Begin typing your search above and press return to search.
Avunu 2

Date of Release: 2015-04-03
రేటింగ్: 2.25 /5
తారాగణం: పూర్ణ, హర్షవర్ధన్ రాణె, నిఖిత, సంజన, చక్రవర్తి, గాయత్రి, రవిబాబు తదితరులు
ఛాయాగ్రహణం: సుధాకర్‌రెడ్డి
సంగీతం: శేఖర్ చంద్ర
రచన, దర్శకత్వం, నిర్మాణం: రవిబాబు
మూడేళ్ల కిందట రవిబాబు హార్రర్ మూవీ 'అవును' సైలెంటుగా వచ్చి సర్ప్రైజ్ హిట్టు కొట్టింది. ఆ సినిమా ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి మొదలుపెట్టి అవును పార్ట్-2 తీశాడు రవిబాబు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా తొలి భాగం లాగే జనాల్ని ఆకట్టుకుందా లేదా చూద్దాం పదండి.
కథ:
దయ్యం ఆవహించి తనపై అత్యాచారం చేయబోయిన భర్త హర్ష (హర్షవర్ధన్ రాణె)ను మోహిని పొడవడం.. అతను ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లడంతో ముగుస్తుంది అవును తొలి పార్ట్. రెండో భాగం అక్కడే మొదలవుతుంది. హర్ష, మోహిని పాత ఫ్లాట్ వదిలేసి సిటీ మధ్యలో ఉండే కొత్త ఫ్లాట్‌లోకి వస్తారు. తమ సమస్యలన్నీ తీరిపోయినట్లే అనుకుంటుండగా.. మోహినిని వెంటాడుతూ కెప్టెన్ రాజు ఆత్మ కొత్త ఫ్లాట్‌లోకి కూడా వస్తుంది. ఐతే ఆత్మను అడ్డుకునే ఓ ఆయుధం మోహిని మెడలో ఉంటుంది. దాన్ని మోహిని నుంచి దూరం చేసి తన వశం చేసుకోవడానికి ఆత్మ ఏం చేసింది? ఆత్మ నుంచి మోహిని బయటపడిందా లేదా? అనేది మిగతా కథ.
కథనం:
హార్రర్ సినిమాలకు ట్రెండుతో సంబంధం ఉండదు. ఈ జానర్ కోసం ఓ వర్గం ప్రేక్షకులు ఎప్పుడూ ఎదురు చూస్తుంటారు. ఏదైనా కొత్త పాయింట్‌తో ప్రేక్షకుల్ని భయపెట్టగలిగితే, థ్రిల్ చేయగలిగితే చాలు.. సక్సెస్ కొట్టేయొచ్చు. చాలా పరిమితమైన క్యారెక్టర్లతో, తక్కువ ఖర్చుతో సినిమా పూర్తి చేయగల సౌలభ్యం హార్రరన సినిమాలకుంటుంది. రవిబాబు ఈ అడ్వాంటేజ్‌ను పూర్తిగా వాడుకుని 'అవును' సినిమాతో ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేశాడు.
ఆత్మ అమ్మాయిని మోహించడం అనే స్పైసీ కాన్సెప్ట్ ఎంచుకున్న రవిబాబు.. టెక్నాలజీని భలేగా వాడుకుని.. ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో ఈ కాన్సెప్ట్‌ను ప్రెజెంట్ చేసిన తీరు ప్రేక్షకుల్ని ఎక్కువ ఆకట్టుకుంది. అవును-2లోనూ ఈ ఆకర్షణలన్నీ ఉన్నాయి. కాకపోతే 'థ్రిల్' ఫ్యాక్టర్ లేకపోవడమే ఇక్కడ సమస్య. తొలి భాగంలో చాలా అంశాలు ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేశాయి, థ్రిల్ ఇచ్చాయి. ఐతే అవును-2లో మళ్లీ అలాంటి అంశాలే రిపీట్ చేయడం వల్ల ప్రేక్షకులకు థ్రిల్ ఉండదు.
ఉదాహరణకు తొలి భాగంలో సెన్సర్ల ద్వారా లైట్లు వాటంతటవే ఆన్, ఆఫ్ కావడం.. డస్ట్‌బిన్ డోర్ తెరుచుకోవడం.. దయ్యం ప్రెజెన్స్‌ను చూపించడానికి ఈ టెక్నాలజీని వాడుకోవడం ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఐతే అవును-2లో టెక్నాలజీని కొంచెం మార్చి మళ్లీ అదే కాన్సెప్ట్ రిపీట్ చేశాడు. ఇది పెద్దగా ఆసక్తి కలిగించకపోగా.. దర్శకుడు టెక్నాలజీపై అతిగా ఆధారపడటం చికాకు పెడుతుంది. తొలి భాగంలో దయ్యం ఏం చేయాలనుకుంటోంది? ఏం చేయబోతోంది? ఇంతకీ దయ్యం వెనుక కథేంటి? అనే అంశాలు ఉత్కంఠ రేపుతాయి. ఐతే రెండో పార్ట్‌లో ఈ ఆసక్తి మిస్సయింది. దయ్యం ఏం చేయొచ్చు, చివరికి కథ ఎలా ముగియొచ్చు అనే క్లారిటీతోనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. వారిని మెప్పించడానికి రవిబాబు తన స్టయిల్లో చేయాల్సిందంతా చేశాడు కానీ.. అతడి ప్రయత్నం ఓ మోస్తరుగా మాత్రమే మెప్పిస్తుంది.
టెక్నాలజీని ఉపయోగించి ఆత్మను క్యాప్చర్ చేయడం అనే కొత్త కాన్సెప్ట్ అవును-2కు స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని రవిబాబు ఆశించి ఉండొచ్చు. కానీ ఆ కాన్సెప్ట్‌ను డీల్ చేసిన తీరు సిల్లీగా ఉంది. లాజిక్కుల సంగతి పక్కనబెట్టేసినా కూడా ఆ ఎపిసోడ్ కన్విన్సింగ్‌గా లేదు. కాశీలో హీరోయిన్ను చూసి ఆమె ఆపదలో ఉందని భావించిన సాధువు ఆమెకు రక్షణ బిళ్ల ఇవ్వడం.. దాన్ని ధరిస్తే దయ్యం పారిపోవడం.. హీరోయిన్‌కు ఆ రక్షణను దూరం చేయడానికి దయ్యం ప్రయత్నించడం.. ఇదంతా ఎప్పుడో 90ల్లో అమ్మవార్ల సినిమాల్లో చూసిన వ్యవహారం. పైగా సాధువు వెయ్యి రూపాయిలిస్తే బిళ్ల ఇస్తాననడం విడ్డూరం.
హాలీవుడ్ స్టయిల్లో గంటా 37 నిమిషాల్లో ముగిసిపోవడం 'అవును-2'కున్న పెద్ద ప్లస్ పాయింట్. కథనం 'అవును' కంటే కూడా వేగంగా సాగిపోయేలా స్క్రీన్‌ప్లే రాసుకున్నాడు రవిబాబు. 'అవును' చూడని వాళ్లకు ఈ కథనం బాగా ఆసక్తి కలిగించొచ్చు కానీ.. తొలి పార్ట్ చూసి మళ్లీ థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు మాత్రం సమయం కష్టంగానే గడుస్తుంది. సన్నివేశాలన్నీ అంచనాలకు తగ్గట్లే ఉండడం నిరాశ పరుస్తుంది.
దర్శకుడు ఎంత వేగంగా కథనాన్ని పరుగులు పెట్టిద్దామని చూస్తున్నా.. నటీనటులు తమ ప్రతిభతో సన్నివేశాల్ని పండించే ప్రయత్నం చేస్తున్నా కూడా ఏదో మిస్సవుతున్న ఫీలింగ్‌లో ఉంటారు ప్రేక్షకులు. చివరి అరగంటలో దయ్యాన్ని హీరో హీరోయిన్లు, వాళ్ల ఫ్రెండ్ డీల్ చేసే తీరు సాగతీతలా అనిపిస్తుంది. తన తాళే విలన్‌ను ఎదుర్కొనే ఆయుధం అని తెలిశాక హీరోయిన్, ఆమె భర్త కలిసి దాన్ని పట్టుకుంటే సరిపోతుంది కదా. కానీ దయ్యం సంగతి తెలిసి కూడా తాళిని పక్కనబెట్టేయడం.. వాక్యూమ్ క్లీనర్‌తో దయ్యం దాన్ని మింగేయడం.. తర్వాత హీరోయిన్ దాన్ని బయటకు తీసి హీరోకు వేయడం.. దయ్యంతో దాగుడుమూతలు ఆడటం.. ఇదంతా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. పతాక సన్నివేశానికి ముందు మళ్లీ నిఖిత ఫ్లాష్‌బ్యాక్ ఒకటి. ఈ ఎపిసోడ్ వల్ల సినిమాకొచ్చిన ప్రయోజనమేంటో అర్థం కాదు. అవును-2 విషయంలో అతి పెద్ద కంప్లయింట్ ఏంటంటే.. ఇది 'హార్రర్ సినిమా' అనే మాటకు న్యాయం చేయలేదు. ప్రేక్షకుడికి ఏ సన్నివేశంలోనూ భయం అన్న ఫీలింగే కలగదు.
నటీనటులు:
పూర్ణ మరోసారి అద్భుతమైన నటనతో అదరగొట్టేసింది. 'అవును' ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో మోహిని పాత్రను ఇంకా బాగా పండించింది. హార్రర్ కోణంలోనే అయినా ఆమెతో దర్శకుడు ప్రేక్షకులకు అందాల వల విసిరాడు. తొలి పార్ట్‌లో పెద్దగా చేసిందేమీ లేని హర్షవర్ధన్ రెండో పార్ట్‌లో మాత్రం తన నట ప్రతిభ చూపించాడు. దయ్యం అతణ్ని టార్చర్ చేస్తున్నపుడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ హర్షలో మంచి నటుడున్నాడనడానికి నిదర్శనం. హీరో ఫ్రెండుగా నటించిన చక్రవర్తి కీలకమైన పాత్రలో బాగా నటించాడు. అవును-2 ప్రధానంగా ఈ మూడు క్యారెక్టర్ల చుట్టూనే తిరుగుతుంది. నిఖిత మామూలే కానీ.. ఆమె భర్తగా నటించిన సత్య బాగా చేశాడు.
సాంకేతిక వర్గం:
టెక్నీషియన్స్ రవిబాబు టేస్టుకు తగ్గట్లు పని చేశారు. రవిబాబు సినిమాలకు పని చేసి చేసి శేఖర్ చంద్ర ఇలాంటి సినిమాలకు నేపథ్య సంగీతం ఇవ్వడంలో ఆరితేరిపోయాడు. అతను మంచి ఔట్పుటే ఇచ్చాడు. ఐతే కొన్ని చోట్ల నేపథ్య సంగీతం మరీ లౌడ్‌గా ఉన్నట్లు అనిపిస్తుంది. సన్నివేశాల్లో బలం లేకపోవడం వల్లో ఏమో.. బ్యాగ్రౌండ్ స్కోర్ ద్వారా భయపెట్టాలని చూశాడు. సుధాకర్‌రెడ్డి ఛాయాగ్రహణం బాగుంది. సినిమా అంతా ఒకే ఫ్లాట్‌లోనే సాగినా.. ఆ ఫీలింగ్ రాకుండా చేయడంలో సుధాకర్‌రెడ్డిది కీలక పాత్ర. ప్రొడక్షన్ వాల్యూస్‌కి ఢోకా లేదు. స్క్రీన్‌ప్లే విషయంలో, దర్శకత్వంలో రవిబాబును తప్పుబట్టడానికేం లేదు. ఐతే 'అవును'ను కొనసాగించాలనుకోవడంలోనే అతను తనకు తాను లిమిటేషన్స్ పెట్టేసుకున్నాడు. దాన్ని దాటి బయటికి వస్తే ఇది అలా లేదంటారు. ఆ ఫార్ములానే ఫాలో అయితే.. అచ్చం అలాగే ఉందంటారు. అవును-2 విషయంలో రెండో ఇబ్బంది తప్పలేదు.
చివరిగా...
అవును సినిమాను అర్ధంతరంగా ముగించినట్లే.. అవును-2లోనూ దయ్యం కథ అయిపోలేదనే హింట్ ఇచ్చాడు రవిబాబు. బహుశా అవును-3 తీసే ఆప్షన్ ఉంచుకున్నాడేమో. కానీ మూడో భాగం తీసేంత ప్రోత్సాహం ప్రేక్షకులు ఇస్తారా అనేదే సందేహం.