Begin typing your search above and press return to search.
Bham Bolenath

Date of Release: 2015-02-27
రేటింగ్: 2 /5
తారాగణం: నవదీప్, నవీన్ చంద్ర, ప్రదీప్ మాచిరాజు, కిరీటీ, పూజాఝవేరీ, పోసాని తదితరులు
సంగీతం: సాయి కార్తీక్
సినిమాటోగ్రఫీ: భరణి కే ధరణ్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
నిర్మాత: సిరువూరి రాజేష్ వర్మ
దర్శకత్వం: కార్తిక్ వర్మ దండు
ఒక సినిమా హిట్ అయితే అలాంటి ట్రెండ్‌లో మరికొన్ని రావడం మామూలే. ఈ మధ్య కాలంలో 'స్వామిరారా' సినిమా ఒక ట్రెండ్‌ను సెట్ చేసి వెళ్లింది. ఆ కోవలో చాలా సినిమాలు వచ్చాయి. మరి అలాంటి అనుకరణను తప్పుపట్టలేం. ఆకట్టుకొనేలా ఉంటే ట్రెండ్‌ను ఫాలో అయిన సినిమాలను కూడా ఆదరించేవచ్చు. అయితే బ్యాలెన్స్ తప్పితే అలాంటి అనుకరణలు అభాసుపాలవుతాయి. ఎలాగంటే అచ్చం ఈ భమ్ భోలేనాథ్ సినిమాలా!
కథ:
బ్యాక్‌డోర్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించడానికి అవసరమైన రెండు లక్షల కోసం అడ్డదారిని ఎంచుకోబోతున్న నవదీప్, అతడి స్నేహితుడికి అనుకోకుండా డాలర్లతో నిండిన బ్యాగ్ దొరుకుతుంది. వారి కథ అలా ఉంటే. డాన్ కావాలనే లక్ష్యంలో దుబాయ్ వెళ్లడానికి చిన్న చిన్న దొంగతనాలు చేసుకొనే నవీన్ చంద్ర క్యారెక్టర్‌కు ఒక్కసారిగా భారీ మొత్తంలో డబ్బు, వజ్రాల ఉంగరం దొరుకుతుంది. ఒకరితో మరొకరికి పరిచయం లేని ఈ రెండు గ్యాంగ్‌ల సంపద చేతికి దొరికినట్టుగానే దొరికి ఒక కార్లో లాక్ అయిపోతుంది. ఆ కారు డ్రగ్స్‌కు అడిక్ట్ అయిపోయి అనునిత్యం వాటి మత్తులోనే ఉండే రాఖీ అండ్ ఫ్రెండ్స్(ప్రదీప్, కిరిటీ)లది. చిత్రమైన పరిస్థితుల్లో డబ్బు ఆ కారులోకి చేరుతుంది. పలు మలుపుల తర్వాత ఆ కారు ఒక లోకల్ డాన్ కాంపౌండ్‌లో ఇరుక్కుపోతుంది. ఆ డాన్‌తో అప్పటికే సున్నం పెట్టుకొని ఉన్న ఈ గ్యాంగ్‌లు తమ డబ్బును ఎలా సంపాదించుకొన్నాయి? తమ జీవిత లక్ష్యాలను ఎలా సాకారం చేసుకొన్నాయి.. ఇంతకీ అనూహ్యంగా వీళ్ల చేతికి వచ్చిన ఆ డబ్బు ఎవరిది? డ్రగ్స్ బ్యాచ్ కథేంటి? అనేది మిగతా కథ.
కథనం:
మామూలుగా సినిమా టైటిల్స్‌కు ముందు 'ఈ నగరానికి ఏమైంది..' అంటూ పొగాకు వినియోగించవద్దని హితబోధ చేసే యాడ్ వస్తుంది. ఆ తర్వాత సినిమా వాళ్లు కూడా 'పొగతాగడం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం' అనే మరో హితబోధ చేస్తారు. అయితే ఈ సినిమాకు అదనంగా మరో హితబోధ కూడా చేశారు. 'డ్రగ్స్ వినియోగం వల్ల పిచ్చి పిచ్చిగా నవ్వడం, ఎక్కువగా ఆకలివేయడం వంటివి జరుగుతాయి.. ' అనే మరో హెచ్చరికను కూడా జారీ చేశారు. ఎందుకలా? అంటే.. ఈ సినిమాలో కొన్ని పాత్రలు నిత్యం డ్రగ్స్ మత్తులో జోగుతూ ఉంటాయి. వాటిని చూసి ప్రేక్షకుడు ఎక్కడ చెడిపోతాడో అని ఈ హెచ్చరిక జారీ చేశారనమాట. అయితే వాటిని చూసి చెడిపోవడం జరగదు.. డ్రగ్స్ అంటేనే అసహ్యం పుడుతుంది! అలా డ్రగ్స్‌పై ఒక్కదెబ్బతో విరక్తిపుట్టించే ప్రయత్నం చేసినందుకు ఈ సినిమా వాళ్లకు ప్రత్యేక అవార్డును ఏదైనా ఇవ్వాలి. ఇక క్లైమాక్స్‌లో అయితే అన్ని పాత్రలకూ డ్రగ్స్ మత్తెక్కించి. ఆ మత్తులోనే శుభం కార్డు వేశారు. గంజాయి పొగ పీలిస్తే మనుషులు అదే పనిగా నవ్వుతారట. అలా సినిమాలోని పాత్రల చేత నవ్వించి థియేటర్లోని జనాల చేత కూడా నవ్వించాలని ప్రయత్నించాడు ఈ సినిమా దర్శకుడు. అయితే ఈ ప్రయత్నమే నవ్వులపాలైంది. ఈ వెర్రికి తోడు గే కామెడీ విసుగు అదనం!
సినిమా ఇంట్రో ప్రేక్షకుడిని టక్కున కథలోకి లాక్కెళుతుంది. ఇంట్రో లో చూపించే టీజర్ ఇంటర్వెల్ వరకూ సినిమాపై ఆసక్తిని నిలుపుతుంది. విరామం దగ్గర విప్పిన చిక్కుముడితో ప్రేక్షకుడు ఫస్టాఫ్‌పై సంతృప్తితోనే ఉంటాడు. అయితే ద్వితీయార్థంలోనే అర్థం లేని రీతిలో కథనం సాగిపోతూ ఉంటుంది. అర్థంలేని మలుపులతో కథను కారుషెడ్డుకు తీసుకొచ్చినా అడ్జెస్ట్ కావొచ్చు. అయితే ఇంతలో వచ్చి చేరే డ్రగ్స్ ఎపిసోడ్ మీద పడిపోతాడు దర్శకుడు. దీంతో ఎంతో సీరియస్‌గా మొదలైన కథ.. సిల్లీగా మారిపోతుంది. అంత వరకూ ఉండిన ఇంప్రెషన్ మొత్తం పోతుంది. చివరకు ఏదో ముగింపునిచ్చి మనల్నివదిలేశారులే.. బతకు జీవుడా అని బయటకు రావాల్సి వస్తుంది. ఇంతకు మించి ఈ సినిమా గురించి చెప్పుకోవడానికేం లేదు.
నటీనటులు:
ఎవరి పాత్రలకు తగ్గట్టుగా వారు చేశారు. ప్రత్యేక ప్రశంసలు అర్హులూ ఎవరూ లేరు. ఇంతోటి సబ్జెక్ట్‌లకు నటీనటులు ఎంత వరకూ న్యాయం చేస్తున్నారు అనే పరిశీలన చేయాలన్నా ఆసక్తీ కలగదు. నటనపరంగా విషయం ఉన్నందునే సరైన హిట్స్ ఏమీ లేకపోయినా నవదీప్ ఇన్ని సంవత్సరాల పాటు బండిని లాగగలుగుతున్నాడు. హీరోయిన్ పూజా ఝవేరీ సింపుల్‌గా ఉంది. పక్కింటమ్మాయి తరహారోల్లో ఆకట్టుకొంది. నవీన్ చంద్ర చిలిపి దొంగ పాత్రకు న్యాయం చేశాడు కానీ.. ఏదో సీరియళ్లు, రియాలిటీ షోలతో బుల్లితెరను ఏలుకొంటున్న ప్రదీప్ ఇలాంటి డ్రగ్, గే కామెడీలు చేసే ముందు కొంత ఆలోచించుకొంటే అతడి కెరీర్‌కే మంచిదని ఒక సలహా. దీన్ని పరిగణనలోకి తీసుకొంటే అతడికే మంచిది. ఒక పోసాని చేత పరమ రొటీన్ పాత్రనే చేయించారు. ఆయన అంతే రొటీన్‌గా చేశారు.
సాంకేతిక వర్గం:
పాటలన్నీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్లాగే వస్తూ ఉంటాయి.. పోతూ ఉంటాయి. ఒక్క పదం కానీ, ఒక్క ట్యూన్ గానీ గుర్తుపెట్టుకోగలగాలి అంటే చాలా మేధస్సు ఉండాలి. భారీ సౌండ్‌తో 'భమ్ భోలేనాథ్' అంటూ ఒత్తి పలుకుతూ బీజీఎమ్ వాయిస్ వినిపిస్తుంటుంది కానీ.. నడుస్తున్న సీన్లో అంత విషయం ఉండదు. దీంతో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ది ఉత్తుత్తి హడావుడే. సినిమాను ప్రేక్షకుల అసహనం అంచుల వరకూ చేరి, అది కట్టలు తెగే వరకూ లాగకుండా సినిమాను రెండు గంటల్లో ముగించడంలో ఏమైనా క్రెడిట్ ఉంటే ఎడిటర్‌కు ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇదే విషయంలో దర్శకుడికి థ్యాంక్స్ చెబితే సరిపోతుంది.
చివరిగా...
భమ్ భోలే నాథ్.. డ్రగ్స్ గోల కే సాథ్