Begin typing your search above and press return to search.
భాగ్ సాలే

Date of Release: 2023-07-07
నటీనటులు: సింహా కోడూరి-నేహా సోలంకి-జాన్ విజయ్-రాజీవ్ కనకాల-హర్ష చెముడు-వర్షిణి సౌందర్ రాజన్-నందిని రాయ్-సుదర్శన్-సంజయ్ స్వరూప్ తదితరులు
సంగీతం: కాలభైరవ
ఛాయాగ్రహణం: రమేష్ కుషేందర్
నిర్మాతలు: అర్జున్ దాస్యన్-యాష్ రంగినేని-సింగనమల కళ్యాణ్
రచన-దర్శకత్వం: ప్రణీత్ బ్రమాండపల్లి
'మత్తు వదలరా' అనే వెరైటీ మూవీతో హీరోగా అరంగేట్రంలోనే సత్తా చాటాడు కీరవాణి తనయుడు సింహా కోడూరి. కానీ అతడి తర్వాతి చిత్రాలు నిరాశ పరిచాయి. ఇప్పుడతను 'భాగ్ సాలే' అనే ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ట్రైలర్ తో ఆసక్తి రేకెత్తించిన 'భాగ్ సాలే' సినిమాగా ఏమేర మెప్పించిందో చూద్దాం పదండి.
కథ:
అర్జున్ (సింహా కోడూరి) ఒక హోటల్లో చెఫ్. అతడికి సొంతంగా ఒక రెస్టారెంట్ పెట్టి ఖరీదైన జీవితం గడపాలని కోరిక. ఓ వైపు ఆ ప్రయత్నాల్లో ఉంటూనే.. మాయ (నేహా సోలంకి) అనే ఒక రిచ్ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమెకి తనో మిలియనీర్ అని అబద్ధం చెప్తాడు. నేహా కుటుంబం దగ్గర తరాల నుంచి ఉన్న ఒక డైమండ్ రింగ్ కోసం శామ్యూల్ (జాన్ విజయ్) అనే దాదా కిడ్నాప్ చేస్తాడు. దీంతో అర్జున్ నేహాతో కలిసి ఆమె తండ్రి కోసం వేట మొదలు పెడతాడు. ఈ క్రమంలోనే ఆ రింగు చాలా మంది చేతులు మారుతుంది. ఇంతకీ ఈ రింగు కథ ఏంటి.. దానికి ఎందుకంత విలువ.. చివరికి రింగు ఎవరి చేతికి చేరింది.. అర్జున్ గురించి నిజం మాయకి తెలిసిందా లేదా.. ఈ ప్రశ్నలు అన్నింటికీ తెర మీదే సమాధానాలు తెలుసుకోవాలి.
కథనం-విశ్లేషణ:
హీరో ఒక మామూలు కుర్రాడు. అతడికి పెద్ద పెద్ద కలలుంటాయి. తన నేపథ్యాన్ని దాచిపెట్టి ధనవంతుడిలా నటిస్తూ ఒక అమ్మాయికి దగ్గర అవుతాడు. తనను కలిసినపుడల్లా రిచ్ డ్రెస్సులు వేసుకుని.. ఖరీదైన కార్లో తిరుగుతూ మేనేజ్ చేస్తుంటాడు. ఇంతలో కథానాయికకు ఓ సమస్య వస్తుంది. దాన్ని పరిష్కరించే బాధ్యత హీరో తీసుకుంటాడు. మధ్యలో హీరో గురించి అసలు నిజం బయటపడిపోతుంది. హీరోయిన్ కష్టాన్ని తీర్చిన హీరో.. తాను వేసుకున్న వేషం నిజం కాకపోవచ్చు కానీ తన ప్రేమ మాత్రం నిజం అంటూ ఆమెను హగ్ చేసుకుంటాడు. ఇలాంటి పాత్రలు.. కథలు ఎన్ని చూసి ఉంటాం తెలుగులో? 'భాగ్ సాలే' ట్రైలర్ చూస్తే ఏదో కొంచెం కొత్తగా ట్రై చేసినట్లు అనిపించింది కానీ.. ఇది మూడు దశాబ్దాల ముందు వచ్చిన 'క్షణక్షణం' సహా ఎన్నో క్రైమ్ కామెడీలను అటు తిప్పి ఇటు తిప్పి తీసిన సినిమానే. పట్టుమని పది నిమిషాలు కూడా ప్రేక్షకులను కుదురుగా కూర్చోబెట్టలేకపోయిన ఈ చిత్రంలో 'ట్రెండీ'గా అనిపించేవి కేవలం బూతులు మాత్రమే.
'భాగ్ సాలే' నుంచి కొన్ని నెలల ముందే 'కూత ర్యాంప్' అనే పాట ఒకటి రిలీజ్ చేశారు. ఈ 'కూత ర్యాంప్' అనే పదం ఎలా పుట్టిందో ఇక్కడ వివరంగా చర్చించలేం కానీ.. ఇలాంటి ఒక పదాన్ని హుక్ వర్డ్ లాగా మార్చి పాట చేశారంటేనే ఇది ఏ టైపు సినిమానో అర్థం చేసుకోవచ్చు. హీరో రెండొందలు పెట్టి ఒక మొక్కను కొని.. అది ఎవరింట్లో ఉంటే వాళ్లకు డబ్బులే డబ్బులు అంటూ తన పక్కింటి లేడీకి అమ్మేస్తా. ఇంతకీ దీనికి అతను పెట్టిన పేరేంటో తెలుసా.. 'పిచ్చి పూ.. చెట్టు'. ఆ లేడీ కూడా అదే పేరు పెట్టి మాట్లాడుతూ తనకు ఆ లక్కీ మొక్కును ఇచ్చేయమంటుంది. అనుకోకుండా ఇలా ఒక డబుల్ మీనింగ్ డైలాగ్ పెట్టారనుకుంటే పొరబాటే. ''దారిన పోయే కంపని.. గుడ్డకు అంటించుకున్నట్లు ఉంది''. ''దెన్ గో'' అని.. ''నీ గుడ్డలో పెట్టుకో'' అని.. ''గూట్లో రాయి తీసి..'' అని.. ''ఇక్కడో 18 అడుగుల రాడ్ ఉంది. దాన్ని తీసి సగం దింపనా'' అని.. ఇలా విచ్చలవిడిగా ఇందులో బూతులను వాడేశారు. సినిమా ఏమైనా 'రా'గా తీసి.. అవసరం కొద్దీ ఈ బూతులు వాడారా అంటే అదేమీ కాదు. ఊరికే ఇది 'బోల్డ్' మూవీ అని.. 'యూత్ ఫుల్' సినిమా అని.. బలవంతంగా ఒప్పించడానికి చేసిన ప్రయత్నం ఇది.
ఈ బూతుల సంగతి పక్కన పెట్టి సినిమాలో ఏమైనా విషయం ఉందేమో అని.. మొదట్నుంచి ఎదురు చూస్తే.. చివరి వరకు ఎదురు చూపులే మిగులుతాయి. 25 కోట్ల డైమండ్ రింగ్ అంటూ టైటిల్స్ లో సిద్ధు జొన్నలగడ్డతో పెద్ద ఇంట్రో ఇప్పించి అంచనాలు పెంచాడు దర్శకుడు. కానీ సిద్ధు కామెంట్రీలో ఉన్న ఫన్.. సినిమాలో ఎంతమాత్రం కనిపించదు. వేదం.. ధమ్కీ సహా ఎన్నో సినిమాల్లో చూసిన తరహా హీరో హీరోయిన్ల పాత్రలు.. వాటి చుట్టూ తిరిగే రొటీన్ సీన్లతో ఆరంభంలోనే 'భాగ్ సాలే' నీరుగారిపోయింది. ఆ ఉంగరం కథ లైవ్ లోకి వచ్చాక కానీ 'భాగ్ సాలే' పైకి లేస్తుందనుకుంటే.. అప్పుడు కానీ ఇదెంత సిల్లీ సినిమానో అర్థం కాదు. ఒక సైకో విలన్.. ఒక కామెడీ గ్యాంగుని వేసుకుని రింగ్ రింగ్ అంటూ కనిపించిన ప్రతి వాడి నెత్తినా గన్ను పెట్టడం.. రింగు కామెడీగా చేతులు మారిపోయి.. ఎక్కడెక్కడికో వెళ్లిపోవడం.. దాని కోసం హీరో-విలన్ మధ్య టామ్ అండ్ జెర్రీ తరహా గేమ్ నడవడం.. ఈ క్రమంలో ఎక్కడా రవ్వంత ఆసక్తి కనిపించదు. వెకిలిగా అనిపించే కామెడీ సీన్లు.. శ్రుతి మించిన డబుల్ మీనింగ్ డైలాగులతో 'భాగ్ సాలే' ప్రేక్షకులకు ఫ్రస్టేషనే తప్ప ఎంటర్టైన్మెంట్ ఇవ్వదు. ప్రథమార్ధమే బోర్ అనుకుంటే.. ద్వితీయార్ధం చూశాక ముందు చూసిందే కొంచెం నయం అనుకునే పరిస్థితి వస్తుంది. తెరనిండా బోలెడన్ని పాత్రలు.. చాలా హంగామా కనిపిస్తాయే కానీ.. ఒక్క క్యారెక్టర్ ఎంగేజింగ్ గా అనిపించదు. ఒక్క సీనూ మెప్పించదు. రెండు గంటల లోపే సినిమా ముగిసినా కూడా చివరి వరకు చూడటం చాలా కష్టమవుతుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
నటీనటులు:
సింహ కోడూరి పక్కింటి కుర్రాడి పాత్రలకి సూట్ అవుతాడు. తనకి నప్పే పాత్రే చేశాడు ఇందులో. హీరోలా కాకుండా మిగతా పాత్రల్లో ఒకదానిలా కనిపించే తన క్యారెక్టర్ మొదట్లో ఆసక్తి రేకెత్తించినా తర్వాత తేలిపోయింది. సింహా నటన ఏవరేజ్. హీరోయిన్ నేహా సోలంకి ఏ రకంగానూ ఆకట్టుకోలేదు. విలన్ జాన్ విజయ్ తమిళంలో అదిరిపోయే పాత్రలు చేశాడు. తెలుగులో మాత్రం ఆయనకి సిల్లీ క్యారెక్టర్లు ఇస్తున్నారు. ఇందులో జాన్ పాత్ర.. నటన చికాకు పెడతాయి. సుదర్శన్.. సత్య కొంత నవ్వించారు. రాజీవ్ కనకాల.. వైవా హర్ష పర్వాలేదు.
సాంకేతిక వర్గం:
టెక్నికల్ గా 'భాగ్ సాలే' సోసోగా అనిపిస్తుంది. పిండి కొద్దీ రొట్టె అన్నట్లే పని చేశారు సాంకేతిక నిపుణులు. కాలభైరవ ఇచ్చిన బిట్ సాంగ్స్ మెప్పించలేదు. నేపథ్య సంగీతంలోనూ మెరుపులు కనిపించలేదు. రమేష్ కుషేందర్ ఛాయాగ్రహణం మామూలుగా సాగిపోయింది. నిర్మాణ విలువలు ఏమంత గొప్పగా లేవు. రైటర్ కమ్ డైరెక్టర్ ప్రణీత్ ఈ కథలో ఏముందని ఫీచర్ ఫిల్మ్ గా తీద్దామనుకున్నాడో అర్థం కాదు. డబ్బు లేదా విలువైన వస్తువు కోసం ఒకరి వెంట ఒకరు పడే క్రైమ్ థ్రిల్లర్లు తెలుగులో ఎన్నో చూశాం. వాటన్నింటినీ అనుకరిస్తూ చేసిన సినిమాలా ఉందే తప్ప ఒరిజినాలిటీ లేదు ఇందులో. ఏ దశలోనూ కథాకథనాలను సీరియస్ గా తీసుకోలేని విధంగా ప్రణీత్ నరేషన్ సాగింది. అలా అని వినోదమూ పండించలేకపోయాడు. రచయితగా.. దర్శకుడిగా అతను పూర్తిగా నిరాశ పరిచాడు.
చివరగా: భాగ్ సాలే.. పారిపోవాల్సిందే
రేటింగ్-1.5/5
Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater