Begin typing your search above and press return to search.
సర్కిల్

Date of Release: 2023-07-08
నటీనటులు: సాయి రోనక్- రిచా పనాయ్-అర్షిన్ మెహతా-నైనా-బాబా భాస్కర్ తదితరులు
సంగీతం: ఎన్ఎస్ ప్రసు
ఛాయాగ్రహణం: రంగనాథ్ గోగినేని
నిర్మాతలు: శరత్ చంద్ర-సుమలత అనిత్ రెడ్డి-వేణు బాబు అడ్డగడ
రెండు దశాబ్దాల కిందట 'షో' చిన్న సినిమాతో రెండు జాతీయ అవార్డులు సొంతం చేసుకుని అందరూ తన వైపు చూసేలా చేసిన దర్శకుడు నీలకంఠ. ఆ తర్వాత ఆయన్నుంచి 'మిస్సమ్మ' సహా కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ వాటిలో చాలా వరకు కమర్షియల్ సక్సెస్ కాకపోవడంతో నీలకంఠ కనుమరుగైపోయారు. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత ఆయన తీసిన 'సర్కిల్' శుక్రవారమే ప్రేక్షకుల ముందు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
కైలాష్ (సాయి రోనక్) ఒక ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్. మద్యానికి బానిస అయిన అతణ్ని పుత్తూరు గణేష్ (బాబా భాస్కర్) అనే కాంట్రాక్ట్ కిల్లర్ కొట్టి బంధిస్తాడు. కైలాష్ ను చంపడానికి తాను సుపారీ తీసుకున్నట్లు చెప్పిన గణేష్ వెల్లడిస్తాడు. తాను చంపాల్సిన వ్యక్తి.. తనకు సుపారీ ఇచ్చిన వ్యక్తి కలిసి మాట్లాడుకుని ఒక ఒప్పందానికి వస్తే తాను టార్గెట్ ను చంపకుండా వదిలేస్తా అంటూ తనకున్న ఒక ప్రిన్సిపుల్ గురించి చెబుతాడు గణేష్. ఆ మాట చెప్పి ఇంతకీ నిన్ను చంపమని చెప్పిందవరో కరెక్టుగా గెస్ చేయమంటాడు. దీంతో కైలాష్ తనతో బ్రేకప్ అయిన అమ్మాయిల్లో ఒకరు ఈ పని చేసి ఉండొచ్చని భావించి తన మూడు బ్రేకప్ స్టోరీలను చెప్పడం మొదలుపెడతాడు. మరి ఆ స్టోరీలేంటి.. నిజంగా వాళ్లలో ఒక అమ్మాయే కైలాష్ ను చంపమని సుపారీ ఇచ్చిందా.. చివరికి కైలాష్ ను గణేష్ వదిలేశాడా లేదా అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
''ఎవరు.. ఎందుకు.. ఎఫ్పుడు శత్రువులు అవుతారో''.. 'సర్కిల్' సినిమా క్యాప్షన్ ఇది. పైన 'సర్కిల్' సినిమా ప్లాట్ పాయింట్ చదివి.. ఈ క్యాప్షన్ చూసి.. 'షో'.. 'మిస్సమ్మ' లాంటి చిత్రాలు తీసిన నీలకంఠ తీశాడంటే ఒక ఉత్కంఠభరిత థ్రిల్లర్ మూవీని ఊహించుకుంటాం. కానీ ఒకప్పుడు తాను తీసిన సినిమాలతో 'స్క్రీన్ ప్లే మాస్టర్'గా పేరు తెచ్చుకున్న నీలకంఠ ఇప్పుడు పూర్తిగా టచ్ కోల్పోయాడనడానికి 'సర్కిల్' సినిమా రుజువుగా నిలుస్తుంది. ప్లాట్ పాయింట్ ఆసక్తికరంగా అనిపించినా.. స్క్రీన్ ప్లేలో నీలకంఠ మార్కు పూర్తిగా మిస్ కావడంతో 'సర్కిల్' ఒక సగటు సినిమాగా మిగిలిపోయింది. ఈ మధ్య థ్రిల్లర్ సినిమాలు అనగానే చివర్లో ఒక షాకింగ్ ట్విస్ట్ సెట్ చేసుకుని.. దాని మీదే మొత్తం భారం వేసేసి.. మిగతా సినిమాను మామూలుగా లాగించేస్తున్నారు దర్శకులు. కానీ ముందంతా బోరింగ్ సినిమా చూసి.. చివర్లో ట్విస్టు చూసి థ్రిల్లయిపోయి అంతా బాగుంది అనుకునేంత అమాయకులేం కాదు ప్రేక్షకులు.
'సర్కిల్' పేరుకు థ్రిల్లర్ సినిమానే కానీ.. సినిమాలో మెజారిటీ టైం తీసుకుంది రొమాంటిక్ ట్రాక్సే. ఆరంభంలో హీరోను కాంట్రాక్ట్ కిల్లర్ కిడ్నాప్ చేయడం.. ఆ తర్వాత వీళ్లిద్దరి మధ్య కాన్వర్జేషన్ల వరకు 'సర్కిల్'లో థ్రిల్లర్ టచ్ కనిపిస్తుంది. అక్కడి వరకు కొంత ఆసక్తికరంగానే ఉన్నా.. ఆ తర్వాత రొమాంటిక్ టర్న్ తీసుకున్నాక సినిమా గాడి తప్పేసింది. హీరోకు సంబంధించి మూడు రొమాంటిక్ ట్రాక్సే సినిమాను చాలా వరకు ఆక్రమించేశాయి. అందులో నైనా అనే కథానాయికతో సాగే రెండో ప్రేమకథ ఒక్కటి తక్కువ నిడివిలో కొంత ఆసక్తికరంగా సాగుతుంది. కానీ మొదటి. చివరి ప్రేమకథలు మాత్రం బాగా బోర్ కొట్టించేస్తాయి. రొమాంటిక్ సీన్లు యువ ప్రేక్షకులను కొంత ఎంగేజ్ చేయొచ్చు కానీ.. కథనంలో మాత్రం ఆసక్తి కనిపించదు. ముఖ్యంగా ద్వితీయార్ధంలో చాలా టైం తీసుకుని నరేట్ చేసిన మూడో ప్రేమకథ సినిమా మీద ఆసక్తిని పూర్తిగా నీరుగార్చేసింది.
ఇదొక థ్రిల్లర్ సినిమా.. చివర్లో ట్విస్టు ఇవ్వాలి కాబట్టి.. హీరోను చంపడానికి సుపారీ ఇచ్చిన వ్యక్తి ఎవరనేది ప్రేక్షకులు గెస్ చేయలేని విధంగా ఉండటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ట్విస్టు షాకింగ్ గానే అనిపించడం వాస్తవమే కానీ.. అదంత లాజికల్ గా.. కన్విన్సింగ్ గా మాత్రం అనిపించదు. ద్వితీయార్ధం అంత భారంగా గడిచాక ఆ ఒక్క ట్విస్టుతో సినిమా మీద ఒపీనియన్ కూడా మారిపోదు. చివర్లో ట్విస్టేంటో తెలుసుకోవాలి కాబట్టి ఓపిగ్గా ఎదురు చూస్తాం తప్ప.. ఉత్కంఠను అంతకంతకూ పెంచే కథనం అయితే ఇందులో మిస్సయింది. ప్లాట్ పాయింట్ వరకు కొంచెం ట్రెండీగానే రాసుకున్న నీలకంఠ.. ఈ తరం ప్రేక్షకులు కోరుకునే వేగాన్ని సినిమాలో చూపించలేకపోయాడు. కథనంతో మ్యాజిక్ చేయలేకపోయాడు. ఇప్పటి థ్రిల్లర్ సినిమాల ప్రమాణాలకు 'సర్కిల్' దగ్గర్లో కూడా లేదు.
నటీనటులు:
సాయి రోనక్ లీడ్ రోల్ లో బాగానే చేశాడు. కైలాష్ పాత్రకు అతను సూటయ్యాడు. తన గెటప్ అదీ కూడా బాగుంది. నటనలో వేరియేషన్లు చూపించగలిగాడు. కాంట్రాక్ట్ కిల్లర్ పాత్రలో బాబా భాస్కర్ ఓకే అనిపించాడు. అతడికి బుల్లితెరపై ఉన్న కామెడీ ఇమేజ్ వల్ల ఈ పాత్రకు అలవాటు పడటానికి కొంచెం టైం పడుతుంది. ఇంకొంచెం సీరియస్ గా అనిపించే నటుడిని ఆ పాత్రకు తీసుకుని ఉంటే బాగుండేదమో అనిపిస్తుంది. హీరోయిన్లలో సీనియర్ అయిన రిచా పనాయ్ నిరాశ పరుస్తుంది. రోనక్ పక్కన ఆమె కొంచెం పెద్దగా అనిపిస్తుంది. నైనా బాగా చేసింది. అర్షిన్ మెహతా పర్వాలేదు. సినిమాలో ఇంకే చెప్పుకోదగ్గ పాత్రలు లేవు.
సాంకేతిక వర్గం:
నీలకంఠ సినిమాల్లో సాంకేతిక విభాగాల పనితీరు ఎప్పుడూ బాగానే ఉంటుంది. ఎన్ఎస్ ప్రసు పాటలు.. నేపథ్య సంగీతం ఓ మోస్తరుగా అనిపిస్తాయి. రంగనాథ్ గోగినేని ఛాయాగ్రహణం సినిమాకు ఆకర్షణ. తన విజువల్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన సినిమా అయినా క్వాలిటీ కనిపించిందంటే అందుకు కెమెరామన్ పనితనమే కారణం. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. ఇక పెద్దగా పేరు లేని నటీనటులు చేసిన ఈ సిినిమా చూసేందుకు కారణమయ్యే పేరు.. నీలకంఠ. 20 ఏళ్ల కిందట అప్పటి కాలానికంటే ముందు వెళ్లి సినిమాలు తీసిన నీలకంఠ.. ఇప్పుడు ట్రెండీ సినిమా తీయలేకపోయారు. ఆయన మార్కు బ్రిలియన్స్ ఏమీ సినిమాలో కనిపించలేదు. ముఖ్యంగా స్క్రీన్ ప్లేతో ఆయన మ్యాజిక్ చేయలేకపోయారు.
చివరగా: సర్కిల్.. నాట్ ఎ 'నీలకంఠ షో'
రేటింగ్- 2/5
Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater