Begin typing your search above and press return to search.
బేతాళుడు

Date of Release: 2016-12-01
నటీనటులు: విజయ్ ఆంటోనీ - అరుంధతి నాయర్ - చారు హాసన్ - వై.జి.మహేంద్ర - ఆడుగళం మురుగదాస్ తదితరులు
సంగీతం: విజయ్ ఆంటోనీ
ఛాయాగ్రహణం: ప్రదీప్ కలిపురయత్
మాటలు: భాషశ్రీ
నిర్మాత: ఫాతిమా విజయ్ ఆంటోనీ
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: ప్రదీప్ కృష్ణమూర్తి
‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లోకి దూరిపోయాడు విజయ్ ఆంటోనీ. అంతకుముందు అతను హీరోగా నటించిన నకిలీ.. సలీమ్.. కూడా ఆసక్తికర సినిమాలే. ‘బిచ్చగాడు’ సినిమా ఊహించని స్థాయిలో ప్రభంజనం సృష్టించాక.. విజయ్ కొత్త సినిమా ‘బేతాళుడు’ మీద అందరి దృష్టీ నిలిచింది. ట్రైలర్ చూస్తే ఇది కూడా ప్రత్యేకమైన సినిమాలాగే అనిపించింది. ప్రేక్షకుల్లో అంచనాల్ని పెంచింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘బేతాళుడు’ ఆ అంచనాల్ని అందుకుందో లేదో చూద్దాం పదండి.
కథ:
దినేష్ (విజయ్ ఆంటోనీ) ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగి. చాలా తెలివైన వాడు. చురుకైన వాడు. యజమానికి కూడా అతనంటే చాలా ఇష్టం. ఓ మ్యాట్రిమొనీ వెబ్ సైట్లో ఐశ్వర్య (అరుంధతి నాయర్) అనే అమ్మాయి నుంచి వచ్చిన ప్రపోజల్ నచ్చి ఆమెను పెళ్లి చేసుకుంటాడు దినేష్. ఐతే పెళ్లయిన కొంత కాలానికి దినేష్ కు అనూహ్యమైన పరిస్థితులు ఎదురవుతాయి. తనతో ఎవరో మాట్లాడుతున్నట్లు.. వెంటాడుతున్నట్లు అనిపిస్తుంది. దీని వల్ల దినేష్ చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. సైక్రియాట్రిస్టును కలిస్తే.. హిప్నాటిజం ద్వారా దినేష్ గత జన్మ జ్నాపకాలు కళ్ల ముందు కదలాడుతాయి. ఆ జన్మ తాలూకు అనుభవాలే అతణ్ని వెంటాడుతున్నట్లు తెలుస్తుంది. ఇంతకీ అతడి గత జన్మలో ఏం జరిగింది.. దినేష్ ఇప్పుడెందుకు అలా ప్రవర్తిస్తున్నాడు.. అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
విజయ్ ఆంటోనీ సినిమా అంటే వైవిధ్యంగా ఉంటుంది.. అతను ప్రత్యేకమైన కథల్ని ఎంచుకుంటాడు అన్న గుర్తింపుకు తగ్గట్లే ఉంటుంది ‘బేతాళుడు’ కథ కూడా. ఇలాంటి కథలు చాలా చాలా అరుదు. ప్రేక్షకుడిని.. ఆరంభం నుంచి చివరి వరకు ఉత్కంఠకు గురి చేసే వైవిధ్యమైన కథ ఉంది ‘బేతాళుడు’లో. కానీ ఆ కథను ఆసక్తికరంగా.. ఎంగేజింగ్ గా చెప్పడంలో మాత్రం దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి సక్సెస్ కాలేకపోయాడు. నిడివి రెండు గంటలే అయినా.. ఓ పెద్ద సినిమా చూసిన భావన కలిగిస్తుంది ‘బేతాళుడు’. అందుకు అంతగా ఆసక్తి రేకెత్తించని.. ఆద్యంతం ప్రేక్షకుడిలో ఒక రకమైన అలజడికి గురి చేసే కథనమే కారణం. సస్పెన్స్ ఎలిమెంట్ బాగుంది.. ప్రేక్షకుడిని థ్రిల్ చేసే ట్విస్టులైతే ఉన్నాయి కానీ.. ఆ ట్విస్టులకు ఇటు అటు నెమ్మదిగా సా...గే కథనం సహనానికి పరీక్ష పెడుతుంది.
‘బేతాళుడు’లో హీరో ఒక మానసిక సమస్యతో బాధపడుతుంటాడు. అనుక్షణం అలజడి ఎదుర్కొంటుంటాడు. ఇంట్రడక్షన్లు ఏమీ లేకుండా నేరుగా హీరోకు ఎదురయ్యే ఈ సమస్య దగ్గర్నుంచే కథ మొదలవుతుంది. ప్రథమార్ధం చాలా వరకు ఆసక్తికరంగానే సాగుతుంది. ఐతే హీరో కలవరపాటుకు గురయ్యే సన్నివేశాలు.. ఇందులో వచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్.. ప్రేక్షకుడిని కూడా ఒకరకమైన అలజడికి గురి చేసేలా ఉంటాయి. తర్వాత ఏమవుతుందా అన్న ఆసక్తి ప్రేక్షకుడిని కళ్లప్పగించి చూసేలా చేస్తుంది కానీ.. తెరమీద జరిగేది చూస్తుంటే ఒక రకమైన ప్యానిక్ ఫీలింగ్ కలుగుతుంది. హీరో గత జన్మకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అనుకున్నంత ఎఫెక్టివ్ గా లేదు. అది కొంచెం గందరగోళంగానూ ఉంది.
ద్వితీయార్ధంలో హీరో తన సమస్య ఏంటో తెలుసుకుని.. మామూలు మనిషి అయ్యేసరికే సినిమా ముగింపు దశకు వచ్చేసిన భావన కలుగుతుంది. కానీ అప్పుడు కథ ఇంకో మలుపు తిరుగుతుంది. అప్పటిదాకా ఫాంటసీ అనుకున్న సినిమా కాస్తా ‘సైంటిఫిక్’ టర్న్ తీసుకుంటుంది. హీరో ఇంకో మిస్టరీని ఛేదించడం మొదలుపెడతాడు. దీనికి సంబంధించిన సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి. ఐతే ఓ భిన్నమైన కథకు సినిమాటిక్ ముగింపు ఇవ్వడం ద్వారా దర్శకుడు సినిమాను తేల్చేశాడు. ప్రథమార్ధం ప్రేక్షకుడిని సినిమాలో బాగానే లీనం చేసినా.. ద్వితీయార్ధం నిరాశ పరుస్తుంది.
దర్శకుడు ఎక్కడికక్కడ ప్రేక్షకుడికి ప్రశ్నలు సంధిస్తూ కథలో లీనమయ్యేలా చేశాడు కానీ.. ఆ ప్రశ్నలకు సంతృప్తికర సమాధానాలు మాత్రం ఇవ్వలేకపోయాడు. ‘బేతాళుడు’ కథగా చెప్పుకోవడానికి.. వినడానికి ఆసక్తికరంగానే అనిపిస్తుంది కానీ.. తెరమీద చూస్తున్నపుడు అంత ఆసక్తికరంగా అయితే లేదు. దర్శకుడు గత జన్మ అంటూ ఓవైపు ఫ్లాష్ బ్యాక్ చూపించి ఫాంటసీ అన్నాడు. అలాగే గత జన్మను గుర్తుకు తెచ్చే డ్రగ్స్ అంటూ హీరోకు ఎదురైన పరిస్థితుల వెనుక సైంటిఫిక్ రీజన్ ఇచ్చే ప్రయత్నమూ చేశాడు. ఐతే ఇవి రెండూ సింక్ అవలేదు. మొత్తంగా ‘బేతాళుడు’ ఒక వైవిధ్యమైన, ఆసక్తికరమైన కథతో చేసిన మంచి ప్రయత్నమే కానీ.. ఆ కథను చెప్పిన తీరే అంతగా రుచించదు. పైగా ఈ జానర్ సినిమాలకున్న పరిమితుల దృష్ట్యా మెజారిటీ ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. ఇలాంటి కథలు ఇండియన్ స్క్రీన్ మీద అరుదు అనడంలో మాత్రం సందేహం లేదు. కథనం కాస్త ఎగుడుదిగుడుగా ఉన్నా.. థ్రిల్ ఉన్న కథను కోరుకుంటే ‘బేతాళుడు’పై ఓ లుక్కేయొచ్చు.
నటీనటులు:
‘బిచ్చగాడు’ సినిమా చూసి ఈ పాత్రను విజయ్ ఆంటోనీ కాకుండా ఇంకెవరూ చేయలేరేమో అని ఎలా అనుకుంటామో.. ‘బేతాళుడు’ కూడా అలాంటి ఫీలింగే కలిగిస్తుంది. ఈ పాత్రకు అతను పర్ఫెక్ట్ ఛాయిస్. ఇలాంటి కథను ఎంచుకున్నందుకే.. తనే స్వయంగా నిర్మించి నటించినందుకు అతడికి అభినందనలు చెప్పాలి. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో విజయ్ ఆంటోనీ చాలా బాగా నటించాడు. సినిమాలో విజయ్ ఆంటోనీ కాకుండా.. అతడి పాత్ర మాత్రమే కనిపిస్తుంది. హీరోయిన్ అరుంధతి నాయర్ కూడా బాగా నటించింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఆమె ఇచ్చిన హావభావాలు బాగున్నాయి. ఐతే గ్లామర్ పరంగా అరుంధతి ఆర్డినరీగా అనిపిస్తుంది. వైజీ మహేంద్ర.. ఆడుగళం మురుగదాస్.. చారు హాసన్.. వీళ్లంతా పాత్రలకు తగ్గట్లు నటించారు.
సాంకేతికవర్గం:
విజయ్ ఆంటోనీ పాటలు ఒక్కటీ బాగా లేవు. సినిమాకు పాటలు పెద్ద మైనస్. లిరిక్స్.. పాటల పాడిన తీరులో తమిళ టచ్ ఎక్కువైంది. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. థ్రిల్లర్ సినిమాలకు సూటయ్యే మ్యూజిక్ ఇచ్చాడు విజయ్. ప్రదీప్ కలిపురయత్ ఛాయాగ్రహణం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. సినిమా అంతటా మంచి క్వాలిటీ కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి ఎంచుకున్న కథ బాగుంది. అందులో ఎన్నో మలుపులున్నాయి. ఈ విషయంలో అతను ఎంతో కసరత్తు చేసిన సంగతి అర్థమవుతుంది. ఐతే ఆసక్తి ప్రమాణాలున్న కథను అదే స్థాయిలో ఆసక్తికరంగా తెరకెక్కించడంలో దర్శకుడు విజయంంతం కాలేదు. ఓ దశ వరకు ఆసక్తికరంగానే కథనాన్ని నడిపించాడు కానీ.. తర్వాత పట్టు వదిలేశాడు.
చివరగా: బేతాళుడు.. కంగారు పెడతాడే కానీ..
రేటింగ్: 2.5/5
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre