Begin typing your search above and press return to search.
Chinnadana Nee Kosam

Date of Release: 2014-12-25
రేటింగ్: 2.5 /5
తారాగణం:నితిన్, మిస్త్రి, నాజర్, ఆలీ, రోహిణి, నరేష్, సితార, మధునందన్, ధన్య తదితరులు
ఛాయాగ్రహణం: ఐ.ఆండ్రూ
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
సంగీతం: అనూప్ రూబెన్స్
మాటలు: హర్షవర్ధన్
నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.కరుణాకరన్
మాస్ ఇమేజ్ కోసం పాకులాడి వరుసగా ఫ్లాపులు చూసిన నితిన్.. తనకు రొమాంటిక్ లవ్‌స్టోరీలే కరెక్ట్ అని ఆలస్యంగా గ్రహించాడు. ఇష్క్‌తో మొదలుపెట్టి హ్యాట్రిక్ హిట్లు అందుకున్నాడు. మళ్లీ అదే బాటలో 'చిన్నదాన నీకోసం' అంటూ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ప్రేమకథల స్పెషలిస్టు కరుణాకరన్ రూపొందించిన ఈ సినిమా నితిన్ డబుల్ హ్యాట్రిక్‌కు నాంది పలికిందో లేదో చూద్దాం పదండి.
నితిన్ (నితిన్) ఈ కాలం కుర్రాళ్లకు ప్రతిరూపం. సరదాగా జీవితాన్ని గడిపేసే ఈ కుర్రాడు బైకు మీద వెళ్తూ నందిని (మిస్తి) అనే అమ్మాయిని చూసి మనసు పారేసుకుంటాడు. ఆ తర్వాత ఆమె వెంటపడతాడు. నితిన్ అంటే ఇష్టం లేకపోయినప్పటికీ తన అవసరం కోసం అతడితో, అతడి కుటుంబ సభ్యులతో కలుస్తుంది నందిని. నితిన్ అంటే బాగా ఇష్టపడే రెడ్డి (నాజర్) అనే పెద్దాయన ఇంట్లో అద్దెకు దిగడమే ఆ అవసరం. కొన్నాళ్ల తర్వాత యూరప్ టూర్‌కి లక్కీ డ్రా ద్వారా ఎంపికయ్యామని చెప్పి.. రెడ్డిని తీసుకుని ఫ్లైటెక్కేస్తుంది నందిని. ఐతే లక్కీ డ్రా అనేది డ్రామా అని.. రెడ్డిని నందిని కావాలనే తన వెంట తీసుకెళ్లిందని తెలుస్తుంది నితిన్‌కు. ఇంతకీ రెడ్డికి, నందినికి సంబంధమేంటి? ఆమె అతణ్ని ఎందుకు తన వెంట తీసుకెళ్లింది? నందిని ఆడిన డ్రామా తెలిసి నితిన్ ఎలా స్పందించాడు? చివరికి ఏం జరిగింది అన్నది మిగతా కథ.
కథ:
అందమైన ప్రేమకథలకు వినోదాన్ని జోడించి.. ప్రేక్షకుల్ని మెప్పించడంలో 'తొలిప్రేమ' కరుణాకరన్‌ది ప్రత్యేకమైన శైలి. ఐతే కెరీర్ మొదట్లో అతడి సినిమాల్లో ఉన్నంత తాజాదనం, వినోదం ఈ మధ్య కనిపించట్లేదు. 'చిన్నదాన నీకోసం' కూడా అదే కోవలో చేర్చదగ్గ సినిమానే కానీ.. ఇటీవలి అతడి ట్రాక్ రికార్డు పోలిస్తే కొంచెం బెటరే. ప్రేమకథను పండించడంలో విఫలమైనప్పటికీ.. కొంచెంలో కొంచెం వినోదం అందించాడు. ఐతే అది ప్రథమార్ధం వరకే.
కథనం:
విడిపోయిన కుటుంబాల్ని కలపడమనే కాన్సెప్టు తెలుగు తెరపై అరిగిపోయిన సమయంలో అదే కాన్సెప్ట్‌కి ప్రేమకథ రంగు పూసి.. మ్యాజిక్ చేయాలనుకున్నాడు కరుణాకరన్. అదే అతడు చేసిన పెద్ద తప్పు. ప్రేమకథ పండకపోయినా.. హీరో హీరోయిన్ల మధ్య గిల్లి కజ్జాలతో, సరదా సన్నివేశాలతో ప్రథమార్ధం వరకు వేగంగా సాగిపోయిన 'చిన్నదాన నీకోసం' ద్వితీయార్ధమంతా బోర్ కొట్టిస్తుంది. తన శైలికి నప్పని సీరియస్ డ్రామాలోకి అడుగుపెట్టగానే కరుణాకరన్ పట్టు కోల్పోయాడు. ఆ తర్వాత మళ్లీ వినోదం అద్దే ప్రయత్నం చేసినా పండలేదు. చివర్లో ఎమోషన్స్ పండించడానికి చేసిన ప్రయత్నమూ ఫలించలేదు.
ఫస్టాఫ్‌లో ఎంటర్టైన్మెంట్ మినహాయిస్తే.. 'చిన్నదాన నీకోసం'లో చెప్పుకోవడానికి ఏమీ లేదు. ప్రేమకథ, ఫ్యామిలీ డ్రామా.. రెండూ వర్కవుట్ కాలేదు. కరుణాకరన్ స్టయిల్లో హీరోయిన్ ముఖానికి చున్నీ అడ్డుపెట్టుకుని తెరలు తెరలుగా తన రూపాన్ని చూపిస్తుండగా.. హీరో అలా చూసి ఇలా పడిపోవడం పరమ రొటీన్‌గా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ను ప్రేమించడానికి సరైన కారణం కనిపించదు. అసలు ఆమెను ప్రేమిస్తున్న ఫీలింగ్ కూడా ప్రేక్షకుడికి కలగదు.
ఇక హీరోయిన్ యాంగిల్ లవ్ అయితే మరీ సిల్లీగా ఉంటుంది. హీరో అంటే అలర్జీ అని చెప్పే హీరోయిన్.. తన కోసం అతను బుల్లెట్ దెబ్బ తిన్నాడనగానే ఎక్కడలేని ప్రేమను ఒలకబోసేసి.. మొత్తం మారిపోవడం.. మరీ డ్రమటిక్‌గా ఉంటుంది. అందుకే చివర్లో హీరో హీరోయిన్‌కు దూరమైపోతున్నా బాధ కలగదు. మళ్లీ వాళ్లు కలుసుకున్నా సంతోషం ఉండదు. ఫీల్ లేని ప్రేమకథలతో ప్రేక్షకులు కనెక్ట్ కావడం కష్టం. అదే సమయంలో హీరోయిన్ ఫ్యామిలీని ఒక్కటి చేసే ఎపిసోడ్‌లోనూ ఎమోషన్ పండలేదు.
ప్రేమకథలకు హీరోయిన్ చాలా కీలకం. ఆమెను చూసి హీరో కంటే ముందు ప్రేక్షకులు పడిపోవాలి. మిస్తిని చూస్తే జనాలకు ఆ ఫీలింగ్ ఏమీ కలగదు. ప్రేమకథ వర్కవుట్ కాకపోవడానికి ఇది మరో కారణం. ప్రథమార్ధంలో తాగుబోతు రమేష్ ఓమాదిరిగా నవ్విస్తే.. సెకండాఫ్‌లో ఆలీ ఫెయిలయ్యాడు. గుండెజారి గల్లంతయ్యిందే స్టయిల్లోనే నితిన్ మరోసారి 'గే' కామెడీ ట్రై చేశాడు కానీ.. ఈసారి అది క్లిక్ కాలేదు. సినిమాకు హైలైట్ అనదగ్గ టైటిల్ సాంగ్ కూడా ఫస్టాఫ్‌లోనే వచ్చేయడంతో సెకండాఫ్ పూర్తిగా నిరాశపరిచింది. పవన్ కళ్యాణ్‌ను ఎప్పట్లాగే బాగా వాడేసుకున్నాడు నితిన్. ఓ సన్నివేశంలో పవన్ బొమ్మ గీస్తే.. ఓ పాటలో బద్రి సినిమా దృశ్యాల్ని కూడా వాడుకున్నాడు.
నటీనటులు:
నితిన్ గత మూడు సినిమాల్లోనూ పనీపాటా లేకుండా సరదాగా జీవితాన్ని గడిపేసే కుర్రాడిగానే నటించాడు. 'చిన్నదాన నీకోసం'లోనూ అంతే. కాన్ఫిడెంట్‌గా నటించినప్పటికీ.. నితిన్‌ను మరోసారి అదే పాత్రలో చూడటం మాత్రం కొంచెం బోర్ కొట్టిస్తుంది. డ్యాన్సులు, ఫైట్లలో ఎప్పట్లాగే అదరగొట్టాడు నితిన్. ముఖ్యంగా ఇంట్రడక్షన్ సాంగ్‌లో స్టెప్స్ చాలా బాగున్నాయి. హీరోయిన్ మిస్తి గొప్ప అందగత్తే కాదు.. నటనా అంతంతమాత్రమే. ఆమెకు మేకప్ అతిగా వేశారు. నాజర్‌కు ఇదేమీ సవాలు విసిరే పాత్ర కాదు. నరేష్, సితార, రోహిణి కూడా పెద్దగా చేసిందేమీ లేదు. తాగుబోతు రమేష్ తన బ్రాండ్ కామెడీతో పర్వాలేదనిపించాడు. ఆలీ మామూలే.
సాంకేతిక వర్గం:
నితిన్ హ్యాట్రిక్ కొట్టడంలో ముఖ్యపాత్ర పోషించిన అనూప్.. ఈసారి పర్వాలేదనిపించాడు. ఆ మూడింటితో పోలిస్తే వీకే కానీ.. చిన్నదాన నీకోసం పాటలు బాగానే ఉన్నాయి. టైటిల్ సాంగ్ ఆల్బమ్‌లో బెస్ట్ అనిపించుకుంటుంది. ఈ పాట చిత్రీకరణ, డ్యాన్స్ కంపోజింగ్ కూడా బాగుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఓకే. ఆండ్రూ ఛాయాగ్రాహణం ఆకట్టుకుటుంటుంది. నితిన్ గత సినిమాలతో పోలిస్తే నిర్మాణ విలువలు తగ్గినట్లే అనిపిస్తుంది. ఫారిన్లో సాగే ద్వితీయార్ధంలో ఆ రిచ్‌నెస్ కనిపించలేదు. హర్షవర్ధన్ మాటల్లో కొన్ని చమక్కులు ఆకట్టుకుంటాయి. విషయం లేని సెకండాఫ్‌లో అతడు కూడా ఏమీ చేయలేకపోయాడు. తన హీరో లేదా హీరోయిన్‌కు ఓ టాస్క్ సెట్ చేసి... దాని చుట్టూ ప్రేమకథను అల్లడం కరుణాకరన్‌కు అలవాటైన బలహీనత. ఈసారి కూడా అతను రూటు మార్చలేకపోయాడు. స్క్రీన్‌ప్లే కూడా అంత ఆసక్తికరంగా రాసుకోలేకపోయాడు. ప్రథమార్ధంలో వినోదాన్ని పండించడం వరకు దర్శకుడిగా తన ముద్ర చూపించగలిగిన కరుణాకరన్ ఆ తర్వాత తేలిపోయాడు.
చివరిగా...
ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో.. రొమాన్స్ లేదు, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంది. మరి ఈ చిన్నదాని కోసం థియేటర్లకు వెళ్లాలో వద్దో మీ ఇష్టం.