Begin typing your search above and press return to search.
'భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు'

Date of Release: 2019-12-07
నటీనటులు: శ్రీనివాసరెడ్డి - షకలక శంకర్ - సత్య - వెన్నెల కిషోర్ - చిత్రం శీను - సుమన్ శెట్టి - రఘుబాబు - ప్రవీణ్ - సత్యం రాజేష్ తదితరులు
సంగీతం: సాకేత్ కోమండూరి
ఛాయాగ్రహణం: భరణీధరన్
కథ - స్క్రీన్ ప్లే - మాటలు: పరమ్ సూర్యాంశు
దర్శకత్వం - నిర్మాణం: శ్రీనివాసరెడ్డి
కమెడియన్ మంచి పేరు సంపాదించి.. ఆ తర్వాత హీరోగా కూడా విజయాలందుకున్న నటుడు శ్రీనివాసరెడ్డి. ఇప్పుడతను దర్శకుడిగా, నిర్మాతగా మారి తీసిన సినిమా ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’. శ్రీనివాసరెడ్డి.. అతడి స్నేహితులైన కమెడియన్లందరూ కలిసి చేసిన ఈ ప్రయత్నం ఎలాంటి ఫలితాన్నిచ్చిందో చూద్దాం పదండి.
కథ:
శీను (శ్రీనివాసరెడ్డి) దురదృష్ణాన్ని జేబులో పెట్టుకుని తిరిగే కుర్రాడు. బాగా డబ్బు సంపాదించాలనే ప్రయత్నంలో ఉన్న అతను అందుకు షార్ట్ ఫిలిమ్స్ ను మార్గంగా భావిస్తాడు. తన స్నేహితులతో కలిసి ఆ ప్రయత్నాల్లో ఉండగా.. అవి ఫలితాన్నివ్వవు. ఇంతలో శీను కొన్న లాటరీ టికెట్ కు కోటి రూపాయల బహుమతి వచ్చినట్లు తెలుస్తుంది. కానీ అతడి టికెట్ కనిపించకుండా పోతుంది. దాని కోసం వెతికే పనిలో పడగా.. ఒక డ్రగ్ కుంభకోణంలో చిక్కుకుంటారు శీను.. అతడి స్నేహితులు. మరి ఈ సమస్య నుంచి బయటపడి శీను లాటరీ డబ్బులు సొంతం చేసుకున్నాడా.. తన సమస్యలన్నింటినీ బయటపడ్డాడా లేదా అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
కమెడియన్లు కూడా దర్శకులు కాగలరని ఇంతకుముందు వెన్నెల కిషోర్ చూపించాడు. అతను ఒకటి కాదు రెండు సినిమాలు తీశాడు. జఫ్ఫా అని.. వెన్నెల 1.5 అని.. వాటిలో అక్కడక్కడా కొన్ని సీన్లు ఏరుకుని విడిగా చూస్తే కిషోర్ కు భలే సెన్సాఫ్ హ్యూమర్ ఉందే.. భలేగా నవ్వించాడే అనిపిస్తుంది. కానీ మొత్తంగా ఆ సినిమాల సంగతేంటో చూద్దామని ప్రయత్నిస్తే.. భరించడం కష్టమవుతుంది. వాటిలో సరైన కథ ఉండదు..అతనేం చెప్పదలుచుకున్నాడో అర్థం కాదు.. అంతా అస్పష్టంగా.. గందరగోళంగా ఏదో సినిమా తీశాడంటే తీశాడు అనిపించేశాడు కిషోర్. ఇప్పుడు భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు సినిమాతో దర్శకుడిగా మారిన శ్రీనివాసరెడ్డి సైతం సరిగ్గా అదే పని చేశాడు. ఇంతకుముందు మెగా ఫోన్ పట్టి చేతులు కాల్చుకున్న వెన్నెల కిషోర్ కూడా ఈ గందరగోళ చిత్రంలో భాగం కావడం విశేషం.
హీరోకు ఒక లాటరీ టికెట్ దొరకడం.. అది మిస్ అయితే దాని కోసం పడే పాట్ల నేపథ్యంలో సినిమా అనగానే 90ల నుంచి పదుల సంఖ్యలో సినిమాలు తలపుల్లోకి వస్తాయి. దీనికి డ్రగ్ మాఫియా బ్యాక్ డ్రాప్ జోడించారు. అది కూడా కొత్తగా ఏమీ ఉండదు. ఇక కథనం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదే. అసలేమాత్రం కసరత్తు లేకుండా.. కథ ఏ రూట్లో సాగుతోందో.. ఏం చెబుతున్నామో చూసుకోకుండా తోచినట్లుగా రాసి.. ఇష్టమొచ్చినట్లుగా తీసుకుంటూ వెళ్లిపోయారు. ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఏం చేయాలో అర్థం కాక తీసింది తీసినట్లుగా పెట్టేసినట్లున్నారు. అంత గందరగోళంగా.. నాన్ సీరియస్ గా సాగుతుందీ చిత్రం. షార్ట్ పిలింలో తన పక్కన హీరోయిన్గా నటించడానికి అమ్మాయి దొరక్కపోతే.. సిటీలో ఏ అమ్మాయి దొరుకుతుందా అని చూస్తూ ఒక పాటేసుకోవడంతోనే ఇది ఏ స్థాయి సినిమా అనేది మొదట్లోనే అర్థమైపోతుంది.
అది చాలదన్నట్లు మతి భ్రమించిన అమ్మాయిని తీసుకొచ్చి దర్శకుడి ముందు ఆడిషన్ చేయించి అతడితో ఓకే చేయించుకోవడం.. చిత్రం శీను అనే కమెడియన్ని డ్రగ్ మాఫియాను నడిపే డాన్‌గా పెట్టి అతడితో సీరియస్ గా కామెడీ చేయించడంతో ఏమాత్రం సీరియస్‌నెస్ తీసి పక్కన పెట్టేసి సినిమా చూడటం మొదలుపెడతాం. ఇక అక్కడి నుంచి జబర్దస్త్ షోల్లో కనిపించే లాజిక్కుల్లేని స్కిట్లు.. సోషల్ మీడియాలో కనిపించే జోకులు.. టీవీ ఛానెళ్లలో షోలు.. ఇలా ఎన్నో రకాల అంశాల స్ఫూర్తితో కామెడీ పండించేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు శ్రీనివాసరెడ్డి. సినిమాలో ఎంత అసందర్భంగా అనిపించినప్పటికీ.. బతుకు జట్కా బండి షోకు పేరడీగా పెట్టిన కామెడీ ఎపిసోడ్ అయితే బాగా పేలింది. అలాగే రసగుల్లా కామెడీ ఎపిసోడ్ కూడా ఓ మోస్తరుగా నవ్విస్తుంది కానీ ఆ నవ్వులు ఆ క్షణాలకే పరిమితం అవుతాయి. అవి సినిమా మీద ఇంప్రెషన్ ఎంతమాత్రం మార్చవు. సినిమాను ఏమాత్రం సీరియస్ గా తీసుకోనివ్వని కథాకథనాలు.. ప్రేక్షకుల్ని ఏ దశలోనూ సినిమాలో ఇన్వాల్వ్ కానివ్వవు. మనకు జబర్దస్త్ లాంటి టీవీ షోల్లో.. సోషల్ మీడియాలో కనిపించే మీమ్స్ లో కనిపించే తరహాలోనే కొన్ని కామెడీ సీన్లు తప్పితే ఈ సినిమాలో విశేషాలేమీ లేవు.
నటీనటులు:
నటుడిగా శ్రీనివాసరెడ్డి ఏ ప్రత్యేకతా చూపించలేదు. డైరెక్టర్.. ప్రొడ్యూసర్ తానే కదా అని అతనేమీ తనను తాను ఎలివేట్ చేసుకోవడానికి.. హీరోలా చూపించుకోవడానికి ప్రయత్నించకపోవడం అభినందనీయమే కానీ.. అతడి నుంచి ఆశించే కామెడీ మిస్ అయింది. శ్రీనివాసరెడ్డి నటన.. హావభావాలు అన్నీ ఇప్పటిదాకా చూసినవే. షకలక శంకర్.. సత్య మాత్రం ఉన్నంతలో బాగానే నవ్వించారు. హీరోయిన్ డోలీషా గురించి సినిమాలో అందగత్తె అందగత్తె అని తెగ ఊదరగొట్టేస్తుంటారు కానీ.. ఆమె అంత అందంగా ఏమీ లేదు. నటన కూడా అంతంతమాత్రమే. వెన్నెల కిషోర్ సీరియస్ టోన్ తో డైలాగులు చెబుతూ తన అభిమానుల్ని అలరించాడు. చిత్రం శీను.. రఘుబాబు.. ప్రవీణ్.. సత్యం రాజేష్.. వీళ్లంతా ఓకే.
సాంకేతికవర్గం:
టెక్నికల్ గా ఈ సినిమా చాలా సాధారణంగా అనిపిస్తుంది. సాకేత్ కోమండూరి కంపోజ్ చేసిన ఒకట్రెండు పాటల్లో ఏ ప్రత్యేకతా లేదు. బ్యాగ్రౌండ్ స్కోర్‌లోనూ కొత్తదనం కనిపించదు. కామెడీ సినిమాల్లో ఎప్పుడూ వినిపించే టెంప్లేట్ సౌండ్లతోనే లాగించేశారనిపిస్తుంది. భరణీ ధరన్ ఛాయాగ్రహణం కూడా మామూలుగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు అంతంతమాత్రమే. పెద్దగా ఖర్చేమీ లేకుండా హైదరాబాద్ లో ఖాళీ ఉన్న రోడ్లు, వీధులు, ఇళ్లలో సినిమాను అవగొట్టేశారు. విషయం ఉంటే పట్టించుకోవాల్సిన విషయం కాదు కానీ.. అది వీక్ అవడంతో నిర్మాణ విలువలపైకి దృష్టి మళ్లుతుంది. పరమ్ సూర్యాంశు కథలో కానీ.. స్క్రీన్ ప్లేలో కానీ ఏ విశేషం లేదు. ఎన్నో సార్లు చూసిన మామూలు కథ.. సాధారణమైన కథనం నిరాశకు గురి చేస్తాయి. దర్శకుడు శ్రీనివాసరెడ్డి కొన్ని చోట్ల కామెడీని బాగా డీల్ చేసినా.. ఒక సినిమాను ప్రేక్షకులు మెప్పించేలా తీర్చిదిద్దగల నైపుణ్యాన్ని ఎక్కడా ప్రదర్శించలేదు.
చివరగా: భాగ్యనగర వీధుల్లో గమ్మత్తేమీ లేదు.. చిత్తే
రేటింగ్-1.5/5
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre