Begin typing your search above and press return to search.
Chandrakala

Date of Release: 2014-12-19
రేటింగ్: 2 /5
తారాగణం: హన్సిక, ఆండ్రియా, లక్ష్మీరాయ్, సుందర్, వినయ్, సంతానం, కోట శ్రీనివాసరావు, కోవై సరళ, మనోబాల తదితరులు
మాటలు: రాజశేఖర్‌రెడ్డి
ఛాయాగ్రహణం: సెంథిల్‌కుమార్
సంగీతం: భరద్వాజ్, కార్తీక్ రాజా
నిర్మాత: శ్వేత, వరుణ్, తేజ, సి.ఎ.రావు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుందర్
ఈ మధ్య తెలుగు తెరపై హార్రర్ కామెడీలు బాగానే హవా సాగిస్తున్నాయి. కాంచన, ప్రేమకథ చిత్రమ్లతో పాటు ఇటీవలే 'గీతాంజలి' కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. దీంతో తమిళంలో ఇదే జానర్లో వచ్చిన 'ఆరణ్మయి' సినిమాను 'చంద్రకళ' పేరుతో తెలుగలోకి తీసుకొచ్చాడు ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్. మంచి టైమింగ్ చూసుకుని ఈ శుక్రవారం భారీగానే విడుదలైందీ సినిమా. తమిళంలో విజయవంతమైన ఈ హార్రర్ తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించేలా ఉందో లేదో చూద్దాం పదండి.
కథ:
ఓ పల్లెటూర్లో పెద్ద బంగ్లాను అమ్మేందుకు గాను.. ఎక్కడెక్కడో ఉన్న హక్కుదారులందరూ ఆ ఇంటికి వస్తారు. కొన్ని రోజులు అక్కడే ఉండి.. బంగ్లా అమ్మకం పూర్తి చేసి వెళ్లాలనుకుంటారు. ఐతే అందరూ ఆ ఇంట్లో ఉండగా.. అక్కడ అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఇంట్లో పని చేసే ముగ్గురు పనివాళ్లు ఒకరి తర్వాత ఒకరు చనిపోతారు. అప్పుడే ఆ ఇంటికి అతిథిగా వచ్చిన రవి (సుందర్).. తన చెల్లెలైన మాధవి (ఆండ్రియా) ఈ హత్యలన్నింటికీ కారణమని కనిపెడతాడు. ఇంతకీ మాధవి ఆ హత్యలు ఎందుకు చేసింది? ఆమెకు చంద్రకళ (హన్సిక) అనే అమ్మాయికి ఏంటి సంబంధం? చివరికి ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం లభించింది అన్నది మిగతా కథ.
కథనం:
తమిళ ఆడియన్స్‌కు ఈ హార్రర్ కామెడీ కొత్తగా అనిపించి ఉండొచ్చు కానీ.. మనకైతే ప్రేమకథా చిత్రమ్, గీతాంజలి సినిమాల్నే మిక్స్‌చేసి చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఓ అమ్మాయిని కొందరు విలన్లు అన్యాయంగా చంపేస్తారు. తను చనిపోయిన ఇంట్లోనే ఉండి.. అక్కడికి కొత్తగా వచ్చిన వాళ్లను ఆటాడుకుంటుంది. చివరికి తనను చంపిన వాళ్లపై ప్రతీకారం తీర్చుకుంటుంది.. ప్రేమకథా చిత్రమ్, గీతాంజలి సినిమాల్లో.. 'చంద్రకళ'లో కనిపించే కామన్ పాయింట్ ఇది. చంద్రముఖి ఛాయలు కూడా చాలానే కనిపిస్తాయి 'చంద్రకళ'లో. సినిమా నిడివి 2 గంటల 40 నిమిషాలుండటం పెద్ద మైనస్.
ఐతే అంతా రొటీన్ వ్యవహారమే అయినప్పటికీ.. అంతా ప్రెడిక్టబుల్‌గా సాగినప్పటికీ.. మినిమం గ్యారెంటీ వినోదం ఉండటం వల్ల 'చంద్రకళ' మరీ నిరాశ పరచలేదు. హన్సిక, ఆండ్రియా, లక్ష్మీరాయ్.. ఇలా ఒకరికి ముగ్గురు ముద్దుగుమ్మలు తమ గ్లామర్‌తో ఆకట్టుకుంటారు. ఇక సంతానం కామెడీ ఓ మాదిరిగా నవ్వులు పంతే.. దయ్యం సన్నివేశాలు ఓ మాదిరిగా భయపెడతాయి.
ప్రేమకథా చిత్రమ్, గీతాంజలి సినిమాలతో పోలిస్తే హార్రర్, కామెడీ గొప్పగా పండకపోయినప్పటికీ.. ఆ సినిమాలతో పోలిస్తే 'చంద్రకళ' చాలా రిచ్‌గా ఉండటం.. చాలామంది నటీనటులతో తెరమీద సందడి సందడిగా ఉండటం.. హై ప్రొడక్షన్ వాల్యూస్.. విజువల్ ఎఫెక్ట్స్.. 'చంద్రకళ'కు ప్లస్ పాయింట్స్. ఐతే తొలిసారి హార్రర్ కామెడీ ట్రై చేసిన దర్శకుడు సుందర్ 90ల నాటి నరేషన్తో సినిమాను మరీ స్లోగా నడిపించాడు.
ఫస్టాఫ్‌లో కామెడీ ఆకట్టుకోవడం వల్ల కథనం కొంచెం వేగంగానే సాగిన ఫీలింగ్ ఉంటుంది కానీ.. సెకండాఫ్‌తో సన్నివేశాల సాగతీత విసిగిస్తుంది. హన్సిక పెర్ఫామెన్స్ తప్ప ఏ ఆకర్షణా లేని ఫ్లాష్ బ్యాక్‌ను ముప్పావు గంట నడిపించిన సుందర్.. ఆ తర్వాత సినిమా ముగించడానికి ఇంకో ముప్పావు గంట తీసుకున్నాడు. క్లైమాక్స్ బాగానే ఉన్నప్పటికీ.. ప్రి క్లైమాక్స్ సుదీర్ఘంగా సాగి ప్రేక్షకుల్ని ఇబ్బంది పెడుతుంది. ఓవరాల్‌గా చూస్తే మనం చూసిన హార్రర్ కామెడీలతో పోల్చి చూస్తే.. చంద్రకళ కొత్తగా ఆఫర్ చేసేదేమీ ఉండదు. హీరోయిన్ల కోసం.. కూసింత కామెడీ కోసం 'చంద్రకళ'పై ఓ లుక్కేయొచ్చు.
నటీనటులు:
'చంద్రకళ'లో సందడంతా లేడీ క్యారెక్టర్లదే. టైటిల్ రోల్ హన్సికదే అయినప్పటికీ.. ఇందులో ఆండ్రియాదే పైచేయి. ఆమె ఇటు అందంతో, అటు పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంది. హన్సిక విలేజ్ అమ్మాయిగా డిఫరెంట్ లుక్‌లో ఆకట్టుకుంది. ఆమె నటన కూడా ఓకే. లక్ష్మీరాయ్ పూర్తిగా అందాల ప్రదర్శనకే పరిమితమైంది. ఆమె గ్లామర్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. చంద్రముఖిలో రజినీ టైపులో డైరెక్టర్ సుందర్ కీలకమైన పాత్ర చేశాడు. నటుడిగా అతడి గురించి చెప్పుకోవడానికేమీ లేదు. వాన ఫేమ్ ఉదయ్ కూడా ఏమంత ఆకట్టుకోడు. సంతానం బాగానే నవ్వించాడు. కోట శ్రీనివాసరావు స్వామీజీ పాత్రలో బాగానే చేశారు. మిగతా వాళ్లంతా మామూలే.
సాంకేతిక వర్గం:
కార్తీక్ రాజా, భరద్వాజ్ కలిసి అందించిన మ్యూజిక్ ఏమంత ఆకట్టుకోదు. హార్రర్ మూవీస్‌కు తగ్గట్లే బ్యాగ్రౌండ్ స్కోర్‌కు వరకు పర్లేదు కానీ.. పాటలేవీ ఆకట్టుకోవు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. సినిమా రిచ్‌గా కనిపించడంలో సెంథిల్ కెమెరా పనితనం ముఖ్యపాత్ర పోషించింది. మాటలు మామూలుగా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ చాలా పూర్. కనీసం 20 నిమిషాలైనా ఓత వేయాల్సింది. సుందర్ పాత కథాకథనాలతో ఓ మినిమం గ్యారెంటీ మూవీ తీసే ప్రయత్నం చేశాడు. సాదాసీదా కంటెంట్ వల్ల అతడి ప్రత్యేకతేమీ కనిపించలేదు. కాకపోతే కామెడీని డీల్ చేయడంలో అతడి అనుభవం పనికొచ్చింది..
చివరిగా...
మూడు పాత సినిమాలు.. ముగ్గురు హీరోయిన్లు.. కాస్తంత కామెడీ కలిపితే చంద్రకళ. చూడాలా వద్దా అన్నది ప్రేక్షకుల ఇష్టం.