Begin typing your search above and press return to search.
బుట్టబొమ్మ

Date of Release: 2023-02-04
నటీనటులు: అనైకా సురేంద్రన్-అర్జున్ దాస్-సూర్య వశిష్ఠ-నవ్య స్వామి-జగదీష్ చీకటి తదితరులు
సంగీతం: గోపీసుందర్
ఛాయాగ్రహణం: వంశీ పచ్చిపులుసు
మాటలు: గణేష్ కుమార్ రావూరి
నిర్మాతలు: నాగవంశీ-సాయి సౌజన్య
దర్శకత్వం: శౌరీ చంద్రశేఖర్ రమేష్
బడ్జెట్లు-మార్కెట్ రీచ్ తక్కువ కావచ్చు కానీ.. ఇండియాలో మంచి క్వాలిటీతో.. సరికొత్త కథలతో సినిమాలు తీసే ఇండస్ట్రీల్లో మలయాళ పరిశ్రమ ముందు వురుసలో ఉంటుంది. అందుకే అక్కడి నుంచి వివిధ భాషల్లో సినిమాలు రీమేక్ అవుతుంటాయి. అక్కడ మంచి విజయం సాధించిన ‘కప్పెలా’ తెలుగులో ‘బుట్టబొమ్మ’ పేరుతో రీమేక్ అయింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇచ్చేలా ఉందో తెలుసుకుందాం పదండి.
కథ:
సత్య (అనైకా సురేంద్రన్) అరకు ప్రాంతంలోని ఒక పల్లెటూరిలో ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. చదువు మధ్యలో ఆపేసి ఇంట్లో అమ్మకు సాయంగా చిన్న చిన్న పనులేవో చేస్తున్న సత్యను ఆ ఊరికే చెందిన ఒక పెద్దింటి అబ్బాయి ఇష్టపడతాడు. సత్య కుటుంబానికి పెళ్లికి ఒప్పించే ప్రయత్నాల్లో ఉంటాడు. ఈలోపు సత్య అనుకోకుండా చేసిన ఒక రాంగ్ కాల్ ద్వారా వైజాగ్ లో ఉండే మురళి (సూర్య వశిష్ఠ) పరిచయం అవుతాడు. ఇద్దరి మధ్య మాటలు పెరిగి ఒకరినొకరు చూసుకోకుండానే ప్రేమలో పడతారు. ఇంట్లో తన పెళ్లికి ఏర్పాట్లు జరుగుతుండడంతో సత్య ఇంట్లో వాళ్లకు తెలియకుండా మురళిని కలవడానికి వైజాగ్ వెళ్తుంది. మరి అక్కడ సత్య మురళిని కలిసిందా.. ఆమెకు ఎదురైన అనుభవాలేంటి.. అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
ఒక భాషలో విజయవంతం అయి మంచి అప్లాజ్ తెచ్చుకున్న సినిమాలను ఇంకో భాషలోకి రీమేక్ చేస్తూ యాజిటీజ్ దించేసినా సరే.. ఒరిజినల్లో ఉన్న ఫీల్ రాదు. ఇందుకు కారణాలేంటి అని అడిగితే సరైన జవాబు చెప్పడం కూడా కష్టమవుతుంది. కొన్నిసార్లు ఆర్టిస్టుల పెర్ఫామెన్స్ తేడా కొట్టొచ్చు. మరికొన్నిసార్లు నేటివిటీ ఫ్యాక్టర్ సమస్యగా మారొచ్చు. ఇంకొన్నిసార్లు అసహజత్వం ప్రతిబంధకం కావచ్చు. మలయాళంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘కప్పెలా’కు తెలుగు రీమేక్ గా వచ్చిన ‘బుట్టబొమ్మ’ సైతం మాతృక ఇచ్చిన ‘ఒరిజినల్ ఫీల్’ను ఇవ్వలేకపోయింది. ఈ చిత్రానికి పైన చెప్పుకున్న మూడు సమస్యలూ ఉన్నాయి. కథ పరంగా బాగుందనించినా.. కొన్ని సన్నివేశాల వరకు బాగానే పండినా.. చివరికి వచ్చేసరికి ఏదో వెలితి మాత్రం ఉంటుంది.
ఒక మనిషితో కొన్ని మాటలు మాట్లాడగానే చాలా మంచి వ్యక్తి అనిపిస్తుంది. కొందరిని చూడగానే ఒక పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. అలాగే కొందరు చూడ్డానికి చాలా రఫ్ గా కనిపిస్తారు. వాళ్ల మాటలు కటువుగా ఉంటాయి. ఐతే కొన్ని మాటలు.. చేతలు చూసి వెంటనే ఒక వ్యక్తి చాలా మంచోడని ఫిక్సయిపోలేం. అలాగే ఎవరి మీదా చెడ్డవాడిగా ముద్ర వేసేయలేం. ‘డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్’ అనే ఇంగ్లిష్ నానుడి ఉద్దేశం ఇదే. ‘బుట్టబొమ్మ’ కథ ఈ పాయింట్ చుట్టూనే తిరుగుతుంది. మనం చూసే మనుషులు.. మన చుట్టూ జరిగే విషయాల నుంచే కథలు పుట్టించి అందంగా.. ఆసక్తికరంగా తెరపై ప్రెజెంట్ చేయడంలో మలయాళ రచయితలు-దర్శకులది ప్రత్యేక శైలి. ఇలాంటి పాయింట్ల మీద కూడా సినిమాలు తీయొచ్చా అనిపించే ఎన్నో కథలు అక్కడ వస్తుంటాయి. ‘కప్పెలా’ కూడా అలా ఆశ్చర్యపరిచే కథే. ఆ కథ పరిధి చూస్తే చాలా చిన్నదిగా అనిపిస్తుంది. కానీ ఇందులో చెప్పిన పాయింట్ చాలా బలమైంది. అది మనల్ని షాక్ కు గురి చేసి.. కొన్ని రోజుల పాటు వెంటాడుతుంది. ‘బుట్టబొమ్మ’లో మనకి పరిచయం అయ్యేపుడు కొన్ని పాత్రలు మనకు ఒకలా కనిపించి.. చివరికి కొత్త ముఖాలతో దర్శనమిచ్చే తీరు ఇందులో హైలైట్.
‘బుట్టబొమ్మ’ తక్కువ నిడివితో ముగిసే సినిమానే అయినా ఇందులో కథ టేకాఫ్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. కథానాయిక నేపథ్యం.. ఆమె చుట్టూ ఉండే మనుషులు.. తన కుటుంబం.. తన ఊర్లో విషయాల చుట్టూ తిప్పిన ప్రథమార్ధం మరీ నెమ్మదిగా అనిపిస్తుంది. అరకు ప్రాంతం అన్నారే కానీ.. అక్కడి వాతావరణాన్ని ఆశించినంత అందంగా చూపించలేకపోయారు. సన్నివేశాలు కూడా సాధారణంగా సాగిపోతాయి. కథానాయిక వైజాగ్ చేరుకుని అక్కడ తాను కలవాలనుకున్న వ్యక్తితో కాకుండా మరో వ్యక్తి చెంతకు చేరడంతో తొలిసారి సినిమాలో ఉత్కంఠ.. ఆసక్తి మొదలవుతుంది. ద్వితీయార్ధం కొంచెం వేగంగానే ముందుకు కదులుతుంది. ఆర్కే పాత్ర ఫ్లాష్ బ్యాక్ చకచకా ముగిసిపోగా.. ఆ తర్వాత కథానాయిక-ఆమె ప్రియుడిని ఆర్కే వెంటాడుతూ సాగే సన్నివేశాలతో ఉత్కంఠ రేగుతుంది. ఇక చివర్లో వచ్చే ట్విస్టు.. పతాక సన్నివేశాలు కూడా బాగానే సాగాయి.
ఐతే ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం మెరుగుపడ్డప్పటికీ.. ఓవరాల్ గా ఒక పూర్తి స్థాయి.. సంతృప్తికర సినిమా చూసిన ఫీలింగ్ అయితే కలగదు. ఇదొక ఎక్స్టెండెడ్ షార్ట్ ఫిలిం లాగా అనిపిస్తుంది. ప్రధాన పాత్రల్లో కనిపించిన నటులతో మనకు ఎమోషనల్ కనెక్షన్ లేకపోవడం మైనస్. కాస్త తెలిసిన నటులు ఉంటే.. పెర్ఫామెన్స్ ఇంకాస్త మెరుగ్గా ఉంటే ‘బుట్టబొమ్మ’ బెటర్ ఫీలింగ్ కలిగించేదేమో. మొత్తంగా మూడు ప్రధాన పాత్రల్లోనూ తెలిసిన నటులు లేకపోవడం సినిమాకు ప్రతికూలంగా మారింది. సినిమాలో ఏదో ఒక అసహజత్వం ఉన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. తక్కువ నిడివి ఉన్నప్పటికీ.. సినిమా షార్ప్ గా అనిపించకపోవడం ప్రతికూలతే. ప్లాట్ పాయింట్.. అర్జున్ దాస్-సూర్య పాత్రలను మలిచిన విధానం.. క్లైమాక్స్ ట్విస్టు సినిమాకు చెప్పుకోదగ్గ ఆకర్షణలు. మిగతా ఇబ్బందులను తట్టుకోగలిగితే వీటి కోసం సినిమాపై ఓ లుక్కేయొచ్చు.
నటీనటులు:
ఇన్నాళ్లూ బాలనటిగా చూసిన అనైకా సురేంద్రన్ ను ఇందులో కథానాయికగా చూసి అలవాటు పడడడానికి కొంచెం టైం పడుతుంది. కథానాయిక పాత్రకు తక్కువ వయసున్న టీనేజీ అమ్మాయే కరెక్ట్ అని అనైకాను ఎంచుకున్నారేమో కానీ.. ఆమెతో కనెక్ట్ కావడం కష్టమే. ఇలాంటి సినిమాను భుజాల మీద మోసే స్థాయి ఆమెకు రాలేదనిపిస్తుంది. అర్జున్ దాస్ ఎంత మంచి నటుడైనా.. తన స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నా అతను మనకు కొత్తే. ఇక ఒరిజినల్లో అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చిన రోషన్ మాథ్యూ ముందు సూర్య వశిష్ఠ నిలవలేకపోయాడు. ముగ్గురు లీడ్ యాక్టర్లలో అతనే వీక్ అనిపిస్తాడు. ఈ పాత్రకు ముందు అనుకున్న సిద్ధు జొన్నలగడ్డనే చేసి ఉంటే ఆ పాత్రతో పాటు సినిమా లెవెలే మారిపోయేదేమో. అతను కాకున్న కొంచెం పేరున్న నటుడిని పెట్టాల్సింది. సినిమాలో చెప్పుకోదగ్గ మిగతా పాత్రలేవీ లేవు. వేరే నటీనటులకు పెద్దగా చేయడానికేమీ లేకపోయింది.
సాంకేతిక వర్గం:
గోపీసుందర్ ఈ సినిమాకు పని చేశాడంటే ఆశ్చర్యం కలుగుతుంది. అతను తన స్థాయికి మ్యూజిక్ ఇవ్వలేదు. సినిమాలో పాటలకు ప్రాధాన్యం కూడా తక్కువే. ఉన్న రెండు పాటలు సోసోగా అనిపిస్తాయి. నేపథ్య సంగీతం బాగుంది. వంశీ పచ్చిపులుసు కెమెరా పనితనం ఓకే. సితార ఎంటర్టైన్మెంట్స్ ముద్రను చాటే స్థాయిలో నిర్మాణ విలువలు కనిపించవు. సినిమా స్థాయికి తగ్గట్లు.. కథను అనుసరించి పరిమిత బడ్జెట్లోనే లాగించేసినట్లున్నారు. దర్శకుడు శౌరీ చంద్రశేఖర్ రమేష్ మాతృకను ఉన్నదున్నట్లుగా ఫాలో అయిపోయాడు కాబట్టి అతణ్ని ప్రత్యేకంగా ప్రశంసించలేం.. అలా అని విమర్శించనూలేం. అతను ఒక ఫెయిత్ ఫుల్ రీమేక్ లాగా ‘బుట్టబొమ్మ’ను తెలుగులో నీట్ గా తీసి పెట్టాడు. ప్రధాన పాత్రలకు నటీనటుల ఎంపిక ఎవరిదో కానీ అక్కడే తప్పు జరిగింది.
చివరగా: బుట్టబొమ్మ.. ట్విస్టు మీదే మొత్తం భారం
రేటింగ్ - 2.25/5