంటే బలమైన ముద్ర వేసేది విలన్ హరీష్ ఉత్తమనే. అతడి పాత్ర.. నటన.. గెటప్ అన్నీ బాగా కుదిరాయి. హరీష్ ఈ పాత్రతో గుర్తుండిపోతాడు. సత్య కొన్ని సన్నివేశాల్లో తనదైన శైలిలో నవ్వించాడు. తల్లి పాత్రలో తులసి ఓకే.
సాంకేతికవర్గం: డి.ఇమాన్ పాటలు పెద్దగా ఆకట్టుకోవు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే మెలోడీ మినహా పాటలు క్యాచీగా లేవు. నేపథ్య సంగీతం బాగుంది. లక్ష్మణ్ ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. ఇక్కడ సుశీంద్రన్ స్టయిల్ కనిపిస్తుంది. ద్వితీయార్ధంలో ఒక మూడ్ క్రియేట్ చేయడంలో సినిమాటోగ్రఫీ కీలక పాత్ర పోషించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక సుశీంద్రన్ దర్శకుడిగా తన ముద్ర చూపించాడు. అతను ఎంచుకున్న కథ కంటే కూడా విలన్ పాత్ర.. దాని చుట్టూ అల్లుకున్న సెటప్ విషయంలో తన ప్రత్యేకత చూపించాడు. కథనం ఇంకొంచెం క్రిస్ప్ గా.. రేసీగా ఉండాల్సింది.
చివరగా: కేరాఫ్ సూర్య.. డిఫరెంట్ థ్రిల్లర్
రేటింగ్ - 3/5